జూదం

14:11 - July 11, 2018

హైదరాబాద్ : ఎవరైనా..  వ్యాపారంలో ఒక ఏడాది నష్టం వస్తే భరిస్తారు.. రెండేళ్లు అయినా ఇదొక్కసారి చూద్దాంలే అనుకుంటారు. కానీ, వరుసగా మూడో ఏడూ నష్టాలే వస్తే.. తక్షణం ఆ వ్యాపారాన్ని మూసేస్తారు. కానీ, రైతుకు వ్యవసాయంలో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా నష్టాలే.. నష్టాలు. కనీసం పెట్టుబడి కూడా దక్కని దయనీయ స్థితి.. దీనికి కారణం ఎవరు..? కచ్చితంగా పాలకులే. ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో చేస్తున్న విన్యాసాలే రైతులను అప్పుల ఊబిలోకి.. అక్కడి నుంచి వద్యశిలకు తోసేస్తున్నాయి. 
ఇరవై ఏళ్లుగా వరుస నష్టాలు...
ఇరవై ఏళ్లుగా వరుస నష్టాలు...సేద్యపు నష్టాల్లో భారత్‌కు ప్రపంచంలోనే అగ్రస్థానం... అవును.. భారత దేశంలో వ్యవసాయం ఓ జూదంగా మారిపోయింది. ప్రతిఏడాదీ కోటి ఆశలతో సేద్యం చేసే రైతులు.. గడచిన ఇరవై ఏళ్లలో ఒక్కసారీ లాభం గడించలేదు సరికదా.. పెట్టుబడి మొత్తాన్ని కూడా సంపాదించలేక పోయారు. ఇది ఎవరో వేసిన కాకి లెక్కలు కాదు. అంతర్జాతీయ సంస్థ.. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఓఈసీడీ... 36 దేశాల్లో విస్తృతంగా సర్వే చేసి వెల్లడించిన సత్యం. 
ఓఈసీడీ సంస్థ అత్యంత పకడ్బందీగా సర్వే 
ఓఈసీడీ సంస్థ అత్యంత పకడ్బందీగా ఈ సర్వేని నిర్వహించింది. వరుస నష్టాలకు కారణాలనూ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో స్థూల రాబడులు, పాత సూచీలను ఎన్నింటినో పరిశీలించింది. 2000-2016 మధ్య కాలంలో సేద్యపు రాబడులు.. ఏటేటా ఆరు శాతం చొప్పున.. సగటున  14శాతానికి పడిపోయాయి. దీన్నిబట్టే.. భారత్‌లో సేద్యం ఏ దుస్థితిలో ఉందో.. రైతు బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో తేటతెల్లం అవుతోంది. మరి ఈ దుస్థితికి కారణం ఎవరు..? ఇంకెవరు.. ఘనత వహించిన పాలకులే..!
పాలకుల అస్తవ్యస్థ వాణిజ్య విధానాలు
