టీ.సర్కార్‌

08:13 - August 10, 2018

హైదరాబాద్ : ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా ఉన్నామని కలరింగ్‌ ఇచ్చిన గులాబీ పార్టీ.... ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. గతంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నా.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని గులాబీపార్టీ చెప్పకనే చెబుతోంది. రాజకీయంగా కూడా బీజేపీతో ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి అనుకూలంగా టీఆర్ ఎస్ 
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ దోస్తీ కడుతుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్‌ పలు సందర్భాల్లో సమర్ధించారు.  ఇప్పుడు రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా... ఫ్రంట్‌ కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. కానీ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి  కేసీఆర్‌ పరోక్షంగా మద్దతిస్తూ .. తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో మరింత ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో ఉన్న నేతకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతునిచ్చింది. ఎన్నికల్లో పాల్గొని ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటేశారు.  అయితే ఇందుకు కొత్త కథ చెబుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతోనే తాము మద్దతు ఇచ్చామన్న వాదనను అధికారపార్టీ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే తరపున అభ్యర్థియే కదాని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
ఒకవైపు బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది.  అంతేకాదు... తెలంగాణలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ టూర్‌ను అడ్డుకునేందుకు గులాబీపార్టీ అనుబంధ విభాగాలు సిద్ధమవుతున్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఓయూలో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌వీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు యూనివర్సిటీలు వేదికలు కాబోవని టీఆర్‌ఎస్‌వి నేతలు అంటున్నారు.  శనివారం ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌వీ నిర్ణయించింది. మొత్తానికి  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో  టీఆర్‌ఎస్‌ విభేదిస్తూనే... బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో ఉంది.

 

20:21 - March 11, 2018

హైదరాబాద్ : పంటలకు  పెట్టుబడి ఇస్తామంటూ ఊరిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రైతులను మోసం చేస్తోందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 4వేలు, 8వేలు నగదు ఇస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగవన్నారు. పంటలకు గిట్టుబాటుధరలు కల్పించనంతవరకు రైతులకు మేలు జరగదన్నారు. మిర్చి రైతులకు క్వింటాలుకు 10వేల రూపాయలు దక్కాల్సి ఉండగా 2నుంచి 3వేలకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. క్వింటా మిర్చిపైనే 8వేల రూపాయల వరకు నష్టపోతున్న రైతులు... ఎకరా పంటమీద దాదాపుగా రెండులక్షల రూపాయల వరకు దోపిడీకి గురువుతన్నారని తమ్మినేని అన్నారు.  గిట్టుబాటుధరలు కల్పించడానికి ప్రయత్నించని కేసీఆర్‌ ప్రభుత్వం .. 4వేల రూపాయల పంటపెట్టుబడి ఇస్తామంటోందని తమ్మినేని విమర్శించారు. 

 

07:14 - December 29, 2017

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ నాలుగో దశ పనుల నిర్వహణకు సర్కార్‌ సిద్ధమైంది. నాలుగో ఫేజ్‌లో  ఐదు వేలకు పైగా.. చెరువుల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా  ఈ చెరువులకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కూడా టార్గెట్‌గా పెట్టుకుంది. మిషన్‌ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో ఉన్న సుమారు 46 వేల చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం పూనుకుంది.  ఇందుకోసం దఫదఫాలుగా పనులను నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటి వరకూ మూడు ఫేజ్‌లను పూర్తి చేసిన ప్రభుత్వం.. జనవరి నుంచి నాలుగోఫేజ్‌ పనులను ప్రారంభించనుంది. 
మూడు ఫేజ్‌లలో 23 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ
ఇప్పటి వరకూ జరిగిన మూడు ఫేజ్‌లలో 23 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక నాలుగో  ఫేజ్‌ కింద 5 వేల ఏడు వందల మూడు చెరువుల పునరుద్ధరణ చేయనున్నారు. ఇందు కోసం ఈ నెలాఖరులోగా  పరిపాలనాపరమైన అనుమతి పొందాలని ప్రభుత్వం.. ఇరిగేషన్ శాఖ అధికారులను  ఆదేశించింది. ఈ ఫేజ్‌లో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందించనుంది.  అలాగే చెరువుల్లోని పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలని సూచించింది.   పూడికలో ఉండే పోషకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరింది. 
అందుతున్న మిషన్ కాకతీయ ఫలాలు
ఇక మిషన్‌ కాకతీయ వల్ల ఫలాలు అందుతున్నట్టుగా కూడా  ప్రభుత్వం ప్రకటించింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో పలు మండలాల్లో గ్రౌండ్‌ వాటర్ పెరిగినట్టుగా ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు పది మీటర్ల మేర భూగర్భ జలాలుపైకి వచ్చినట్టుగా తెలిపారు. అలాగే మిషన్‌ కాకతీయ ప్రభావాలపై అధ్యయనం చేసిన నాబ్‌కాన్‌ సంస్థ పూడిక మట్టి వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గినట్టు తెలిపిందని.. అధికారులు చెబుతున్నారు.  వరి, కందులు, పత్తి తదితర పంటలు దిగుబడి రెండు నుంచి ఐదు క్వింటాళ్లు పెరిగినట్టు ప్రభుత్వానికి నివేదించిందని అధికారులు చెబతున్నారు. అయితే  చెరువు పనుల్లో కాంట్రాక్టర్లు సరిగా  పని చేయడం లేదనే.. చర్చ కూడా జరుగుతోంది. దీంతో పనుల్లో ఆలస్యంగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.  

