టీఆర్ఎస్

09:09 - March 20, 2018

హైదరాబాద్ : తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎలాంటి పొరపాట్లు చేయకుండా అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించబోతుంది. తమకు ఉన్న మెజారిటీ ప్రకారం మూడు స్థానాలు తమకే దక్కే అవకాశం ఉన్నప్పటికీ... కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తమ ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఓటు వేయాలి.. ఎలా వేయాలనే అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనుంది గులాబీ పార్టీ.

రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యం..
తెలంగాణలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అనివార్యం కావడంతో అధికార పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలకు ఓటింగ్‌ విధానంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో.. ఎమ్మెల్యేలను మూడు బ్యాచ్‌లుగా విభజించి ఎవరెవరికి ఎవరు ఓటు వేయాలో పార్టీ సూచించనుంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి 30 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కాగా.. దానికనుగుణంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం రచిస్తోంది.

విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌ పావులు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా... ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కారెక్కినా... వారితో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయించకుండా ఉండే అవకాశాలను పరిశీలిస్తోంది. ఫిరాయింపుల ఎమ్మెల్యేల లెక్కతేల్చేందుకే కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని రంగంలోకి దించడంతో... ఆ ఆరోపణలకు తెరదించాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయకపోయినా... గెలిచే అవకాశాలున్నాయని అధికార పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు సొంత ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ మొత్తం ఎమ్మెల్యేల బలం 90గా ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు... మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించగా.. బీజేపీ, సీపీఎంలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి అధికార పార్టీ మూడు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

 

08:30 - March 18, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ బలపరిచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఓటమి చెందింది. బీఎంఎస్ అధ్యక్షుడు యూనియన్ శంకర్ విజయం సాధించారు. 5570 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ యూనియన్ కార్మిక సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 9 సంఘాలున్నా ఎన్నికల బరిలో నాలుగు సంఘాలు నిలిచాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:27 - March 12, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రణరంగాన్ని తలపించింది. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రసంగం కాపీలను చించివేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన హెడ్‌సెట్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలి గాయమైంది. వెంటనే ఆయనను సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై టీఆర్‌ఎస్‌ మండిపడింది. మరోవైపు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తొలి రోజే గందరగోళం ..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజే గందరగోళం నెలకొంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు చేపట్టిన నిరసన... సభలో గందరగోళానికి దారితీసింది. గవర్నర్ ప్రసంగాన్ని వెల్‌లోకి వెళ్లి అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో మరింత ముందుకెళ్ళాలని భావించిన సభ్యులు...తమ చేతిలోని ప్రసంగం కాపీలను చించి విసిరారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టేబుల్‌పైనున్న హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరడంతో.. అది గవర్నర్‌ పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. దీంతో ఆయన కంటికి స్వల్పగాయమైంది. గవర్నర్‌ ప్రసంగం అయ్యే వరకు అలాగే ఉండి తర్వాత సరోజనీ దేవి ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

దాడికి పాల్పడిన సభ్యులపై కఠిన చర్యలు :
సభలో కాంగ్రెస్ సభ్యులు అనుసరించిన తీరును టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దాడికి పాల్పడిన సభ్యులపై స్పీకర్‌ కఠిన చర్యలు తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులకు సభలో ఉండటం ఇష్టం లేదని హరీష్‌ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు గుండాల్లాగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, కొండాసురేఖ విమర్శించారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారమే కాంగ్రెస్ సభ్యులు దాడి చేశారని మీడియా పాయింట్‌ వద్ద అన్నారు.

గొంతునొక్కేస్తున్నారు : విపక్షాలు
ఇటు కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని అంతే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సభలో తమగొంతునొక్కేస్తున్నారని.. అసలు నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహిరించదని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యల గురించి మాట మాత్రమైనా లేదని.. అందుకే తాము ఆందోళన చేశామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విపక్ష సభ్యులుగా మా నిరసన తెలియజెప్పడానికి స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లామన్నారు... అయితే మార్షల్స్‌ తమకు అడ్డుతగిలి దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. గలాటాలోతన కాలికి గాయం అయినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చూపించారు. అయితే తమ ఆందోళన గవర్నర్‌ మీదే తప్ప...మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ మీద కాదని..ఇది అనుకోకండా జరిగిన పరిణామం అని విచారం వ్యక్తం చేశారు.

