టీటీడీ

11:31 - October 24, 2018

తిరుమల : కలియుగ దైవం తిరుమల వెంకన్న సన్నిధి రాజకీయాలకు వేదిగా మారిపోతోంది. టీటీడీ బోర్ట్, ప్రభుత్వం, అర్చకుల మధ్య వెంకన్న నలిగిపోతున్నాడు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకన్న దేవాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. శ్రీ వెంకటేశ్వరుడి ఆస్తులకు, ఆభరణాలకు కొదవేలేదు. ఇప్పుడు అదే వివాదంగా మారింది. శ్రీనివాసుడు ఆస్తులు, ఆభరణాల విషయంలో ఎంతటి వివాదం రేగిందో తెలిసిన విషయమే. ఈ వివాదంలో ప్రధాన వ్యక్తి  శ్రీ వెంకటేశ్వరుని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.

టీటీడీ చరిత్రలో ఇలా మాజీ ప్రధానార్చకుడిపై పరువు నష్టం కేసు దాఖలు కావడం ఇదే తొలిసారి. దేవస్థానంలో మిరాశీ అర్చకులు, వంశపారంపర్య అర్చకుల పదవీ విరమణ వయసును నిర్దేశిస్తూ, టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తరువాత, పలువురు తమ అర్చకత్వ పదవులకు దూరంకాగా, వారిలో రమణ దీక్షితులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన టీటీడీ బోర్డుపైనా, అధికారుల తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు. 
స్వామివారి నగలు అన్యాక్రాంతం అవుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను అధికారులు మాయం చేశారని ఆరోపించారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన నగలను కాజేశారని, ఆలయంలోని నేల మాళిగల్లో ఉన్న అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు ఎవరికీ తెలియకుండా తవ్వకాలు జరిపించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పరమ పవిత్రమైన ఆలయం పరువు పోయిందని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రమణదీక్షితులపై టీటీడీ  రూ. 200 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది.  శ్రీవారి ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహించిన వ్యక్తపై పరువు నష్టం దావా వేయటం టీటీడీ చరిత్రలో తొలిసారి కావటం విశేషం. మరి దీనిపై రమణదీక్షితులు ఎలా స్పదిస్తారో వేచి చూడాలి.

08:40 - October 15, 2018

చిత్తూరు:కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు  తిలకించడానికి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో  భాగంగా 6వ  రోజు సోమవారం  మలయప్ప స్వామి ఉదయం 9 గంటలకు  హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించునున్నారు.  రామాయణంలో  హనుమంతుడి స్ధానం  చాలా ప్రముఖమైనది.  హనుమంతుని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. తిరుమలలో  సోమవారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది.  స్వామి వారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సర్వ, దివ్య దర్శనం భక్తులకు టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది. ఉచిత దర్శనానికి 20 గంటలు, సర్వ, దివ్య ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.  ఉదయం హనుమంతవాహానం పై  విహరించిన స్వామి వారు  సాయంత్రం పుష్పపల్లకిపై  ఊరేగనున్నారు. రాత్రికి  మలయప్ప స్వామి గజవాహనంపై  తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

08:46 - October 13, 2018

చిత్తూరు:తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నరాత్రి ముత్యాల పందిరిలో ఇరువురు  దేవేరులతో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు 4వ రోజు శనివారం  కల్పవృక్షవాహనం పై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఇప్పటికే అన్ని ప్రత్యేక సేవలను నిలిపివేసింది. తిరువీధులు భక్తకోటి గోవిందనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఈ రోజు రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించునున్నారు. తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు కల్పవృక్షం పై స్వామివారు భక్తులకు దర్శనం  ఇవ్వనున్నారు. 

