టీచర్లు

21:27 - March 22, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పాలక తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు ముగ్గురు, వైసీపీ సభ్యుడు ఒకరు విజయకేతనం ఎగురవేశారు. విశాఖ పట్టభద్రుల ఎన్నికలో మాత్రం.. టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు సత్తా చాటారు. రెండు రోజుల ఉత్కంఠ అనంతరం వెలువడిన ఫలితాలు, పాలక పక్షాన్ని ఖంగు తినిపించాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో వామపక్షాలకు ఎదురు లేదని మరోమారు నిరూపితమైంది. చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను పీడీఎఫ్ అభ్యర్థులను విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసరెడ్డి కైవసం చేసుకున్నారు. వరుసగా మూడోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం గెలిచారు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనదని పీడీఎప్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కార్పొరేట్ శక్తులను తనపై పోటీకి దింపి మండలిలో తన గొంతు నొక్కేయాలని అధికార పార్టీ చూసిందని.. అయితే ఉపాధ్యాయులు విజ్ఞతతో ఓటు వేసి తనను గెలిపించారన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మంత్రి నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై యండపల్లి శ్రీనివాసరెడ్డి విజయదుందుభి మోగించారు. ఈ విజయం వామపక్షాల విజయమని యండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ తరపున గోపాల్‌రెడ్డి ఈ ఎన్నికలో గెలుపొందారు. ఈ విజయంతో విద్యావంతులందరూ తమతోనే ఉన్నారని తేలిందన్నారు.. గోపాలరెడ్డి. ఇక ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నిబీజేపీ సొంతం చేసుకుంది. పీడీఎప్ అభ్యర్థి అజశర్మపై బీజేపీ అభ్యర్థి మాధవ్ విజయం సాధించారు. ఫలితం అనంతరం విశాఖకు రైల్వే జోన్ కోసం కృషిచేస్తానని మాధవ్ తెలిపారు. మొత్తమ్మీద విద్యావంతులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే... ఏపీలో, పాలక తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా తగ్గిందని.. అదే సమయంలో, వామపక్షాల జోరుకు ఎదురేలేదని స్పష్టమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

18:44 - March 6, 2017

నెల్లూరు : ఉపాధ్యాయుల కొత్త పెన్షన్‌ విధానాన్ని అడ్డుకుని తీరుతామని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. పెద్దలసభ ఎన్నికల్లో అధికార పార్టీ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తనకు మరో అవకాశం కల్పిస్తే ఉపాధ్యాయుల సమస్యలపై మండలిలో గళమెత్తుతానంటున్న బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

16:07 - January 11, 2017

నల్లగొండ : జిల్లాలో దారుణం జరిగింది. నందకుమార్‌ అనే వ్యక్తి ఆరుగురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా చిన్నారులపై అత్యాచారానికి పాల్పిడినట్లు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన టీచర్లు.. విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు నందకుమార్‌ను చితకబాదారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థినులు గిరకబావిగూడెం సుందరయ్య కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.

12:36 - August 5, 2016

పుస్తకాలు, బట్టీ చదువులు, ర్యాంకుల కోసం పరుగులు ఇలాంటి పోటీ ప్రపంచంలో.. అందుకు భిన్నంగా రంగుల ప్రపంచంలో మునగాలని ఎవరికుంటుంది? మనసులోని భావాలను చిత్రాలుగా గీసే అవకాశం ఎందరికుంటుంది? ఆ దిశగా ప్రోత్సహించే వారు ఎందరుంటారు? ఇలాంటి సమయంలోనే ఆర్ట్ టీచర్లంతా ఓ వేదిక మీదకొచ్చారు. పిల్లలకోసం మేమున్నామంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కేవలం ఒకరిది కాదు. ఒక సమూహంలో టీచర్లది. రేపటి తరాన్ని తీర్చిదిద్దే వారిది. పేద పిల్లలకోసం, ఆర్థిక లేమి కారణంగా చదువుకి ఇతర సృజనాత్మక శక్తులకు దూరమైన చిన్నారుల కోసం .. ఇలా టీచర్లంతా ఒక్కచోట చేరడాన్ని స్వాగతిద్దాం. అందరికన్నా భిన్నంగా ఇలా ముందుకొచ్చిన ఈ టీచర్లను అభినందిందాం. ఎందరికో స్పూర్తిని కలిగించాలని ఆశిద్దాం.