27 వరకు శాసనసభ సమావేశాలు
అనంతరం జరిగిన బిజినెస్‌ అడ్వయిజరీ మీటింగ్‌లో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మొత్తం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

17:58 - March 12, 2018

హైదరాబాద్ : సభలో విపక్షం లేకుండా చేయడమే కేసీఆర్ ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. ఇవాళ సభలో.. జరిగిన తమ ఆందోళనను పెద్దదిగా చేసి.. ప్రయోజనం పొందాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మొదట మాములుగా కనిపించిన మండలి ఛైర్మన్.. తరువాత ఆసుపత్రికి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ అనుసరించిన తీరుపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మటిరెడ్డితో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

17:24 - March 12, 2018
13:56 - March 12, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ద్వంద్వ నీతి మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే.అరుణ అన్నారు. టీఆర్ ఎస్ సభ్యులు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ సభ్యులు నీతులు చెప్పడం ఆపాలన్నారు. సభలోకి పోలీసులను చొప్పించరాని, ప్రీప్లాన్డ్ గా చేశారని ఆరోపించారు. హామీల అమలు లేదన్నారు. నిరసన వ్యక్తం చేయడం సర్వసాధారణం అన్నారు. సస్పెన్షన్లకు భయపడమని చెప్పారు.

14:54 - March 9, 2018

ఢిల్లీ : రిజర్వేషన్లు పెంచుకొనే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలంటూ పార్లమెంట్ లోపలా బయటా తెలంగాణ రాష్ట్ర సమితి తన ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నది. వరుసగా ఐదోరోజు ఎంపీలు.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ గళం వినిపించారు. సభలో నినాదాలతో పాటు.. పార్లమెంటు ద్వారం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్ర అధికారాలపై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. 

15:51 - March 8, 2018

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర శాసన సభలో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టి, అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తీర్మానం చేశామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదంతో రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రతుల్ని పంపినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో నిరసన చేపట్టామన్నారు. 

18:15 - March 7, 2018

ఢిల్లీ : రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాలకే అధికారం ఉండాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వరుసగా మూడోరోజు తమ ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రిజర్వేషన్లపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదన్నారు. 

15:28 - March 1, 2018

హైదరాబాద్ : అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. నేతల మధ్య సయోధ్య లేకపోవడం అటు ఉంచితే.. ఎమ్మెల్యేలు, మంత్రులపైనే గులాబి నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రుల వైఖరికి నిరసనగా పార్టీని వీడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
నేతల మధ్య అంతర్గత పోరు
అధికార టిఆర్ ఎస్ పార్టీ రాజకీయ పునరేకీకరణ పేరుతో వలస నేతలకు ప్రాధాన్యతనిస్తోందని సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని 31జిల్లాల్లో వలసనేతలతో పాత నేతలకు ఉప్పూనిప్పుల పంచాయతీ నడుస్తోంది. పార్టీ  ఆవిర్భావం నుంచి జెండా మోసిన తమ పరిస్థితి కూరలోకరివేపాకు మాదిరిగా మారిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవుల నియామకంలో కూడా తమకు న్యాయం జరుగడం లేదన్న ఆందోళన ఉద్యమ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఈ   పరిస్థితుల్లో ఇటీవల  చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీలో మరింత అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
ఎమ్మెల్యే గంగులపై పార్టీనేతల గుర్రు 
పార్టీకి పట్టున్న  కరీంనగర్‌లో ఇద్దరు కార్పోరేటర్లు  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు.  ఎమ్మెల్యే, మేయర్ వర్గాల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో ఇద్దరు కార్పోరేటర్లు  పార్టీని వీడారని ప్రచారం జరుగుతోంది.  ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగానే తాము  పార్టీని వీడుతున్నామని వారుకూడా ప్రకటించడం పార్టీలో పరిస్థితిని బయటపట్టినట్టేంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా  జడ్పీటీసికి   మంత్రి  తుమ్మల  నాగేశ్వర్ రావ్ వర్గాలమధ్య చిటపటలు బయటపడుతున్నాయి.  వివాదాలకు దూరంగా ఉండే తమ్ములపై కూడా  ఆరోపణలు  రావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
బయటపడుతున్న అంతర్గత పంచాయతీలు 
ఓవైపు మరోఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు తరముకొస్తున్న సందర్భం.. ఇటు ఇంతకాలం లోలోపలే రగులుతున్న నేతల అంతర్గత పంచాయతీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ పరిస్థితి గులాబీపార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు కొత్త దారులు వెతుక్కుంటుండం పార్టీలో చర్చనీయంశంగా మారుతోంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - టీఆర్ఎస్