జీహెచ్ఎంసీ

15:47 - July 15, 2018

హైదరాబాద్ : లేని భ‌ద్రతకు వేతనాలు చెల్లిస్తోంది బల్దియా. పార్కులు, కార్యాలయాల్లో వంద‌లాది మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించినట్లు రికార్డుల్లో ఉన్నా.. విధుల్లో మాత్రం లేరు. కానీ ప్రతి నెలా బ‌ిల్లులు మాత్రం డ్రా అవుతున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మ‌త్తులో జోగుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల భ‌ద్రత‌కే ముప్పుతెచ్చేలా ఉంది. ప్రజల భ‌ద్రత కోసం సెక్యూరిటీ గార్డులను నియమిస్తోంది బల్దియా. కానీ వాస్తవం మరోలా ఉంది.. రికార్డుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు విధుల్లో మాత్రం క‌నిపించరు. జీహెచ్ఎంసీ పార్కుల్లోని భ‌ధ్రత, సెక్యూరిటీ గార్డుల పనితీరుపై క్షేత్రస్థాయిలో ప‌లు ఆక్రమాలు వెలుగుచూశాయి. ఉండాల్సిన సంఖ్య క‌న్నా త‌క్కువ మందితో ఏజెన్సీలు ప‌ని చేయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్రధాన కార్యాల‌యం తోపాటు 5 జోన‌ల్ కార్యాలయాలు, 30 డిప్యూటి క‌మీష‌న‌ర్ కార్యాల‌యాలు, పార్కింగ్ యార్డులు, ఇత‌ర భ‌వ‌నాల వ‌ద్ద వంద‌లాది మంది సెక్యూరిటీ గార్డుల‌ను నియ‌మించింది జీహెచ్ఎంసీ. కానీ కొన్ని ఏజెన్సీలు అవినీతి అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నాయి. ప్రధాన కార్యాల‌యంతో పాటు ప్రతీచోటా ఎక్కువ మంది పేరుతో వేత‌నాల దోపిడీ జరుగుతోంది. కాగా ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చ‌ర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు.

ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది జ‌ల‌గం వెంగ‌ల్ రావు పార్కు. ఇక్కడ భ‌ద్రత‌కోసం 16మంది గార్డుల‌ను నియ‌మించేలా సంబంధిత ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకుంది జిహెచ్ఎంసి. ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారన్నది సూపర్‌వైజర్‌కు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఇక చాచా నెహ్రు పార్కులోనూ అదే పరిస్థితి ఉంది. అంతే కాదు.. ఇక్కడి గార్డుల‌కు అందుతున్న వేతనానికి, జీహెచ్‌ఎంసీ ఏజెన్సీకి చెల్లిస్తున్న నిధుల‌కు ఏమాత్రం పొంత‌న లేదు. ప్రతినెలా కేవ‌లం పార్కుల భ‌ద్రత‌కోసమే 200మందిని ఉప‌యోగిస్తుంది జీహెచ్ఎంసీ. వేత‌నాలు, ఈఎస్ఐ, పీఎఫ్, ఏజెన్సీలకిచ్చే స‌ర్వీస్‌ టాక్స్‌ల కోసం మూడు కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తోంది. ప్రతి సెక్యూరిటీ గార్డుకు 9698 రూపాయ‌ల వేత‌నం చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ. ఒక్కో చోట ఒక్కో విధంగా వేతనం ఇస్తున్నారు. చాచా నెహ్రు పార్కులో 7500, వెంగ‌ల్ రావు పార్కులో 8000 ఇలా చెల్లిస్తున్నారు. ఇక కార్మికుల జీవిత భ‌ద్రత‌, ఆరోగ్య భద్రతకు ఏర్పాటుచేసిన పీఎఫ్‌, ఈఎస్ఐ కూడా చెల్లించ‌డం లేదు. ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నిచేస్తున్నా కానీ ఈ రెండింటి పేరుతో ప్రతి నెలా కార్మికుడి వేతనంతోపాటు... బ‌ల్దియా ఖ‌జానుంచి నిధుల‌ు ఖాళీ అవుతున్నాయి.

