టూరిజం

07:09 - April 2, 2018

విజయవాడ : ఏపీ పర్యాటక శాఖ ప్రస్తుతం నష్టాల బాటలో నడుస్తోంది. టూరిస్టులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. పర్యాటకుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిధులు వృధా అవడం తప్ప ఎలాంటి లాభం చేకూరడంలేదు. ఇప్పటివరకు నిర్వహించిన బెలూన్‌ ఫెస్టివల్, సౌండ్‌ ఆన్‌ శాండ్స్‌, విశాఖ ఉత్సవ్‌... ఇప్పుడు యాచింగ్‌ ఫెస్ట్‌ వరుసగా ఫెయిల్‌ కావడంతో పర్యటక శాఖపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. విశాఖ టూరిజం పర్యటకులను ఆకర్షించేందుకు చేపట్టిన ఫెస్ట్‌లు అంతగా సక్సెస్‌ అవడంలేదు. విశాఖ సాగర తీరంలో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన యాచింగ్‌ ఫెస్టివల్‌కు పర్యటకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కేవలం విదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ ఫెస్ట్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ వేదికగా విస్తృత ప్రచారం కల్పించారు. ఆరు లక్షల మందికి ఆహ్వానం పంపగా 15 వందల మంది మాత్రమే ఆసక్తి చూపారు. చివరకు 16 మంది మాత్రమే ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌ ప్రచారం ద్వారా పర్యటకానికి 3 కోట్లు ఖర్చు కాగా ఆదాయం మాత్రం 2.50 లక్షలు మాత్రమే వచ్చింది.

అయితే మొదటి నుండి యాచింగ్‌ ఫెస్ట్‌ అయోమయంగానే ఉంది. పడవల పండగకు యాచింగ్‌ బోట్లు వస్తాయో, రావో తెలియని పరిస్థితి. అసలు ఫెస్ట్‌ జరుగుతుందో లేదో అన్న అనుమానం ఇటు అధికారులతో పాటు అటు జనంలోనూ నెలకొంది. మార్చి 28 నుండి 31 వరకు జరగాల్సిన ఫెస్ట్‌... గోవా, చెన్నైలతో పాటు థాయిలాండ్‌ నుండి యాచ్‌ బోట్లు రావడం ఆలస్యమవడంతో ఏప్రిల్‌ 1 వరకు ఫెస్ట్‌ను పొడగించారు. ముఖమంత్రి చంద్రబాబు ఈ ఫెస్ట్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఉన్న యాచ్‌లతోనే తూతూ మంత్రంగా పోటీలు నిర్వహించడంతో పర్యటకులను అంతగా అలరించలేకపోయాయి. సముద్రంలో కనీసం 10 కిలో మీటర్లైనా విహారం చేద్దామనుకున్నప్పటికీ నిరాశే మిగిలింది. దీంతో ఇలాంటి ఫెస్టివల్స్‌ మాటలకే పరిమితం గాని పర్యటకానికి పనికి రావని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పద్దతి వల్ల ప్రజా ధనం వృధా అవడం తప్ప మరేమీలేదంటున్నాయి.

భవిష్యత్‌లో విశాఖ యాటింగ్‌కు అనుకూల నగరమని ప్రపంచ పర్యటకులకు తెలియజేసేందుకు ఈ ఫెస్ట్‌ నిర్వహించారు. కాని అది ఇప్పుడు నీరుగారిపోయింది. అయితే ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాల ఇవ్వకపోవడానికి కారణం...కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ నిర్వహనలోపమనే చెప్పాలి. గతంలో కూడా ఈ ఫ్యాక్టర్స్‌ సంస్థ...ప్రభుత్వం తలపెట్టిన విశాఖ ఉత్సవ్‌, శాండ్‌ ఆఫ్‌ సౌండ్స్‌, బెలూన్‌ ఫెస్ట్‌ ఇలా అనేక కార్యక్రమాల నిర్వహన బాధ్యత చేపట్టింది. ఇందులో ఏ ఒక్క కార్యక్రమం సక్సెస్‌ అవలేదు. దీంతో ప్రతి సారి అదే ఈవెంట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే యాచింగ్ ఫెస్టివల్ కోసం విశాఖ పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు తన సహాయ సహకారాలు అందించడమే కాకుండా యాచింగ్ ఫెస్టివల్ సక్సస్ అయితే విశాఖ పోర్టులోనే ఒక టెర్మినల్ నిర్మించి పర్యాటక శాఖకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తద్వారా విశాఖ ఆర్థికంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పోర్ట్ చైర్మన్ క్రిష్ణబాబు రాష్ట్రఅభివృద్దికి అందిస్తానన్న సాయం అభినందనీయం. కాని నిర్వహన లోపంతో యాచింగ్ ఫెస్టివల్ నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే స్థానికంగా ఉన్న సెంటిమెంట్‌ను వాడుకుంటోంది పర్యటక శాఖ. గతంలో బెలూన్‌ ఫెస్ట్‌ నిర్వహించినప్పుడు వచ్చిన ఆదాయాన్ని గిరిజనులకు ఇస్తామని చెప్పి... వారి ప్రాంతాల్లో తిష్టవేసారు గాని మళ్లీ వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రస్తుతం యాచింగ్‌ ఫెస్ట్‌ను అదే రీతిలో కొనసాగించారు. ఫెస్ట్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మత్స్యకారులకు ఇస్తామని చెప్పినా....అది కూడా చేయలేకపోయారు. ఇలా పర్యటక శాఖ తన విధానాలతో ఇటు పర్యటకుల్లోనూ, అటు ప్రజల్లోనూ అభాసుపాలవుతోంది. 

