చంద్రబాబు నాయుడు

21:11 - March 22, 2018

విజయవాడ : టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. తనపై కేసులు పెట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీని ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు కేసులకు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. రాజకీయ కుయుక్తులతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు

తనపై అక్రమ కేసులు పెట్టించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రధాని మోదీని ప్రభావితం చేస్తున్నారని, ఇందుకు రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా వంతపలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ఏపీకి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ప్రకటిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జలవనరుల సంరక్షణపై మండలిలో కూడా చంద్రబాబు ప్రకటన చేశారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యేక హోదా ఇవ్వమంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలు చంద్రబాబు విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ సభ్యులు మాధవ్‌ ఘాటుగా స్పందించారు. హోదాతో సమానమైన నిధులు తెచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని మాధవ్‌ హామీ ఇవ్వగా... ప్యాకేజీ ప్రకటించిన ఏడాదిన్నర తర్వాత కూడా పైసా ఇవ్వని కేంద్రం.. ఇప్పుడు ఇస్తుందన్న నమ్మకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చ ముగిసిన తర్వాత మండలి సభ్యులతో జలవనరుల సంరక్షణపై చైర్మన్‌ ఫరూక్‌ ప్రతిజ్ఞ చేయించి, సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

15:39 - March 22, 2018

విజయవాడ : ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే తేడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తున్నామని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీరందిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో దిగుబడి పెరుగుతున్నందున, భూగర్భ జలలు పెంచి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచుతామని చెప్పారు.

13:29 - March 18, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో జరిగిన పంచాంగ శ్రవణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉగాది పచ్చడి రుచిచూశారు. పండితుల ఆశీదర్వాదం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో తెలుగు ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనిషి జీవితంలో అనుభవాలకు గుర్తులని.. కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని ఉగాది మనికు సందేశం ఇస్తుందన్నారు ఏపీ సీఎం.

కేంద్రం చివరిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసి తాను తీవ్ర నిరాశకు లోనయ్యానన్నారు. మాట ఇచ్చి మోసం చేస్తున్నారని కేంద్రాన్ని గట్టి నిలదీశానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యుద్ధం చేస్తామని చెబుతోందని.. ఆయుద్ధం ఎవరిపై చేస్తారు.. తెలుగు జాతిపైనేనా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. గత 60 ఏళ్లలో ఆంధ్ర ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారని సీఎం చంద్రబాబు అన్నారు.60వేల కోట్ల అప్పుతో అమరావతికి వచ్చిన ఏపీ ప్రజలు.. ఉగాది సందేశాన్ని స్వీకరించి.. అభివృద్ధి దిశగా పట్టుదలతో సాగాలన్నారు సీఎం చంద్రబాబు. 

13:28 - March 18, 2018

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడకల్లో వేదపఠనం, వ్యవసాయ, ఉద్యానవన పంచాంగం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. డా.ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణం చేశారు.  

16:13 - March 16, 2018

గుంటూరు : ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగటం అనే అంశం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గత నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని, అనేక సార్లు ప్రత్యేక హోదా గురించి అడిగానని ఆయన గుర్తు చేశారు. మోదీ సర్కార్ తన చివరి బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకే తమ మంత్రులు క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారన్నారు. విభజన హామీలు ఇంత వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేరిస్తే ఈ సమస్య ఉండేదికాదన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మనోభావాలతో నిధులను పెంచలేమని మంత్రి జైట్లీది నిర్లక్ష్య ధోరణి అని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సెంటిమెంట్ ఆధారంగానే ఇచ్చారని, ప్రజల మనోభావాలు చాలా శక్తివంతమైనవని, ఇప్పుడు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని బాబు ఆరోపించారు. గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నామని, ఇలాంటి పరిస్థితులను ఈజీగా దాటేస్తామన్నారు. ప్రధాని లేఖ రాసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై పవన్ కు అవగాహన వుందా?
పోలవరం ప్రాజెక్టుపై పవన్ కళ్యాణ్ అవగాహన వుండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై పవన్ లేని పోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కలిసి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సిన వచ్చిందో తెలుసుకోవాలని పవన్ కు సూచించారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఏపీకి ఇస్తానని వాగ్ధానం చేసిన రైల్వే జోన్ ను ఇవ్వటం సాధ్యం కాదనటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు.
ఎన్డీయే డొంక తిరుగుడు విధానం
రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలు చెబుతోందని, పార్లమెంటులో తాము పోరాడుతుంటే ఒక్కసారయినా కూర్చోబెట్టి ప్రధాని మోదీ చర్చించారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తాము నిన్నటి వరకు వేచి చూశామని, ఇక తాము ఎన్డీఏలో ఎందుకు ఉండాలని ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తరువాతే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుని అదే విధంగా చేశామని అన్నారు.
నాలుగు బడ్జెట్లలోనూ ఏపీకి అన్యాయం
భాజపా ప్రభుత్వం గత నాలుగు బడ్జెట్లలోనూ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... భాజపాతో ఉండబోదని తెదేపా నిర్ణయించిందని, ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్‌ కష్టాలను కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన భాజపా.. అధికారంలోకి రాగానే మరిచిపోయింది. శాసన మండలిలో ఎన్డీయే నుండి విడిపోయిన అంశాలను, విభజన సమంయలో ఏన్డీయే ఇచ్చిన హామీలను, అనంతరం అవలంభిస్తున్న విధానాలను, దీనిపై కొనసాగుతున్న రాజీకీయ పరిణామాలను, పార్లమెంట్ లో పెట్టిన అవిశ్వాస తీర్మానం వంటి పలు అంశాలపై చంద్రబాబు సుదీర్ఘంగా వివరించారు. అనంతరం సభను మండిలి చైర్మన్ ఫరూక్ మంగళవారానికి వాయిదా వేశారు.