భారత్‌లో పాలకుల అస్తవ్యస్థ వాణిజ్య విధానాలు రైతాంగాన్ని నష్టాల్లో తోసిందన్నది ఓఈసీడీ సర్వే తేల్చింది. ద్రవ్యలోటును పూడ్చుకునే వంకతో.. ఆహారం ధరలను అతి తక్కువగా కొనసాగించారన్నది సర్వేలో తేలింది. ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు.. ప్రపంచ మార్కెట్‌లో వచ్చే పరిణామాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా భారత్‌ పంచదార, బియ్యం, జొన్న, గోధుమ, బాస్మతి బియ్యం వంటి ఉత్పత్తులను గణనీయంగా ఎగుమతి చేసి.. లాభాలు గడించే అవకాశాలను కోల్పోయింది. మరోవైపు.. పదే పదే ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇచ్చారే తప్ప.. సేద్యంలో పెట్టుబడులు,  ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వంటి ప్రధాన అంశాలను పాలకులు విస్మరించారన్నది సర్వే తేల్చిన సత్యం. 
భూమి కలిగిన రైతులు 62 శాతం 
భారత్‌లో, 0.80 హెక్టార్లలోపు భూమి కలిగిన రైతులు 62 శాతం మంది ఉన్నారు. వీరు వ్యవసాయేతర వృత్తుల్లోకి మారకపోతే.. శాశ్వతంగా దిగువ పేదరికపు జీవులుగా బతకాల్సిన దుస్థితి నెలకొంటుందని నీతి ఆయోగ్‌ సైతం గుర్తించినట్లు.. సర్వే నిర్వహించిన ఓఈసీడీ సంస్థ వెల్లడించింది. భారత్‌లో 2011 నుంచి వ్యవసాయ ఉత్పాదనలు ఏటా 3.6 శాతం మేర పెరుగుతూ వస్తున్నాయి. జీడీపీ 1990 నుంచి 5 శాతం వరకూ పెరిగింది. ఫలితంగా దేశంలో పేదరికం సగానికి తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టిన సర్వే  
వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని సర్వే తప్పుబట్టింది. దేశీయ ద్రవ్యలోటును తక్కువగా చూపేందుకు ప్రత్యేకమైన వాణిజ్య ఆంక్షలు డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగా.. ఎగుమతులపై తరచూ బ్యాన్‌ విధించడం.. కనీస మద్దతు ధరను అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే అత్యంత తక్కువగానే నిర్ణయించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా.. ఇరవై ఏళ్లుగా.. ఏలికలు తీసుకుంటున్న అస్తవ్యస్థ విధానాల కారణంగా.. భారత రైతు పెను సంక్షోభంలో కూరుకు పోయాడు. ఈ పరిస్థితిలో స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను యథాతథంగా అమలు చేసి... రైతును లాభాల బాట పట్టించాలి. తద్వారా.. ఇంతకాలం రైతుకు చేసిన అన్యాయాన్ని పాలకులు సరిదిద్దుకున్నట్లు అవుతుంది. మరి ఏలికలు ఆదిశగా అడుగులు వేస్తారా..?  చూడాలి. 

