తిరుమల

17:29 - November 14, 2018

తిరుమల: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడేవారిపై ప్రభుత్వం, టీటీడీ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాంటి వ్యక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించవద్దని అనిత కోరారు. ఎమ్మెల్యే అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌పైనా ఆమె విమర్శలు గుప్పించారు. జగన్ కోడి కత్తి డ్రామాను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. విచారణకు సహకరించకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏంటి? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏడాదిగా పోలీసుల రక్షణలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నారని గుర్తు చేసిన ఆమె.. ఆంధ్రా పోలీసులపై తనకు నమ్మకం లేదని జగన్ అనడం దారుణమని మండిపడ్డారు.

09:47 - November 6, 2018

తిరుమల: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం చెలరేగింది. తిరుమలలో శ్రీవారి లడ్డూల కుంభకోణం బయటపడింది. లడ్డూ కౌంటర్‌లలో పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం చూపించారు. రెండు రోజుల వ్యవధిలో 26వేల లడ్డూలను కాంట్రాక్ట్ సిబ్బంది పక్కదారి పట్టించినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పక్కదారి పట్టించిన లడ్డూల విలువ రూ.13లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 30మంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. లడ్డూల స్కాంలో టీటీడీ ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

* తిరుమలలో లడ్డూల కుంభకోణం
* 2 రోజుల్లో 26వేల లడ్డూలు పక్కదారి
* 13లక్షలు విలువైన లడ్డూలు మాయం
* రూ.50 విలువైన లడ్డూలు రూ.80, 100కు విక్రయం

గత నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజున రద్దీ అధికంగా ఉంటుందని, భక్తులకు ఆలస్యం కాకుండా లడ్డూ టోకెన్లను స్కాన్ చేయకుండానే భక్తులకు త్వరితగతిన అందజేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను లడ్డూ కౌంటర్‌లలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది తమకు అనుకూలంగా చేసుకున్నారు. లడ్డూలను పక్కదారి పట్టించి వాటిని బ్లాక్‌లో విక్రయించుకున్నారు. 50రూపాయలు విలువైన లడ్డూని బ్లాక్‌లో 80, 100 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కాస్త ఆలస్యంగా ఈ స్కాం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో అక్రమానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.

Image result for tirumala laddu scamగతంలో కూడా ఇలాగే అనేక స్కామ్‌లు జరిగినా సరైన చర్యలు తీసుకోవడంలో టీటీడీ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సేవా టికెట్లు, లడ్డూలు అడ్డదారిలో పొందడం బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం సాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

 
11:31 - October 24, 2018

తిరుమల : కలియుగ దైవం తిరుమల వెంకన్న సన్నిధి రాజకీయాలకు వేదిగా మారిపోతోంది. టీటీడీ బోర్ట్, ప్రభుత్వం, అర్చకుల మధ్య వెంకన్న నలిగిపోతున్నాడు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకన్న దేవాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. శ్రీ వెంకటేశ్వరుడి ఆస్తులకు, ఆభరణాలకు కొదవేలేదు. ఇప్పుడు అదే వివాదంగా మారింది. శ్రీనివాసుడు ఆస్తులు, ఆభరణాల విషయంలో ఎంతటి వివాదం రేగిందో తెలిసిన విషయమే. ఈ వివాదంలో ప్రధాన వ్యక్తి  శ్రీ వెంకటేశ్వరుని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు.

