టీఆర్ ఎస్

08:13 - August 10, 2018

హైదరాబాద్ : ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా ఉన్నామని కలరింగ్‌ ఇచ్చిన గులాబీ పార్టీ.... ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. గతంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నా.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని గులాబీపార్టీ చెప్పకనే చెబుతోంది. రాజకీయంగా కూడా బీజేపీతో ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి అనుకూలంగా టీఆర్ ఎస్ 
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ దోస్తీ కడుతుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్‌ పలు సందర్భాల్లో సమర్ధించారు.  ఇప్పుడు రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా... ఫ్రంట్‌ కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. కానీ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి  కేసీఆర్‌ పరోక్షంగా మద్దతిస్తూ .. తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో మరింత ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో ఉన్న నేతకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతునిచ్చింది. ఎన్నికల్లో పాల్గొని ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటేశారు.  అయితే ఇందుకు కొత్త కథ చెబుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతోనే తాము మద్దతు ఇచ్చామన్న వాదనను అధికారపార్టీ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే తరపున అభ్యర్థియే కదాని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
ఒకవైపు బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది.  అంతేకాదు... తెలంగాణలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ టూర్‌ను అడ్డుకునేందుకు గులాబీపార్టీ అనుబంధ విభాగాలు సిద్ధమవుతున్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఓయూలో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌వీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు యూనివర్సిటీలు వేదికలు కాబోవని టీఆర్‌ఎస్‌వి నేతలు అంటున్నారు.  శనివారం ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌వీ నిర్ణయించింది. మొత్తానికి  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో  టీఆర్‌ఎస్‌ విభేదిస్తూనే... బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో ఉంది.

 

06:59 - August 9, 2018

హైదరాబాద్ : గులాబీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది? కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా? లేక ఎన్డీయే ప్రతిపాదించిన జేడీయు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కు ఓటేస్తుందా? లేక తటస్థంగా ఉంటుందా? ఇంతకీ టీఆర్‌ఎస్‌ ఎంపీలకు గులాబీ బాస్‌ ఇచ్చిన డైరెక్షన్‌ ఏంటి?
టీఆర్‌ఎస్‌ నిర్ణయంపై ఉత్కంఠ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ఇవాళ జరుగనుంది.  అధికార, విపక్ష పార్టీలు చెరో అభ్యర్థిని నిలబెట్టాయి. అయితే ఎవరికీ పూర్తి మెజారిటీ లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఇరు పక్షాలు ఆధారపడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. టీఆర్‌ఎస్‌ మాత్రి ఇప్పటి వరకు అధికారికంగా ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. 
జేడీయూ అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ మద్దతు!
గులాబి పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చేది అధికారికంగా ప్రకటించకపోయినా... జేడీయూ అభ్యర్థికే తమ ఓటు వేసే సంకేతాలను ఇస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ మూడో కూటమిని తెరపైకి తెచ్చినా.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మద్దతును కేసీఆర్‌ కూడగట్టేందుకు ఆసక్తి చూపలేదు. రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోవాలంటే ప్రాంతీయ పార్టీల నేతలను రంగంలోకి దించాలని కమలనాథులు తీసుకున్న నిర్ణయం టీఆర్‌ఎస్‌కు ఊటర నిచ్చింది.
తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ను కోరిన నితీష్‌కుమార్‌
డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఫోన్‌లో కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు.  అయితే రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే గులాబీపార్టీ కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది.  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను భావిస్తున్న నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి ఎలా మద్దతు ఇవ్వాలని గులాబీనేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి రంగంలో లేకపోవడం, ప్రాంతీయపార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపేందుకు ఆసక్తి చూపుతోంది.   
రాజకీయవర్గాల్లో ఉత్కంఠ 
మొత్తం మీద రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రాంతీయ పార్టీలు మద్దతు కీలకం కావడంతో వాటి మద్దతు కోసం జాతీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరికొద్ది గంటల్లో జరుగనున్న ఎన్నికల్లో ఎవరిది గెలుపో... ఎవరిది పరాజయమో తేలిపోనుంది.

