తమిళనాడు

20:40 - October 3, 2016

జయలలితకు ఏమయింది? ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు?పార్టీ వర్గాల్లో, సగటు కార్యకర్తల్లో ఉత్కంఠ ఎందుకు వీడటం లేదు..?జయ తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? శశికళ అత్యవసర సమావేశం దేన్ని సూచిస్తోంది? తమిళనాట రాజకీయాలు ఏ మలుపుతిరగనున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..ఒంటిచేత్తో రాష్ట్ర రాజకీయాలను చక్రంతిప్పే మహిళ ఆస్పత్రి పాలవటంతో తమిళనాడు అంతటా అయోమయం..గందరగోళం.. అందరిలో అనేక ప్రశ్నలు. అత్యున్నత స్థాయిలో నిజాలు తెలిసినప్పటికీ బయటకి వివరాలు రాకపోవటంతో ప్రజల్లో, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

జయలలిత ఆరోగ్యంపై నెట్లింట్లో రకరకాల పుకార్లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. జయలలిత ఆసుపత్రి బెడ్‌పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమిళ నాట ఆమె ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి. ఆమె రూటే సెపరేటు..

ఆమె సింగిల్ హ్యాండ్ తో పాలిటిక్స్ ని నడిపించగల సత్తా ఉన్న ఉక్కు మహిళ..కంటిచూపుతో పార్టీని శాసించగల నేర్పు..అవరోధాలను, ప్రతికూలతలను ఎదుర్కొనే సత్తా...ఒక్కమాటలో చెప్పాలంటే జయ అంటే తమిళనాట ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి.. అలాంటి జయలలిత ఆస్పత్రి పాలైతే సగటు అభిమాని జీర్ణించుకోవటం అంత తేలిక కాదు..

నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించి, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు.

ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాదు.. దేశమంతటా ఉత్కంఠగా చూస్తోంది. జయ ఆరోగ్యం కోసం ఆమె అభిమానులు, అన్నాడీఎంకె కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఎదురు చూస్తున్నారు. అమ్మ ఎప్పుడు బయటికి వస్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. తమిళనాట రాజకీయాలను శాసిస్తున్న జయలాంటి మహిళ ఆస్పత్రి పాలైతే ఇలాంటి పరిస్థితి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. మరో పక్క పార్టీలో తానే తిరుగులేని శక్తిగా ఉండి.. నంబర్ టూ అంటూ ఎవరూ లేని తరుణంలో భవిష్యత్తుపై ఆసక్తి, ఆందోళన ఉండటం కూడా సహజమే.

21:23 - March 23, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్‌కె నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నాడిఎంకే పార్టీలోని రెండు వర్గాలకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించింది. శశికళ వర్గానికి టోపీ గుర్తు , పన్నీర్‌సెల్వం వర్గానికి రెండు విద్యుత్‌ స్తంభాల గుర్తును కేటాయించింది. రెండు వర్గాలకు వేర్వేరు పార్టీ పేర్లను కూడా ఈసీ ప్రకటించింది. శశికళ వర్గానికి 'అన్నాడిఎంకె అమ్మ' పార్టీ , పన్నీర్‌ సెల్వం వర్గానికి 'అన్నాడిఎంకే పురిట్చితలైవి అమ్మ' పార్టీగా పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల్లో అన్నాడిఎంకే పేరును ఎక్కడా వాడొద్దని ఇరువర్గాలకు ఈసీ సూచించింది. పార్టీ సింబల్‌ రెండాకుల గుర్తు కోసం ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. రెండాకుల గుర్తును ఎవరికి కేటాయించకుండా ఈసీ నిర్ణయం తీసుకుంది.

