ఢిల్లీ

21:44 - January 18, 2017

ఢిల్లీ : ఆర్బీఐ గ‌వ‌ర్నర్ ఉర్జిత్ ప‌టేల్‌ పార్లమెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ విచార‌ణ ముందు హాజ‌ర‌య్యారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత 9.2 ల‌క్షల కోట్ల కొత్త క‌రెన్సీ ప్రవేశ‌పెట్టిన‌ట్లు ఆయన కమిటీకి  తెలిపారు. నోట్ల ర‌ద్దు ప్రక్రియ 2016 జనవరి నుంచే ఆరంభమైనట్లు వీరప్పమొయిలీ నేతృత్వంలోని స్టాండింగ్ క‌మిటీ ముందు ఆయన వెల్లడించినట్లు సమాచారం. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల బ్యాంకులకు ఎంత సొమ్ము వ‌చ్చింద‌ని ఎంపీలు అడిగిన ప్రశ్నకు మాత్రం పటేల్‌ స్పందించలేదు. నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల అస్తవ్యవ‌స్తమైన ఆర్థిక వ్యవ‌స్థ ఎప్పుడు మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి వ‌స్తుంద‌న్న దానిపై ఉర్జిత్ నోరు మెదపలేదు. శుక్రవారం థామస్‌ నేతృత్వంలోని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ముందు కూడా ఉర్జిత్‌ పటేల్‌ హాజరు కానున్నారు.

 

09:36 - January 17, 2017

ఢిల్లీ : అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అలోక్‌వర్మ... 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్‌గా ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, సీజేఐతో కూడిన కొలీజియం ఎంపిక చేశారు.

15:44 - January 16, 2017

పంజాబ్ : రాష్ట్రాన్ని రక్షించడానికే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అన్నారు. డ్రగ్స్‌ మాఫియాతో అధికారంలో ఉన్న పంజాబ్‌ నేతలకు సంబంధముందని ఆరోపించారు. పంజాబ్‌ హరిత విప్లవానికి చిహ్నమని...డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారకూడదన్నారు. పంజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తానని సిద్ధూ స్పష్టం చేశారు. పంజాబ్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ-తొలిసారిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌మాకెన్‌తో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సొంతిళ్లు..
కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వెళ్లినట్లుగా ఉందని సిద్ధూ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ నేతగానే జన్మించానని... దేశ స్వాతంత్య్రం కోసం తన కుటుంబం పోరాటం చేసిందని గుర్తు చేశారు. తన తండ్రి 40 ఏళ్లు కాంగ్రెస్ కోసం పని చేశారని తెలిపారు. హరిత విప్లవానికి గుర్తింపుగా ఉన్న పంజాబ్‌ డ్రగ్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని సిద్ధూ అన్నారు. అన్నదాతలు అడుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంజాబ్ యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్‌, గుజరాత్‌లో లేని డ్రగ్స్‌ సమస్య పంజాబ్‌లోనే ఎందుకుందని ప్రశ్నించారు.

భాగ్ బాదల్..భాగ్..
పంజాబ్ ప్రభుత్వానికి, నేతలకు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని ఆరోపించారు. పంజాబ్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని... భాగ్... బాదల్... భాగ్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతామని సిద్ధూ పేర్కొన్నారు. పార్టీని తల్లిగా భావిస్తామని చెప్పిన సిద్ధూ...బిజెపిని కైకేయిగా...కాంగ్రెస్‌ను కౌసల్యగా అభివర్ణించారు. పంజాబ్‌ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సిద్ధూ రాజ్యసభకు, బిజెపి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సిద్ధూ చేరికతో కాంగ్రెస్‌కు ఎంత లాభం చేకూరుస్తుందన్నది వేచి చూడాలి.

13:33 - January 16, 2017

ఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే రాష్ర్ట ప్రభుత్వం బడ్జెట్‌ ఆధారపడి ఉండొచ్చన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆదాయం పెరగాలంటే.. పెద్ద డీలర్ల నుంచే పన్నులు వసూలు చేయాలని కేంద్రానికి సూచించామని ఈటెల తెలిపారు. పన్ను ఎగవేతదారుల సంఖ్య తగ్గితే.. కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గు ఉండే అవకాశాలున్నాయన్నారు.

09:55 - January 16, 2017

ఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్‌ 9వ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరుగనుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్ధికమంత్రులు హాజరవుతున్నారు. గత ఎనిమిది సమావేశాల్లో అపరిష్కృతంగా ఉన్న కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా కోటిన్నరలోపు వార్షిక టర్నోవర్‌గల వ్యాపారాలపై ఎవరి అజమాయిషీ ఉండాలన్న దానిపై, రేవుల ద్వారా జరిగే వాణిజ్యంపై పన్నుల వసూళ్లను ఎవరు చేయాలన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రెండు అంశాల్లో రాష్ట్రానికే అధికారం ఉండాలని అన్ని రాష్ట్రాల మంత్రులు గత సమావేశాల్లో కోరారు. అయితే కేంద్రం మాత్రం వీటిని పూర్తిగా తన పరిధిలోకి తీసుకోవాలని యోచిస్తోంది.

