టీసర్కార్

19:58 - June 23, 2017

హైదరాబాద్ : చేనేతల అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు తీసుకురాబోతుంది తెలంగాణ సర్కార్‌. చేనేత కార్మికుల కోసం నూతన పొదుపు పథకాన్ని రేపు పోచంపల్లిలో ప్రారంభించబోతుంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులతో పాటు.. పవర్‌లూమ్‌ కార్మికులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెలంగాణలోని నేతన్నల కోసం నూతన పొదుపు పథకాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రారంభించబోతుంది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. చేనేత జౌళిశాఖ అధికారుల సమీక్ష సమావేశంలో కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. 
రేపు పోచంపల్లిలో ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌ 
గతంలో ఉన్న పథకాన్ని పూర్తిగా మార్చి నేతన్నలకు అత్యధిక ప్రయోజనాలు కలిగేలా దీన్ని రూపొందించినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా కార్మికుల వేతనాల్లో పొదుపు చేసుకునే మ్యాచింగ్‌ గ్రాంటు 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతామన్నారు. ఇక పవర్‌లూమ్‌ కార్మికులకు పొదుపునకు 8 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ థ్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా నేతన్నలకు ఆర్థిక భరోసాతో పాటు.. సామాజిక భద్రత కల్పించేందుకు ఉపయోగపడుతుంది. నేత కార్మికులకు భవిష్యత్‌ అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కో ఆపరేటివ్‌ సొసైటీల పరిధిలో పని చేస్తున్నవారితో పాటు.. సొంతంగా పని చేస్తున్న కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి నేత కార్మికుడు ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉంది. శనివారం మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

08:30 - May 7, 2017

హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. విద్యుత్‌శాఖలో ఖాళీగా ఉన్న 13,357 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించిన రెండు రోజులకే ఉత్తర్వులు వెలువడడం విశేషం. మరోవైపు ఎంతోకాలంగా ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ జీవోతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

08:28 - May 4, 2017

హైదరాబాద్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో..లబ్ధిదారుల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. అనుకున్న టార్గెట్‌లోగా ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో పురోగ‌తి, రాజీవ్ స్వగృహ, హౌజింగ్ బోర్డుపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో విభాగాల వారీగా అధికారులు పవ‌ర్ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా మంత్రికి వివ‌రించారు.
ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వ‌స్తున్నార‌న్న ఇంద్రకరణ్ రెడ్డి  
డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మించేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు వ‌స్తున్నార‌ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 94,250 ఇళ్ల నిర్మాణానికి పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తులు వ‌చ్చాయ‌ని..వాటిలో 83,087 ఇళ్లకు టెండ‌ర్లు పిలవ‌గా 41,925 ఇళ్లకు టెండ‌ర్లు ఖరారైన‌ట్లు అధికారులు చెప్పారు. వీటిలో 20,986 డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగుతున్నాయ‌ని..1629 ఇళ్లు పూర్తయినట్లు వివ‌రించారు. ఇప్పటివరకు రెండు పడకగదుల నిర్మాణానికి 202.85 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. టెండ‌ర్లు ఖరారైన చోట్ల ల‌బ్ధిదారుల ఎంపిక‌ను త్వరితగతిన పూర్తి చేసి, జాబితాను త‌యారు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 
94,250 ఇళ్ల నిర్మాణానికి పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తులు 
50,959 డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మొద‌ట విడ‌త‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద 190.66 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.ఈ స‌మీక్ష స‌మావేశంలో గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామ‌చంద్రన్‌తో పాటు హౌజింగ్ కార్పొరేష‌న్ సీఈ స‌త్యమూర్తి, ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

