టిడిపి

06:59 - March 27, 2017

అనంతపురం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న కరవు సమస్యలను అధ్యయనం చేసేందుకు పాదయాత్ర చేయాలని ఉందని అనంతపురంలో జరిగిన సభలో ప్రకటించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని కచ్చితంగా ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా జనసేనాని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ....

అనంతపురంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొత్తులు, ఎత్తులు విషయాన్ని పక్కన పెడితే, యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానన్న హామీతో యువత ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపుతూపడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతల వెన్నులో వణుకు పుడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ, వైపీసీల మధ్య ప్రధానంగా పోరు జరిగింది. 2019 ఎన్నికల్లో ఇది మూడు పార్టీల మధ్య పోటీకి దారితీస్తుంది. జనసేన, టీడీపీ, వైసీపీల మధ్య పోరుగా మారనుంది. జనసేన పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేస్తే టీడీపీ, వైసీపీల్లో ఎవరికి దెబ్బ అన్న అంశంపై విస్తృతంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

అనంతపురం అర్బన్‌లో కాపు ఓటర్లు అధికం.....

వపన్‌ కల్యాణ్‌ అనంతపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం రాయలసీమ మొత్తంపై పడుతుందని భావిస్తున్నారు. అనంతపురం అర్బన్‌ ఏరియాలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే జనసేనాని జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించి ఉంటారని విశ్లేషిస్తున్నారు. దీంతో పవన్‌ పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని ఇతర పార్టీల్లోని నేతలు ఒత్తిడికి గురువుతున్నారు. అనంత సభలో పవన్‌ ప్రధానంగా రైతులు, చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావించిన నేపథ్యంలో ఈ రెండు వర్గాలతో పాటు ఇతరులు కూడా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జనసేనానితో టీడీపీ, కాంగ్రెస్‌ నేతల సంప్రదింపులు ......

మరోవైపు జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్‌ నేతల్లో కొందరు జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. జనసేనానితో సంప్రదింపులు జరుపుతున్నారని వినిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఎక్కువ మంది జనసేనలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడంతో జిల్లాలో టీడీపీ ప్రభ మసకబారుతోందని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా నేతల్లో మార్పు రాకపోగా, నేతల గొడవలతో పార్టీ పరువు బజారుకెక్కుతోంది. దీంతో కొంత మంది టీడీపీ నేతలు జనసేన వైపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవైపు జనసేన కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు తమ నేతకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఆ లోగా జనసేనాని జిల్లా సమస్యలపై మరింత ఆధ్యయనం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది పార్టీకి మరింత కలిసొచ్చే అంశమని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.

16:50 - March 20, 2017

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురువేసింది. జరిగిన మూడు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్‌ కంచుకోట కడప జిల్లాలో వైసీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిని ఓడించి.. అక్కడ టీడీపీ పాగా వేసింది. 40 ఏళ్ల వైఎస్‌ రాజకీయ కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేసి.. బీటెక్‌ రవి 33 ఓట్లతో విజయం సాధించారు. కడపలో విజయం కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడే మకాం వేసి వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు. ఇక బీటెక్‌ రవి విజయంతో తెలుగు తమ్ముళ్లు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలంతా స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

62 ఓట్ల మెజారిటీతో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం ....

ఇక కర్నూలులోనూ ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై.. టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి.. 62 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1084 ఓట్లకు గాను 1077 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీకి 564 ఓట్లు రాగా.. వైసీపీకి 502 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లకుండాపోయాయి. చంద్రబాబు, లోకేశ్‌ ఆశీస్సులతో విజయం సాధించానని.. ప్రజాసమస్యలపై మండలిలో తన గళం విప్పుతానన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.

87 ఓట్ల మెజారిటీతో వాకాటి నారాయణరెడ్డి గెలుపు ...

నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డి.. వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాలో మొత్తం 851 ఓట్లకు గాను వాకాటి 465 ఓట్లు సాధించారు. ఆనం విజయ్‌కుమార్‌రెడ్డికి 378 ఓట్లు పోలయ్యాయి.

అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థులను గెలిపించారు...

ఇదిలావుంటే.. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి టీడీపీ అభ్యర్థులను గెలిపించారన్నారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. వైఎస్‌ కంచుకోట అయిన కడపలో టీడీపీ అడుగుపెట్టిందని.. భవిష్యత్‌లో పులివెందులలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ విజయాన్ని కొట్టి పారేసిన వైసీపీ ....

అయితే.. వైసీపీ మాత్రం టీడీపీ గెలుపును కొట్టిపారేస్తున్నారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి విజయం సాధించారన్నారు. టీడీపీకి ధైర్యం ఉంటే.. ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలవాలని సవాల్‌ విసురుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పాలక పక్షం నేతలు అంటున్నారు.