08:38 - March 23, 2017

చెన్నై : సగటున రోజుకు ఇద్దరి ఆత్మహత్య...! ఆరు నెలల కాలంలో 254 మంది బలవన్మరణాలు..!! ఈ గణాంకాలు, తమిళనాట, రైతుల దుస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. రుతుపవనాలు సహకరించక.. సేద్యానికి పెట్టిన పెట్టుబడులూ గిట్టక, అధికారం కోసం కుమ్ములాటలతో పాలకులకు క్షణం తీరిక లేక.. తమను పట్టించుకునే వారే కానరాక... రైతులు ఉరికొయ్యలే శరణమని భావిస్తున్నారు. 
మృత్యువు కరాళ నృత్యం..
తమిళనాడును వేధిస్తోన్న వర్షాభావ పరిస్థితులు.. దుర్భర కరవుతో తల్లడిల్లుతున్న అన్నదాతలు.. సగటున రోజుకు ఇద్దరు చొప్పున బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతులు.. తమిళనాడు డెల్టా ప్రాంతంలో మృత్యువు కరాళ నృత్యం.. తమిళనాడులో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు, ఈశాన్య రుతుపవనాలూ రైతులను తీవ్రంగా దగా చేశాయి. సకాలంలో వానలు కురవని కారణంగా.. నీరు అందక.. పైర్లు ఎండిపోయాయి. కనీసం పెట్టుబడులు కూడా తిరిగి రాని దుర్భర పరిస్థితుల్లో తమిళ రైతులు.. నైరాశ్యంలో కూరుకుపోయారు. బతుకుపై భరోసా కొరవడి.. బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. 
254 మంది రైతులు బలవన్మరణాలు
ఒకరు కాదు ఇద్దరు కాదు.. గడచిన ఆరు నెలల కాలంలో 254 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు కోల్పోయారు. సిరులు కురిపించే డెల్టా ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన నాగపట్నం, తంజావూరు జిల్లాల్లోనే ఈ దుర్భర పరిస్థితులు తలెత్తడం యావత్‌ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రాంతంలో సగటున ప్రతి రైతుకూ రెండు నుంచి మూడు ఎకరాల పొలం ఉంది. మొత్తం 80వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంత రైతులు వరి పండిస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట నష్టపోవడంతో.. తమను ఆదుకోవాలంటూ రైతులు గడచిన డిసెంబర్‌, జనవరి నెలల్లో ఆందోళన నిర్వహించారు. తద్వారా తమ ఆవేదనను రాష్ట్రం మొత్తానికి తెలిసేలా చేశారు. 
అధికార యంత్రాంగం కాస్త ఉదాసీనత 
జయలలిత మృతి.. తదనంతర పరిస్థితుల్లో రైతుల వెతలు పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం తొలినాళ్లలో కాస్త ఉదాసీనత కనబరచింది. అయితే రైతుల ఆందోళన అధికం కావడంతో, యంత్రాంగం కదిలింది. రైతులను ఆదుకునేందుకంటూ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఐదు ఎకరాలలోపు పొలమున్న రైతులకు, ఎకరాకు 5వేల 465 రూపాయల వంతున చెల్లిస్తామని తెలిపింది. అయితే, ఆల్‌ తమిళనాడు ఫార్మర్స్ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం, 254 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే.. ప్రభుత్వం మాత్రం 58 మందేనంటూ లెక్క తేల్చింది. వీరిలో 25 శాతం రైతులకు కూడా ఇంకా పరిహారం చెల్లించలేదని వారి బ్యాంకు అకౌంట్ల ద్వారా తెలుస్తోంది. 
ఢిల్లీలో రైతులు ఆందోళన
పరిస్థితి తీవ్రత అధికం కావడం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. డెల్టా ప్రాంత రైతులు.. ఇటీవలే, దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగారు. పుర్రెలు ధరించి, తమ దుస్థితిని సింబాలిక్‌గా దేశం మొత్తానికి తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతుల దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష డిఎంకె, సీపీఎంలు విమర్శించాయి. కాలువల మరమ్మతులు చేయకపోవడం వల్ల నీరు అందడం లేదని, దీంతో భూములున్న రైతులు కూలీలుగా మారుతున్నారని విపక్షాలు అంటున్నాయి. ఇంటాబయటా ఒత్తిడి పెరగడంతో, ముఖ్యమంత్రి పళనిస్వామి, కరవు పీడిత రైతులకు 2,247 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. దీని ద్వారా 32 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఈ ఉపశమనం రైతులకు చేరేందుకు ఎంతకాలం పడుతుందో.. ఈలోపు మరెంత మంది ప్రాణాలు కోల్పోతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

16:40 - March 13, 2017

హైదరాబాద్: జయలలిత వారసురాలిగా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న ఆమె మేనకోడలు దీపకు వేధింపులు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరుగనుంది. ఆర్కే నగర్‌ సీటు నుంచి పోటీ చేయాలని దీప నిర్ణయించుకున్నారు. ఈ తరgణంలో అధికార అన్నా డీఎంకే నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని దీప ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు గూండాలు వచ్చి బెదిరిస్తుండటంతో ఇంట్లో కూడా ఉండటంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నా డీఎంకేలోని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం ఈ బెదిరింపులకు దిగుతోందా... లేక ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం హెచ్చరిస్తోందా ... అన్న విషయంలో దీప స్పష్టత ఇవ్వడంలేదు.

14:33 - March 10, 2017

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష నేత సాల్టిన్‌ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రతిపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని స్టాలిన్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారమే బలపరీక్ష నిర్వహించామని తమిళనాడు అసెంబ్లీ కార్యరద్శి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు.. బలపరీక్ష నాటి వీడియో ఫుటేజీని స్టాలిన్‌కు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది.