09:14 - March 16, 2018

విజయవాడ : నాలుగేళ్ల బంధం విడిపోనుంది...టిడిపి - బిజెపి అనుబంధం తెగిపోనుంది..బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని తాజాగా టిడిపి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. విభజన హామీలు..ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై టిడిపి గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రంతో పోరాడి హక్కులు సాధించుకుంటామని చెబుతున్న టిడిపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో రాజీనామా చేసిన టిడిపి ఎన్డీయేలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే జనసేన అధినేత పవన్ ఏపీ ప్రభుత్వం..సీఎం చంద్రబాబు..నారా లోకేష్ లపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుండడంతో అధికారపక్షంపై విమర్శలు అధికమయ్యాయి. చివరకు వైసీపీకి మద్దతివ్వాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. కానీ తామే సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు..ఎంపీలు..ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఎన్డీయేలో నుండి బయటకు రావాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సాయంత్రం జరిగే టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. టిడిపి తీసుకొనే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. 

13:14 - March 15, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ సమర్థించుకున్నారు. గుంటూరులో ఎన్ఆర్ఐ లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు పాలనపై వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు విధానాలను పరిశీలించడం జరిగిందని, బాబు మారే పరిస్థితి లేకపోవడంతోనే తాను దూకుడుగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. ఒక మాట అనే ముందు చాలా ఆలోచించాల్సి మాట్లాడుతుంటానని, అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా పట్టించుకోనని భయపడనన్నారు..

10:08 - March 11, 2018
09:40 - March 7, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా..విభజన హామీల అమలుపై కేంద్ర వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీనితో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఏపీ అసెంబ్లీని చక్కగా ఉపయోగించుకోవాలని బాబు నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బాబు ప్రసంగించనున్నారు. ఇందులో కేంద్ర వైఖరిపై బాబు క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ఎంపీలతో బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయబోదని పరోక్ష పద్ధతిలో కేంద్రం చెబుతోందని పేర్కొన్నారు. పరోక్ష విధానంలో లీక్ లు ఇవ్వడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీల విషయంలో కేంద్ర వైఖరిలో స్పష్టత వచ్చేలా చేయాలని, కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని బాబు సూచించారు. 

06:49 - March 6, 2018

విజయవాడ : ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకంగా మారిన భూ సేకరణ సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం సూచించారు. భూసేకరణకు బదులుగా భూ గర్భ పైపులైన్లు వేసి... ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ పైపులైన్లకు ప్రత్యేకంగా ఎవరి అనుమతులు అవసరం లేదని... అలాగే భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుందని సీఎం చెప్పారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 28 ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం.. మరో 20కిపైగా ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన 28 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చాలావరకూ పూర్తి కావస్తున్నందున... కొత్త ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి ఇంకా మిగిలి ఉన్న డిజైన్లను శరవేగంగా రూపొందించి, కేంద్రం నుంచి ఆమోదం పొందేలా చూడాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. డిజైన్ల రూపకల్పనకు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారిని నియమించాలన్నారు. 2018 జనవరి వరకు పోలవరం ప్రాజెక్ట్‌ కోసం 13, 053.91 కోట్లు ఖర్చు చేయగా... జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం 7,918.04 కోట్లు ఖర్చు చేసిట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి 9వరకూ కేంద్రం 4,932.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో 2,985.78కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. గడచిన వారం రోజుల్లో 24వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టితవ్వకం పనులు చేపట్టగా... 11వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్‌ వాల్‌ 7.6 మీటర్ల వరకూ నిర్మాణం జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.

పోలవరం ప్రాజెక్టులో మొత్తం మీద 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకూ 777.54 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్‌వే, స్టల్లింగ్ బేసిన్, స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి 35.14లక్షల క్యూబిక్ మీటర్ల వరకూ కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటికి 5.4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌కుగాను 1011.6 మీటర్ల వరకూ నిర్మాణం పూర్తయింది. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా. 1,62,739 ఎకరాల భూసేకరణ చేస్తుండగా ఇప్పటివరక 4,922.76కోట్లు చెల్లించి.. 1,02,480.90 ఎకరాలు సేకరణ పూర్తి చేశామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇంకా 60,25,8.10 ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉందని, ఇందుకు 28,302.98కోట్లు అవసరమవుతాయని చెప్పారు. త్వరిత గతిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - చంద్రబాబు నాయుడు