21:56 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ చట్ట సవరణ బిల్లును, రాష్ట్ర ఉభయ సభలు మూజువాణి ఓటుతో ఆమోదించాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన సవరణలను ప్రతిపాదిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇంతకీ కేంద్రం ఏఏ అంశాలపై సవరణలను సూచించింది. తెలంగాణ సర్కారు ఎలాంటి మార్పులు చేసింది..?
మూజువాణి ఓటుతో ఆమోదం
భూసేకరణ చట్ట సవరణ బిల్లును, తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. గతంలో ఆమోదించిన బిల్లుకు.. కేంద్రం నాలుగు సవరణలను సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సవరణలన్నింటినీ చేర్చుతూ కొత్త బిల్లును అసెంబ్లీ ముందుకు తెచ్చింది.
రాష్ట్ర భూసేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచే అమలు
ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, భూసేకరణ చట్టం 2014 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, అదేసమయంలో, అధికారిక గెజిట్‌ వెలువడిన తేదీ నుంచి చట్టం అమలవుతుందంటూ బిల్లులోని 3వ క్లాజ్‌లో పేర్కొన్నారు. ఈ రెండింటి మధ్య అయోమయాన్ని నివారించేందుకు, 3వ క్లాజ్‌ను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. 
క్లాజ్‌ అనవసరమన్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013 ప్రకారం, నోటిఫికేషన్‌కు ముందే ఆయా జిల్లాల కలెక్టర్లు భూమి ధరను రివైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం 2016 ప్రకారం, భూమి ధరను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా, పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ క్లాజ్‌ అనవసరమని తేల్చి చెప్పింది. దీంతో, కేసీఆర్‌ సర్కారు, ఈ క్లాజ్‌ను తొలగించింది.
వ్యక్తిగత ప్రయోజనాలకు విఘాతం కలగరాదన్న కేంద్రం
భూసేకరణ బిల్లులోని 7, 8 క్లాజులలో మార్పులు చేయాలని కేంద్రం సూచించింది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకూ విఘాతం కలగకూడదని కేంద్రం స్పష్టం చేసింది. 2013 చట్టంతో పోలిస్తే, పరిహారం అందే కుటుంబాలకు అన్యాయం జరగకుండా, పునరావాసం కోసం చెల్లించే పరిహారంలో పెద్దగా వ్యత్యాసం రాకుండా చూడాలని కేంద్రం సూచించింది. భూసేకరణ పరిధిలోకి వచ్చే కుటుంబాల జాబితాలో.. వ్యవసాయాధారిత కూలీలు కూడా ఉంటారు కాబట్టి, వారికీ పరిహారం చెల్లిస్తామని బిల్లులో పేర్కొన్నామని ప్రభుత్వం పేర్కొంది. 
పార్లమెంటు ఆమోదం అనవసరం.. ప్రభుత్వ అనుమతి చాలు
అత్యవసరం అనుకునే పనుల కోసం జిల్లాల కలెక్టర్లు అవార్డు పాస్‌ చేసి భూసేకరణ జరపవచ్చని, దీనికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదని, ప్రభుత్వ అనుమతి ఉంటే సరిపోతుందని కేంద్రం ప్రతిపాదించిన 2013 భూసేకరణ చట్టం చెబుతోంది. ఈ చట్టం కల్పించిన వెసులుబాటునే 2016 భూసేకరణ బిల్లులో ప్రతిపాదించామని, అయినా, కేంద్రం సూచన మేరకు క్లాజ్‌ 10ని తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తానికి కేంద్రం చేసిన సూచనల మేరకే భూసేకరణ చట్టం -2016కు అన్ని మార్పులూ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. విపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసి, ఏకపక్షంగా బిల్లును ఆమోదింప చేసుకోవడం విమర్శలకు కారణమవుతోంది. 
        

 

16:34 - April 30, 2017

హైదరాబాద్ : బిల్లుపై చర్చ జరగాల్సిన అవసరముందని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని.. తాము ముందే చెప్పినట్లు జానారెడ్డి చెప్పారు. సభలో మాట్లాడటానికి సమయమివ్వలేదని మండిపడ్డారు. ఆదివారం సభ పెట్టాల్సిన అవసరమేముందని జానారెడ్డి ప్రశ్నించారు. 
రైతు సమస్యలపై చర్చించని సభ ఎందుకు : ఉత్తమ్‌
రైతు సమస్యలపై చర్చించని సభ ఎందుకు అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. అన్యాయంగా రైతులపై కేసులు పెడుతున్నారని.. వారి ఆందోళనకు రాజకీయాన్ని ఆపాదించడం దారుణమని మండిపడ్డారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మిర్చి కొనుగోలు కోసం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌గా ప్రభుత్వం 1000 కోట్లు ప్రకటించాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
రైతులను బేషరతుగా విడుదల చేయాలి : మల్లు భట్టివిక్రమార్క   
ఖమ్మం మార్కెట్‌ యార్డులో మిర్చి రైతుల ఆందోళనను రౌడీల దాడిగా పోల్చడాన్ని మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. అరెస్ట్ చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు.    

 