 

07:49 - October 10, 2018

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ రాత్రి పెద్దశేష వాహన సేవతో పూర్తి స్థాయిలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం తిరువీధుల్లో బంగారు తిరుచ్చి ఉత్సవం, తరువాత రంగనాయకుల మండపంలో నవరాత్రి ఆస్థానం జరగనుంది. 
అంకురార్పణలో భాగంగా మంగళవారం సాయంత్రం సేనాధిపతి విష్వక్సేనుడిని  వసంతమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వేద పండితులు, అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా భూమిపూజ చేసి పుట్ట మట్టి సేకరించి ప్రదక్షిణంగా వచ్చి ఆలయ ప్రవేశం చేశారు. తిరువీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.   ఈ అంకురార్పణ ఘట్టం కోసం ముందుగా యాగశాలలో సీతారామలక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవుడు,అగందుడు,అనంతుడు, గరుడాళ్వార్, చక్రత్తాళ్వార్, విశ్వక్సేనులను వేంచేశారు. అంకురార్పణ నిర్వహించే  ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేశారు. తరువాత సోమరాజు మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తూ వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల మధ్య అంకురార్పణ జరిగింది. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడి విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ఏడు లక్షలకుపైగా లడ్డూలను సిద్ధం చేసింది. పాపవినాశనం రహదారి ముఖద్వారం సమీపంలో ఏర్పాటుచేసిన ఫల, పుష్ప, ఛాయాచిత్ర ప్రదర్శన భక్తుల మది దోచుకుంటోంది.
 

 

09:31 - October 4, 2018

తిరుమల.... వచ్చే జనవరిలో జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ  శుక్రవారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను జారీ చేస్తుంది. గురువారం ఉదయం 10 నుంచి 4 రోజులపాటు నమోదు చేసుకోవచ్చు. అనంతరం ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో భక్తులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలి. కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు సాధారణ విధానంలో వెంటనే టీటీడీ  వెబ్‌సైట్‌ నుంచి నమోదు చేసుకోవచ్చు. 

 

16:57 - October 3, 2018

హైదరాబాద్ : తమిళనాడు కు చెందిన  బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఉమ్మడి హైకోర్టులో టీటీడీ పై బుధవారం   పిటీషన్  దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని, దేవస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. టీటీడీ మీద ఇటీవల కాలంలో  వచ్చిన ఆరోపణలు దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. 65 ఏళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణను టీటీడీ బోర్డు అమలు చేసింది. దీంతో అప్పటి వరకు ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రమణ దీక్షితులు టీటీడీ మీద  పలు  సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి నగలు, ఆభరణాలు, వజ్రాలు మాయం అయ్యాయంటూ  ఆయన ఆరోపించారు. ఇది అప్పట్లో  పెను దుమారం రేపింది.
           టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం నుంచి తప్పించాలంటూ గతంలో సుబ్రమణ్య స్వామి  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిబంధనల ప్రకారమే దేవస్థానం బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుందని తెలిపింది. దీనిపై కావాలంటే హైకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో సుబ్రమణ్యస్వామి హైకోర్టు లో  బుధవారం  పిటీషన్ దాఖలు చేశారు. 
గతంలో శ్రీవారి ఆలయంపై పరిశోధన చేసేందుకు పురాతత్వ శాఖకు సహకరించాలంటూ కేంద్రం నుంచి వచ్చిన లేఖ పెనుదుమారం రేపింది. తిరుమల మీద కేంద్రం పెత్తనం చేసేందుకు రాష్ట్రం పరిధి నుంచి తప్పించే కుట్రలు చేస్తోందంటూ టీడీపీ ఆరోపించింది. అయితే, ఆ వివాదం సద్దుమణిగింది.

20:08 - September 20, 2018

హైదరాబాద్ : జనసేన పార్టీలోకి చేరేందుకు పలు పార్టీల నేతలు..మేధావులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ క‌ృష్ణమూర్తి కలిశారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌ను చదలవాడ కలిసినట్లుగా రాజకీయ వర్గాల సమాచారం.