11:35 - March 31, 2016

హైదరాబాద్ : ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పోలీసు డిపార్ట్ మెంట్ లో 5.70 వేలు, డీఎస్సీకి 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగుల 12 -15 లక్షల మంద్రి మాత్రమే ఉన్నారని కొంతమంది పేర్కొంటున్నారని కానీ సీఎం మాత్రం కోటి మందికిపైగా ఉన్నారని చెబుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నీళ్లు..నిధులు..నియామకాల సమస్యలపై తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 43 వేల టీచర్ల పోస్టులు..3,755 జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రెండు సంవత్సరాల అవుతున్నా ఇంతవరకు ఖాళీలు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. భర్తీ చేయకపోతే కేటాయించిన బడ్జెట్ మిగులుతుందని, నిరుద్యోగుల పొట్ట కొట్టే విధంగా చేయకూడదని ఆర్.కృష్ణయ్య సూచించారు. 

16:52 - February 17, 2016

కరీంనగర్ : అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల్లో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి కొంతమంది ఉపాధ్యాయులు గండికొట్టారు. తప్పుడు లెక్కలను చూపి జీతాలను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఇందులో పదవి విరమణ చేసిన వారు కూడా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు చూపారు. ఈ ఘటన వేములవాడలో చోటు చేసుకుంది. 
జిల్లాలోని వేములవాడలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టారు ఉపాధ్యాయులు, అధికారులు. పదవీ విరమణ పొందిన ముగ్గురు టీచర్లను ఇంకా సర్వీసులోనే కొనసాగుతున్నట్టు లెక్కలు చూపి జీతాలను సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఎంఈవో శోభన రావు, ఉపాధ్యాయుడు కోరెపు శ్రీనివాస్ ఈ మోసానికి పథక రచన చేశారు. బ్యాంకు అధికారులతో కలిసి గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ తతంగం నడుపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల రూపాయలను స్వాహా చేశారు. కొందరి ఫిర్యాదుదో ఈ కుంభకోణం బట్టబయలైంది. ప్రధాన సూత్రధారి కోరేపు శ్రీనివాస్‌తో సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయతే కోరెపు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు.

13:20 - December 18, 2015

రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ప్రముఖులకు తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు స్వీయ రక్షణార్థం... వారికి తుపాకులు వెంట తెచ్చుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇప్పుడు ఈ కోవలో టీచర్స్ కూడా చేరారు. టీచర్లు కూడా ఆత్మరక్షణార్ధం, స్వీయరక్షణకు తుపాకులు వెంట తెచ్చుకునేందుకు అనుమతించారు. అయితే ఇది భారతదేశంలో కాదు లేండీ.. మరెక్కడా అనుకుంటున్నారా... అమెరికాలో...

ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పాఠశాల యాజమాన్యం స్వీయ రక్షణ చర్యలు చేపట్టింది. తమ చీచర్లు తమతో బాటు తుపాకులు తెచ్చుకునేందుకు అనుమతి తెలిసింది. టెక్సాస్ లోని జాన్సన్ కౌంటీ పరిధిలో ఉన్న 'కీనీ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్' ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మొదట్లో చీచర్లు తుపాకులు తీసుకెళ్లడానికి వ్యతిరేకించిన పాఠశాల సూపరింటెండెంట్ రికీ స్టీఫెన్స్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దుర్ఘటనల సమయంలో ఇతర విద్యార్థులను కాపాడటానికి, టీచర్ల ఆత్మరక్షణకు ఉద్దేశించిన తాజా నిర్ణయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి అమలు చేస్తామని తెలిపారు. అయితే తుపాకులు తీసుకెళ్లడానికి ఏ టీచర్లు అర్హులో పాఠశాల ముందుగా ఎంపిక చేయనుంది. ఇదే పాఠశాలకు ఉన్న మరో నాలుగు క్యాంపస్ లోనూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

 

10:29 - September 13, 2015

హైదరాబాద్ : ఎన్నో ఆశలతో ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు విద్యావాలంటీర్ పోస్టులకు కూడా పోటీపడలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా టెట్ నిర్వహించకపోవడంతో నిరాశలో కూరుకుపోతున్నారు దాదాపు లక్షమంది అభ్యర్థులు. ఈ అంశంపై వెంటనే క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ విద్య కోర్సులు చేసిన అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక... ఆ పరీక్షకు ద్వారం లాంటి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందో అర్థం కాక అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. రేషనలైజేషన్, ఉపాధ్యాయ బదిలీల తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం 7వేల 974 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు అర్హతలు కూడా ప్రకటించి జీవో విడుదల చేసింది. జీతం 8వేలుగా నిర్ధారించింది.

