జీఎస్టీ

06:33 - November 12, 2017

ఢిల్లీ : జీఎస్టీ స్లాబుల తగ్గింపు నిర్ణయం గుజరాత్‌ ఎన్నికల కోసమే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. అత్యవసరంగా జీఎస్టీ అమలు చేయాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకొచ్చిందో దేశప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుచేశామని అంగీకరించే నైతిక ధైర్యం ఆర్థికమంత్రికి ఉండాలన్నారు. ఈ విషయంలో దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

08:41 - November 11, 2017

జిఎస్‌టి అమలుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువులను శ్లాబ్‌ నుంచి తప్పిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం శ్లాబు పరిధిలో కేవలం 50 వస్తువులకే పరిమితం చేశారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కాట్రగడ్డ ప్రసూన్న (బీజేపీ), కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

08:31 - November 11, 2017

ఢిల్లీ : జిఎస్‌టి అమలుపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగివచ్చింది. జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువులను శ్లాబ్‌ నుంచి తప్పిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 28 శాతం శ్లాబు పరిధిలో కేవలం 50 వస్తువులకే పరిమితం చేశారు. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జిఎస్‌టి 28 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 177 వస్తువులను ఆ శ్లాబు నుంచి తప్పించాలని జిఎస్‌టి కౌన్సిల్‌ నిర్ణయించింది. నిత్యావసర వస్తువులైన చాక్లెట్లు, చూయింగ్‌ గమ్‌లు, పోషాకాహార పానీయాలు, షాంపూలు, డియెడరెంట్, కాస్మెటిక్స్, డిటెర్జెంట్, షూ పాలిష్, చెప్పులు, షేవింగ్‌ క్రీమ్, ఆఫ్టర్ షేవ్ కిట్స్, శానిటరి, సూట్‌కేస్‌, గడియారాలు, వాల్‌ పేపర్స్‌, ప్లయివుడ్‌, స్టేషనరి, మార్బుల్‌ తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా, జీఎస్‌టీ మండలి అంతకన్నా ఎక్కువ వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించింది. దీంతో చాలా వస్తువులు 28శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వస్తాయి. సామాన్యులు వాడే అన్ని రకాల వస్తువులను 28 శాతం పరిధి నుంచి తప్పించినట్లు బిహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్‌ మోది తెలిపారు.

28 శాతం శ్లాబులో గతంలో 227 వస్తువులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 50కి తగ్గింది. దీంతో 177 వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. పెయింట్స్‌, సిమెంట్‌, విలాస వస్తువులు, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్‌ కండీషనర్లు, ఫ్రిజ్‌, టొబాకో తదితర వస్తువులు 28శాతం శ్లాబు పరిధిలో ఉన్నాయి. జిఎస్‌టి మండలి తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయంపై 20 వేల కోట్ల మేర ప్రభావం చూపనుంది.

గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ -జిఎస్‌టి జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. జిఎస్‌టి శ్లాబులను 5, 12, 18, 28 శాతంగా నిర్ణయించింది. జిఎస్‌టి కౌన్సిల్‌ ప్రతి నెలా సమావేశమై పన్ను అమలవుతున్న తీరుపై సమీక్ష జరుపుతోంది. జిఎస్‌టి అమలు తీరుపై విపక్షాలు మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. జిఎస్‌టిని ఆదరా బాదరాగా అమలు చేయడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

10:30 - November 9, 2017

హైదరాబాద్: గౌహతిలో జరిగే జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ బయలుదేరారు. సామాన్యుడికి జీఎస్టీ పన్నుభారం మరింత తగ్గే అవకాశం ఉందని ఈటెల చెప్పారు. సామాన్య ప్రజలకు జీఎస్టీ పన్నుభారం తగ్గించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటెల తెలిపారు. 

17:31 - November 8, 2017

హైదరాబాద్: కంప్యూటర్ విద్య సామాన్యులకు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న నియో కర్సర్ సంస్థ త్వరలో ఉచితంగా జీఎస్టీ కోర్సులు అందించనుంది. డిగ్రీ చదువుకున్న యువతీ, యువకులు ఈ కోర్సు పూర్తి చేయడానికి అర్హులు. నవంబర్ 30లోగా ఆసక్తి ఉన్న యువత తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సంస్ధ నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి వివరాలకు హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న నియోకర్సర్‌ను సంప్రదించాల్సిందిగా తెలిపారు.