టీటీడీ చరిత్రలో ఇలా మాజీ ప్రధానార్చకుడిపై పరువు నష్టం కేసు దాఖలు కావడం ఇదే తొలిసారి. దేవస్థానంలో మిరాశీ అర్చకులు, వంశపారంపర్య అర్చకుల పదవీ విరమణ వయసును నిర్దేశిస్తూ, టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తరువాత, పలువురు తమ అర్చకత్వ పదవులకు దూరంకాగా, వారిలో రమణ దీక్షితులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆపై ఆయన టీటీడీ బోర్డుపైనా, అధికారుల తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు. 
స్వామివారి నగలు అన్యాక్రాంతం అవుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను అధికారులు మాయం చేశారని ఆరోపించారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన నగలను కాజేశారని, ఆలయంలోని నేల మాళిగల్లో ఉన్న అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు ఎవరికీ తెలియకుండా తవ్వకాలు జరిపించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పరమ పవిత్రమైన ఆలయం పరువు పోయిందని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రమణదీక్షితులపై టీటీడీ  రూ. 200 కోట్ల మేరకు పరువు నష్టం దావా వేసింది.  శ్రీవారి ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహించిన వ్యక్తపై పరువు నష్టం దావా వేయటం టీటీడీ చరిత్రలో తొలిసారి కావటం విశేషం. మరి దీనిపై రమణదీక్షితులు ఎలా స్పదిస్తారో వేచి చూడాలి.

11:24 - October 24, 2018

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ నానాటికీ పెరుగుతోంది. నిత్యం లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలతో తిరుమలకు వచ్చినా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేది క్షణకాలం మాత్రమే...ఆ క్షణకాలం దర్శనానికి 15 నుండి 20 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిందే..మరోవైపు ప్రముఖుల తాకిడితో భక్తుల దర్శనం మరింత ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమలకు భక్తజన తాకిడి గత కొద్ది నెలలుగా నిరంతరం కొనసాగుతోంది. నిత్యం 80 వేల మందికి తక్కువ కాకుండా దర్శనాలు చేయిస్తున్నారు. గత పదేండ్లతో పోల్చితే తిరుమలకు భక్తుల రాక ప్రస్తుతం బాగా పెరిగింది. భక్తులు  పెరుగుతున్న కారణంగా టిటిడికి ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే దీన్ని నియత్రించేందుకు టిటిడి కొత్తగా ఆలోచిస్తోంది. ఇకపై విఐపీలకు బ్రేక్ దర్శనాన్ని నెలకు ఒక్కసారే కల్పించేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. 
Image result for tirumala huge crowdఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా రద్దీ రోజుల్లోనే అధికంగా వస్తున్నారు. వారి వల్ల సాధారణ భక్తులు దర్శనానికి ఆలస్యమవుతోంది. విఐపీల దర్శనం అయిపోయిన తరువాత కూడా దర్శనం  పునరుద్దరించడానికి పావుగంట సమయం పడుతుంది. ఈ సమయంలో సుమారు వెయ్యి మందికే దర్శనం ఆగిపోతుంది.
నిత్యం తిరుమలకు వెల్లువలా వచ్చే రద్దీని తట్టుకోవాలంటే భక్తులను తిరుపతిలోనే కట్టడి చేయాలన్నది టిటిడి ఆలోచన. దీనికోసం అలిపిరిలో సుమారు 2 వేల గదులు నిర్మించాలని ఇటీవలె పాలకమండలిలో తీర్మానించారు. మొదటి  దశలో 120 కోట్లతో 500 గదులు నిర్మించాలని టిటిడి పాలకమండలి తీర్మాణం చేసింది. Related image
గత నెలలో ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1,02,219 ఇది తిరుమలలో రెండవ రికార్డు. గతంలో 2016 లో 1,02,617 మంది ఒకేరోజు స్వామివారిని దర్శించుకోవడం ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇలాంటి రికార్డులు భవిష్యత్‌లో బ్రేక్ చేయడం కష్టమేమి కాదు. మరి టిటిడి అందుకు తగ్గట్లుగా ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

16:49 - October 20, 2018

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు, దానికి తోడు వారాంతం.. దీంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనానికి దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా, భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు.

20:16 - October 19, 2018

తిరుపతి: వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న మరో కాంట్రవర్సీ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరపైకి తెచ్చారు. దీంతో విడుదలకు ముందే వర్మ సినిమా ఆసక్తికరంగా మారింది. తిరుపతిలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి మీడియాతో మాట్లాడిన వర్మ.. తన సినిమా విశేషాలను వివరించారు. జనవరి 24న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల చేస్తున్నామని, దివంగత ఎన్టీఆర్‌ ఆశీస్సులు తన సినిమాకు ఉంటాయని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజాలు చూపించేలా సినిమా తీయగలిగే దమ్ము ఎవరికీ లేదన్న వర్మ.. తాను మాత్రం నిజాలు నిరూపించగలిగేలా సినిమా తీస్తానని స్పష్టం చేశారు. అయితే వైసీపీకి తాను తీసే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు ఎలాంటి సంబంధం లేదని వర్మ క్లారిటీ ఇచ్చారు. 

