జగన్

21:51 - October 16, 2017
13:53 - October 16, 2017

కృష్ణా : బీసీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. బీసీల కోసం జగన్‌ ఆరు నెలల కార్యాచరణ ప్రకటించారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని.. నిధులు కూడా అరకొరగానే విడుదల చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. బీసీలకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు స్వీకరించాలన్నారు. పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేయనున్న బీసీ గర్జనలో... బీసీ డిక్లరేషన్‌ ప్రవేశపెడతామని తెలిపారు. బీసీలకు చేపట్టే అభివృద్ధిని మేనిఫెస్టోలో పెట్టి... వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూశారని ఆరోపించారు జగన్‌. సమావేశానికి ముందు జగన్‌.. పలు కుల వృత్తులకు చెందినవారిని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

09:28 - October 16, 2017

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ బీసీ డిక్లరేషన్‌ను రూపొందించబోతున్నది. రాష్ట్రంలో బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి... పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోబోతున్నారు. ఇందుకోసం ఈరోజు వైఎస్‌ జగన్‌.. విజయవాడలో బీసీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జిల్లాలవారీగా నేతల నుంచి సమాచారం సేకరించనున్నారు. అలాగే బీసీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు... వైసీపీ ఏం చేయాలనే దానిపై చర్చించనున్నారు. అనేక దఫాల చర్చల అనంతరం వైసీపీ 'బీసీ డిక్లరేషన్‌' ప్రకటించే అవకాశం ఉంది. 

06:49 - October 15, 2017

విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్రకు రెడీ అవుతోన్న వేళ ఆ పార్టీకి పెద్ద షాకే త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర వ‌చ్చే నెల 2 నుంచి స్టార్ట్ అవుతోంది. ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యే టైంకు కాస్త అటూ ఇటూగా వైసీపీ నుంచి కీల‌క వ్యక్తులు జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఏపీ పాలిటిక్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీలో జోష్‌ నింపగా.. ప్రతిపక్షాన్ని డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీతో పాటు కాంగ్రెస్‌ నుంచి కూడా కొందరు కీలక నేతలు టీడీపీవైపు తొంగి చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ బుట్టా రేణుక టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బుట్టా రేణుకతో పాటు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధినేత జ‌గ‌న్...క‌ర్నూల్ జిల్లా నేత‌ల‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాము పార్టీ మార‌డం లేద‌ని కొందరు నేతలు చెప్పగా...ఎంపీ బుట్టా రేణుక మాత్రం పార్టీలో కొన‌సాగే విష‌యంపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..బుట్టా రేణుక పార్టీ మారడం ఖాయమన్న ప్రచారానికి మరింత బ‌లం చేకూరింద‌ని వైసీపీ నేత‌లు చర్చించుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకను కర్నూలు ఎంపీగా కాక..ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్‌ సూచించడంతో వైసీపీని వీడేందుకు ఆమె సిద్ధపడినట్లు తెలుస్తోంది. బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అంగీకరిస్తే..కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని జ‌గ‌న్ భావిస్తున్నారు. అయితే బుట్టా మాత్రం ఇందుకు ససేమిరా అన్నారట. ఎంపిగానే పోటి చేస్తాన‌ని, ఎమ్మెల్యేగా పోటి చేసే ఉద్దేశం తనకు లేద‌ని కుండబద్దలు కొట్టేశారట. ఈ పరిణామాలతోనే బుట్టా రేణుక త‌న‌దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు బుట్టా రేణ‌క భర్త గ‌తంలో చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. రేణుక కూడా భర్త బాటలో నడుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త‌న స‌న్నిహితులు,అనుచ‌రుల‌తో సమావేశమైన త‌రువాత..పార్టీ మార్పుపై రేణుక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే వ‌ల‌స‌ల‌తో స‌త‌మ‌తమవుతున్న వైసీపీకి బుట్టా రేణుక పార్టీ మారితే మ‌రింత న‌ష్టం త‌ప్పద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

06:46 - October 15, 2017

విజయవాడ : నంద్యాల, కాకినాడ ఓటమితో కుదేలైన వైసీపీని గాడిన పెట్టేందుకు జగన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? మూసపద్ధతిలో కాకుండా వినూత్న పద్ధతిలో పాదయాత్ర ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారా? ప్రజా సమస్యలే ఎజెండాగా బాబు సర్కార్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహాలకు జగన్‌ పదునుపెడుతున్నారట. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు అనుమతి వస్తుందని భావిస్తున్న వైసీపీ నేతలు...జగన్‌ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. అసలు జగన్‌ పాదయాత్రకు సీబీఐ కోర్టు అనుమతి ఇస్తుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. జగన్ పాదయాత్రకు సంబంధించి హాజరు మినహాయింపుల అనుమతులు కోరుతుండగా.. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లలో యాత్రకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు. రాజకీయ నేపథ్యం, ప్రజావసరాల దృష్ట్యా యాత్రకు మాత్రం అనుమతి వస్తుందని, హాజరు మినహాయింపు సంగతి ఏమౌతుందో చూడాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడక పోయినా..జగన్‌ పాదయాత్రకు వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

