చెన్నై

11:41 - March 18, 2017

తమిళనాడు : చెన్నైలో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఇంట‌ర్నేష‌న‌ల్ కారు రేసర్‌ అశ్విన్ సుంద‌ర్ మృతిచెందాడు. ఆ దుర్ఘటనలో ఆయ‌న భార్య కూడా చ‌నిపోయింది. రేస‌ర్ అశ్విన్ న‌డుపుతున్న బీఎండబ్ల్యూ కారు శాంతం హైరోడ్డులో చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో రేసర్‌ అశ్విన్‌ దంపతులు సజీవదహనమయ్యారు. చెట్టును అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చే లోపే కారు పూర్తిగా ద‌గ్ధమైంది. ఈ ప్రమాద ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. 2012, 2013 సంవ‌త్సరాల్లో ఎఫ్‌4 క్యాటిరీల్లో అశ్విన్ చాంపియ‌న్‌గా నిలిచాడు.

13:38 - March 10, 2017

చెన్నై : జయలలిత మృతిపై కొందరు అన్నా డీఎంకే ఎంపీలు రాజ్యసభలో ఆందోళన వెలిబుచ్చారు.  జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు.  ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మరణించే వరకు జయలలితకు అందించిన వైద్యాన్ని రహస్యంగా ఉంచారని  ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణకానీ లేకపోతే సీబీఐ, సిట్‌ దర్యాప్తుకు ఆదేశించాలని అన్నా డీఎంకే ఎంపీ మైత్రేయన్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి, సభా కార్యక్రమాలను అడ్డుకున్న  అన్నా డీఎంకే మిథిలపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

17:29 - March 8, 2017

చెన్నై: మహిళా దినోత్సవం సందర్భంగా సేవ్‌ శక్తి నినాదంతో నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చెన్నైలో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సేవ్‌ శక్తి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తాలుకా స్థాయిలో మహిళా కోర్టు ఏర్పాటు చేయాలని.. 6 నెలల్లో తీర్పు ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

10:42 - March 8, 2017

ఢిల్లీ : తమిళనాడులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దీక్షకు కూర్చొంటున్నారు. జయ మరణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జయ మరణం తరువాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేయడం..సీఎం కావాలని ఆలోచించిన శశికళ జైలుకు వెళ్లడం జరిగిన సంగతి తెలిసింద. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం నిరహార దీక్షకు పూనుకున్నారు. అమ్మ జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ రాజరత్నం స్టేడియంలో సెల్వం దీక్ష చేయనున్నారు. జయది సహజమరణం కాదని..ఉద్ధేశ్య పూర్వకంగా మరణానికి దగ్గర చేశారని..సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12:25 - March 6, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రానున్నారా ? రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోమవారం కమల్ అభిమాన సంఘాలతో అత్యవసరం భేటీ అయ్యారు. దీనితో ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జయ మరణం తరువాత తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై ట్విట్టర్ వేదికపై కమల్ పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తామే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొంటున్నారు. దీనితో ఆయన రాజకీయాల్లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జయ మరణం అనంతరం..
జయ మరణం అనంతరం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడం..డీఎంకే బలంగా తయారు కావడం వంటివి చోటు చేసుకున్నాయి. జాతీయ పార్టీలు నామమాత్రం కావడంతో సినీ రంగం నుండి రావాలని పలువురిపై వత్తిడి పెరుగుతోంది. అంతేగాకుండా సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ దీనిపై రజనీ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. తాజాగా కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

21:14 - March 3, 2017

చెన్నై : సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్‌కి మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ కేసులో న్యాయవిచారణను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ధనుష్ తమ కొడుకు అంటూ మధురై కోర్టులో పిటిషన్
సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్‌కి మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకు అంటూ మధురై కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. 
కదిరేశన్ దంపతులు ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు 
అయితే కదిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయని పేర్కొనగా.. ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు పేర్కొనలేకపోవడం గమనార్హం. దీంతో ధనుష్ పుట్టుమచ్చలు వెరిఫికేషన్ కొరకు ఫిబ్రవరి 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించించడంతో ధనుష్ మధురై కోర్టుకు హాజరయ్యారు. అతనికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని మేలూరుకు సమీపంలోని మేజిస్ట్రేట్‌ కోర్టు తదుపరి విచారణను మార్చి 9కు వాయిదా వేసింది.  
విచారణపై హైకోర్టు స్టే 
మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ధనుష్‌ హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్‌ జి.చొక్కలింగం విచారణపై స్టే విధించారు. కదిరేశన్ దంపతులు మాత్రం ధనుష్ తమ కుమారుడే అని డిమాండ్ చేస్తూ, నెలకు 60 వేల భృతిని ఇవ్వాలని వారు కోరుతున్నారు. ధనుష్‌కి డీఎన్ ఏ పరీక్షలు కూడా జరపాలని కదిరేషన్ దంపతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే డీఎన్ఏ పరీక్షపై హైకోర్టు ఏం తేల్చకపోవడం విశేషం. 

