చిరంజీవి

06:50 - April 25, 2018

హైదరాబాద్ : టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు.. నిరసనలు.. తెలుగు చిత్రసీమను కుదిపేస్తున్న అంశాలపై చర్చించేందుకు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో దాదాపు 18 మంది హీరోలు.. ఇతర సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. మెగస్టార్‌ చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. టీవీ చానళ్లు కేవలం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని.. వాటికి కంటెంట్‌, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ప్రతిపాదన వచ్చింది. అంతేకాదు.. టీవీ చానల్స్‌ను ప్రోత్సహించకూడదని, వాటిని సినీ పరిశ్రమ బ్యాన్‌ చేయాలని ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. సమస్యలేవైనా వస్తే ఐక్యంగా మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీరెడ్డిని మొదట్లోనే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదని కొంతమంది అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మళ్లీ 4రోజుల తర్వాత కలిసి చర్చించాలని డిసైడ్‌ అయ్యారు. 

20:05 - April 24, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ హీరోలతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి హీరోలతో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలకృష్ణ, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అరవింద్, నాగబాబు, నానిలతో పాటు 20మంది పెద్ద హీరోలతో చిరంజీవి పాల్గొన్నారు. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై కలకలం రేగిన సంగతి తెలిసిందే. కాగా మీడియాకు సినిమాకు సంబంధించి కంటెంట్ ను అంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వర్క్ వంటి కీలక అంశాలను ఇవ్వకూడదనే విషయంలో ఈ భేటీలో చర్చిస్తున్నట్లుగా సమాచారం. కాగా గతకొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మీడియాలు చేసిన రాద్ధాంతంతో సినిమా పరిశ్రమలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం ఇంకా కొనసాగుతునే వుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి పెద్ద హీరోలతో రహస్య సమావేశం జరపటంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

15:20 - April 18, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూస్తే తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకువస్తానన్నారు. మా అసోసియేషన్‌లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అయితే మాలో సభ్యత్వం ఉచితంగా ఇవ్వడం కుదరదన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు తాను వ్యతిరేకమన్నారు నాగబాబు. పవన్‌ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. ఎవ్వరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకోమన్నారు

12:28 - February 28, 2018

షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఫీచర్ ఫిలిం తో టోటల్ ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేసిన డైరెక్టర్ తన మనసులో మాట చెప్పేసాడు. తన ప్రాజెక్ట్ విషయం లో క్లారిటీ గా ఉంటూనే స్టార్ హీరోలతో మల్టి స్టారర్ ప్లానింగ్ తన ఆలోచన అని మనసు విప్పాడు ఈ యంగ్ డైరెక్టర్ రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు ప్రెజెంట్ ఫిలిం మేకర్స్. తమ తమ టాలెంట్ ఏంటో ఫస్ట్ ఫిలిం తోనే చూపిస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇదే వే లో ఉన్న డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ వర్మ. షార్ట్ ఫిలిం నుండి తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు 'అ' అనే ఫీచర్ ఫిలిం తో ఆడియన్స్ ని పలకరించాడు.

' అ!’ సినిమా ఓ వర్గం వారికే నచ్చినా కథ పరంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ నటీనటులను తెరపై చూపించిన విధానం చాలా కొత్తగా అనిపించింది. ఈ దర్శకుడు తన మనసులో మాటను చెప్పేసాడు. తనకు మల్టి స్టారర్ సినిమా చెయ్యాలని ఉంది అని అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తో తన మల్టీస్టారర్ సినిమా చెయ్యాలని ఉంది అని చెప్పేసాడు ఈ యంగ్ డైరెక్టర్. 'సింహ' సినిమా హిట్ తో జోష్ లో ఉన్న బాలయ్య కొత్త డైరెక్టర్ అవకాశం ఇచ్చినా ఇస్తాడు. 