అభ్యర్థులకు టెట్ కష్టాలు..
అయితే విద్యా వాలంటీర్ల పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు 20శాతం వెయిటేజీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిబంధన కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు శాపంగా మారింది. రెండేళ్లుగా ఈ పరీక్ష నిర్వహించకపోవడంతో దాదాపు లక్షమంది పోటీలో వెనకబడుతున్నారు. ఉపాధ్యాయ కోర్సులు చదివినా కేవలం టెట్ అర్హత లేక అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ వచ్చే 8వేల జీతంతో తల్లిదండ్రులకు కాస్త ఆసరాగా ఉందామన్నా వీలు కావడంలేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

డీఎస్సీలో టెట్‌కు వెయిటేజీ ఇస్తారా? రద్దు చేస్తారా?..
టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిబంధనలప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలి. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013 సెప్టెంబరులోఈ పరీక్ష జరిగింది. ఆ తర్వాతనుంచి టెట్ గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అటు వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీ సర్కారు ప్రకటించింది. ఈ ఎంట్రన్స్ లో టెట్‌కు వెయిటేజీ ఇస్తారా? లేక ఏపీలోలాగా రద్దు చేస్తారా? అన్న అంశంపై ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీంతో నిరుద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని ఎన్నో ఆశలతో కోర్సులు చేసిన అభ్యర్థులు టెట్ లేక విద్యావాలంటీర్ లాంటి పోస్టులకు పోటీపడలేకపోతున్నారు.. వెంటనే ఈ టెట్‌పై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

13:42 - September 5, 2015

విశాఖపట్టణం : ఆచార్యదేవోభవ అన్న సూక్తికి సరైన అర్థం చెబుతున్నారు ఇద్దరు మహిళా టీచర్లు... ఒక్క చదువు చెప్పడంతోనే తమ బాధ్యత పూర్తయిందని భావించలేదు.. సమాజంలో చైతన్యంకోసం అహర్నిషలు శ్రమించారు.. సేవేలక్ష్యంగా ముందుకు కదులుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కిపైగా గిరిజన తెగలు నివసిస్తున్నాయి... ఇందులో చాలా తెగలకు మాతృభాషలున్నాయి.. ఇతర భాషల ప్రభావంతో ఈ గిరిజనుల భాషలన్నీ మెల్లగా కనుమరుగైపోతున్నాయి.. కొన్నేళ్లు గడిస్తే గిరిజనుల సంస్కృతిని తెలియజేసే ఈ భాషలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదముంది.

18 గిరిజనుల భాషలకు లిపి..
ఈ పరిస్థితి చూసిన ఓ ప్రొఫెసర్... లిపి రూపొందిస్తే ఆ భాషలు చాలాకాలం నిలిచిఉంటాయని భావించారు. ఏకంగా దాదాపు 18 గిరిజన భాషలకు లిపి రూపొందించారు. 18 గిరిజనుల భాషలకు లిపి అందించడమంటే మాటలు కాదు... ఆ భాషలు నేర్చుకోవాలి.. వాటికి కొత్త అక్షరాలు తయారు చేయాలి.. అయినా ముందుకే సాగారు ఏయూ ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ.. ఒక్క అక్షరాలు రూపొందించడమే కాదు అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాల మీద పరిశోధన చేశారు. ఏపీలోని బగత, గదబ, కోయ, సుగాలి, ఎరుకల, సవర, గౌడు, గోండు, కొలమి, కొండదొర, కమ్మర, కుపియా, రానా, మల్లి, జాతాపు, పొర్జ, ముఖదొర, కొటియా భాషలకి లిపి అందించారు.. ఇలా ఆసియాలోనే అనేక భాషలకు అక్షరాలు అందించిన ఏకైక మహిళగా నిలిచారు.