 

06:52 - November 21, 2017

హైదరాబాద్ : తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఏర్పాట్లపై సాహితీవేత్తలతో సమావేశమైన కేసీఆర్‌... సలహాలు, సూచనలు స్వీకరించారు. సాహితీమూర్తుల ప్రతిభా పాటవాలు ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలుగు మహాసభలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యే విధంగా... తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా... అత్యంత జనరంజకంగా... భాగ్యనగరం భాసిల్లేలా... స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పలువురు సాహితీవేత్తలతో చర్చించిన కేసీఆర్‌.. వారి నుంచి అనేక సలహాలు, సూచనలు తీసుకున్నారు. 

తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాహిత్య సృజన జరిగిందని... తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు తెలంగాణలో ఉన్నారన్నారు సీఎం. తెలంగాణలో ప్రతిభా పాటవాలకు కొదవలేదు... కానీ వారి ప్రతిభ రావాల్సినంతగా వెలుగులోకి రాలేదన్నారు. భాషాభివృద్ధి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలని... ఎవరినో నిందించడానికి కాకుండా, తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా చాటుకునేలా సభల నిర్వహణ ఉండాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అన్ని భాషా ప్ర్రక్రియలపై ప్రత్యేక కార్యక్రమాలుండాలని.... చిత్ర లేఖనంతో పాటు ఇతర కళలకు ప్రాధాన్యత ఉండాలన్నారు. మన ప్రతిభ, గొప్పతనం వెలుగులోకి రావాలని... అముద్రిత గ్రంథాలను ముద్రించాలన్నారు కేసీఆర్‌.

అత్యంత అట్టహాసంగా, కోలాహలంగా మహాసభలు జరగాలన్నారు కేసీఆర్‌. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలన్నారు. తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించాలని.... భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల ఏర్పాట్లుండాలన్నారు. వచ్చిన అతిథులకు మంచి వసతి, భోజనం కల్పించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలని.... నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి, ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలని సీఎం సూచించారు.

16:04 - October 16, 2017

హైదరాబాద్ : కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ సర్కార్‌ కదిలింది. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టింది. రేపు కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కాలేజీల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెలవు రోజుల్లో తల్లిదండ్రులను కలిసేందుకు పిల్లలకు అవకాశం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:18 - October 6, 2017

