చత్తీస్ ఘడ్

11:29 - November 14, 2018

రాయ్ పూర్:  చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు లక్ష్యంగా బుధవారం ఉదయం బీజాపూర్ ఘటి వద్ద  ఈఐడీ పేల్చారు. పేలుడు ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్ధితి అదుపులోనే ఉందని, నక్సల్స్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని యాంటీ నక్సల్ ఆపరేషన్స్ డీఐజీ సుందర్ రాజ్ చెప్పారు. గత సోమవారమే చత్తీస్ ఘడ్ అసెంబ్లీకి మొదటి విడత  పోలింగ్ జరిగింది. రెండవ విడత పోలింగ్ నవంబర్ 20న జరుగుతుంది. 

12:45 - November 11, 2018

రాయ్‌పూర్: సోమవారం మొదటి విడత పోలింగ్ జరగునున్న చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతోభద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాంకేర్‌ జిల్లాలోని కోయలబేడలో వరుసగా పేర్చిన 6 ఐఈడీలను ఒకేసారి పేల్చివేయడంతో ఆ మార్గంలో కూంబింగ్ జరుపుతున్న బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. రాయపూర్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని కాంకేర్ జిల్లాలో ఈఘటన జరిగింది. గాయపడ్డ జవాన్ ఏఎస్ఐ మహేంద్ర సింగ్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పేలుడు తర్వాత భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. 
మరోవైపు బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించగా,మరోక మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. కొందరు తప్పించుకు పారిపోయారు. ఘటనా స్ధలంనుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, పారిపోయిన మావోయిస్టులను గాలించేందుకు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపు నిచ్చిననేపధ్యంలో... సోమవారం మొదటి విడత పోలింగ్ జరగనున్నబస్తర్ డివిజన్ లోని 7 జిల్లాలు, రాజనందగాఁవ్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతగా జరగటానికి సుమారు లక్షమంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపారు. 

21:57 - November 8, 2018

దంతెవాడ: చత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని పోలిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. చత్తీస్ ఘడ్ కు చెందిన అభినందన్ పాఠక్ అచ్చు మోడీ లాగానే ఉంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బస్తర్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.  గతంలో బీజేపీ కార్యకర్తగానే ఉన్న పాఠక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దంతెవాడ, కొండగావ్‌, జగ్దల్‌పూర్‌, బస్తర్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నపాఠక్ తో ఓటర్లు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

15:11 - November 8, 2018

దంతేవాడ: నవంబర్ 12 ఎన్నికల జరగనున్న చత్తీస్ ఘడ్  రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చత్తీస్ ఘడ్ లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక రోజు ముందు మావోయిస్టులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. చత్తీస్ ఘడ్  రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బచేలి సమీపంలో గురువారం మావోయిస్టులు ఒక బస్సుపై  దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తో సహా ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
గడచిన 2 వారాల్లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులకు పాల్పడటం ఇది మూడోసారి.  అక్టోబర్ 30 న ఎన్నికల వార్తల కవరేజ్ కు  వెళ్లిన దూరదర్శన్ టీంపై పైదాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానందన్ మరణించారు.  వారికి రక్షణగా వెళ్లిన  మరో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 27న  ఆవపల్లి వద్ద జరిగిన మరో దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు  మరణించారు.
90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న చత్తీస్ ఘడ్ లో తొలిదశ పోలింగ్  నవంబర్ 12న జరుగుతుంది.  తొలిదశలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, మిగిలిన  72 నియోజకవర్గాలలో నవంబర్  20న పోలింగ్ జరుగుతుంది. 

15:25 - March 2, 2018

భూపాలపల్లి : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భూపాలపల్లి జిల్లా నూగూరు-వెంకటాపురంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మవోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌తోపాటు సెంట్రల్‌ కమిటీ సభ్యులు ఉన్నారు. మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ ముగ్గురు పోలీసుల్లో వికారాబాద్‌కు చెందిన సుశీల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 తుపాకులు సహా పది ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 
హరిభూషణ్ ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసి
ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన హరిభూషణ్‌ది ఉమ్మడి వరంగల్‌ జిల్లా. కొత్తగూడ మండలం మడగూడెంకు చెందిన హరిభూషణ్‌ 20 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లాడు. పార్టీలో అంచలంచలుగా ఎదిగి తెలంగాణ సెంట్రల్‌ కమిటీలో పనిచేశాడు. గతంలో పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హరిభూషణ్‌... తాజా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. హరిభూషణ్‌ భార్య జజ్జరి అలియాస్‌ సమ్మక్క, అలియాస్‌ స్వర్ణక్క మావోయిస్టు ఉద్యమంలో పని చేశారు. అనారోగ్య కారణంలో 2009లో పోలీసులకు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కొనసాగుతున్నారు. 
 

17:46 - August 31, 2017

చత్తీస్ ఘడ్ : ఆ ఊళ్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని దయనీయ స్థితి. మంచినీళ్ల కోసమే రోజుల తరబడి వేట. దప్పిక తీరాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. వాగులు, వంకల్లో నీటి చెలిమెలను ఒడిసిపట్టుకోవాల్సిందే. కరువు రక్కసి దాడిచేయడంతో జనమే కాదు.. మూగజీవాలూ అల్లాడిపోయాయి. చుక్క నీరు లేక తల్లడిల్లుతున్న పల్లెజనుల దాహార్తిని ఓ బాలుడు తీర్చాడు. ఊరిజనం కష్టాలను ఆ పిల్లాడు ఎలా తీర్చాడో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కథనాన్ని చూసేయండి.. 