17:34 - February 28, 2017

చెన్నై : తమిళ నటుడు ధనుష్‌ తమ కుమారుడని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన కేసుకు సంబంధించి ధనుష్‌ కోర్టుకు హాజరయ్యారు. సదరు దంపతులు పేర్కొన్న అంశాల్లో నిజాలు లేవనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ధనుష్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ధనుష్‌కు సంబంధించి పుట్టుమచ్చలు తదితర ఆధారాలను కదిరేశన్‌ దంపతులు కోర్టుకు సమర్పించగా...ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు లేవని పేర్కొనడం గమనార్హం. ఈ కేసుపై ఇవాళ విచారణ జరుగుతోంది.

 

11:16 - February 21, 2017

చెన్నై : తమిళనాడు శాసనసభలో ఈనెల 18న నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్షం డీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా రేపటికి వాయిదా పడింది. ఇటీవల పళని సెల్వం విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఓటింగ్ సమయంలో రెండుసార్లు సభను వాయిదా వేయడం..చివరికి ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం వంటి అంశాలను డీఎంకే కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రతిపక్షం లేకుండా విశ్వాస పరీక్ష నిర్వహించడం సబబు కాదని, దీనిపై సరియైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అందులో భాగంగా న్యాయపోరాటం చేయాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా 23వ తేదీన రాష్ట్రపతిని స్టాలిన్ కలువనున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్షపై కోర్టు ఎలా తీర్పునిస్తుందో చూడాలి.

 

11:13 - February 19, 2017

చెన్నై : విశ్వాస పరీక్ష ఎదుర్కొని విజయవంతం అయిన సీఎం పళని స్వామి నేడు గవర్నర్ విద్యాసాగర్ రావు ను కలువనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఘటనలపై గవర్నర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ సూచించినట్లు, ఈ నేపథ్యంలో సీఎం పళనిస్వామి భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు..బళ్లలు విసిరేయడం..స్పీకర్ స్థానంలో పలువురు సభ్యులు కూర్చొవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అనంతరం సస్పెండ్ చేసిన డీఎంకే సభ్యులను మార్షల్స్ బయటకు పంపారు. ఇలాంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన షర్ట్ చించారని, ప్రతిపక్ష నేత అయినా కూడా గౌరవించలేదంటూ డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిరిగిన చొక్కాతోనే గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి జరిగిన పరిణామాలను వివరించారు. గవర్నర్ తో ప్రస్తుతం సీఎం పళనిస్వామి భేటీ కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

17:12 - February 18, 2017

చెన్నై : మరోసారి మెరీనా బీచ్ వార్తల్లోకి ఎక్కింది. జల్లికట్టు ఉద్యమంపై యువత భారీ ఎత్తున ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నిరహార దీక్ష చేయడంతో బీచ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పళనిస్వామి విశ్వాసతీర్మానం నేపథ్యంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ బయటకు తరలిస్తుండగా చిరిగిపోయిన చొక్కాతోనే స్టాలిన్ గవర్నర్ వద్దకు చేరుకుని మాట్లాడారు. అనంతరం అక్కడి నుండి నేరుగా బీచ్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని దీక్షకు కూర్చొన్నారు. విషయం తెలుసుకున్న డీఎంకే అభిమానులు, నేతలు భారీగా చేరుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దీక్షకు అనుమతి లేదని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలని స్టాలిన్ కు తెలిపారు. దీనిని వారు వ్యతిరేకించారు. విపక్ష నేతయైన తన విషయంలో సరిగ్గా ప్రవర్తించలేదని, అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. స్పీకర్ తీరుపట్ల ఆయన గర్హించారు. అనంతరం స్టాలిన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడున్న 89 మంది ఎమ్మెల్యేలు..అభిమానులను తరలించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - చెన్నై