16:15 - July 14, 2018

హైదరాబాద్ : బల్దియాలో భద్రతను గాలికొదిలేశారా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి...30 డిప్యూటి కార్యాలయాలు..జోనల్ కార్యాలయాలు...ప్రధాన కార్యాలయం..వందలాది పార్కులున్నాయి. ప్రధాన పార్కులు కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవడానికి..రక్షణకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా సెక్యూర్టీని నియమించింది. కానీ భద్రతను జీహెచ్ఎంసీ గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పార్కుల వద్ద సెక్యూర్టీ గార్డులు కనిపించడం లేదు. గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని చెప్పవచ్చు. కార్మికుల వేతనాలను కొల్లగొడుతున్నారు. సెక్యూర్టీ డ్యూటిల పేరిట అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:19 - July 7, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ప్రశ్నించే కార్మికులకు వేధింపులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారుల దాష్టీకం బయటపడింది. ఇక్కడ ఆర్డర్లీ వ్యవస్థ నడుస్తుండడం కలకలం రేపుతోంది. ఆర్థికంగా..శ్రమ దోపిడి చేస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాకపోవడం శోచనీయం.

మల్కాజ్ గిరిలో సూపర్ వైజర్లు బరి తెగిస్తున్నారు. ఎంటమాలజీ కార్మికులతో సూపర్ వైజర్ పనులు చేసుకుంటుండడం గమనార్హం. బల్దియా సిబ్బందితో అధికారులు బట్టలు ఉతికించుకుంటున్నారు. పిల్లల్ని బడికి తీసుకెళ్లేందుకూ బల్దియా సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు. అంతేకుండా స్నేహితుల పనులను అధికారులు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో దోపిడి కూడా ఉంది. పీఎఫ్ డబ్బులూ వదలలేదు. వేతనాలు పడగానే వసూళ్లు ప్రారంభిస్తారు. పై అధికారులకు ఇవ్వాలంటూ వసూళ్లు చేస్తున్నారు. 

17:21 - July 2, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఫుట్ పాత్ లపై అక్రమంగా నిర్మితమయిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు సోమవారం కూల్చివేతలను కొనసాగించారు. ఆరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2341 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ సోమవారం కూకట్ పల్లి, కాచిగూడలో సిబ్బంది, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరివల్ల చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగ మహిళ నడుపుకుంటున్న టీ స్టాల్ ను కూల్చివేయడంతో ఆమె లబోదిబోమంటోంది. కూకట్ పల్లిలోని ఓ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణమైన రెండో అంతస్తు స్టేర్ కేస్ కూల్చివేశారు. దీనితో పైనున్న వారు కిందకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:08 - July 2, 2018

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలోమూడోరోజు ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. నగరంలోని ఆరు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2 వేల మూడు వందల 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

21:06 - July 1, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజులుగా అక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమైయ్యారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది. అధునాతన యంత్రాలతో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ విశ్వజిత్‌ చెబుతుంటే.. మరోవైపు తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో రెండో రోజూ ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ రంగంలోకి దింపారు అధికారులు. దీంతో తొలగింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలిరోజు వేయికి పైగా అక్రమ నిర్మాణాలు తొలగించిన అధికారులు, రెండో రోజు కూడా వేయికి పైగా నిర్మాణాలను తొలగించారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

హిమాయత్‌నగర్‌తో పాటు నారాయణగూడ వంటి పలు ప్రాంతాల్లోని ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. ఉదయాన్నే ఆరు బృందాలుగా ఏర్పడిన సిబ్బంది పలు ప్రాంతాల్లో తొలగింపులు చేపట్టారు. జేసీబీల సాయంతో పాటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొని ఆక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ డ్రైవ్‌ను మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు.

వీధి వ్యాపారుల ఆక్రమణలే కాకుండా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, నీటి సరఫరా పైప్‌లైన్లు కూడా వీటిపైనే ఏర్పాటుయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు మండిపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఆక్రమణలకు తొలగించడానికి మొత్తం 120 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 127.5 కిలో మీటర్ల పొడవున ఆక్రమణలను గుర్తించిన అధికారులు.. కూల్చివేతలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

21:10 - June 30, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై GHMC అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, సిబ్బందితో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. అధునాతన యంత్రాలతో పుట్‌పాత్‌లపై ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ విశ్వజిత్‌ చెబుతుంటే.. మరోవైపు తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు. మరికొన్ని చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల దురుసుతనం విమర్శలకు తావిస్తోంది.