14:43 - March 9, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 23 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జయలలిత మృతితో ఆర్కేనగర్‌ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

10:42 - March 8, 2017

ఢిల్లీ : తమిళనాడులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దీక్షకు కూర్చొంటున్నారు. జయ మరణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జయ మరణం తరువాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేయడం..సీఎం కావాలని ఆలోచించిన శశికళ జైలుకు వెళ్లడం జరిగిన సంగతి తెలిసింద. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం నిరహార దీక్షకు పూనుకున్నారు. అమ్మ జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ రాజరత్నం స్టేడియంలో సెల్వం దీక్ష చేయనున్నారు. జయది సహజమరణం కాదని..ఉద్ధేశ్య పూర్వకంగా మరణానికి దగ్గర చేశారని..సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12:25 - March 6, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రానున్నారా ? రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోమవారం కమల్ అభిమాన సంఘాలతో అత్యవసరం భేటీ అయ్యారు. దీనితో ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జయ మరణం తరువాత తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై ట్విట్టర్ వేదికపై కమల్ పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తామే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొంటున్నారు. దీనితో ఆయన రాజకీయాల్లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జయ మరణం అనంతరం..
జయ మరణం అనంతరం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడం..డీఎంకే బలంగా తయారు కావడం వంటివి చోటు చేసుకున్నాయి. జాతీయ పార్టీలు నామమాత్రం కావడంతో సినీ రంగం నుండి రావాలని పలువురిపై వత్తిడి పెరుగుతోంది. అంతేగాకుండా సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ దీనిపై రజనీ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. తాజాగా కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

19:15 - February 27, 2017

చెన్నై : డీఎంకే పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎంగా పళనిస్వామి ఎన్నిక చెల్లదని కోర్టులో స్టాలిన్‌ పిల్‌ వేశారు. స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

21:28 - February 26, 2017

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో దివంగత సీఎం జయలలిత ఫోటోల వివాదం రోజురోజుకు ముదురుతోంది. స్టాలిన్‌, పన్నీర్‌ సెల్వం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో జయలలిత ఫోటోలు ఉండడం, పథకాలకు ఆమె పేరు కొనసాగించడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అమ్మ బొమ్మలు, పథకాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌తో శనివారం భేటీ అయ్యారు. జయలలిత ఫోటోలు తొలగించాలంటూ ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. జయలలితను కోర్టు దోషిగా తేల్చిందని, ఆమె ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం చట్టవిరుద్దమని అన్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందిచకుంటే కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.

డీఎంకే తీరును తప్పుపట్టిన పన్నీరు సెల్వం

ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత ఫోటోలు తొలగించాలన్న డీఎంకే తీరును మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తప్పుపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే డీఎంకే ఆందోళన చేస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన జయలలిత చిత్రాలను తొలగిస్తే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆఫీసుల్లోంచి జయ ఫోటోలను తొలగించినా ప్రజల మనసుల్లోంచి అమ్మను తొలగించలేరని అన్నారు. ప్రజలు వరుసగా రెండుసార్లు తిరస్కరించినా డీఎంకేకు బుద్దిరాలేదని దుయ్యబట్టారు. తండ్రి కరుణానిధి బాటలోనే స్టాలిన్‌ కూడా నడుస్తున్నారని పన్నీరుసెల్వం ధ్వజమెత్తారు. మరోవైపు అన్నాడీఎంకే కూడా స్టాలిన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా డీఎంకే అనేక కుట్రలు చేస్తోందని.. భాగంగానే అమ్మ ఫోటోల వివాదానని సృష్టిస్తున్నారని దినకరన్‌ మండిపడ్డారు.

వాస్తవానికి దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించకూడదు.

వాస్తవానికి దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించకూడదు. అలాగే వారి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండరాదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. దీంతో ఆమె ఫోటోలను తొలగించాలన్నది డీఎంకే డిమాండ్‌. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తాము చెప్పిందే చట్టం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అమ్మ పేరిట పథకాలు అలాగే కొనసాగుతున్నాయి. మరికొన్ని పథకాలకు అమ్మ పేరు పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక జయలలిత జయంతిని కూడా ప్రభుత్వం అధికారిక వేడుక తరహాలో నిర్వహించింది. వీటన్నింటిని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అమ్మ బొమ్మలకు, పథకాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎస్‌ను కలిసి జయ ఫోటోలను తొలగించాలని కోరింది. అయితే ఈ చర్య.. రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదంగా మారింది. మరి ఈ పరిణామం ఎటువైపు సాగుతుందో వేచి చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - తమిళనాడు