13:52 - January 12, 2017

ఢిల్లీ : సైనికులకు ఇస్తున్న నాణ్యతలేని ఆహారం గురించి బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను ఇంకా మరవక ముందే మరో సిఆర్‌పిఎఫ్‌ జవాను జీత్‌ సింగ్‌ వీడియో తెరపైకి వచ్చింది. సైన్యానికి ఇస్తున్న అన్ని సౌకర్యాలను పారా మిలటరీ జవాన్లకు లభించాలని జీత్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదికి విజ్ఞప్తి చేశాడు. ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాడుతూ ఎందరో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు తూటాలకు బలైపోతున్నారని.... పరిహారం విషయంలో మాత్రం భేదభావం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో అక్టోబర్‌ 16, 2016 నాటిదని తెలుస్తోంది. పారమిలటరీ దళాలకు 2004 తర్వాత పెన్షన్‌ ఇవ్వడం లేదని, ఉగ్రవాద పోరులో మృతి చెందిన వారిని అమరులుగా గుర్తించడం లేదని జీత్‌సింగ్‌ పేర్కొన్నాడు. 

 

12:38 - January 12, 2017

ఢిల్లీ : జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జల్లికట్టుకు అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. తీర్పును త్వరగా ఇవ్వాలన్న తమిళనాడు న్యాయవాధులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:25 - January 12, 2017

ఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌  కేంద్రాన్ని కోరారు. నీతి ఆయోగ్‌ సూచించిన విధంగా మిషన్‌ భగీరథ, కాకతీయకు 20వేల కోట్లు మంజూరు చేయాలన్నారు.  తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా కేటీఆర్‌ హస్తిన పర్యటన సాగింది.  పలువురు కేంద్రమంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు.  ప్రాంతీయ విమాన అనుసంధానంపై  కేంద్ర పౌర విమానయాన శాఖతో ఒప్పందం చేసుకున్నారు.
ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎంవోయూ
తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ముగ్గురు కేంద్రమంత్రులతోపాటు నీతి ఆయోగ్‌ సీఈవో, కేంద్ర ఫైనాన్స్‌ సెక్రెటరీతో ఆయన వరుగా భేటీ అయ్యారు.  మొదట కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుతో భేటీ అయిన కేటీఆర్‌... ప్రాంతీయ విమానయాన అనుసంధానం కింద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్య ఒప్పందం చేసుకున్నారు.  కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు అనుమతిచ్చినందుకు  కేటీఆర్‌ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.  బేగంపేట ఎయిర్‌పోర్టును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అభివృద్ధికి ఇవ్వాలని ఆయన అశోక్‌గజపతిరాజును కోరారు. 
కేంద్రమంత్రి అనంత్‌గీతేతో కేటీఆర్‌ భేటీ
మధ్యాహ్నం 12 గంటలకు మరో కేంద్ర మంత్రి అనంత్‌గీతేతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్‌ ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  సాయంత్రం కేంద్రజౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు.  తెలంగాణ వేదికగా జాతీయ జౌళి సమ్మేళనం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.  వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు సహకారం అందించాలని కోరినట్టు కేటీఆర్‌ చెప్పారు.  సిరిసిల్లాలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటును  రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కోరామన్నారు.
నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌తో కేటీఆర్‌ భేటీ
నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌,  కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌లావసతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నీతి ఆయోగ్‌ సూచించిన 20వేల కోట్ల రూపాయలను ఈ బడ్జెట్‌లో విడుదలయ్యేలా చూడాలని ఫైనాన్స్‌ సెక్రెటరీని కోరారు. తెలంగాణలో తీసుకొస్తున్న నూతన ఆవిష్కరణలను నీతి ఆయోగ్‌ సీఈవోతో  కేటీఆర్‌ చర్చించారు.   

 

13:40 - January 11, 2017

ఢిల్లీ : చిన్నపట్టణాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోందని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రితో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని విమానయానశాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి అశోక గజపతిరాజుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్కిల్ అకాడమి స్థాపనకు విమానయానశాఖ అంగీకారం తెలిపిందని కేటీఆర్ తెలిపారు. 

 

12:35 - January 11, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడారు. మోడీ నినాదాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగదు కొరత దేశ ప్రజలను ఇంకా వెంటాడుతుందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై రెండో దశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఢిల్లీ