 

16:19 - September 4, 2018

తిరుమల : శ్రీవారి ఆభరణాల విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. టీటీడీ ఆభరణాల గురించి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఏలూరు చెందిన ప్రముఖ సామాజిక వేత్త అయ్యంగార్. అన్ని స్థాయిల్లోను పోరాడిన అయ్యంగార్ చివరకు సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. అసలు శ్రీవారి ఆభరణాల గరించి ఆయన ఎందుకు పోరాటం చేస్తుంది అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తిరుమల ఆలయాలను చరిత్రాత్మక, జాతీయ వారసత్వ కట్టడాలుగా ప్రకటించడానికి తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ అనే వ్యక్తి తొలుత ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. తిరుమల ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1,500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సంరక్షించడం లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాల భద్రతపైనా అయ్యంగార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుమల కొండపై శ్రీవారి ప్రధాన ఆలయం మహాద్వారం ఎదురుగా ఉన్న 15 శతాబ్దం నాటి వెయ్యి కాళ్ల మండపాన్ని ఎలాంటి కారణం లేకుండానే 2003లో కూల్చివేశారని ఆక్షేపించారు. కీ.శ ఆరు ఏడు శతాబ్దాల నుండి శ్రీవారికి చారిత్రక వైభవం వుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ తన భాత్యతను పూర్తిగా విస్మరించిందటానికి శ్రీవారి నగల మాయం ఒక ఉదాహరణగా చెప్పవచ్చని అయ్యంగార్ అభిప్రాయపడ్డారు. తిరుమల ఆలయంలో గోడలపై చెక్కిన శాసనాల ఆధారంగా శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన అనేక ఆభరణాలకు సంబంధించి ఆధారాలు లభించాయని 2011లోనే కేంద్ర పురావస్తు శాఖకు చెందిన 20మంది అధికారుల బృందం తేల్చి చెప్పిందని అయ్యంగార్ గుర్తు చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు ఎనిమిది సార్లు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు ఏఏ అభరణాలకు సమర్పించారో..ఎన్ని ఇచ్చారు. అవి ఎంత బరువు వున్నాయి? ఆ నగలలో వున్న రత్నాల విషయంలో కూడా అధికారుల తనిఖీలలో సరిపోలలేదని కూడా పురావస్తు శాఖ బృందం నివేదికలో వెల్లడయ్యిందని అయ్యంగార్ తెలిపారు. ఏది ఏమైనా శ్రీవారి ఆభరణాల లెక్కలు తేలేవరకు తన పోరాటం కొనసాగుతుందని అయ్యంగార్ తేల్చి చెప్పారు. 

15:57 - August 24, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఆగమశాస్త్రయుక్తంగా రూపొందించిన ఆలయ నమూనాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. కృష్ణానది అభిముఖంగా 25 ఎకరాల్లో టీటీడీ దివ్యధామం నిర్మిస్తారు. ఇందుకు 140 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈనెల 29న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తి రాతికట్టడంగా ఆలయ నిర్మాణం చేపడతారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి రెండేళ్లు పడుతుంది. 

21:43 - July 17, 2018

చిత్తూరు : మహాసంప్రోక్షణ కోసం శ్రీవారి ఆలయం మూసేయాలన్న నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రోక్షణ కోసం 8రోజులపాటు భక్తులకు అనుమతి లేదన్న టీటీడీ నిర్ణయంపై భక్తుల్లో విమర్శలు తలెత్తడంతో.. మరోసారి సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ... గతంలో మాదిరిగానే మహాసంప్రోక్షణ చేపడతామని అధికారులు ప్రకటించారు. 

మహా సంప్రోక్షణ సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎనిమిది రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని టీటీడీ ఇదివరకే తీసుకున్న  నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మహాసంప్రోక్షణ నిర్వహించాలని టీటీడీ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో పునరాలోచనలో పడ్డ టీటీడీ.. భక్తులకు అనుమతి విషయంలో వెనక్కి తగ్గింది.

తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై  హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులతోపాటు భక్తుల్లోనూ  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీటీడీ చైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకమైనప్పటినుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటున్నారని  వైసీపీ విమర్శించింది.  ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం.. మహాసంప్రోక్షణకు గతంలో పాటించిన నియమాలనే పాటించాలని టీటీడీని ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఉంచాలనే నిర్ణయానికి టీటీడీ వచ్చింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అందుబాటులో ఉన్న సమయంలో దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లు తెలిపారు. ఇకనైనా సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. ఈనెల 24 న జరగనున్న పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు టీటీడీ అధికారులు. అదేవిధంగా భక్తుల నుంచి సూచనలు, సలహాలు కూడా  స్వీకరిస్తామని అన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - టీటీడీ