తమ్మినేని

21:35 - February 14, 2018

హైదరాబాద్ : సీపీఎం తెలంగాణ కార్యదర్శి వర్గ సమావేశం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన ఎంబీ భవన్‌లో జరిగింది. నల్గొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఎన్నికైన కార్యదర్శి వర్గ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌ లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల ఏర్పాట్లతోపాటు, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ బలోపేతం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించారు.

నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా నోరు మెదపని ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిని సీపీఎం కార్యదర్శి వర్గం తప్పు పట్టింది. గురువారం జరిగే బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో చర్చించి దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు 20 కమిటీలు ఏర్పాటు చేస్తూ కార్యదర్శి వర్గం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు పార్టీ మహాసభల ఏర్పాట్లు చూస్తూనే మరో వైపు బీఎల్‌ఎఫ్‌ను బలోపేతంపై దృష్టి పెట్టింది. బీఎల్‌ఎఫ్‌లోఎవరైనా నేరుగా చేరొచ్చని, ఫ్రంట్‌లోని ఏదోఒక పార్టీలో చేరాలన్న నిబంధన ఏదీలేదని సీపీఎం తెలంగాణ కార్యరద్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. జిల్లాల్లో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభలు నిర్వహించాలని సీపీఎం కార్యదర్శి వర్గం నిర్ణయించింది. ఈనెల 20న సంగారెడ్డి, 25న మహబూబ్‌నర్‌లో ఫ్రంట్‌ సదస్సులు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు బీఎల్‌ఎఫ్‌ ఒక్కటే ప్రత్యామ్నాయమన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

15:40 - February 14, 2018

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ ఉదాసీన వైఖరి అవలంభించడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు కేసీఆర్‌ తిలోదకాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

20:58 - February 10, 2018

పశ్చిమగోదావరి : బీజేపీ-టీడీపీ మిత్రబంధం వల్ల సాధించిందేమీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను ఈ రెండు పార్టీలూ మోసం చేశాయని విరుచుకుపడ్డారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. అల్లూ‌రు సీతారామ‌రాజు న‌గ‌ర్‌ ప్రాంగ‌ణంలో జరిగిన బ‌హిరంగ స‌భలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ-టీడీపీ మిత్రబంధంతో సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌.. ప్యాకేజీ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేద ప్రజలపై మరింత భారాలు మోపుతుందని ఏచూరి మండిపడ్డారు. 73 శాతం ధనం ఒక్క శాతం ప్రజల వద్దే ఉందని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని అన్నారు. ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని ఏచూరి అన్నారు.

రైతాంగం పోరాటాల్లోకి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు పిలుపునిచ్చారు. బడ్జెట్లో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రైతుల అప్పులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం విభజన హామీలను విస్మరించి ప్రజలను మోసగించిందని రాఘవులు మండిపడ్డారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయాలన్నారు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వా పరిశ్రమ, యనమదుర్రు డ్రెయిన్‌, గరగపర్రు, పెద్దగొట్టిపాడు దళితులపైదాడుల వంటి సమస్యలపై సీపీఎం ఉద్యమాలు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. రొయ్యల చెరువుల వల్ల కాలుష్యం పెరుగుతుందని ఏయూ ప్రొపెసర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదని మధు మండిపడ్డారు.

రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ మండిపడ్డారు. సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా రానున్నకాలంలో కార్మిక, కర్షక, దళిత, బహుజన, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసే వేదికగా ఈ మహాసభలు జరగనున్నాయ‌ని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని గఫూర్‌ హెచ్చరించారు.

రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని.. వారి సమస్యలూ ఒకేలా ఉన్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజలు భూమి కోసం భుక్తి కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అన్ని పోరాటాల్లోనూ సిపిఎం ప్రజలకు అండగా ఉంటోందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసేది ఎర్రజెండా మాత్రమే అని తమ్మినేని స్పష్టం చేశారు.

అంతకు ముందు భీమవరం పట్టణంలో సీపీఎం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. దాదాపు 20 వేల మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కామ్రేడ్స్‌ కదం తొక్కడంతో.. భీమవరం వీధులన్నీ అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. సీపీఎం రాష్ట్ర మహాసభలు సోమవారం వరకూ సాగనున్నాయి. 