హైదరాబాద్ : హడావిడికి బ్రేక్‌ పడింది. అడ్డదారులు సరికాదని తెలంగాణ సర్కార్‌కు మరోమారు తెలిసొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అనుమతుల్లేకుండా ప్రాజెక్టు ఎలా కడతారంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సీరియస్‌ అయింది. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంతా ప్రతిపక్షాల తప్పదమే అన్నట్టు మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి. 
టీ.సర్కార్‌ దూకుడుకు బ్రేక్‌ 
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో చుక్కెదురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ స్టే యిచ్చింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై హడావిడి చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దూకుడుకు బ్రేక్‌ పడినట్టైంది. అటవీ, పర్యావరణ అనుమతులు లభించే వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితుడు  హయ్యత్‌ ఉద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా  నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
కాళేశ్వరం పనులను ఆపాలంటూ స్టే 
కాళేశ్వరం పనులను వెంటనే ఆపాలంటూ స్టే ఇచ్చింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాల్సిందేని స్పష్టం చేసింది. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులను 3 రోజుల పాటు నిలపుదల చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సైతం ఎన్ జీటీ తోసిపుచ్చింది. అటవీ, పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వుల్లో మార్పులు కోరాలని  తెలంగాణ సర్కార్‌కు సూచించింది.
ఎన్ జీటీ ఆదేశాలపై సుప్రీంకు వెళతామన్న టీ సర్కార్‌
ఎన్ జీటీ ఆదేశాలపై  తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని నిర్ణయించింది. కాళేశ్వరంపై ఎన్ జీటీ ఆదేశాలు తాత్కాలిక అడ్డంకేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో  ప్రాజెక్టు పనులు ఆగిపోనున్నాయని.. హస్తంపార్టికి ఇపుడు ఆనందంగా ఉందా అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 
ఎన్‌జీటీ ముందు దెబ్బతిన్న టీ సర్కార్‌ 
పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం .. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ముందు ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం తన తప్పిదాన్ని ప్రతిపక్షాల మీద నెట్టడం సరికాదని విపక్షపార్టీలు అంటున్నాయి. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

 

16:48 - September 26, 2017


హైదరాబాద్ : రైతు సమన్వయ సమితులు వివాదానికి దారితీస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.  వివిధ స్థాయిల్లో కమిటీల పదవులపై ఆచితూచి వ్యవహరిస్తోంది.  గ్రామం  నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు కట్టబెట్టడంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎక్కడా వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దంటూ పార్టీ నేతలకు గులాబీబాస్‌ ఆదేశాలు జారిచేసినట్టు తెలుస్తోంది.

గ్రామస్థాయిలో   ఏర్పాటు చేస్తున్న  రైతు సమన్వయ సమితులపై విపక్షాలు విమర్శలు సంధిస్తుండటంతో సీఎం కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జిల్లా,రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటులో వివాదాలకు తావులేకుండా చూడాలని పార్టీనేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.  మరోవైపు విపక్షాలు న్యాయపోరాటానికి కూడా సిద్ధం కావడంతో  ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుకమిటీల నియామకాన్ని పూర్తి చేసేందుకు  ప్రణాళికలను రచిస్తోంది. 

రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం గులాబీపార్టీలో జోరుగా సాగుతోంది. ఇక జిల్లా కమిటీలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. జిల్లా కమిటీల్లో  24 మంది సభ్యులు, రాష్ట్ర కమిటీల్లో 42 మంది సభ్యుల నియమాకం జరుగాల్సి ఉంది.  పూర్తి స్థాయి వివరాలు  సేకరించిన తర్వాతే జిల్లా రైతుసమితుల నియామకం చేయాలన్న అభిప్రాయంతో  ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే   రైతు సమితుల ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోందని పార్టీవర్గాలు  అంటున్నాయి.  

న్యాయపరమైన చిక్కులు ఎదురు కారాదన్న అభిప్రాయంతో సిఎం ఉన్నట్టు సమాచారం. దీనికి అనుగుణంగానే  కమిటీల నియామకంలో మార్పులు చేసే అవకాశం ఉందని గులాబీపార్టీనేతలు చెప్పుకుంటున్నారు. అవసరమైతే  ఇప్పటికే కమిటీల్లో ఉన్న కొన్ని పేర్లను మార్చే చాన్స్ ఉందని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ ఏడాది చివరి నాటికి రైతుసమన్వయ కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