తల్లిదండ్రుల మోక్షప్రాప్తి కోసం ఆనాటి భగరథుడు ఆకాశగంగను భువిపైకి తీసుకొస్తే.. ఊరి జనం దాహార్తి తీర్చేందుకు ఈనాటి భగీరథుడు పాతళగంగను పైకి తెచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు 27 ఏళ్లు మొక్కవోని దీక్షతో జలయజ్ఞం చేశాడు. ఒక్కడే చెరువును తవ్వి చివరకు అనుకున్నది సాధించాడు. 

అతడి లక్ష్యం అనితరసాధ్యం. ఒక్కడే 27 ఏళ్ల పాటు సాగించిన భగీరథ ప్రయత్నం చివరకు ఫలించింది. సొంత ఊరి కోసం అలుపెరగని శ్రమదానం చేసిన ఇతనే శ్యామ్‌ లాల్‌. సొంత ఊరు చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కోరియా జిల్లాలోని సాజా పహడ్‌ గ్రామం. కోరియా జిల్లా చత్తీస్‌ఘడ్‌లో అత్యధికంగా నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రాంతం. కరువు రక్కసి కోరలు చాచడంతో..తాగునీటి కోసం జనమేకాదు.. మూగజీవాలు అల్లాడిపోయాయి. గుక్కెడు నీటి కోసం సాజా పహడ్‌ ప్రజలు అష్టకష్టాలు పడుతూ కిలోమీటర్ల మేర పరుగులు తీశారు. 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న శ్యామ్‌లాల్‌.. ఊరిజనం నిత్యం పడుతున్న నీటి కష్టాలను చూసి చలించిపోయాడు. ఊరి చివర్లో చెరువు తవ్వాలనే ఆలోచనతో ముందుకు కదిలాడు. 

సాజాపహడ్‌లో నీటి ఎద్దటి తాండవిస్తున్నా ప్రభుత్వం తరఫు నుంచి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామ ప్రజల దుస్థితి శ్యామ్‌ను కదిలించింది. అయితే శ్యామ్‌ ఆలోచనకు గ్రామంలో ఎవరూ మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ ఆలోచనను విరమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అయినా, తన ఆలోచనను విరమించుకోని శ్యామ్‌లాల్‌.. తనొక్కడే రోజు కొంతభాగం చెరువును తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామ పొలిమేర్లలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకుని తవ్వకాన్ని ప్రారంభించాడు. రోజూ తన జీవనం కోసం పనికి వెళ్లొచ్చిన అనంతరం... చెరువు కోసం 27 ఏళ్లుగా శ్రమదానం చేస్తూ వచ్చాడు శ్యామ్‌.

మొత్తానికి 27 ఏళ్ల శ్రమదానానికి ఫలితం దక్కింది. వర్షాలు కురిసిన సమయంలో చెరువులోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. సాజాపహడ్‌ వాసులు చెరువు నీటిని అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ మహేందర్‌ఘడ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యామ్‌ బిహారి జైస్వాల్‌..శ్యామ్‌లాల్ శ్రమను గుర్తించి 10 వేల నగదును అందజేశారు. జిల్లా కలెక్టర్‌ కూడా శ్యామ్‌లాల్‌కు తగిన ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మొత్తానికి మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు.. శ్యామ్‌లాల్‌. గ్రామ ప్రజల కష్టాలు తీర్చేందుకు ఈ అపర భగీరథుడు చేసిన ప్రయత్నం.. అందరికీ స్ఫూర్తి దాయకం. 

19:36 - March 2, 2016

హైదరాబాద్ : చత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ చట్టవిరుద్ధంగా జరిగిందని పౌరహక్కుల నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు మృతదేహాలను భద్రపరిచి రేపు నివేదిక సమర్పించాలని అదేశించింది. ఎన్ కౌంటర్ లో  ఎనిమిది మావోయిస్టులు చనిపోయారు. పోస్టుమార్టంను వీడియో రికార్డు చేసి ఆ తర్వాత మృతదేహాలను బందువులకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. 

 

18:16 - January 6, 2016

రాయ్ పూర్ : ఛత్తీస్‌గడ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమిత్‌ జోగిపై వేటు పడింది. అమిత్‌ జోగిని ప్రాథమిక సభ్యత్వం నుంచి  ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఛత్తీస్‌గడ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అంతాగడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని కాంగ్రెస్‌ ఓటమికి పాల్పడ్డారన్న కారణంతో కాంగ్రెస్‌- అమిత్‌ జోగిని బహిష్కరించింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశమున్నప్పటికీ బిజెపి గెలుపు కోసం జోగి ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. అజిత్‌జోగి, అమిత్‌ జోగి తన సహచరులు- ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అల్లుడు పునీత్‌ గుప్తాతో కలిసి డీల్‌ చేసుకున్న ఫోన్‌ సంభాషణలను ఓ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.

 

21:07 - November 2, 2015

చిత్తూరు : జార్ఖండ్‌కు చెందిన మావోయిస్టు గోవింద్‌ యాదవ్‌ను చిత్తూరు జిల్లా మదనపల్లెలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవింద్‌ యాదవ్‌పై 17కు పైగా కేసులు నమోదై ఉన్నాయి. మందుపాతరలతో పోలీసులను మట్టుబెట్టిన కేసుల్లోనూ గోవింద్‌ యాదవ్‌ నిందితుడుగా ఉన్నారు.

Don't Miss

Subscribe to RSS - చత్తీస్ ఘడ్