టీఆర్టీ

17:05 - November 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనితో హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

08:23 - November 11, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్టీ నోటిఫికేషన్‌కు వివాదాల చిక్కుముడులు వీడటం లేదు. కొత్త జిల్లాల పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అటు హైకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం ఇంతవరకు దరఖాస్తులు స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ నోటిఫికేషన్ వివాదాస్పదమవుతోంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు పాత జిల్లాల ప్రకారం విడుదల చేసి.. టీచర్‌ పోస్టులు కొత్త జిల్లాల ప్రకారం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడం అభ్యర్థులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. జిల్లాల పెంపుతో స్థానికతకు ఏమాత్రం భంగం వాటిల్లదని వాదిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెబుతోంది. అయితే కొత్త జిల్లాల వారీగా పోస్టులు ప్రకటించడం..కొన్ని జిల్లాలకు పోస్టులు కేటాయించకపోవడం అక్కడి అభ్యర్థులను తీవ్రమనోవేదనకు గురిచేస్తోంది. అయితే స్థానికేతరులకు 20శాతం అవకాశం ఉండటం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుందని విద్యార్థి, యువజన సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే దరఖాస్తులో ప్రస్తుత జిల్లా, పూర్వపు జిల్లా ప్రస్తావన వుంటే బాగుంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు స్థానికత రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందని హైకోర్టు బెంచ్‌ గుర్తుచేస్తోంది. దీంతో సోమవారం ప్రభుత్వం హైకోర్టు ముందు ఎలాంటి వాదనలు వినిపిస్తుందన్నది టీఆర్‌టీ అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. 

Don't Miss

Subscribe to RSS - టీఆర్టీ