హైదరాబాద్‌ నగర పరిధిలోని పాదచారుల బాటల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కన్నెర్ర చేస్తోంది. పుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పాదచారుల బాటలు ఆక్రమించి దుకాణాలు పెట్టడంతో.. చాలా ప్రాంతాల్లో పాదచారుల బాటే కనుమరుగైంది. దీనిపై చాలా సార్లు ఉన్నత న్యాయ స్థానం కూడా తీవ్రంగా స్పందించింది. దీంతో పాదచారులకు ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లో సుమారు పదివేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వాటిలో అతికొద్ది రహదారులకు మాత్రమే పాదచారుల బాట ఉంది. అది కూడా దుకాణదారులు, చిరువ్యాపారుల ఆక్రమణలో ఉంది. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంటోంది. కాగా గత కొంతకాలంగా పాదచారుల బాట ఆక్రమణలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తోంది. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆక్రమణల్ని తొలగించి పాదచారుల హక్కుల్ని కాపాడాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. కోర్టు ఆదేశించిన ప్రతిసారీ బల్దియా యంత్రాంగం కూల్చివేతలకు దిగడం, రాజకీయ నేతల రంగప్రవేశంతో వెనకడుగు వేయడం పరిపాటిగా మారింది.

ఆక్రమణల్ని తొలగించే బాధ్యతను ఇటీవల ఏర్పడిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటికి అప్పగించింది జీహెచ్‌ఎంసీ. పాదచారుల బాటలు క్లియర్‌ చేసేందుకు... సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. 120 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 127.5 కిలో మీటర్ల పొడవున ఆక్రమణలను గుర్తించిన అధికారులు.. మొదటి దశలో 4,133 నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ప్రకటనల బోర్డులతోపాటు.. మెట్లు, ప్రహరీ గోడలను కూల్చివేస్తున్నారు. అధికారులు వచ్చేదాకా ఆగకుండా.. స్వతహాగా ఆక్రమణలు తొలగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళూ పనిచేయవని విశ్వజిత్‌ స్పష్టం చేశారు.

గ్రేటర్‌ పరిధిలోని స్ర్టీట్‌ వెండర్లకు ఇబ్బందులు రాకుండా.. కేవలం పూర్తిస్థాయిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిరువ్యాపారులతో దురుసుగా ప్రవర్తించారు. మలక్‌పేట, బోరబండ ప్రాంతాల్లోని స్ర్టీట్‌ వెండర్స్‌పై తమ ప్రతాపం చూపించారు. నిస్సహాయులైన చిరువ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల అధికారులపై నిరసన వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఉన్నపళంగా దుకాణాలు కూల్చేస్తే.. తమ బతుకులు ఏంకావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరువ్యాపారులు.

అధికారులు చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వారికి గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. వెండింగ్‌ జోన్స్‌ ఫిక్స్‌ చేశాక వ్యాపారులందరినీ అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా తమ పని తాము చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతుంటే.. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు. 

15:36 - June 2, 2018

హైదరాబాద్ : వర్షాకాలం తరుమకొస్తోంది. వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు..కష్టాలు ముందే తెలిసినా జీహెచ్ఎంసీ మాత్రం ఇంకా మేలుకోలేదు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయం కావడం..నాలాలు పొంగి పొర్లుతుండడం తెలిసిందే. దీనితో మే చివరి నాటికి నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ జూన్ మాసం మొదలైనా..కొద్ది రోజుల్లో రుతుపవనాలు తెలంగాన రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నా నాలాల పూడికతీత పనులు ఇంకా సగం కూడా పూర్తికాలేదు. చాలాచోట్ల విస్తరణకు కూడా నోచుకోలేదని సమాచారం. గంట వ్యవధిలో రెండు సెం.మీటర్ల వర్షం పడితే డ్రైనేజీలు పొంగిపొర్లే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పటి నుండే పలు బస్తీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. 

08:56 - May 24, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారుల మ‌ధ్య వాడివేడిగా సాగింది. పారిశుధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. రంజ‌ాన్ పండుగ సందర్భంగా చేపట్టిన పనులను ఇంతవరు పూర్తిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎనిమిదో జ‌నరల్ బాడీ స‌మావేశంలో అధికారులు, కార్పొరేట‌ర్ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డిచింది. ఘ‌న‌వ్యర్థాల నిర్వహ‌ణ‌లో మొద‌టి స్థానం ద‌క్కించుకున్న నగరంలో.. వాస్తవ ప‌రిస్థితి అందుకు విరుద్ధంగా ఉందంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. చెత్తను త‌ర‌లించడంలో సిబ్బంది అల‌స‌త్వం వహిస్తున్నారని.. ఫలితంగా చెత్త పేరుకుపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌గ‌రంలో వెలుగుల‌ు నింపేందుకు చేపట్టిన ఎల్ఈడీ లైట్ల పథకం పూర్తిస్థాయిలో ప‌ట్టాలెక్కలేదు. టైమ‌ర్లు, సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సిష్టమ్ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని పెదవి విరిచారు కార్పొరేటర్లు. రంజాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక లైట్ల విష‌యంలోనూ అధికారులు అల‌స‌త్వంగా ఉన్నారని మండి ప‌డ్డారు. రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. నాలాల వెడల్పు, డిసిల్టింగ్ అంశాల‌పై చ‌ర్చించారు. వానల గండం గ‌ట్టెక్కాలంటే అధికారులు వెంటనే ప‌నులు ప్రారంభించాలన్నారు. ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారంటూ కార్పొరేటర్లు గళమెత్తారు . దోమల గురించి ఎన్ని సార్లు చెప్పినా అధికారులు స్పందిండం లేదన్నారు. నగరంలో మరో పెద్ద స‌మ‌స్యగా మారిన ప్లాస్టిక్‌పై చ‌ర్చించారు. ప్లాస్టిక్ నిషేధంపై తీర్మాణం చేసి ప్రభుత్వానికి పంపారు. నాలాల నిర్వహణపై దృష్టి పెట్టాలని కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారు.

