టీఎస్ ఆర్టీసీ

08:16 - May 31, 2018

హైదరాబాద్ : ఆర్టీసీని మూసేసి కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్‌ యత్నిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ కె. రాజిరెడ్డి విమర్శించారు.  కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే... కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌లోని సీబీఎస్‌ దగ్గర.. ఆర్టీసీ పరిరక్షణ - కార్మికుల వేతన ఒప్పందం - ప్రభుత్వ వైఖరి అనే అంశంపై బహిరంగ నిర్వహించారు.  కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులు, యూనియన్లపట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు. తమ డిమాండ్లపై స్పందించకుంటే.... సమ్మెతో సహా ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉండాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.  ఆర్టీసీ చెట్టును సీఎం కేసీఆర్‌ నరికివేసేందుకు  కుట్రలు చేస్తున్నారని కో- కన్వీనర్‌ వీఎస్‌ రావు అన్నారు. 

 

06:52 - October 19, 2017

హైదరాబాద్: ఉద్యోగాలు ఇస్తున్నట్టు కాల్‌ లెటర్లు పంపారు.. వచ్చిన వారికి నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగులు ఇవ్వడం మరిచారు. ఘనత వహించిన తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టింగ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు . టీఎస్‌ ఆర్టీసీలో సంవత్సరాలుగా సాగుతున్న రిక్రూట్ మెంట్ పై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ.

డ్రైవర్ పోస్టులకు 9 వేల మంది దరఖాస్తు

హైదరాబాద్‌ జోన్ పరిధిలోని జిల్లాల్లో ఉన్న ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు 9 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 387 మందిని సెలక్ట్‌ చేశారు. ఎంపికైన వారిలో 170 మందికి వెంటనే పోస్టింగులు ఇచ్చారు. మిగిలిన 217 మందికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మరో సారి డ్రైవర్ కమ్‌ కండక్టర్‌ ట్రైనింగ్‌ కూడా ఇప్పించారు. శిక్షణ పూర్తై దాదాపు నాలుగేళ్లు గడిచిపోయినా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంత మందికి ఉద్యోగాలు ఇచ్చి మరికొందరికి నియామక పత్రాలు ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. వీరంతా ఎన్నోసార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులను కలిసినా... ఖాళీలు ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ ఇస్తామన్న హామీతోనే సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు ఎంపికైన వారు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమకు ఇంకా ఉద్యోగాలే రాలేదని ఆందోళన చెందుతున్నారు.ఖాళీలు లేకుండా డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసి, ఎలా ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఆర్టీసీ అధికారుల అనాలోచిత విధానానికి ఎంపికై, పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లే నిదర్శనమని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు.

18:20 - September 23, 2017

హైదరాబాద్ : దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులన్నీ ఫుల్‌ అవుతాయి. ప్రతి ఏడాది కూడా ఆర్టీసీ... ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా నగరం నుండి ఊర్లకు వెళ్లే రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్త్తోంది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,600 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ బస్సుల రద్దీని, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక బస్సు బస్టాప్‌లు ఏర్పాటు చేసి అక్కడినుండే బస్సులను నడపనున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఎల్బీనగర్‌ నుండి,.. వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుండి,... కరీంనగర్‌, నిజామాబాద్‌ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్‌ నుండి... ఇలా నగరంలో ఆరాంఘర్‌, సాగర్‌ రింగ్‌రోడ్డు, తదితర చోట్ల నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పాయింట్లలో 300 మంది ప్రత్యేక సిబ్బందిని ఆర్టీసీ కేటాయించింది. అయితే... షెడ్యూల్‌ బస్సులు మినహా స్పెషల్‌ బస్సులలో ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ చార్జీలు తప్పడం లేదని యాజమాన్యం అంటుండగా... పండుగ పేరుతో ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 