17:48 - January 13, 2018

హైదరాబాద్‌ : నగరంలో పతంగుల సందడి మొదలైంది. ఇంటర్ నేషనల్ కైట్స్ ఫెస్టివల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మూడవసారి నిర్వహిస్తున్న ఈ కైట్ పెస్టివల్‌కు పెద్ద సంఖ్యలో దేశ- విదేశీయులు నగరానికి చేరుకుంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే కైటర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

18:30 - November 4, 2017

విజయవాడ : ఏపీ పర్యాటక రంగానికి పెట్టుబడుల కోసం రేపటి నుంచి రెండు రోజుల పాటు ఆ శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ లండన్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. లండన్‌లో వరల్డ్ ట్రావెల్ మార్ట్‌లో ఎపీ తరపున స్టాల్ ఏర్పాటు చేయబోతున్నట్లు అఖిలప్రియ చెప్పారు. రాష్ట్రంలో విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అదే విధంగా విదేశాల్లో పర్యటించే తెలుగు వారికి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

లండన్ పర్యటనలో టూరిజం, హోటల్..ఈవెంట్ మేనేజ్ మెంట్..అడ్వర్ టైజ్ మెంట్స్ కు సంబంధించిన వారితో చర్చలు జరుపడం జరుగుతుందన్నారు. విదేశీ పర్యటకులకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల్లో పర్యటించే తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి..అక్కడున్న అధికారికి విషయం తెలియచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

19:44 - October 27, 2017

విశాఖ : టూరిజంతో రాష్ట్రాభివృద్ధి మరింత పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియ అన్నారు. విశాఖలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుల సదస్సును అమె ప్రారంభించారు. ఆసియా ఖండంలో పర్యాటక పెట్టుబడులకు విశాఖ అత్యంత కీలకమైదని.. విశాఖలో హోటల్స్‌, రిసార్ట్స్‌తో పాటు అనేక ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందని అఖిలప్రియ అన్నారు.

 

17:10 - July 25, 2017

వేముల వాడ : మిష్ ఏషియా, తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ వేములవాడకు వచ్చారు. మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ఆమె కోడెమొక్కులను చెల్లించుకున్నారు. రాజన్న ఇంటి ఇలవెల్పు అని, ఆలయానికి రూ. 400 కోట్ల బడ్జెట్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చెయ్యడం గర్వించదగిన విషయమన్నారు. డ్రగ్స్ కేసుపై కూడా ఆమె స్పందించారు. ఈ కేసులో ఎంత మంది ఉన్నారో..ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతే తెలుస్తుందన్నారు. సినీ ఇండ్రస్ట్రీ కాకుండా బయట వారు కూడా డ్రగ్స్ వాడుతున్నారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమయ్యేసరికి ఎక్కువ ప్రచారం జరిగిందని రష్మీ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

07:13 - February 23, 2017

ముంబై : 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ముంబైలో నిర్వహిస్తున్న ప్యూచర్ డీకోడెడ్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీ విద్యార్థుల్లో నైపుణ్యం పెంపు, ఉపాధి కల్పనపై చర్చించారు. అలాగే ఎస్ బ్యాంక్ ఛైర్మన్ రాణాకపూర్‌ను చంద్రబాబు కలిసి అమరావతిలో ఇన్నోవేటివ్ ఫిట్‌నెస్ పార్క్, టూరిజంపై చర్చించారు. 