 

13:57 - July 24, 2018

హైదరాబాద్ : గులాబీ పార్టీలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. టిక్కెట్లు దక్కించుకునేందుకు  కుమ్మలాటలు కూడా ప్రారంభమయ్యాయి.  వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో ఆశావహుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.  తమ అనుయాయులతో నియోజకవర్గంలో పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సార్వత్రిక సమరానికి  ఇంకా చాలా సమయం ఉంది. కానీ తెలంగాణలో అధికారపార్టీలో అప్పుడే టిక్కెట్ల కుమ్ములాట మొదలైంది.  అధికార పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. దీంతో నియోజకవర్గాల్లో నేతలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యవహారంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లు తాము అడిగితే తప్పేమిటన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటి వరకు అంతర్గంతా ఉన్న కుమ్ములాటలు ఇప్పుడిప్పుడే బట్టబయలవుతున్నాయి. పార్టీకి పట్టున్న వరంగల్‌ జిల్లాలో ఈ వ్యవహారం నేతల మధ్య మరింత ఆజ్యం పోస్తోంది. 

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యకు మంచి పట్టుంది. అయితే రాజయ్యకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కావ్యను రంగంలోకి దించేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందని కడియం వర్గం ప్రచారం చేస్తున్నట్టు రాజయ్య అనుచరులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తూ  పరిస్థితిని కడియం శ్రీహరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కడియం వ్యవహారంపై రాజయ్య వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.  ఇక కొండాసురేఖ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. గత కొన్నిరోజులుగా ఎమ్మెల్యే కొండా, మేయర్‌ నరేందర్‌ వర్గాలు సై అంటే సై అంటున్నాయి. బహిరంగంగానే ఇరువర్గాలు ఆరోపణలకు దిగాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ టికెట్‌ కోసం కుస్తీలు జరుగుతున్నాయి. నేతల మధ్య ఇన్నాళ్లూ నిగూఢంగా ఉన్న విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఆరు నెలలు ముందుగానే టిక్కెట్లు ప్రకటిస్తారన్న ప్రచారం పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో.... నేతలు రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

16:58 - July 20, 2018

ఢిల్లీ : ప్రజల అంచనాలకనుగుణంగా మోడీ ప్రభుత్వం పనిచేయడం లేదని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. అవిశ్వాసంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్లు అయినా.. కేంద్రం.. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలోని 7 మండలాలను అక్రమంగా ఏపీలో కలుపుకున్నారని పేర్కొన్నారు. మోడీపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ఏడు మండలాలను ఏపీలో కలుపుకున్నారని చెప్పారు. విభజన చట్టాన్ని  సవరించి తమ మండలాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు తీరుతో హైకోర్టు విభజన ఆగిపోయిందన్నారు. హైకోర్టులో మెజార్టీ జడ్డీలు ఏపీకి చెందిన వారే ఉన్నారని తెలిపారు. తాగునీటి కోసం నీతి ఆయోగ్ 19 వేల కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు విడుదల కాలేదన్నారు. థర్మల్ విద్యుత్ విషయంలో కేంద్రం ఇంకా సాయం చేయాలన్నారు. తెలంగాణ నుంచి హైడల్ ప్రాజెక్టును కూడా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

21:38 - July 18, 2018

హైదరాబాద్ : పార్లమెంట్‌ సమావేశాలు వృధా కాకూడదనే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారామ్‌నాయక్‌. మేము మొదటి నుంచి ఏపీకి మద్దతుగా ఉన్నా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విభజనను జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటామని చెబుతున్న టీడీపీ నేతలు.. మరోవైపు అవిశ్వాసంపై మా మద్దతు అడగడం నచ్చలేదంటున్న సీతారాంనాయక్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటామన్నారు. అవిశ్వాసం ఓటింగ్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర వైఖరిని పార్లమెంట్‌లో నిలదీస్తామని చెప్పారు.

15:34 - July 8, 2018

ఢిల్లీ : హస్తినలో లా కమిషన్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు హాజరయ్యారు. జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో తాము ఉన్నామన్నారు. జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నాయి. నిన్నటి సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హాజరుకాలేదు. జమిలి ఎన్నికలను పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి, ప్రాంతీయ భావోద్వేగాలకు ఈ ప్రతిపాదన వ్యతిరేకమని అభిప్రాయం పడుతున్నాయి. ఇవాళ లా కమిషన్‌ ఎదుట టీడీపీ, టీఆర్‌ఎస్‌ అభిప్రాయాలు వెల్లడించనున్నాయి.