న‌వంబ‌రు 2 నుంచి సుదీర్ఘ పాద‌యాత్రకు శ్రీకారం చుట్టేందుకు జగన్‌ రెడీ అవుతున్నారు. పట్టణాలతో పాటు ప‌ల్లెలు, గ్రామాల్లో విస్తరిస్తేనే పార్టీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పాద‌యాత్ర పూర్తిగా ప‌ల్లెలు, గ్రామాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. ఇడుపులపాయ నుంచి మొదలయ్యే పాదయాత్రను అట్టహాసంగా ప్రారంభించేందుకు వైసిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారట. సుమారు లక్ష మందితో పాదయాత్రను మొదలుపెట్టి అధికార పార్టీకి పెద్ద సవాల్‌ను విసరాలని భావిస్తున్నారట. 3 వేల కిలోమీటర్లకు పైగాసాగే పాదయాత్ర అన్ని జిల్లాలను కలుపుతూ 122 నియోజకవర్గాల్లో ఉండేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఈ పాదయాత్రలో జనాన్ని ఆకర్షించేందుకు పీకే కొత్త వ్యూహాలు సిద్ధం చేశారట. నవరత్నాల పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఇవేకాక జనాల నాడిని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి కొత్త హామీలు ప్రకటించాలని భావిస్తున్నారట. ఇక జగన్‌ పాదయాత్రలో మరో ఆసక్తిరమైన అంశంపై ప్రచారం హోరెత్తుతోంది. ప‌ల్లె జ‌నాల‌ను ఆక‌ర్షించేందుకు త‌న తండ్రి మాదిరిగా జ‌గ‌న్ కూడా పంచె ధరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా వైసీపీ అధినేత పాదయాత్రకు సీబీఐ కోర్టు తీర్పు కీలకం కానుంది. 

10:47 - October 13, 2017

 

హైదరాబాద్ : కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు హాజరుకానున్నారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విన్నవించనున్నాడు. 6నెలల పాటు మినహాయింపు ఇవ్వాలని కోరునట్టు తెలుస్తోంది. సీబీఐ కోర్టు కాసేపట్లో ఈ పిటిషన్ విచారించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:39 - October 12, 2017

హైదరాబాద్ :వంశధార నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్షాల నేతలను అరెస్టు చేయడాన్ని వైసీపీ అధినేత జగన్‌ ఖండించారు. కాంట్రాక్టులు, కమీషన్లమీదే దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రాబాబు.. వంశధార నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వామపక్షాలతోపాటు వైసీపీ కూడా ఉద్యమిస్తుందన్నారు వైఎస్‌ జగన్‌. 

15:44 - October 10, 2017
15:19 - October 10, 2017

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై  సీఎం చంద్రబాబు కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. అనంతపురంలో పదవ యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షకు దిగితే అర్ధరాత్రి పోలీసులను పంపి దీక్షను భగ్నం చేయించారని బాబు పై మండిపడ్డారు. ప్రధాని మోదీతో సన్నీహితంగా ఉండే చంద్రబాబు కనీసం మాటమాత్రంగానైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని జగన్‌ విమర్శించారు. 

 

11:33 - October 4, 2017

హైదరాబాద్ : ఏపీలో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను తన పాదయాత్ర ద్వారా ఎత్తిచూపాలని భావించిన జగన్‌కు.. కోర్టు కేసులు బ్రేక్‌ వేసేలా కనిపిస్తున్నాయి. పార్టీ ప్లీనరీలో జగన్‌ నవరత్నాలు పేరుతో తొమ్మిది అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇదే వేదిక నుంచి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. పాదయాత్రకు ముహూర్తం కూడా ప్రకటించేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు.

ప్రతి శుక్రవారం కోర్టుకు
వైఎస్‌ జగన్‌ తనపైనున్న కేసుల విచారణ కోసం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. దీంతో జగన్‌ పాదయాత్ర ప్రారంభానికి నోచుకోలేదు. అందుకే పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని తాను కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని జగన్‌ కోరుతూనే ఉన్నారు. అయితే జగన్‌ అభ్యర్థనపై కోర్టు నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో పాదయాత్రపై పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.

అధికారపార్టీకి అస్త్రంగా..
జగన్‌ కోర్టుకు హారుకావడం నుంచి మినహాయింపు దొరికినా తద్వారా ఎదురయ్యే పరిణామాలను పార్టీ నేతలు బేరీజు వేసుకుంటున్నారు. కోర్టు నుంచి అనుమతి పొంది పాదయాత్ర చేస్తే అది అధికారపార్టీకి అస్త్రంగా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాదయాత్రకు ప్రత్యామ్నాయంపైనా దృష్టి సారించారు. పాదయాత్రను కాదని ఏం చేస్తే బావుటుందన్న తర్జన భర్జనలు పార్టీ నేతల్లో మొదలయ్యాయి. పాదయాత్రకు ప్రత్యామ్నాయంగా జిల్లాల పర్యటనలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. వీలైనంత త్వరగా ప్రజాక్షేత్రంలోకి జగన్‌ వెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్నదానిపై నేతలు దృష్టి సారించారు. మరి జగన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాదయాత్ర చేస్తారా.. లేక జిల్లాల పర్యటనలు చేస్తారా అన్నది పార్టీలో చర్చనీయాంశమైంది.

Pages

Don't Miss

Subscribe to RSS - జగన్