09:31 - August 17, 2017
06:43 - August 12, 2017

హైదరాబాద్ : ఆర్టీసీకి అసలే అప్పుల కుప్పలు. ఆపై నష్టాల తిప్పలు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఆర్టీసీ పై జీఎస్టీ పిడుగులు. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్సీఈకి పన్నుల భారం తడిసిమోపెడవుతోంది. ఆర్టీసీకి జీఎస్టీ ప్రభావంపై 10 టీవీ ప్రత్యేక కథనం. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రగతి రథ చక్రం.. ఆర్టీసి ప్రభుత్వ విధానాలతో కుదేలేవుతోంది. సంస్థను పటిష్టం చేయాల్సిన సర్కారు... ప్రైవేటు మాదిరిగానే ఆర్టీసీపై పన్నుల భారం మోపుతోంది. దీంతో సంస్థ సంక్షోభంలో చిక్కుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన జిఎస్టీ ఆర్టీసికి శాపంగా పరిమణించింది. కోటి మందికి పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడంలేదు. ఆదాయ వ్యయాలకు మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ ఆర్టీసీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది.. జీఎస్టీ అమల్లోకి వచ్చి నలభై రోజులు గడిచినప్పటికీ ఆర్టీసిపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయంపై యాజమాన్యానికి స్పష్టత లేకపోయినా... ప్రజా రవాణ వ్యవస్థ విస్తరణకు జీఎస్‌టీ అవరోధంగా పరిమించే అవకాశం లేకపోతేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ వినియోగించే డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై అభ్యంతం వ్యక్తమవుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డీజిల్‌పై అమ్మకం పన్ను వసూలు చేస్తున్నారు. తెలంగాణలో డీజిల్‌పై 24.5 శాతం అమ్మకం పన్ను విధిస్తున్నారు. డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉందని పది వేలకు పైగా బస్సులు కలిగిన ఆర్టీసి కొత్త బస్ బాడీలు తయారు చేసేందుకు విడిభాగాలు, టైర్లు, ట్యూబ్‌లను పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిపై 18 నుండి 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఇంతకు ముందు అమల్లో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే, జీఎస్‌టీ చాలా ఎక్కువ. బస్ బాడీ తయారీకి వ్యాట్‌ ఐదు శాతం ఉంటే, జీఎస్టీలో ఇది 28 శాతానికి చేరింది. ఇది సంస్థకు భారమే.

జీఎస్టీ చట్ట నిబంధనల్లో 10 అంతకంటే ఎక్కువ సీట్లు సామర్థ్యం కలిగిన వాహనాలకు 15 శాతం సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి 28 శాతం కలిపితే మొత్తం 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సంస్థకు అదనపు భారమే. కొత్తగా కొనుగోలు చేయనున్న 1350 కొత్త బస్సుల కూడా జీఎస్‌టీ ప్రభావం పడుతుంది. మొత్తం మీదీ జీఎస్‌టీ ఆర్టీసీకి భారంగానే పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 