17:29 - January 16, 2018

కృష్ణా : సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కోళ్ల పందాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన కనుమ రోజున పందాలు మరింత జోరందుకున్నాయి. జిల్లాలో ఏకంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. బరులు ఏర్పాటు చేసి కోళ్లకు కత్తులు కట్టి పందాలు కాస్తున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పందాలు ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు మద్యం ఏరులై పారింది. రామలింగేశ్వరనగర్ లో కూడా పందాలు జోరుగా సాగాయి. కానీ తాము కత్తులు కట్టి పందాలు నిర్వహించడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:53 - January 15, 2018

హైదరాబాద్ : అందరూ ఊహించిందే జరుగుతోంది. కోస్తాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. భోగిరోజు మొదలైన ఈ పందెం... రెండోరోజూ కొనసాగింది. కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హడావుడి చేసిన అధికారులు, పోలీసులు పత్తాలేకుండా పోయారు. ఇదేఅవకాశంగా ఖద్దరు అండతో నిర్వాహకులు కోడిపందేలు యధేచ్చగా నిర్వహిస్తున్నారు. ఏపీలో కోడి పందేలు యధేచ్చగా సాగుతున్నాయి. కోళ్లు కత్తులు దూస్తున్నాయి. కత్తులు కట్టకుండా డింకీ పందేలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకునే వారేలేరు. కోళ్లకు కత్తులు కట్టి మరీ కోళ్లను పందాలకు దింపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఐ. పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేల నిర్వహణ కొత్త పుంతలు తొక్కింది. తొలిరోజే పది కోట్లకుపైగా చేతులు మారగా.. రెండో రోజు 50కోట్లకుపైగా పందేలు నడిచాయి. కోడి పందేలు ఆడటానికి తెలుగు రాష్ట్రాల నుంచి పందెపురాయుళ్లు తరలివచ్చారు. ఇక్క మొత్తంగా పది బరులు ఏర్పాటు చేశారు. 25వేలు, 50వేలు, లక్ష, రెండు లక్షలు, అయిదు లక్షల బరులుగా విభజించి పందేలు నిర్వహిస్తున్నారు.(kkd కోడిపందేలతోపాటు గుండాట, పేకాట, కోతముక్క జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఏకంగా గుండాట కోసం 30 బోర్డులను ఏర్పాటు చేశారు. కోడిపందేలతోపాటు గుండాట ఆడటానికి పందెంరాయుళ్లు ఎగబడ్డారు. బరులకు సమీపంలో మద్యం, బిర్యానీ, మాంసం పకోడీ, శీతలపానియాలు అందుబాటులో ఉంచారు. ప్రజాప్రతినిధులు సైతం వీటిని తిలకిస్తున్నారు. మురమళ్లలో భారీ స్థాయిలో జరుగుతున్న పందేలకు ఖరీదైన కార్లు బాటపట్టాయి. పందెంరాయుళ్లు ఖరీదైన కార్లలో పందేలుకాయడానికి తరలివచ్చారు. దీంతో మరమళ్లలోని పదెకరాలు ప్రాంగణం కార్లతో నిండిపోయింది. వేలాది ద్విచక్రవాహనాలు కొలువుతీరాయి. సాయంత్రం మురళ్లలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామర్లకోట, పిఠాపురం మండలాల్లోనూ కోళ్లు కాలుదూస్తున్నాయి. మీడియా, పోలీసులు వెళ్లిపోగానే నిర్వాహకులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తున్నారు. కోడిపందేలతోపాటు గుండాట, చిన్నబజార్‌, పెద్దబజార్‌,లోన, బయట ఆటలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందేలు తూర్పుమన్యానికీ విస్తరించాయి. దేవీపట్నం మండలం ఇందుకూరు, పోతుకొండలో కోళ్లు గిరిగీసి బరుల్లో కత్తులు దూస్తున్నాయి. నిర్వాహకులు గిరిజనులకు ఈ పందేలను అటవాటుచేసి వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరు,వాడ బరులు ఏర్పాటు చేశారు. ఈ బరుల్లో 24 గంటలూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న ప్రజాప్రతినిధులే.. దగ్గరుండి మరీ కోడిపందేలను ప్రారంభించారు. చాలా చోట్ల కత్తికట్టిన కోడిపందేలే జరుగుతున్నాయి. కత్తులతో కోళ్లు తలపడుతుంటే రక్తం చిందుతోంది. ఆకివీడు మండలం ఐ.భీమవరంలో జరిగిన కోడి పందేలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హాజరయ్యారు. కోడి పందేలను వీక్షించారు. కోడి పందేలు తెలుగు సంస్కృతికి అద్దంపడుతాయని... వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక యండగండిలో జరిగిన పోటీలను టాలీవుడ్‌ నటుడు శ్రవణ్‌ రాఘవ తిలకించారు. పెనుమంట్ర మండలం జుత్తిగలో స్థానిక వీఆర్‌వో భూపతిరాజు రవీంద్ర ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడంతో నిర్వాహకులు మరింతగా రెచ్చిపోయి పందేలను నిర్వహించారు. విజయవాడలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగుల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పోరంకి సెంటర్లో హాస్యనటుడు కిషోర్ దాస్ ఈ పందేలను తిలకించారు. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోకుండా... కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరానికి కోడిపందేలు పాకాయి. సుప్రీంకోర్టు, పోలీసుల ఆదేశాలు బేఖాతర్‌చేస్తూ... పందేలు నిర్వహించారు. పందేల నియంత్రణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్‌లేకుండా పోయాయి. అధికారం, ధనబలం ముందు ఖాకీలు తలవంచారు. దీంతో రెచ్చిపోయి మరీ పందేలు కాశారు.