08:05 - November 8, 2017

మోది సర్కార్ పెద్దనోట్ల రద్దు అమలు చేసి ఏడాది పూర్తవుతోంది. గడచిన సంవత్సర కాలంలో.. నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి ఫలితాలనిచ్చింది..? ప్రజలకు ఏమైనా మేలు చేసిందా..? వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తమెంత..? పోనీ ప్రజలంతా డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? ఇలాంటి ప్రతి ప్రశ్నకూ లేదు అన్న సమాధానమే వస్తోంది. ఈ కఠోర వాస్తవాలను కప్పిపుచ్చే క్రమంలో... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు.. రేపు అనుకూల ర్యాలీ చేపడుతున్నాయి. అదే సమయంలో విపక్షాలు.. నవంబర్‌ 8ని బ్లాక్‌డేగా వర్ణిస్తూ.. దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనున్నాయి.

నవంబర్‌ 8, 2016న 500, 1000 నోట్లను రద్దు చేస్తూ మోది ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆదరా బాదరాగా కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నోట్ల మార్పిడి చేసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చుని వందకు పైగా మంది మృతి చెందారు. నోట్లరద్దుతో రైతులు, పేదలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. మోది సర్కార్‌ తీసుకున్న నోట్ల రద్దు, జిఎస్‌టి నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని ఎన్నో సర్వేలు నిరూపించాయి. 90 శాతం నల్లధనం విదేశాల్లోనే మూలుగుతోందని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న ప్రధాని ఇచ్చిన హామీ పూర్తిగా విఫలమైంది.

పెద్దనోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, ఫేక్‌ కరెన్సీ నిర్మూలిస్తామన్న మోది ఆకాంక్ష నెరవేరకపోగా....అది మరింత పెరిగిందని విపక్షాలతో పాటు.. పలు సర్వేలూ ఘోషిస్తున్నాయి. మోది ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో నిరుద్యోగిత పెరిగింది. ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఏదోరకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విపక్షాలు నిరసనలకు దిగుతున్న వేళ.. అధికార బిజెపి, పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. నల్లధనం నిర్మూలనలో భాగంగానే పెద్దనోట్లను రద్దు చేసినట్లు తమ చర్యను సమర్థించుకుంది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోట్లరద్దు నిర్ణయంపై అధికార, విపక్షాల ఆందోళన ప్రజలపై ఎంత ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి.

11:26 - November 6, 2017

'వన్ మేన్ షో టు మేన్ ఆర్మీ' పద్ధతులకు బీజేపీ స్వస్తి పలకాలని బిజెపి ఎంపి, నటుడు శత్రఘ్న సిన్హా ఘాటు విమర్శలు చేశారు. తమ సొంతపార్టీ పైనే విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ తమ పార్టీలోని లోపాలను నిష్పక్షపాతంగా ఎత్తిచూపే నేతలలో బీజేపీ ఎంపీ నటుడు శత్రుఘ్న సిన్హా ఒకరు. నోట్ల రద్దు సమయంలో కూడా మోదీని విమర్శించారు. తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీలో దురహంకారం పెరుగుతోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపొందాలంటే అధినాయకత్వం ఒంటెత్తుపోకడను విడనాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల యువకులు రైతులు వ్యాపారులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఆ ప్రభావం త్వరలో జరగనున్న గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై పడుతుందన్నారు. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడక కాదని శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికలు అధికార పార్టీకి సవాలు వంటిదన్నారు. ప్రత్యర్థి పార్టీలను తక్కువగా అంచనా వేయడం పొరపాటన్నారు. తాను బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. బీజేపీని వదిలిపెట్టే ఉద్దేశం తనకు లేదని అలా అయితే తాను ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన నిర్ణయాలను కేవలం ఒకరో ఇద్దరో వ్యక్తులు తీసుకోవడం సరికాదని మోదీ అమిత్ షాలనుద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే విధానం కొనసాగితే రాబోయే సవాళ్లను ఎదుర్కోలేమని సొంతపార్టీ పై సద్విమర్శలు చేసేందుకు తాను వెనుకాడబోనని స్పష్టం చేశారు. పటేళ్ల ఉద్యమాన్ని బీజేపీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందని అందుకే హార్దిక్ పటేల్ కు బీజేపీ దగ్గరకాలేకపోయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల చార్టర్డ్ అకౌంటెంట్లకు చేతినిండా పని దొరికిందని సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అధికారులు న్యాయమూర్తులపై ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు జరపకూడదని వారిపై వచ్చే ఆరోపణలపై మీడియా కూడా అనుమతి లేకుండా వార్తలు రాయకూడదంటూ రాజస్థాన్ సర్కార్ బిల్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుపై సిన్హా మండిపడ్డారు. ఆ బిల్లు...రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