13:36 - December 1, 2016
20:07 - October 14, 2016

రాష్ట్రంలోని టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని టూరిజం కార్మిక సంఘం నేత ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్ మెంట్ అధికారులకీ, కార్మిక యూనియన్లకీ మధ్య ఇవాళ కీలక సమావేశం జరగబోతోంది. విజయవాడలో జరిగే ఈ సమావేశంలో దీర్ఘకాలికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు సిఐటియు సమాయత్తమైంది. 2013 సమ్మెకాలం నాటి వేతన బకాయిలు, 10వ పిఆర్ సి ప్రకారం డిఏ వర్తింపు, మరణించిన కార్మికుని స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం లాంటి అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధికి వున్న అవకాశాలేమిటి? ఏపిలో టూరిజం పాలసీ ఎలా వుంది? ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధికి ఎలాంటి పాలసీ అవసరం? టూరిజం డిపార్ట్ మెంట్ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వర్కింగ్ కండిషన్స్ ఎలా వున్నాయి? వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:34 - July 6, 2016

టర్కీ : టూరిస్టుల స్వర్గధామం టర్కీలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్ధం ఆవరించింది. టెర్రరిస్టుల బీభత్సకాండతో   ఇస్తాంబుల్‌ నిర్మానుష్యంగా మారింది. బిజినెస్‌లు లేక హోటళ్లు, యాత్రాస్థలాలు వెలవెలబోతున్నాయి. పర్యాటక నగరంలో ఉగ్రవాదులుదాడి తర్వాత ఆప్రాంతంలో అడుగు పెట్టేందుకే జనం వణికిపోతున్నారు. 
నిర్మానుష్యంగా మారిన టూరిస్ట్‌ స్పాట్‌లు
వేలసంఖ్యంలో టూరిస్టులు... కోట్లాది డాలర్ల బిజినెస్‌...  ఇది నిన్నటి మాట..ఉగ్రవాదుల దాడితో... టర్కీటూరిజం నిస్తేజంగా మారింది. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే  ఇస్తాంబుల్‌నగరం... నిర్మానుష్యంగా మారిపోయింది.  షాపింగ్  చేసేందుకు స్థానికులు సైతం  భయపడిపోతున్నారు. సందర్శకులతో ఎప్పుడూ రష్ గా కనిపించే షాపింగ్‌మాల్స్‌ ...ఖాళీగా కనిపిస్తున్నాయి. 
జూన్‌ 30న ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టుపై ఉగ్రదాడి
గత నెల 30న ఇస్తాంబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబులతో మారణహోమానికి తెగబడిన ఉగ్రమూకలు నలభై మందికి పైగా ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. దీంతో  టర్కీపౌరులతోపాటు.. ఆదేశానికి వెళ్లే యాత్రీకులు సైతం వీధుల్లో తిరగాలంటేనే భయపడుతున్నారు.  ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరాల్లో నాలుగో స్థానంలో ఉన్న  ఇస్తాంబుల్.. టర్కీలోని అతి పెద్దనగరమే కాక, సాంస్కృతిక, వాణిజ్యాలకు ప్రధాన కేంద్రం. యూరప్ ఆసియా ఖండాల మధ్య భాగంలో ఉన్న నగరంలోని పలు చారిత్రక ప్రాంతాలు  ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ప్రాచీన మసీదులు, అద్భుతమైన సందర్శనా స్థలాలు ఇస్తాంబుల్ నగరానికి ఎసెట్‌గా ఉన్నాయి. అటువం ఉన్నత చారిత్ర  వారసత్వపు దేశం ఇపుడు ఉగ్రవాదుల దాడులతో చిగురాటాకులా వణికిపోతోంది.  ఈ ఏడాది వరుసగా జరిగిన దాడులు స్థానిక ప్రజలనే కాక, టూరిస్టులనూ భయపెట్టాయి.   టర్కీవైపు వెళ్లాలంటేనే టూరిస్టులు వణికిపోతున్నారు. దీంతో  కొనుగోలుదారులు లేక ఇస్తాంబుల్‌ నగరంలో షాపులు వెలవెలబోతున్నాయి. టూరిస్ట్ జిల్లాగా పేరొందిన సుల్తానా  మెట్ లోని రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్ళు పర్యాటకులు లేక  బోసిపోతున్నాయి. 
తీవ్రంగా దెబ్బతిన్న టూరిస్ట్ ఇండస్త్రీ
ఇస్తాంబుల్ దాడులు స్థానిక పరిస్థితులనేకాదు, తమ జీవితాలనూ తారు మారు చేసేసిందని టూరిస్ట్ గైడ్లు వాపోతున్నారు.  జిహాదీల దాడి.. ఇప్పుడు టర్కీలోని టూరిస్ట్ ఇండస్త్రీని తీవ్రంగా దెబ్బతీసింది. చారిత్రక కాలం నుంచి ఎన్నో యుద్ధాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న తమదేశం...ఇపుడు జీహాదీలను కూడా సమర్ధంగా ఎదుర్కొంటుందని  సాధారణ టర్కీపౌరులు మాత్రం ధీమావ్యక్తం చేస్తున్నారు.  

 

Pages

Don't Miss

Subscribe to RSS - టూరిజం