18:27 - February 10, 2018

పశ్చిమగోదావరి : తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్టాలు విడిపోయి నాలుగేళ్లు గడిచిపోయాయన..ఎక్కడ అభివృద్ధి అంటూ తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోతే అభివృద్ధి అవుతుందని ఆనాడు చెప్పారని, నీళ్లు..నిధులు..నియామకాలు వస్తాయని ఆనాడు ఉద్యమం చేసిన కేసీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజలు నమ్మి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారని, అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారని..ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు.

ఏపీ, తెలంగాణలో కొత్త సీఎంలు వచ్చారని..ఇరు రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. కానీ ప్రజల బాధలు..కష్టాలు తీరలేదని..హక్కులు..సమస్యల కోసం ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో 7.5 శాతం అభివృద్ధిలో ఉన్నామని మోడీ..తెలంగాణలో పది శాతం వృద్ధి సాధించామని కేసీఆర్ పేర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన జీడీపీలో 73 శాతం సంపద ధనికుల..కుబేరుల చేతుల్లోకి వెళుతోందని..ఇదే నా అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం..దేశం అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేశారు.

ఎర్రజెండాను అధికారంలోకి తీసుకరావాలని..అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తాము చెప్పడం జరుగుతోందని...ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందట పెట్టాలని సూచించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ ఏర్పాటయ్యిందని, ఆనాటి చరిత్రను పునరావృతం చేస్తామని..ఎర్రజెండా రాజ్యాధికారం కోసం పోరాడుతామన్నారు. సకల అట్టడుగుల మీద అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని..అగ్రకులాల ఆధిపత్యం అణగదొక్కడానికి పోరాటం చేస్తున్నట్లు..ఇందుకు 28 పార్టీలతో బిఎల్ఎఫ్ ఏర్పాటైందన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో బిఎల్ఎఫ్ స్పష్టంగా ప్రజలకు చెబుతోందన్నారు. 

17:49 - February 8, 2018

నల్గొండ : జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఎం ద్వితీయ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి తమ్మినేని ఎన్నికయ్యారు. మొత్తం 60మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాగా రాష్ట్రకార్యదర్శి వర్గం 13 మందితో ఏర్పాటైంది. తమ్మినేని వీరభద్రంతో పాటు రంగారెడ్డి నుండి జి. నాగయ్య, చుక్కా రాములు, బి.వెంకట్, టి.జ్యోతి, పోతిరెడ్డి సుదర్శన్, జి.రాములు, డి.జి.నర్సింహరావులు కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివితో తమ్మినేని మాట్లాడారు. కాంగ్రెస్...బిజెపిలకు రాష్ట్రంలో మరో ప్రత్నామ్నాయం రావాలని, బిఎల్ఎఫ్ ని కేంద్ర పార్టీ సైతం ప్రశంసిస్తోందన్నారు. అట్టడుగు కులాలు..వర్గాల సమస్యలపై దృష్టి పెడుతామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:35 - February 2, 2018

యాదాద్రి : యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరులో దళితులపై ఆర్ఎస్ఎస్ దాడిని బీఎల్ఎఫ్, టీ మాస్ తీవ్రంగా ఖండించింది. దాడిని నిరసిస్తూ నేడు బీఎల్ఎఫ్..టీ మాస్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం సుందరయ్య కళా విజ్ఞాన కేంద్రం నుండి 50 కార్లలో బీఎల్ఎఫ్, టీ మాస్ ర్యాలీ చేపడుతోంది. ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ మాస్ ఛైర్మన్ కంచ ఐలయ్య, బీఎల్ ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ పలువురు నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా టీమాస్ నేత జాన్ వెస్లీ 10టివి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:27 - January 28, 2018

హైదరాబాద్ : పార్లమెంట్ లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోందని..2014 సంవత్సరానికి 82 శాతం ఎంపీలు శతకోటీశ్వరులున్నారని...484 మంది శతకోటీశ్వర్లుంటే పేద..మహిళలు..ఇతర చట్టాల గురించి ఆలోచిస్తారా ? అంటూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ఎస్వీకేలో రాజ్యాంగంపై దాడి...ఎవరి కోసం జరిగిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పౌరుల మధ్య ఆర్థిక సమానత్వం సాధించాలంటే అంబేద్కర్ చూపిన మార్గంలో సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య సమానత్వానికి అడ్డుగోడగా ఉన్న కుల వ్యవస్థ ను తొలగించాలంటే ముందుగా ఆర్థిక సమానత్వం రావాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆర్ఎస్ఎస్ ...బిజెపి శక్తుల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అంబేద్కర్ చూపిన మార్గంలో సాగాల్సినవసరం ఉందన్నారు.  