ఎన్నో అవార్డులు...
ప్రసన్న శ్రీ చేసిన కృషికి ఎన్నో అవార్డులొచ్చాయి.. ప్రముఖులనుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.. అయినా ఈ ప్రొఫెసర్‌కు సంతృప్తి అనిపించలేదు. గిరిజనులకోసం ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డల మాతృ భాషలో విద్యను ప్రోత్సహిస్తేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

అవయవదానం కోసం మరో ఉపాధ్యాయురాలు ఉద్యమం..
గిరిజనులకోసం ఓ ప్రొఫెసర్ తన జీవితాన్నే ధార పోస్తుండగా అవయవదానంపై అవగాహనకోసం మరో ఉపాధ్యాయురాలు ఉద్యమం చేపట్టారు. అవయవాలు దొరక్క ఎంతో మంత్రి ప్రాణాలు పోవడంచూసి ఆమె చలించిపోయారు. 2009లో సావిత్రీభాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. విద్యా దానంతో పాటు శరీర దానంకోసం ఈ సంస్థద్వారా వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. వీరి చొరవతో మొదట కేవలం 35మంది పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా ప్రస్తుతం ఈ సంఖ్య 18 వేల మందికి చేరింది. ఒక దేహం 18మందికి జీవం అన్న ఈ టీచర్ నినాదానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

1983లో టీచర్ గా జీవితం..
1983లో టీచర్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన సీతా మహాలక్ష్మి ప్రస్తుతం అనకాపల్లిలోని శంకరం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. చిన్నతనంనుంచి తోటివారికి సేవచేయడమే లక్ష్యంగా ఆమె ఎన్నో పనులు చేపట్టారు. కులాల అడ్డుగోడలు తొలగినప్పుడే సరైన అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి కులాంతర, మతాంతర వివాహాల కోసం ప్రయత్నించారు. స్వయంగా దళితున్ని వివాహం చేసుకున్నారు. రోడ్డు మీద అనాధ పిల్లలు కనిపిస్తే చాలు ఈ సీతమ్మ మనసు కరిగి కన్నీరైపోతుంది. వారిని చేరదీసి విద్యా బుద్దులు చెప్పిస్తారు. ఇలా ఇప్పటివరకూ 168మందికి ఉన్నత చదువులు చెప్పించారు.

ఆదాయంలో సగ భాగం ఇతర కార్యక్రమాలకు..
అటు తాను పనిచేస్తున్న 12 స్కూళ్లను కార్పొరేట్ స్కూల్లకు ధీటుగా తీర్చిదిద్దారు. తనకు వచ్చే ఆదాయంలో సగ భాగం ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. సీతామహాలక్ష్మి కృషిని చూసిన అనేక మంది వివిధ రకాల అవార్డులు ప్రధానం చేశారు. ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ ఈ అభ్యుదయ టీచర్ సేవను ఇంతవరకూ గుర్తించలేదు. ఎంతోమందికి ఆదర్శ టీచర్ అవార్డులు ఇస్తున్న అధికారులు. సేవకోసం జీవితాన్ని ధారపోసిన ఈ ఉపాధ్యాయురాల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అయితేనేం సీతామహాలక్ష్మిమాత్రం తనకు అవార్డులు ముఖ్యంకాదని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. స్కూల్‌కు వెళ్లామా... ఇంటికి వచ్చామా... అన్న ఆలోచనతోకాకుండా సమాజంలో మార్పుకోసం కృషి చేస్తున్న ఈ మహిళలు అందరికీ రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారు.

11:01 - September 5, 2015

మహబూబ్ నగర్ : అందరికీ చదువులమ్మ దారిచూపితే ఆ చదువుల తల్లికే నీడనిచ్చిందో మానవతామూర్తి. పరిస్థితులు ప్రతికూలమైన చోట.. ఎవరి అండా దొరకని వేళ.. ఒంటరిగా నడుం బిగించి నాలుగు దశాబ్దాల క్రితం ఆమె నాటిన చదువుల మొక్క.. నేడు మహావృక్షమైంది..! వందల మంది విద్యార్థులకు విద్యా ఫలాలను అందిస్తోంది..! ఆమె సేవాగుణాన్ని, త్యాగనిరతిని మెచ్చి ఎన్నో అవార్డులు నడిచిరాగా.. తాజాగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు సైతం వరించబోతోంది.

