చేయాలి

13:48 - August 7, 2018

పశ్చిమ గోదావరి : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని కోరుతూ రేపు రాజమండ్రి నుండి కొవ్వూరు వరకు వారధిపై కవాతు చేపట్టనున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు.  ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని కోరారు. రాపూరు ఘటనకు ఎస్ఐ ప్రవర్తనే కారణమంటున్న కారెం శివాజీతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:43 - July 4, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఆర్టీసీ డ్రైవర్‌ వీరేశం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బర్కత్‌ పురా ఆర్టీసీ డిపో మేనేజర్‌ శంకర్‌ నాయక్‌ వేధింపులు భరించలేక డ్రైవర్‌ ఆత్మహత్యా యత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో.. సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిపో మేనేజర్‌ తీరుకు నిరసనగా.. బర్కత్‌పురా డిపోలో కార్మికులు విధులు బహిష్కరించారు. నిరసనగా 80 బస్సులను నిలిపేశారు. డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేయకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోన చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

 

22:14 - May 26, 2018

హైదరాబాద్ : మే 31న తలపెట్టిన రైతు జేఏసీ సడక్ బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష నేతలు పిలుపు నిచ్చారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయాలని సీపీఎం నేత నర్సింగరావు అన్నారు. రైతుబంధు పథకంతో భూస్వాములకే మేలు జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన గందరగోళంగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ 
అన్నారు. 

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

21:14 - April 4, 2018

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేసి చిత్తశుద్ధిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని దళిత ఉద్యమకారుడు ప్రొ.శ్రీపతి రాముడు అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. దళితులపై దాడులు పెరుగుతున్నా సత్వర న్యాయం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కారణమని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు...'మా చట్టం..మా హక్కు' అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీపతిరాముడు పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే..
'నేరాల రూపం మారుతూ వచ్చింది. దళితులపై క్రూయల్ గా శిక్షలు వేస్తున్నారు. మూత్రం తాగించడం, మల తినిపించడం, మహిళలను వివస్త్రను చేయడం జరుగుతుంది. ఇది కుల సమాజం. కారంచేడు ఊచకోత. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు వచ్చింది. 1995లో చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు. చట్టంలో మూడు అంశాలున్నాయి. ఒకటి అత్యాచారాలను నిరోధించాలి, రెండు అత్యాచార బాధితులకు రిలీఫ్, రిహాబిలిటేషన్ ఇవ్వాలి, మూడోది స్పీడ్ జస్టిస్ (సత్వర న్యాయం). కేసులను మూడు నెలల్లోపు క్లియర్ చేయాలి. దళితులు అభద్రతా భావానికి గురవుతున్నారు' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:27 - February 6, 2018

గుంటూరు : పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వర్చువల్ రివ్యూలో ప్రాజెక్ట్ తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.స్పిల్‌ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, రేడియల్ గేట్లు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 4వేల 375కోట్లు ఖర్చవుతుందని అధికారులు సమావేశంలో తెలిపారు. పోలవరం పనుల పురోగతిపై.. చంద్రబాబు 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు.

 

19:40 - August 16, 2017

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డికి రావాల్సిన మెడికల్‌ కాలేజ్‌ను మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని ఆరోపించారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ వచ్చే వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. 

 

15:08 - August 3, 2017

కర్నూలు : వైసీపీలో చేరే ముందు చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించాలని చెప్పారు. టీడీపీలో గుర్తింపు, గౌరవం లేకపోవడంతోనే వైసీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించడాన్ని రాజశేఖర్‌రెడ్డి తప్పుపట్టారు. చక్రపాణిరెడ్డికి టీడీపీ అధిష్టానం మంచి గుర్తింపు ఇచ్చిందని చెబుతున్నారు. చక్రపాణిరెడ్డిని టీడీపీ అధినాయకత్వం బాగా గౌరవించిందన్నారు. టీడీపీ నాయకత్వం అగౌరవపరిచిందని చక్రపాణిరెడ్డి చెప్పడం తగదని హితవు పలికారు. 

 

15:51 - July 31, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర కార్మికులకు అందుబాటులో ఉండేలా 500 పడకల ఈఎస్ఐ అసుపత్రిని ఏర్పాటు చేయాలని సీఐటీయు ఆందోళనకు దిగింది. విశాఖలోని ఈపీఎఫ్‌ ఆఫీసు ముందు జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ పాల్గొన్నారు. కార్మికుల నుంచి వసూలు చేస్తున్న డబ్బును మెడికల్‌ కాలేజీలు కట్టడానికి ఉపయోగిస్తున్న ప్రభుత్వం... వారి సంక్షేమాన్ని మరిచిందని గఫూర్‌ విమర్శించారు. కార్మికుల అవసరాలను గుర్తించి వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