ఇటీవ‌ల బదిలీ అయిన శానిట‌రీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కార్పొరేట‌ర్ల అభ్యంతారాల‌ను కొట్టిపారేశారు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్. నగరంలో ఎప్పుడూ ఎదో ఒక ప‌ని ఉంటుంద‌న్నారు. నాలాల వెడ‌ల్పు, పున‌రుద్ధరణ పనుల్లో ఎలాంటి ఒత్తిడికి త‌లొగ్గే ప్రస‌క్తే లేద‌న్నారు. బ‌ల్దియా కౌన్సిల్‌ మీటింగ్‌పై సభ్యులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు నాలుగు నెల‌లకు ఓసారి జరిగే పాల‌క‌ మండలి సమావేశం.. నాలుగు గంట‌ల‌కు మించి కూడా జ‌రగ‌డం లేదు. అలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం, సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

06:38 - May 23, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలను దాదాపుగా పరిష్కరించామన్నారు మంత్రి కేటీఆర్‌. శేరిలింగంపల్లి జోన్‌లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తాగునీటి రిజర్వాయర్లను ప్రారంభించారు. గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ ప‌రిధిలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడంలో మంచి ఫ‌లితాలు సాధించామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. శేరిలింగం ప‌ల్లి ప‌రిధిలోని వివిధ ప్రాంతాల్లో హైద‌రాబాద్ జ‌ల‌మండ‌లి నిర్మించిన నీటి రిజ‌ర్వాయ‌ర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంబించారు. దీంతో గ్రేటర్ శివారు మున్సిపాలిటిల్లో తాగునీటి ఇబ్బందులు త‌గ్గుతాయ‌న్నారు. రెండేళ్ల క్రితం 1900కోట్ల రూపాయల హాడ్కో రుణంతో పారంభ‌మైన ప‌నులు చాలా వ‌ర‌కు తుదిదశ‌కు చేరుకున్నాయ‌న్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో రాబోయే రోజుల్లో ఎమాత్రం తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేయడాని కేశ‌వ‌పూర్ వ‌ద్ద భారీ రిజ‌ర్వాయ‌ర్ నిర్మించేందుకు ప్రణాళిక‌లు త‌యారవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

జిహెచ్ఎంసి అధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ప‌లు రోడ్దు ప‌నుల‌కు శంకు స్థాప‌న చేయడంతో పాటు శిల్పారామం వ‌ద్ద నిర్మించిన ఎసి బ‌స్ స్టాప్ ను మంత్రికేటీర్‌ ప్రారంభించారు. సిటి ప్రయాణికుల‌కు సుఖ‌వంత‌మైన ప్రయాణం క‌ల్పిండమే త‌మ ఉద్యేశ‌మన్నారు మంత్రులు. అందులో భాగంగానే గ్రేట‌ర్ ప‌రిధిలో ఈఎడాది 1120కోట్ల రోడ్లను అభివృద్ది చేశామన్నారు. గ్రేటర్‌లో ఉన్న పార్కులు, చెరువుల ప‌రిర‌క్షణ‌లో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. నగరపరిధిలో 541కోట్లతో 40చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుద‌ల‌కోసం 3200కోట్లతో ప్రణాళికను త‌యారు చేశామ‌ని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాము చేపట్టిన పథకాల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిధిలో 95శాతం నీటికష్టాలు తొలిగిపోయయని మంత్రి కేటీఆర్‌ చెప్పడంపై నగర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌ క్యాన్లు కొనుక్కుని రోజులు గడుపుకుంటున్న పరిస్థితులు ఉంటే.. తాగునీటి కష్టాలే లేవనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - జీహెచ్ఎంసీ