07:41 - April 22, 2017

హైదరాబాద్ : అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ దుస్థితి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బస్సులు పార్కింగ్‌లోనే మగ్గుతున్నాయి. సిఎం చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు సమయం దొరక్క..కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. ప్రయాణికులకు సేవలందించాల్సిన విలువైన బస్సులు 5 నెలలుగా ఎండకు ఎండి వానకు తడుస్తున్నాయి.
అలంకారప్రాయంగా బస్సులు 
ఆదాయాన్ని పెంచుకునే మార్గాలున్నా తెలంగాణ ఆర్టీసీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన 300లకు పైగా బస్సులు..షెడ్డుకు పరిమితం కావడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. గత నవంబర్‌లో సుమారు మూడు వందల బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. బాడీ నిర్మాణం పూర్తిచేసుకుని షెడ్డుకే పరిమితమయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసిన బస్సులు అలంకారప్రాయంగా మారాయి. ఆర్టీసికి ఆదాయం వచ్చే సీజన్‌లో.. కొత్తగా కొనుగోలు చేసిన బస్సులు సిద్ధంగా ఉన్నా అధికారులు వాటిని రోడ్డెక్కించలేకపోయారు. సంక్రాంతి సీజన్ లో అందుబాటులోకి తెచ్చినట్లైతే.. కొనుగోలు చేసిన ఖర్చులో సగమైనా వచ్చేదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. వేసవి సీజన్‌లోనూ...బస్సులు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోసారి కొత్త బస్సుల ప్రారంభోత్సవం వాయిదా..
ఒక్కో ఎక్స్‌ప్రెస్‌ బస్సు ద్వారా సాధారణంగా రోజుకు 10 వేల వరకు ఆదాయం వస్తుంది. గరుడా, రాజధాని లాంటి బస్సుల ద్వారా 20 వేల నుంచి 30 వేలు వచ్చే అవకాశం ఉంది. 300 బస్సులు నెలకు 10 కోట్ల నుంచి 12 కోట్ల ఆదాయాన్ని తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 5 నెలల్లో సుమారు 50 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్టీసి కోల్పోవడానికి కారణమెవరని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కావడంలేదని ఓసారి, సిఎం అపాయింట్‌ మెంట్‌ దొరకడం లేదని మరోసారి వాయిదా వేయడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నాయి. సుమారు మూడు వందల కొత్తబస్సులు సిద్ధంగా ఉన్నాయని నెల క్రితం ఆర్టీసి ఎండి రమణారావు చెప్పారు. గత నెలాఖరునే వాటిని ప్రారంభిస్తామన్నారు. నెల గడిచినా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా వేసవి సీజన్‌ ముగియక ముందే కొత్త బస్సులను అందుబాటులోకి తేవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

17:21 - March 29, 2017

హైదరాబాద్ : నగరాలు మహానగరాలుగా మారుతున్నాయి. బస్సులు పెరిగిపోతున్నాయి. ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు పెరగడం లేదు. నగరాభివృద్దిలో భాగంలో మోడ్రన్‌ బస్టాపులు నిర్మిస్తామన్నారు. బస్‌బేలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అవన్నీ ఉట్టి ప్రకటనలకే పరిమితమని తేలిపోయింది. ఓవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు బస్టాపులలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రయాణం అంటేనే భయమేస్తోంది. ఓవైపు పాడైన రోడ్లు.. మరోవైపు ట్రాఫిక్‌ జామ్‌లతో నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసంతో కూడుకున్న పని. సాధారణంగా బస్టాప్‌లలో గంటల తరబడి వేచి చూస్తే తప్ప ఆర్టీసీ బస్సులు దొరకని పరిస్థితి. అయితే.. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో బస్టాప్‌లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు
హైదరాబాద్‌లో ఏళ్లు గడుస్తున్నా బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రం పూర్తి కావడంలో లేదు. 2008లో ఆర్టీసీ బస్సు షెల్టర్ల నిర్మాణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది. నగరంలో మొత్తం 1832 బస్టాప్‌లు అవసరమని గుర్తించిన ఆర్టీసీ అధికారులు... ప్రతిపాదనలను బల్దియాకు పంపారు. యాడ్‌ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు గ్రేటర్‌ అధికారులు. అయితే.. బస్సు షెల్టర్ల నిర్మాణానికి ఐదు సార్లు టెండర్లు పిలిచినా కేవలం... 840 బస్సు షెల్టర్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వివిధ ప్రాంతాల్లో బస్సు షెల్టర్ల నిర్మాణానికి యాడ్‌ ఏజెన్సీలు ముందుకు వచ్చినా.. ఎక్కడ ఎక్కువ ఆదాయం వస్తుందో అక్కడ మాత్రమే బస్సు షెల్టర్లు నిర్మించి మిగతావాటిని వదిలేశారు.

