టీడీపీ

12:59 - October 18, 2017

హైదరాబాద్‌ : నగరంలో రేవంత్‌రెడ్డిని కంభంపాటి రామ్మోహన్‌ కలిశారు. రేవంత్‌ పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధినేతతో చర్చించాలని రేవంత్‌కు సూచించారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని... రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నారు. సమస్య ఎలాంటిదైనా చర్చించుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:20 - October 17, 2017

గుంటూరు : బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌ బీసీ నేతలతో నిర్వహించిన సమావేశంపై బాబు స్పందించారు. మొదటి నుంచి బీసీల సంక్షేమానికి పాటుపడింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. జగన్‌ చెప్పే మాటలను బీసీలు విశ్వసించరని చంద్రబాబు చెబుతున్నారు. 

 

07:17 - October 17, 2017

కర్నూలు : ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్రకు ముందే వైసీపీకి  తెలుగుదేశం పార్టీ గట్టి షాక్ ఇస్తోంది. ఆ పార్టీ నేతలను సైకిల్ ఎక్కించుకునేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుమానం ఉన్న నేతలపై వైసీపీ అధినేత జగన్ ఆరా తీసినట్లు సమాచారం.
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌  
వైసీపీ అధినేత జగన్‌ తలపెట్టిన పాదయాత్రకు దీటుగా తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ కు మళ్లీ తెర తీసింది. 2014 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ టికెట్‌ పై గెలిచిన బుట్టా రేణుకను టీడీపీలో చేర్చుకోనున్నారు.  
2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ దక్కదన్న సంకేతాలు 
బుట్టా రేణుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున  మరోసారి కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి  పోటీ చేసే  అవకాశం దక్కదన్న సంకేతాల రేణుకకు అందాయి. ఈ కారణంతోనే  అధికార పార్టీ గూటికి చేరుతున్నారన్న ప్రచారం పార్టీలో సాగుతోంది. 
ఈసారి సైకిల్‌ ఎక్కనున్న రాయలసీమ వైసీపీ నేతలు 
టీడీపీ మరోసారి మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో  ఎంతమంది  నేతలు అధికార పార్టీ గూటికి చేరతారోనన్న  ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈసారి  రాయలసీమ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో ఇలాంటి వారిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు టీడీపీ పావులు కదపడం వైసీపీలో చర్చనీయంశంగా మారింది. పార్టీ ఫిరాయింపుల అంశం ఏపీ రాజకీయాల్లో  ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

 

09:29 - October 16, 2017

కర్నూలు : జగన్‌ పాదయాత్రకు ముందే వైసీపీకి గట్టి షాక్‌ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుకను టీడీపీలో చేర్చుకోవాలని డిసైడ్‌ అయ్యింది. బుట్టా రేణుక మంగళవారం టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె భర్త నీలకంఠం టీడీపీలో చేరగా... బుట్టా రేణుక వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే... వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకకు కర్నూలు ఎంపీ సీటుపై వైసీపీ స్పష్టత ఇవ్వకపోవడం... ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ ప్రతిపాదించడంతో ఆమె టీడీపీలో చేరాలని భావిస్తున్నారు. 

18:51 - October 14, 2017

నెల్లూరు : తెలుగుదేశంకు మంచిరోజులు నడుస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బాబు పాలనలో కరవు రావాలని కోరుకున్న ప్రతిపక్ష పార్టీ ఆశలపై నీళ్లు కురిసాయని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. వర్షాలు పడొద్దని విపక్షం కోరుతుందన్నారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి...కరవు సీమలో సైతం జలాల గలగలలు పారుతున్నాయన్నారు. రాయలసీమతో సహా అన్ని చోట్ల కరువు తీరా వర్షాలు పడ్డాయని తెలిపారు.

 

12:00 - October 10, 2017

 

గుంటూరు : అమరావతిలో టీడీపీ సమన్వయ భేటీ ప్రారంభమైంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై పార్టీ నేతలు చర్చించనున్నారు. అటు ఈ మధ్యాహ్నం 3గంటలకు కేబినెట్‌ సమావేశం కూడా జరగనుంది. వివిధసంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం చర్చించనుంది. దాంతోపాటు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలతోపాటు చక్రపాణి కమిటీ నివేదికపై కూడా కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. 