14:28 - March 20, 2017

అమరావతి: టీడీపీ ప్రలోభాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిందని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

09:07 - March 20, 2017

నెల్లూరు :జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నిక కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. నెల్లూరు స్థానిక బరిలో టిడిపి నుండి వాకాటి నారాయణ, వైసీపీ నుండి ఆనం విజయకుమార్ రెడ్డి బరిలో నిలిచారు. కౌంటింగ్ జరిగిన గంట అనంతరం ఫలితం వచ్చేసింది. వైసీపీ అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి గెలుపొందారు. వాకాటి నారాయణ 85 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. ఐదు టేబుళ్లపై కౌంటింగ్ జరిపారు. ఇక్కడ జరిగిన ఎన్నికలో 851 ఓట్లు పోలయ్యాయి. టిడిపి అభ్యర్థి విజయం సాధించడంపై పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఎన్నికను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా మంత్రి నారాయణ రంగంలోకి దిగి అభ్యర్థిని గెలుపొందే విధంగా అన్ని ప్రయత్నాలు చేశారు.

08:24 - March 20, 2017

విజయవాడ : మూడురోజుల సెలవుల తర్వాత ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది.. షెడ్యూల్‌ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. ఇందులో వివిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశముంది.. ముఖ్యంగా రాష్ట్రానికి ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు, రుఫమాఫీ, మధ్యాహ్న భోజనపథకంకోసం ఏజెన్సీలు, రేషన్‌కార్డులకోసం విజ్ఞప్తులు, ఎన్టీఆర్ వైద్యసేవలకింద నిధుల కేటాయింపు, మహిళాశిశుసంక్షేమం, ఆదర్శ పాఠశాలలపై చర్చ జరిగే అవకాశముంది.. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు ఉభయసభల్లోనూ మాట్లాడనున్నారు.. అటు వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారం సభలో నిర్ణయం తీసుకోవాల్సిఉంది.. సభాహక్కులకమిటీ సిఫార్సులమీద ఇవాళ సభలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.. ప్రతిపక్ష నేతల వైఖరినిబట్టి రోజా అంశాన్ని సభలో ప్రస్తావించాలని అధికారపార్టీ భావిస్తోంది.. మరోవైపు పీఏసీ, పీయూసీ కమిటీలతోపాటు అంచనాలకమిటీలకుచెందిన కాలపరిమితి ముగిసింది.. ఈ కమిటీలను కొత్తగా ఎన్నుకోవాల్సిఉంది... ఈ అంశంకూడా ఉభయసభలముందుకు రానుంది.

11:28 - March 16, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశం మళ్లీ రాజుకుంది. ఎమ్మెల్యే అనితపై రోజా వ్యవహారశైలిపై విచారించబడిన ప్రివిలేజ్ కమిటీ గురువారం ఉదయం స్పీకర్ కు నివేదిక సమర్పించింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతనలో ప్రివిలేజ్ కమిటీ 62 పేజీల నివేదిక తయారు చేసింది. రోజా ఏ విధంగా అవమానపరిచారు ? వీడియో క్లిప్పింగ్స్..ఇతరత్రా వ్యాఖ్యలను నివేదికలో పొందుపరిచారు. రోజా సభకు క్షమాపణలు చెబితే ఈ అంశంపై పునరాలోచిస్తారని తెలుస్తోంది. దాదాపు సంవత్సర కాలంగా కమిటీ ఐదు సార్లు సమావేశమైంది. మూడుసార్లు గైర్హాజరయిన రోజా నాలుగోసారి హాజరయ్యారు. కమిటీ ఎదుట హాజరైన రోజా క్షమాపణలు చెప్పినా కమిటీ సంతృప్తి పడలేదని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే అధికార..ప్రతిపక్షాల మధ్య వాద..ప్రతివాదాలు జరుగుతున్నాయి. సోమవారం నాడు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

10:22 - March 16, 2017
07:38 - March 16, 2017

అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 56 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 19 వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 12 వేల కోట్లు కేటాయించారు. 9 రంగాల ఆధారంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందన్నారు యనమల. ఈ అంశాలపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో గౌతమ్ రెడ్డి (వైసీపీ), పట్టాభిరామ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:25 - March 14, 2017

హైదరాబాద్ : టీ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో టీ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ట్యాండ్‌బండ్‌ దగ్గరున్న అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో టీ టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణలో కేసీఆర్‌ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టీ టీడీపీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలు ప్రశ్నించిన తమ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

15:12 - March 12, 2017

కర్నూలు : నంద్యాల ఎమ్మెల్యేల భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు అభిమానులు..నేతలు..భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. భూమా ఇకలేరన్న విషయం టిడిపి శ్రేణులు దిగమింగులేకపోతున్నారు. భూమ నాగిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలియచేస్తున్నారు. కాసేపటి క్రితం ఆసుపత్రి నుండి నంద్యాల టిడిపి కార్యాలయానికి తరలించారు. ప్రజలు..టిడిపి నేతలు..కార్యకర్త సందర్శనార్థం తరలించారు. భారీగా అభిమానులు తరలిస్తుండడడంతో పార్టీ కార్యాలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భూమాకు నివాళులు అర్పించేందుకు..వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ నంద్యాలకు రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆయన స్వగృహానికి తరలించి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రయలకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - టిడిపి