అక్షర దీపం..
"నేను అనుభవించిన ఇబ్బందులు మరే చిన్నారి అనుభవించకూడదు. నా కంట్లోంచి వచ్చిన కన్నీళ్లు ఇంకెవరి కళ్లలోనూ చూడకూదు." ఇంతటి ఉన్నత లక్ష్యాన్ని తనకు తాను నిర్దేశించుకున్న ఈ మానవతామూర్తి పేరు నాగమ్మ. కనీసం ఇంటర్‌ మీడియట్‌ అయినా పూర్తికాకముందే ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన ఈమె.. చదువు ద్వారానే అజ్ఞానపు చీకట్లను తరిమికొట్టొచ్చని భావించింది. అలాంటి బలమైన సంకల్పంతో ఆమె వెలిగించిన అక్షర దీపం.. ఇవాళ ఎంతో మంది చిన్నారులకు వెలుగునిస్తోంది.

ఏకోపాధ్యాయురాలి అవతారం..
మహబూబ్‌ నగర్‌ జిల్లా, నారాయణ పేట గ్రామానికి చెందిన నాగమ్మ.. చిన్నతనంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇలాంటి కష్టాలు మరెవరికీ రావద్దనే ఆలోచనతో.. ఇంటర్‌ మీడియట్‌లో ఉండగానేనారాయణపేటలో ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఆ దిశగా పనులు మొదలు పెట్టినప్పటికీ.. ఆ ప్రాంతానికొచ్చి పనిచేయడానికి ఉపాధ్యాయులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో.. తానే ఉపాధ్యాయురాలైంది ఈ బాల నాగమ్మ. ఏకోపాధ్యాయురాలి అవతారమెత్తి.. 20 మంది పిల్లలతో 1978లో 'దయానంద విద్యామందిర్‌' పాఠశాలను ప్రారంభించింది.

పాఠాలు చెబుతూనే చదువు..
ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. ఆమె కూడా చదువు కొనసాగించారు. ఎంఏ బీఎడ్‌ పూర్తిచేశారు. ఉపాధ్యాయురాలిగా ఆమె సాధిస్తున్న ఫలితాలను చూసి.. ఏడేళ్లకే ప్రభుత్వం నుంచి ఎయిడెడ్‌ గుర్తింపు వచ్చిందీ పాఠశాలకు. అయితే.. 1984లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన నాగమ్మ... 87 వరకు ఊట్కూర్ మండలం వల్లంపల్లి, ధన్వాడ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. అయితే.. పాత పాఠశాల విద్యార్థుల కోసం ఉద్యోగాన్ని వదిలేసి.. మళ్లీ దయానంద విద్యామందిర్‌కు వచ్చేశారు. ప్రస్తుతం సెకండరీగ్రేడ్ టీచర్ గా పాఠశాలలో కొనసాగుతున్నారు.

ఎన్నో అవార్డులు...
నాగమ్మకృషిని మెచ్చి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. 2009-10లో ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్ నుంచి.. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. 2011-12 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2012-13లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా.. 2013-14లో ఇందిరాగాంధీ సంయాత్ర సంస్థ వారి నుంచి.. గ్రాడ్యూయేటేడ్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. 2013లో సర్వేపల్లి రాధాకృష్ణ వాలంటీర్ ఆర్గనైజేషన్ వారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందించారు. ఇప్పుడు తాజాగా.. 2015-2016 విద్యా సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు నాగమ్మ. ఈ నెల 5న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతున్నారు.

ప్రతొక్కరికీ ఆదర్శం..
తమ టీచర్‌కు ఈ అవార్డు రావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నారు. విద్యా సుగంధాలను నలుగురికీ పంచేందుకు నాగమ్మ జీవితాన్నే ధారపోయడం ఎంతైనా ప్రశంసనీయం. వృత్తిపట్ల ఆమెకున్న నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆశిద్దాం..

Pages

Don't Miss

Subscribe to RSS - టీచర్లు