08:41 - June 29, 2017

హైదరాబాద్ : పాడుపడిన బోరుబావులపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేయని బోరుబావులు వివరాలను సేకరించడానికి ఇవాళ్టి నుంచి సర్వే నిర్వహించనున్నారు.  పనిచేయని బోర్లను మూసివేయకుంటే యజమానిపై 50వేల వరకు జరిమానా విధిస్తామని పంచాయతీరాజ్‌శాఖామంత్రి జూపల్లి కృష్టారావు స్పష్టంచేశారు. ఇక నుంచి కొత్తగా బోర్లు వేసుకోవాలంటే.. గ్రామస్థాయిలో వీఆర్వో, విలేజ్‌సెక్రెటరీల ముందస్తు అనుమతి తప్పని సరిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 
టీ.ప్రభుత్వంలో కదలిక 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడెంలో చిన్నారి బోరుబావిలో పడి చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అనుమతిలేకుండా విచ్చల విడిగా బోర్లు వేయడం, పనిచేయని వాటిని పూడ్చకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, భూగర్భ జలశాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.  పనిచేయని బోర్‌వెల్స్‌ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై  అధికారులతో చర్చించారు.  రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 350 రిగ్స్‌కు మాత్రమే భూగర్భ జలశాఖ అనుమతులు ఉన్నట్టు అధికారులు జూపల్లి దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్లువేసే రిగ్స్‌ ఓనర్లతోపాటు... భూ యజమానులపట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని  సమావేశంలో నిర్ణయించారు.   ఇకనుంచి బోర్లు వేయడానికి 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలన్నారు.  అనుమతి లేకుండా బోర్లు వేస్తే రిగ్‌ యజమానులకు లక్ష వరకు ఫైన్‌ విధించాలని ఆదేశించారు.  అనుమతులు లేని రిగ్స్‌ను సీజ్‌ చేయడంతోపాటు.. జరిమానా విధించాలని నిర్ణయించారు.  
పనిచేయని బోర్‌వెల్‌ గుంతలను పూడ్చివేయాలని ఆదేశాలు
పనిచేయని బోర్‌వెల్‌ గుంతలను జూన్‌ 10లోపు పూడ్చివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెడిపోయిన, పనిచేయని బోర్లను పూడ్చివేసే బాధ్యతను పూర్తిగా భూ యజమానులే తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.  పనిచేయని బోరుబావులను పూడ్చకపోతే 50వేల రూపాయల వరకు జరిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 
నేటి నుంచే గ్రామలవారీగా సర్వే
పనిచేయని బోరుబావులపై చర్యలు తీసుకునే బాధ్యతను క్షేత్రస్థాయిలో వీఆర్వీ, గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌లకు అప్పగించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. చెడిపోయిన, పనిచేయని బోర్‌వెల్స్‌కు సంబంధించి గురువారం నుంచే గ్రామలవారీగా సర్వే చేయాలని అధికారులన ఆదేశించారు. సర్వే సందర్భంగా ఎక్కడికక్కడ భూ యజమానులతో బోర్‌వెల్‌ గుంతలను పూడ్పించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

21:03 - April 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజల నుంచి ప్రభుత్వం వారి భూములను లాక్కొంటోందని మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం సేకరించిన భూముల్లోకి ఇప్పటికీ పరిశ్రమలే రావడంలేదన్నారు. హైదరాబాద్‌లోసి సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వాసిత రైతుల రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. భూసేకరణ చట్టం -2013కు ప్రభుత్వం సవరణలు చేసి రైతులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు చేసిన భూసేకరణ చట్టాన్ని రాష్ట్రపతికి పంపొద్దని భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్‌ బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. రైతు రాజ్యం అంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం... రైతులకు నష్టం చేసేలా కొత్త భూసేకరణ చట్టం తీసుకురావడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి సభకు రాకుండానే సవరణలు ఆమోదించడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని విమర్శించారు.

 

12:12 - January 12, 2017

హైదరాబాద్ : గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్‌ ఎస్పీ సింగ్‌.. వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. 
జనవరి 26 వేడుకలపై సీఎస్‌ సమీక్ష 
68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. జనవరి 26 వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో సంబంధింత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలకు గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
పారిశుద్ధ్యం, మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు
వేడుకలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో పారిశుద్ధ్యం, మొబైల్‌ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. గన్‌పార్క్‌, క్లాక్‌టవర్‌, ఫతేమైదాన్‌లతో పాటు.. రాజ్‌భవన్‌, సెక్రటేరియెట్‌, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌లను విద్యుద్దీకరించాలని సూచించారు. 
విద్యుత్‌, మంచినీటి సౌకర్యం 
వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, మంచినీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కోసం ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుక ప్రాంగణాలను పుష్పాలతో ముస్తాబు చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - టీ.సర్కార్‌