19:30 - January 27, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రయోజనాలను నష్టపరుస్తున్న కేంద్ర విధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎంలతో దోస్తీ చేస్తూ కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆర్ధిక వ్యవస్థను పురోగమనం దిశగా వెళ్లాలంటే కేంద్రం తమ తప్పుడు నిర్ణయాలను సవరించుకుని ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ రూపొందించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు డిమాండ్ చేశారు.

తెలంగాణ సీపీఎం రాష్ట కమిటీ సమావేశాలు హైదరాబాద్ ఎంబీ భవన్ లో జరిగాయి . ఈ సమావేశానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డిలతో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట, జాతీయ మహాసభల నిర్వహణపై చర్చ జరిగింది.

కేంద్రం ఆర్ధిక విధానాల్లో తీసుకొస్తున్న ప్రైవేటైజేషన్ చర్యల్ని తెలంగాణ ప్రభుత్వం సమర్ధిస్తూ వస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఓవైపు బీజేపీతో దోస్తీ చేస్తూనే.. మరోవైపు ఎంఐఎంతో దోస్తీ చేస్తూ కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసమే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు అన్న తమ్మినేని... ఫిబ్రవరిలో నల్లగొండలో జరిగే సభల్లో ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.. సీపీఏం పొలిట్‌బ్యూరో సభ్యలు బీవీ రాఘవులు. రాష్ట్రంలో ఎగుమతులు దిగుమతులను పెంచడానికి డ్రైపోర్టులపై దృష్టిపెట్టాలన్నారు. డ్రైపోర్టుల ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా ఉన్న సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాఘవులు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు తెచ్చుకునేందుకు కేసీఆర్‌ కృషిచేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం కోసం ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలోపేతానికి సీపీఎం ప్రయత్నాలు ప్రారంభించింది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నల్గొండలో జరుగనున్న ఈ సభలకు సంబంధించిన పోస్టర్‌ను సీపీఎం నేతలు ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ అభివృద్ధి జరగదని సీపీఎం అభిప్రాయపడుతోంది. ఇపుడు బీఎల్‌ఎఫ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 

15:35 - January 27, 2018

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక విధానాల్లో తీసుకొస్తున్న ప్రైవేటేజేషన్ చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తూ వస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. హైదరాబాద్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో పాటు పలువురు సీపీఎం నేతలు హాజరయ్యారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఫిబ్రవరి 4 నుండి 7 వ తేదీ వరకు నల్గొండలో రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరుగుతాయని తమ్మినేని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసమే బిఎల్ ఎఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని, బిఎల్ఎఫ్ ను బలోపేతం చేసే విధంగా అనుసరించాల్సిన వ్యూహంపై మహాసభలో చర్చిస్తామన్నారు. ఓ వైపు బీజేపీతో దోస్తీ చేస్తూనే మరో వైపు ఎంఐంఎ తో దోస్తీ చేస్తూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు. 

19:27 - January 14, 2018

హైదరాబాద్ : కార్పొరేట్ దోపిడిని ఎదుర్కోవడం..అగ్రకులాల అధిపత్యాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడబోతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎస్వీకేలో బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...ఈనెల 25వ తేదీన బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ జరుగుతుందని, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం దాసోహమైందన్నారు. ధనవంతుల చేతుల్లోనే సంపద అంతా పోగవుతోందని, రాష్ట్ర సంపదలో అన్ని కులాలకు సమాన వాట సాధించేందుకు బీఎల్ఎఫ్ పనిచేస్తుందని తెలిపారు. బహుజన ఫ్రంట్ ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - తమ్మినేని