35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పైగా ఉండడంతో ప్రయాణికులు బస్టాప్‌లలో నిలబడాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ నుండి రక్షణ కోసం చెట్లు, భవనాల నీడలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు బస్టాప్‌లలో క్షణం పాటు బస్సులు నిలపకపోవడంతో.. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 100 రోజుల్లో నగరంలో 50 ప్రాంతాల్లో బస్‌బేలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మెట్రో రైలు పనుల కారణంగా రోడ్డు వైడనింగ్‌లో ఉన్న బస్సు షెల్టర్లను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

12:36 - November 19, 2016
15:39 - October 27, 2016

హైదరాబాద్ : నష్టాల బాటలో పయనిస్తోన్నసంస్థను లాభాల బాట పట్టించేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంస్ధ ఆస్తులను వినియోగించుకొని రెవెన్యూ పెంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లను నిర్మించి అద్దెల ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తోంది. వీటితో పాటే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు.. ఆదాయం పెంపు లక్ష్యంగా.. కొత్తగా డివిజనల్‌ మేనేజర్‌ పోస్టులనూ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. 
ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్‌మాల్స్, సినిమాహాల్స్ నిర్మాణం
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని రక్షించుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ నడుం బిగించింది. ఏటా వస్తోన్న కోట్లాది రూపాయల నష్టాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు కొత్త విధానాలను అమలు చేయనుంది. సంస్థ స్థలాలనే ఆదాయాభివృద్ధి వనరుగా మలచుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. సంస్థకు చెందిన స్థలాల్లో  షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ నిర్మించాలని ఆర్టీసీ యోచిస్తోంది. వీటి ద్వారా స్థిరమైన ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుత సంవత్సరం నాలుగువేల కోట్లున్న ఆదాయాన్ని.. వచ్చే ఏడాదికి ఐదువేల కోట్ల రూపాయలకు పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
సంస్థ నష్టాలపై దృష్టిసారించిన టీఎస్ ఆర్టీసీ
టీఎస్ ఆర్టీసీ.. గత  ఏడాది దాదాపు 700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90 డిపోలలో కేవలం పదింటిలోనే లాభాలొస్తున్నాయని, మిగిలిన 80 డిపోలూ నష్టాల బాటలో సాగుతున్నాయని సంస్థ రికార్డులు చెబుతున్నాయి. ఈ దశలో సంస్థను ప్రగతిబాట పట్టించేందుకు అట్టడుగు స్థాయి నుంచే సమూల మార్పులు తేవడానికి ఆర్టీసీ యాజమాన్యం సమాయత్తమవుతోంది. ఇటీవలే కొనుగోలు చేసిన పదకొండు వందల యాభై కొత్త బస్సులను.. కొత్త జిల్లాలకు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన వజ్ర మినీ బస్సు సర్వీసులను వచ్చే నెల నుంచి అందుబాటులొకి తీసుకురానుంది.  
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కసరత్తు
మరోవైపు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకూ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లలో డూప్లికేట్‌ వాటర్‌ బాటిల్‌ అమ్మకాలకు చెక్‌ పెట్టాలని యోచిస్తోంది. వాటి స్థానంలో బిస్లరీ వాటర్ బాటిల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
కొత్తగా డివిజనల్‌ మేనేజర్‌ క్యాడర్‌ పోస్టుల ఏర్పాటు 
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడం.. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించే దిశగా.. కొత్తగా డివిజనల్‌ మేనేజర్‌ క్యాడర్‌ పోస్టులను ఏర్పాటు చేయాలనీ ఆర్టీసీ నిర్ణయించింది. డివిజన్‌ స్థాయిలో ఉన్నతాధికారి నియామకం వల్ల.. సంస్థను ప్రగతిబాటలో పరుగులు పెట్టించడం సాధ్యమవుతుందని ఆర్టీసీ యాజమాన్యం విశ్వసిస్తోంది. 

Don't Miss

Subscribe to RSS - టీఎస్ ఆర్టీసీ