 

15:52 - July 3, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల దిశగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రచార సామాగ్రిని సిద్ధం చేస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు.
వచ్చే మార్చి, ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు
వచ్చే మార్చి, ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగాల్సి ఉంది. జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం పావులుకదుపుతోంది.  దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.  జమిలి ఎన్నికలపై కేంద్రం రాష్ట్ర అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఆరు నెలల పదవీ కాలాన్ని వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామ్న సంకేతాలను గులాబీ బాస్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే... అందుకు తాము కూడా రెడీ ఉన్నామని గులాబీ దళపతి తేల్చిచెప్పినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  జమిలి ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తే.. తాము కూడా కలిసి వస్తామని కేసీఆర్‌ ప్రధానితో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో కూడా రాజకీయంగా అధికారపార్టీ అడుగులు వేయడం మొదలు పెట్టింది. పార్టీ ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకుంటుంది.  అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు  గులాబీ బాస్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు.
పార్లమెంట్‌ సమావేశాల నాటికి జమిలి ఎన్నికలపై స్పష్టత
త్వరలోనే రాజకీయ పార్టీలతో లా కమిషన్‌ కూడా మరోసారి జమిలి ఎన్నికలపై అభిప్రాయాన్ని సేకరించనుంది. అయితే ఈ విడత జరిగే పార్లమెంట్‌ సమావేశాల నాటికి జమిలీ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే.. రాష్ట్రం వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు.

 

07:36 - June 30, 2018

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారపార్టీ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ధీమాతో అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్దం కాకముందే.. ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో గులాబీబాస్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి ముందస్తు ఎన్నికలపై సవాల్‌ విసిరిన కేసీఆర్‌.... అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఆసక్తి 
సాధారణ ఎన్నికలకు మరో 9 నెలలు సమయం ఉంది. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండేందుకు అధికారపార్టీ సన్నద్దమవుతోంది. గులాబీ నేతలంతా ప్రజాక్షేత్రానికే పరిమితంకావాలన్న సూచనలు కేసీఆర్‌ నుంచి అందుతున్నాయి. జమిలీ ఎన్నికలకు కేంద్రం ఆసక్తి చూపుతోందన్న ప్రచారం ఉన్నా... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లాంటి పెద్ద రాష్ట్రాలకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితోపాటే కేంద్రం పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీంతో తెలంగాణలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ ఆసక్తి చూపిస్తోంది. ప్రధాని మోదీతో బేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
పార్టీని బలోపేతం చేసుకునే పనిలో టీఆర్‌ఎస్‌ 
ముందస్తు అంచనాలతో అధికారపార్టీ బలోపేతం చేసుకునే పనిలో పడింది. బలమైన నేతలను కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.  వారం రోజులుగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. నవంబర్‌, డిసెంబర్‌ నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న స్పష్టమైన సంకేతాలను గులాబీ దళపతి తమ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కొంత మందికి తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచనలను కూడా కేసీఆర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థులపై స్పష్టత ఇచ్చేందుకు కూడా సీఎం నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గద్వాల నియోజకవర్గంలో కృష్ణమోహన్‌రెడ్డిని సభపై ప్రకటించారు కేసీఆర్‌. 
ఇబ్బందులు అధిగమించే పనిలో గులాబీ బాస్‌
రానున్న రోజుల్లో టీఆర్ ఎస్ లో మరిన్ని చేరికలు
గులాబీ పార్టీకి ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముందస్తు ఎన్నికల అంచనాతో కీలక నేతలను కారెక్కించుకుకోవడంపై అధికారపార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో మరింత మంది విపక్షనేతలు అధికారపార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

 

10:51 - June 28, 2018

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డి.శ్రీనివాస్‌ సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కూ ఫిర్యాదు చేశారు. తనపై జిల్లా నేతల ఫిర్యాదు నేపథ్యంలో.. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయనకు సీఎం అపాయింట్‌ లభించలేదు. ఇదే అంశంపై నిర్వహిచిన చర్చా కార్యక్రమలో విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత గోస్ల శ్రీనివాస్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్త పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:11 - June 5, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు వచ్చిన రసమయి బాలకిషన్‌ను మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని మహిళలు, యువకులు ఎమ్మెల్యేను నిలదీశారు. దాదాపు 40 నిమిషాలపాటు ఎమ్మెల్యేను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇదిలావుంటే... ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన స్థానిక వార్డు మెంబర్‌ను ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడమే కాకుండా.. బలవంతంగా డిలీట్‌ చేయించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - టీఆర్ ఎస్