20:58 - November 4, 2017

ఆరోగ్యం వేరు..రోగం వేరు..కానీ దేశంలో ప్రజారోగ్యం ఎలా ఉందంటే రోగం రాకుండా చేసుకునే చర్యలు లేవని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డా.వి.బ్రహ్మారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఆరోగ్య రంగం ఎలా ఉంది ? వైద్యుల పరిస్థితి..ఇతరత్రా అంశాలపై టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఉచిత వైద్యం సాధ్యం కాదనే మాట కరెక్టు కాదని, పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఉచిత వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పన్నులు కట్టించుకుంటున్నారు కదా ? అని ప్రశ్నించారు. ఎవడికి రోగం వస్తే వాడే బాగు చేసుకోవాలనే పరిస్థితి ఏర్పరిచారని, చూడటానికి అందంగా ఉంటుంది..కానీ చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రైవేటుపై ప్రభుత్వాలకు ప్రేమగా ఉంటుందని..కార్పొరేట్ శక్తులకు లక్షలు..కోట్ల రాయితీలు ఇస్తారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు శిక్షణ ఇచ్చింది గాంధీ..ఉస్మానియాలేనన్నారు.

వైద్యులు ఉంటే సరిపోదని..సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగా పనిచేస్తారని, గాంధీ..ఉస్మానియాలో నైపుణ్యమైన వైద్యులున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో జీఎస్టీ ద్వారా డబ్బులు తీసుకుంటే ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రశ్నలు ఉత్నన్నమౌతాయన్నారు. కోటి రూపాయలు పెట్టిన విద్యార్థి ఆ డబ్బులు ఎలా వస్తుందనే ఆలోచన వస్తుందని, ఒక్క విద్యార్థి మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రజలదే కదా అన్నారు. ఎంబీబీఎస్ పూర్తయిన తరువాత 50 నైపుణ్యాలు వచ్చి ఉండాలని, కానీ వాస్తవానికి పరీక్షలు చేస్తే ఒక వైద్యుడికి ఇంజక్షన్ ఇవ్వడం తప్ప తప్ప ఇంకేమీ రాదన్నారు. వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు ప్రజలతో ఎలా మెలగాలనే దానిపై శిక్షణ ఉండాలని సూచించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

21:27 - November 2, 2017

ఢిల్లీ : నోట్ల రద్దు జీఎస్టీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రైతులపై భారం పడిందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి. ఢిల్లీలోని భగత్‌ సింగ్‌ పార్కు వద్ద రెండో రోజు కొనసాగుతున్న రైతుల మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. దేశంలో రైతులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలపై అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. 

10:29 - October 28, 2017

మహారాష్ట్ర : రాష్ట్రంలో బిజెపి, శివసేన పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. తరచూ బిజెపిపై విమర్శలు చేసే శివసేన ఈసారి ఏకంగా ప్రధాని మోదినే టార్గెట్‌ చేసింది. జిఎస్‌టి, నోట్లరద్దు నిర్ణయాలతో మోది పనైపోయిందని.... ఈ దేశానికి రాహులే దిక్కని పేర్కొంది. శివసేన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్‌ సీరియస్‌గా స్పందించారు. బిజెపి ప్రభుత్వంలో కొనసాగుతారా...లేదా... అన్నది తేల్చుకోవాలని శివసేనకు సవాల్‌ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి శివసేన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వంద మంది రాహుల్‌గాంధీలు కూడా మోదీని ఏమీ చేయలేరని రెండేళ్ల క్రితం పొగడ్తలతో ముంచెత్తిన శివసేన ఇపుడు మాట మార్చింది. మోదీ ప్రతిష్ట మసకబారుతోందని... కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కనిపిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది.

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపట్ల దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌.. ఒక టీవీ షోలో అన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు.. ప్రజలను ఆలోచనలో పడేశాయని ఆయన చెప్పారు. జిఎస్‌టి కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం తప్పదని సంజయ్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీపై సంజయ్‌రౌతే ప్రశంసలు కురిపించారు. ఆయనను పప్పు అనడం సరికాదన్నారు. ఈ దేశంలో అతిపెద్ద రాజకీయ శక్తి ప్రజలే. ఎవరినైనా పప్పును చేసే శక్తి ప్రజలకు ఉందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి రౌత్ అన్నారు. శివసేన ఎంపీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తీవ్రంగా స్పందించారు. బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో కొనాసాగాలా...లేదా అన్నది ఉద్ధవ్‌ ఠాక్రే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. తాము చేసే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తూనే ఉంది...కానీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం సరికాదన్నారు.

మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. ఇటీవల శివసేన- ప్రధాని మోదిని, బిజెపిని టార్గెట్‌ చేస్తూ చురకలు అంటిస్తోంది. సంజయ్‌ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలిగితే ఫడ్నవిస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. శరద్‌ పవార్‌ మద్దతుపైనే బిజెపి ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.

Pages

Don't Miss

Subscribe to RSS - జీఎస్టీ