07:29 - October 10, 2017

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో ఇసుక విషయంలో తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎంపీ గల్లా జయదేవ్‌ వర్గం పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. తుళ్లూరు మండలంలోని అన్ని క్వారీలను ఎమ్మెల్యే తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. మొన్నటి వరకు అంతర్గతంగానే ప్రత్యారోపణలు , కుమ్ములాడుకున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు బాహాబాహీకి దిగాయి. రాయపూడి ఇసుక రీచ్‌లో ఇరువర్గాలు గొడవకు దిగాయి. సీఎం నివాసం, ఏపీ పరిపాలన కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఇది జరిగింది.

ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ ఇష్టారాజ్యంగా
ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఎంపీ జయదేవ్‌ వర్గం ఆరోపిస్తోంది. రాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు భారీగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఉంటూకూడా తమ ఇళ్లు నిర్మించుకోవడానికి ఇసుకను తీసుకెళ్లనివ్వకుండా ఎమ్మెల్యేవర్గం అడ్డుకుంటోందని మండిపడ్డారు. వాస్తవానికి ఏపీ రాజధాని ప్రాంతంలో మొత్తంగా 6 ఇసుక క్వారీలు ఉన్నాయి. భవిష్యత్‌ రాజధాని అవసరాలకు ఇక్కడి ఇసుకను ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాజధాని అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన ఇసుక కాస్తా బయటి ప్రాంతాలకు తరలిపోతోంది. 5 క్వారీలను ఎమ్మెల్యే అనుచరులే నడుపుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు.

తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత ఇసుకలోనూ తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. రీచ్‌లపై ఆధిపత్యం కోసం ఒకవర్గంపై మరోవర్గం గొడవకు దిగుతోంది. ఇలా బహిరంగంగానే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగుతున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను వేల రూపాయలకు విక్రయిస్తున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదు. దీంతో సర్కార్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

19:23 - October 7, 2017

గుంటూరు : పార్టీని పట్టాలెక్కించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.... టీడీపీ మైండ్‌ గేమ్‌కు తెరతీసింది. రాయలసీమ నేతలే టార్గెట్‌గా ముందుకు కదులుతోంది. టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందో? వైసీపీ ఎక్కడ బలంగా ఉందో..? చూసుకుని మరీ ఆ ప్రాంతంపైనే టీడీపీ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను ... పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

పార్టీలో చేర్చేందుకు కసరత్తు
ఈ క్రమంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి... కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గుర్నాథ్‌రెడ్డితో.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.... బుట్టా రేణుకతో.. ఎంపీ సీఎం రమేశ్‌ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి శైలజానాథ్‌, కర్నూలు జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.

టీడీపీలోకి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
వీరితో పాటు.. మాజీ సీఎం కోట్ల కుటుంబ సభ్యులతో కూడా సీనియర్‌ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి.. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. అలాగే మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి... చిత్తూరు జిల్లాలో . మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌ రెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా.. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా లైన్‌ క్లియర్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చేరికలకు సంబంధించి ఇప్పుడే బయటపెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం సుముఖంగా లేదనేది సమాచారం. జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టాక... వైసీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఆపరేషన్‌ రాయలసీమ బాధ్యతలను మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డిలతో పాటు ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేశ్‌లకు పార్టీ అధినాయకత్వం అప్పజెప్పినట్టు సమాచారం.

 

19:19 - October 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం, తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా 32 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లాలని తెలపడంతో.. తుందుర్రు గ్రామానికి వెళ్ళడానికి రామాంజనేయులు ఏర్పాట్లు చేశారు. పనిలో పనిగా అధికారులు కూడా గ్రామంలో నిర్మించిన రోడ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసి.. శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కానీ తెల్లవారే సరికి గ్రామస్తులు శిలాఫలకాన్ని కూల్చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. 

17:45 - October 7, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై... టీడీపీ నేత రేవంత్‌రెడ్డి... మండిపడ్డారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఊడిపోతే.. సురభి నాటకాల్లో నటించడానికి అన్ని రకాల అర్హతలున్నాయని.. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు. తెలంగాణలో టీడీపీనే లేదంటూ... కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీటు కోసం కొడుకు పేరునే మార్చుకున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - టీడీపీ