19:06 - May 29, 2017

ఖమ్మం  : తొలకరి వచ్చేస్తోంది. ఈ సారి ఏం పంట సాగు చేయాలి. ప్రతీ సారి అన్నదాతకు ఎదురవుతోన్న బేతాళ ప్రశ్న ఇది. గతేడాది సర్కార్‌ చెప్పినట్లుగా సాగు చేసినా.. ఫలితం దారుణంగా కనిపించింది. దీంతో ఈ సారి ఏ పంటలు సాగు చేయాలో తెలియక రైతులు మధనపడిపోతున్నారు. ఓ వైపు ఖరీఫ్‌ సీజన్‌ దగ్గర పడుతోంటే.. ఎలాంటి పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో రైతులలో ఆందోళన ఎక్కువయ్యింది. మరి ఈ సారి ఏం సాగు చేయాలి? ఏం పంట వేస్తే అన్నదాత పంట పండుతుంది? తొలకరి దగ్గర పడుతోంది? ప్రభుత్వ ప్రకటన ఎప్పుడేస్తారు? అధికారులు దండోరా ఎప్పుడేస్తారు? ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. దీంతో చేలను దున్ని విత్తనాలు వేయటానికి అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. పోయిన పంటలో పత్తి సాగు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు అన్ని గ్రామాల్లో తిరిగి రైతులకు వివరించారు. దీంతో అన్నదాతలు ప్రభుత్వం చెప్పినట్లుగానే.. ఎక్కువ మొత్తంలో అపరాలు సాగు చేశారు. మరి కొందరు మిర్చి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట చేన్లో ఉన్నప్పుడు ఆకాశాన్నంటిన తృణ ధాన్యాల ధరలు చేతికొచ్చాక.. అమాంతం పాతాళానికి పడిపోయాయి.

కడుపు మండిన అన్నదాత
మిర్చి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అన్నదాతల కడుపు మండి ఖమ్మం మార్కెట్ కార్యాలయంపై దాడి చేసే వరకూ వెళ్లింది. పలువురు రైతులు సైతం అరెస్టయిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా.. సంచలనం సృష్టించింది. దీంతో ఈ సారి ఏ పంట సాగు చేయాలనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మిర్చి మంటతో ఈ సారి.. రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో పత్తి వేసే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వరి విస్తీర్ణత బాగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. సాధారణ వరి విస్తీర్ణత 1.82 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 92 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇది ఇంకా తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రైతన్న పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు.. వ్యాపారులు ఒక్కటై అన్నదాతను నిలువునా ముంచేస్తున్నారు. ఈ సారైనా సర్కార్ తమకు అండగా నిలవకపోతుందా అని.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట వేసిన తరువాత ధరలు పడిపోతుండటంతో.. ముందుగానే మద్దతు ధరలు ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఖరీఫ్‌ సిద్ధమవుతున్న రైతులు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. రైతులు ఖరీఫ్‌ పంటకు సిద్ధమవుతున్నారు. గతేడాది కంటే ఈ సారి పంట విస్తీర్ణం.. సుమారు 24 వేల హెక్టార్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి సరఫరా చేస్తారు. ఎరువులను 33 శాతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కేటాయించారు. మిగతా ఎరువులు ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తారు. విత్తన సేకరణలో శాఖ వెనకబాటు అన్నదాతలను కలవరపాటుకు గురి చేస్తోంది. వాణిజ్య పంటల విషయంలో గతేడాది కోట్లల్లో అన్నదాతలకు పంట నష్టానికి గురి చేసిన నకిలీ విత్తన వ్యాపారులపై ఈ ఏడాది ఉక్కుపాదం మోపాలని రైతులు కోరుతున్నారు. అలాగే కౌలు చేస్తున్న రైతులకే రుణాలు దక్కాలని.. రుణమాఫీ తమకే జరగాలని రైతులు కోరుతున్నారు.

అధికారుల కాలయాపన
సమయం దగ్గర పడిన తరువాత విత్తనాలంటూ హడావిడి, ఆపై కాలయాపన చేయడం వ్యవసాయ శాఖ వంతు అవుతోంది. చేసేది లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడం రైతు వంతవుతోంది. వాణిజ్య పంట, జిల్లాలో అధికంగా సాగయ్యే అవకాశం ఉన్న పత్తి విత్తనాలను స్వయంగా తయారు చేసుకోవడంపై.. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించలేకపోతోంది. దీంతో వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న విత్తనాలు రైతులకు భారమవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాగు కానున్న వరి, మిరప, పత్తి విత్తనాలను.. రాయితీపై వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోంది. కనీసం నకిలీ వ్యాపారుపైనైనా దృష్టి సారించాలని, అన్నదాతలు కోరుతున్నారు. మొత్తానికి వరికి ముందు పెసర వంటి అపరాలు సాగు చేస్తే బాగుంటుందని.. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - చేయాలి