16:56 - April 29, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో లుచ్చాలు, లఫంగుల పరిపాలన సాగుతోందని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీసర్కార్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందన్నారు. అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ లో 144 సెక్షన్ విధించడమేంటని ప్రశ్నించారు. టీసర్కార్ కు బుద్ధి చెప్పేందుకు, తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని.. ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రేపు అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపైనే చర్చిస్తామని ఉత్తమ్ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:41 - April 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ నుంచి సారా మహమ్మారిని తరిమికొట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏటా ఎన్నో కుటుంబాలకు అన్నం లేకుండా చేస్తున్న ఈ రక్కసి నుంచి ప్రజలకు రక్షించేందుకు నడుం బిగించింది. తెలంగాణ నుంచి గుడుంబాను సమూలంగా దూరంచేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2 నాటికి సారా రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
ఎన్నో ప్రాణాలను కబళిస్తోన్న సారా  
గుడుంబా... సారా.. పేరు ఏదైనా ఈ మహమ్మారి ఏటా ఎన్నో ప్రణాలను కబళిస్తోంది. గ్రామాలు, తండాల్లో గుండా జాఢ్యం మరీ ఎక్కువ. ఈ రక్కసి కోరల్లో చిక్కుకుని ఎన్నో కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పుడు ఏ కోరలను పీకేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
కూలి పైసలు గుడుంబాకు తగలేస్తున్న మద్యంప్రియులు
పురుషుల గుడుంబా అవాటులో మహిళలు పడుతున్న కష్టా ఇన్నీ అన్నీకాదు. కూలో, నాలో చేసుకుని సంపాదించే కొద్దిపాటి పైసలను పురుషులు గుడుంబాకు తగలేస్తుంటే, కుటుంబ సభ్యులు పస్తులు ఉండాల్సి వస్తోంది. సారా వ్యసనాన్ని మాన్పించేందుకు ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా ఫలితాలు రాకపోవడంతో, తెలంగాణ నుంచి గుడుంబాను దూరంచేసి, సారా రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. 
ప్రత్యామ్నాయ ఉపాధి హామీతో గుడుంబా తయారీకి దూరం 
హైదరాబాద్‌ పాతబస్తీ దూల్‌పేటలోని పేద కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా గుడుంబా తయారు చేసి, జీవనోపాధి పొందేవి. వీరితో ఈ వృత్తి మాన్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న హామీతో ఈ జాఢ్యాన్ని దూరంచేసింది. ఇప్పుడు ఇదే పద్ధతిని రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. గుడుంబా తయారీదారులతోపాటు, అమ్మేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు బడ్జెట్‌లో 157.75 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఎక్సైజ్‌ సిబ్బందితో  సారా బట్టీలను గుర్తించి, వీరికి నయానో, భయానో నచ్చచెప్పి ఈ వృత్తిని మాన్పించేందుకు చర్యలు చేపట్టింది. 
ప్రత్యామ్నాయ ఉపాధికి ఒక్కొక్కరి రూ. 2 లక్షల సాయం 
తెలంగాణలో గుడుంబా తయారుచేసి, అమ్మేవారు వేలాది మంది ఉన్నట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. మొత్తం 7,886 మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 2,404 మంది ఎస్టీలు, 1686 మంది ఎస్సీలు ఉన్నారు. అలాగే  3,630 మంది బీసీలు, 165 మంది మైనారిటీలు ఉన్నట్టు ఎక్సైజ్‌ శాఖ లెక్కలు తేల్చింది. గుడుంబా తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల వంతున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై సారా తయారీదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
సారా రహిత రాష్ట్రంగా ప్రకటించాలని ప్రభుత్వం లక్ష్యం 
రాష్ట్రావతరణ దినోత్సవం దినోత్సవం వచ్చే జూన్‌ 2వ తేదీ నాటికి తెలంగాణను సారా రహిత రాష్ట్రంగా ప్రకటించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా  మహిళాలోకం అభిమానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో గుడుంబా లేకుండా చేస్తే రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందన్న భావంతో టీఆర్‌ఎస్‌ సర్కారు ఉంది. ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. 

 

19:35 - April 28, 2017

హైదరాబాద్ : సవరణల పేరుతో 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భూనిర్వాసితుల పోరాట కమిటీ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు అత్యంత లోపభూయిష్టంగా  ఉన్నాయన్నారు. భూసేకరణ చట్టంలో మార్పుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కమిటీ నేతలు విమర్శించారు. 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  

 

17:10 - April 28, 2017

సూర్యపేట : కేసీఆర్ మూడేళ్లపాటు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల కోసం రైతు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదన్నారు. టీఆర్ ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. టీసర్కార్ ఘోర ఓటమి చూడబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఒకేసారి రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 

 

07:33 - April 21, 2017

హైదరాబాద్ : ధాన్యం సేకరణను ఇకపై ప్రతిరోజు సమీక్షించాలని మంత్రి హరీష్‌రావు జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన హరీష్‌రావు... ధాన్యం క్రయ, విక్రయాలపై మీడియాలో వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను హరీష్‌రావు ఆదేశించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని.. తేమ శాతం 17లోపు ఉండేలా రైతులలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐకేపీల ద్వారా ప్రచారం చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయొచ్చని.. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్టం చేయాలని హరీష్‌రావు సూచించారు.
ధాన్యం కేంద్రాలలో ముందు జాగ్రత్త చర్యలు..
వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కేంద్రాలలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు హరీష్‌రావు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోళ్ల తర్వాత రైతులకు చెల్లింపులు 48 గంటల్లోనే జరిగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు, క్రయ విక్రయాల్లో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలన్నారు. ఏ రోజుకారోజు మార్కెట్‌ నుంచి ధాన్యం మిల్లులకు, గోడౌన్లకు తరలించాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణా కోసం అవసరమైతే రవాణాశాఖను సంప్రదించి లారీల కోసం ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని హరీష్‌రావు సూచించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - టీసర్కార్