 

09:56 - February 7, 2018

హైదరాబాద్ : రాజ్యసభ సమావేశాలకు ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి డుమ్మా కొడుతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై పెద్దల సభలో కేవీపీ రామచంద్రరావు ఒంటరి పోరాటం చేస్తున్నా... చిరంజీవి గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తర్వాత చిరంజీవి ఇంతవరకు ఒక్కరోజు కూడా హాజరుకాకపోవడం చూస్తుంటే... రాష్ట్ర సమస్యలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
చిరంజీవి బడ్జెట్‌ సమావేశాలకు గైర్హాజరు
కేంద బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యంలేదు. రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు, చిరంజీవి, సుబ్బరామిరెడ్డి ఏపీ నుంచి  కాంగ్రెస్‌ ఎంపీలుగా కొనసాగుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేవీపీ రామచంద్రరావు నిరసన తెలుపుతున్నా... చిరంజీవి మాత్రం బడ్జెట్‌ సమావేశాలకు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
2018 ఏప్రిల్‌ 2తో ముగియనున్న పదవీకాలం  
పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోద సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి, రాష్ట్రానికి జరిగిన నష్టంపై అప్పట్లో ఒకసారి మాత్రమే నోరు విప్పారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్‌ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్‌  మంత్రివర్గంలో పర్యాటక శాఖ  బాధ్యతలు నిర్వహించారు. 2104 లోక్‌సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరుకావడం తగ్గించారు. అడపాడదపా హాజరైనా అదీ మొక్కుబడి తంతుగానే ముగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీలో చిరంజీవి రాజ్యసభ పదవీకాలం పూర్తవుతుంది. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో బాధ్యతాయుతమైన ఎంపీగా చిరంజీవి ఈ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. విభజన చట్టంలోని హామీల అమలు పెద్దల సభలో పోరాటం చేయాల్సిన సమయంలో గైర్హాజరవ్వడం విమర్శలకు తావిస్తోంది. 
రాజ్యసభ సమావేశాలకు చిరంజీవి హాజరైంది చాలా తక్కువ
రాజ్యసభ సమావేశాలకు చిరంజీవి హాజరైంది చాలా తక్కువ. 2017 బడ్జెట్‌ సమావేశాలకు 7 శాతం హాజరైన చిరంజీవి, శీతాకాల సమావేశాలకు 5 శాతమే హాజరయ్యారు. 2016 బడ్జెట్‌ భేటీకి 7శాతం, 2015 శీతాకాల సమావేశాలకు 30 శాతం, వర్షాకాల భేటీకి 5 శాతం హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత  2014లో తొలిసారి జరిగిన సమావేశాలకు 67 శాతం హాజరీ కనపరిచారు. ఇక రాజ్యసభలో చిరంజీవి వేసిన ప్రశ్నలు ఒక్కటి కూడా లేదంటే... రాష్ట్ర ప్రయోజనాలపై ఉన్న శ్రద్ద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. 2014 జులై 14న ఏపీ విభజన చట్టంపై జరిగిన చర్చలో పాల్గొన్న చిరంజీవి, 2017 ఏప్రిల్‌ 5న మిజోరం సీఎస్‌ఎస్‌ హిందీ టీచర్ల పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా ఒక్క ప్రైవేటు మెంబర్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. కార్మిక శాఖపై ఏర్పాటైన  పార్లమెంటరీ స్థాయి సంఘంలో చిరంజీవి సభ్యుడు. కానీ ఒక్క సమావేశానికి కూడా హాజరుకాలేదు.
మంత్రిగా కేటాయించిన బంగ్లా ఖాళీకి నోటీసులు 
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన అక్బర్‌ రోడ్లులోని బంగ్లాను ఖాళీ చేయడానికి నిరాకరించినప్పుడు.. పట్టణాభివృద్ధి శాఖ నోటీసులతో బలవంతంగా  ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆతర్వాత రాజ్యసభ ఎంపీగా చిరంజీవి పురానా ఖిల్లా రోడ్డులోని ఏబీ-3 బంగ్లాను కేటాయించారు. కొద్ది రోజుల్లో రాజ్యసభ పదవీకాలన్ని పూర్తి చేసుకోబోతున్న చిరంజీవి, ఇప్పుడైనా సభకు హాజరై  కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై  నోరు విప్పుతారాలో .. లేదో .. చూడాలి. 

 

18:30 - November 15, 2017

హైదరాబాద్ : మెగాస్టార్ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందా ? అంటే అవును జరిగిందని గీతా ఆర్ట్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న బన్నీ వాసు పేర్కొన్నారు. ఈయన చేసిన ట్వీట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే ఏపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు వచ్చింది. మెగా కుటుంబంలో ఉన్న ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదన్నారు.

ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని, దీనిని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీని అవమానించడమేనని తెలిపారు. మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోదని..అయిన ఆవేదనను తట్టుకోలేక మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. మగధీర సినిమాకు కూడా ఎంతో అన్యాయం జరిగిందని..జాతీయస్థాయిలో గుర్తింపు పొందినా రాష్ట్ర స్థాయిలో మాత్రం అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి....

15:33 - November 6, 2017

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో నుండి రూ. 2లక్షలను అపహరించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని జూబ్లీహిల్స్ పీఎస్ లో చిరంజీవి మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గత పదేళ్లుగా పనిచేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

10:54 - October 8, 2017

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా హీరో..హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులుంటారు. వారి చిత్రాలు విడుదలయ్యిందంటే చాలు ఎంతో సంబరపడిపోతుంటారు. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది అభిమానులున్నారు. అందులో వీరాభిమానులు కూడా ఉన్నారు. చిరంజీవి పుట్టిన రోజు..సినిమాలు విడుదలయితే హల్ చల్ చేస్తుంటారు. తాజాగా నటుడు చిరంజీవిపై అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లాలోని కడియపులంకలో ఆకుల భాస్కర్ రావు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఇతనికి పెళ్లి కుదిరింది. తన వివాహానికి అంత పెద్ద స్టార్ రాలేడని తెలుసుకున్న భాస్కర్ వివాహ మండపంలో చిరంజీవి ఫొటోతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. దాని సాక్షిగా అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. తన అభిమాన నటుడు చిరంజీవి పెళ్లికి వచ్చాడని అనుకుంటూ ఆనందం పొందాడు. 

12:03 - October 5, 2017

పలు చిత్రాల్లో స్పెషల్ పాటలు కామన్ అయిపోయాయి. అగ్ర హీరోలు..పేరొందిన నటుల సిన్మాలో ఈ పాటలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పాటల్లో నర్చించేందుకు హీరోయిన్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే పలు అగ్రహీరోల సినిమాలు..యంగ్ హీరోల సిన్మాల్లో హీరోయిన్లు ఆడి..పాడిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్' హీరోగా 'రంగస్థలం 1985' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ప్రత్యేక పాట ఉండనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో 'చెర్రీ' సరసన 'సమంత' నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సినిమా కథ ఉండనుంది. ఇటీవలే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం 'పూజా హెగ్డే' చిత్ర బృందం సమర్పించినట్లు టాక్. పూజా హెగ్డే 'డీజే' సినిమాలో 'అల్లు అర్జున్' తో కలిసి ఆడిపాడింది. అంతేగాకుండా బెల్లంకొండతో కొత్త సినిమాలో కూడా నటిస్తోంది. మరి 'రామ్‌ చరణ్‌'తో ఆడి పాడేందుకు సిద్ధమౌతుందా ? లేదా ?అనేది చూడాలి. 

10:19 - September 22, 2017

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా నర్సింహారెడ్డి' చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమౌతుంది ? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాకపోవడం వల్ల అభిమానులు నిరుత్సాహం ఉన్నారంట. తాజాగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి...టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరు. రాజకీయాల్లోకి వెళ్లిన అనంతరం చాలాకాలం పాటు ఆయన సినిమాలు చేయలేదు. అడపదడపా స్పెషల్ రోల్స్ లో నటించినా పూర్తిస్థాయి సినిమాలో నటించలేదు. ఇటీవలే ఆయన 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో తదుపరి చిత్రం కోసం 'చిరు' చాలా రోజుల పాటు వెయిట్ చేశాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాల వాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో 'చిరంజీవి' నటిస్తుండడంతో భారీ అంచనాలు ఇప్పటి నుండే నెలకొన్నాయి. ఇటీవలే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు..చిత్ర పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీపావళి తరువాతే 'సైరా' షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్. అక్టోబర్ 20 నుండి చిత్రీకరణ మొదలుకానుందని, నగర శివారులో ఓ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్ తేజ నిర్మిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమిత్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - చిరంజీవి