తెలంగాణకూ కోడిపందేలు విస్తరించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేఖపల్లి దగ్గర కోడిపందేలు యధేచ్చగా సాగాయి. రామారావు అనే వ్యక్తిని నిర్వాహకులు చితకబాదడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల ముందే ఇంత దారుణం జరుగుతున్నా.. నిర్వాహకులను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

16:09 - January 15, 2018

విజయవాడ : చట్టాలు పనిచేయలేదు...కోడి గెలిచింది..ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పందాలు జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరి చేతిలో చూసినా ఒక కోడి..జేబుల్లో లక్షల రూపాయలు...తిరునాళ్లు తలపిస్తున్నట్లుగా ఆయా ప్రాంతాలు కనబడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భం నిర్వహించే కోళ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు నిబందనలు పట్టించుకోకుండా కోళ్లకు కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 300 బరులు..తూర్పుగోదావరి జిల్లాలో 200కి పైగా బరుల్లో పందాలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే రూ. 600 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనిధికారికంగా తెలుస్తోంది. ఒక్కో కోడి పందెంలో లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల ధర పలుకుతుండగా పందాలు వీక్షించడానికి వచ్చిన వారు కూడా పందాలు కాస్తుండడంతో ఆ ధర కాస్తా ఇంకా పెరిగిపోతోంది. కనుమ రోజు పోలీసులు దాడులు చేసి పందాలను ఆపుతారని తెలుసుకున్న నిర్వాహకులు భోగి..సంక్రాంతి రోజు ఉదయం..పగలు నిర్వహించడమే కాకుండా రాత్రుల్లో ఫ్లడ్ లైట్లు వెలుతురుల్లో పందాలు నిర్వహిస్తుండడం గమనార్హం. 

16:12 - January 14, 2018

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ప్రధానంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి జోరు కొనసాగుతోంది. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో పందాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కోళ్ల పందాలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నారు. బరులు ఏర్పాటు చేసి కోళ్లను పందాలకు దింపుతున్నారు. పందాల్లో పాల్గొనే వారికి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరోవైపు కోళ్ల పందాలతో పాటు ఇతర పందాలు కూడా కొనసాగుతున్నాయి. గుండాట, పేకాట పందాల్లో జనాలు భారీగా పాల్గొంటున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 

19:48 - December 28, 2017
18:27 - December 28, 2017

పశ్చిమగోదావరి : సంక్రాంతి పండుగ..ఇంకా రెండు వారాలు ఉంది. కానీ అప్పుడే రగడ మొదలైంది. పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వెంప గ్రామంలో నిర్వహిస్తున్న కోళ్ల పందాల ముసుగులో జూదం, వ్యభిచారం జరుగుతోందని గ్రామస్తుడు కలిదిండి రామచంద్రరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని గురించి తెలుసుక్ను వెంప చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యేను పిలిపించారు. ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగడం లేదని..సంప్రదాయబద్ధంగా కోళ్ల పందాలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. కోడిపందాల్లో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరగడం లేదని తీర్మానం చేశారు. గ్రామ పరువు తీసేలా కోర్టులో పిటిషన్ వేసిన రామచంద్రరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

08:25 - November 14, 2017

హైదరాబాద్ : జూదంపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి అసాంఘిక చర్యలకు మినహాయింపు ఇవ్వకుండా అసెంబ్లీ గేమింగ్‌ యాక్ట్‌కి చట్ట సవరణలు చేసింది ప్రభుత్వం. ఇకపై జూదం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇక నుండి జూదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న గేమింగ్‌ యాక్టులో కొన్ని సవరణలు చేసింది అసెంబ్లీ. ఈ సవరణలో పేకాట, మట్కా, సట్టా, జూదం, ఆన్‌లైన్ పేకాట వంటి వాటిని ఈ పరిధిలోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా వీటిని అమలు చేసే నిర్వహకులు, అందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్ట సవరణలో మార్పులు చేసింది.
జూదం ఆడినవారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష
కొత్త చట్టం 2017 జులై 8 నుండి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం జూదం ఆడినవారిపై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించనుంది. అలాగే దాడులు చేసిన చోట లభించిన నగదుతో పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను జప్తు చేయడం వంటి అధికారం ఈ చట్టంలో ఉన్నాయి. అయితే హార్స్‌ రేసింగ్‌ను కూడా ఈ చట్టంలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. 
హార్స్‌ రేసింగ్‌ను చట్టంలోకి తీసుకురావడం కుదరదు : నాయిని  
అయితే హార్స్‌ రేసింగ్‌ను ఈ చట్టంలోకి తీసుకురావడం కుదరదన్నారు మంత్రి నాయిని నర్సింహారెడ్డి. అర్బన్ రూరల్‌ ఏరియాలలో అందరికీ ఈ చట్టం వర్తిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో జూదం నిర్వహించే కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త చట్ట సవరణతో రాష్ట్రంలో జూదంపై పూర్తిగా నిషేధం అమలు కానుంది. జూదం వల్ల ఎక్కువ ప్రభావం చూపుతున్న  మహిళలు, విద్యార్థులకు ఈ చట్ట సవరణతో ఉపశమనం కలుగుతుందని అధికారులు బావిస్తున్నారు. 

 

14:26 - January 14, 2016

ఉభయ గోదావరి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి జోరందుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం భోగి మంటలతో మొదలైన సదండి.. కోడి పందాలతో ఊపందుకుంది. పందాలపై పోలీసులు ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని నిర్వాహకులు.. ఎప్పటిలాగానే... పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రౌండ్స్ ఏర్పాటు చేసి... పోటీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్న పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పోటీలను ప్రారంభించడం విశేషం. మరోవైపు నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బంధువులు వేడుకగా పండుగ జరుపుకుంటున్నారు.  కోనసీమలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. హైటెక్‌ హంగుల బరుల మధ్య కోడిపందాల్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు కోడిపందాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. దీంతో కోడి పందాలు ప్రాంతాలు పెద్ద జాతరను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన కోడిపందాల బరులే కన్పిస్తున్నాయి. ఒక్కో పందెం 5 లక్షల నుంచి 50లక్షల వరకు సాగుతున్నాయి. మరోవైరపు పందెంలో ఓడిపోయిన కోళ్లకు కూడా బాగా గిరాకీ ఏర్పడింది. పందెంలో ఓడిపోయిన కోడిని వండుకుని తినేందుకు వేలరూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు కోడిపందాలు జోరుగా సాగుతుంటే..అంతే జోరుగా మద్యం అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. కోడి పందెం బరుల పక్కనే డ్రమ్ముల్లో ఐస్‌ను వేసి మరి బీర్లు, మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు వ్యాపారులు. 

14:21 - January 14, 2016

పశ్చిమగోదావరి : సంక్రాంతి..అనగానే అక్కడ కోళ్ల పందేలు గుర్తుకొస్తాయి. కోర్టులు..ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోరు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు ఈ పందేలలో మునిగితేలుతుంటారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. స్వయంగా ప్రజాప్రతినిధులే ఈ పందేలలో పాల్గొంటుండడంతో ఇతరులు కూడా విచ్చలవిడిగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. సుమారు 500 ప్రాంతాల్లో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఓ ప్రాంతంలో బీజేపీ నాయకుడు కోళ్ల పందేలను ప్రారంభించగా ఒంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పందేలను ప్రారంభించారు. పాలకొల్లులో సంగీత దర్శకుడు కోటి పాల్గొన్నారు. దీనితో పాటు ఇతర జూద క్రీడలు యదేచ్చగా సాగుతున్నాయ. ఈ సంవత్సరం కోళ్ల పందేలలో పాల్గొనేందుకు హైదరాబాద్ ప్రాంతం నుండి ఎక్కువ మంది వచ్చినట్లు సమాచారం. వీరికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కోర్టులు..ప్రభుత్వాలు హెచ్చరికలు చేసినా కోళ్ల పందేలు..ఇతర జూద క్రీడలు జరుగుతున్నాయని స్వయంగా టెన్ టివి రిపోర్టర్లు ఫోన్ చేసి సమాచారం అందించినా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. 

Don't Miss

Subscribe to RSS - జూదం