ఎన్టీఆర్‌ మంచి మనిషి అని పొలిటిక్‌ హీరో అని, నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేందుకు ఎన్టీఆర్‌ భయపడరని వర్మ కొనియాడారు. లక్ష్మీపార్వతి గురించి చెప్పగలిగే ప్రత్యక్ష సాక్షి ఎన్టీఆర్‌ మాత్రమే అన్నారు. యూట్యూబ్‌లో లక్ష్మీపార్వతి గురించి... ఎన్టీఆర్‌ గొప్పగా మాట్లాడిన వీడియో తాను చూశానని చెప్పారు. అలనాటి నటీమణలు శ్రీదేవి, జయసుధ, జయప్రదలో లేని ఆకర్షణ... లక్ష్మీపార్వతిలో ఏముందని తాను ఆశ్చర్యపోయానని వర్మ వ్యాఖ్యానించారు. అంతటి ఆకర్షణను కాదని...ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడంపై సందిగ్ధంలో పడిపోయానని చెప్పుకొచ్చారు. కాగా, దాదాపు కొత్తవాళ్లతోనే సినిమా తీస్తున్నట్టు.. పాత్రల ఎంపిక తుదిదశకు చేరినట్టు వర్మ వెల్లడించారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి దర్శించుకున్న వర్మ.. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉన్న అనేక సందేహాలకు సమాధానంగా తన వాయిస్‌లో 4 నిమిషాల నిడివితో ఉన్న వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను నాస్తికుడిగా చెప్పుకునే వర్మ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. తనకు దేవుడి మీద నమ్మకం ఉందన్న వర్మ.. భక్తుల మీదే నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవమే తనను తిరుమల రప్పించిందన్నారు. ఈ సినిమాలో నిజాలు చూపించేలా తనను ఆశీర్వదించాలని తాను శ్రీవారిని కోరుకున్నట్టు వర్మ చెప్పారు. నాస్తికుడైన వర్మ శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. వర్మ తన సిద్దాంతాలను పక్కన పెట్టి దైవ దర్శనానికి రావడం వల్ల ఈ సినిమాకు, ఎన్టీఆర్‌కు న్యాయం జరుగుతుందని.. సినిమా విజయవంతం అవుతుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.

15:46 - October 19, 2018

తిరుమల: వెంకన్నను వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు దర్శించుకున్నారు. వీరితో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర యూనిట్ సభ్యులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వర్మ మాట్లాడుతూ, పుట్టినప్పటి నుంచి తాను దేవుడిని దర్శించుకోలేదని చెప్పారు. కేవలం దివంగత ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే తిరుమల వెంకన్నను దర్శించుకున్నానని చెప్పారు. 
గతంలో తాను తెరకెక్కించిన 'గోవిందా గోవిందా' చిత్రం యాక్షన్ మూవీ అని... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాస్తవిక చిత్రమని వర్మ తెలిపారు. ఈ సినిమాలో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. నిజాలను ప్రజలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు. నిజాలను చూపించే ధైర్యం, సాహసం, శక్తి ఇవ్వాలని కోరుకున్నానని చెప్పారు.
 

15:18 - October 19, 2018

తిరుమల : వివాదాల వర్మ ఎప్పుడు వివాదాలనే కాదు షాక్‌కు కూడా గురిచేస్తుంటారు. సినిమాల చిత్రీకరణలో వైవిధ్యమే కాదు ఆయన నిజ జీవితంలో కూడా వైవిధ్యభరితంగా ఉంటారు. పలు సంచలన సినిమాల రూపకర్తగా పేరున్న వర్మ ఇప్పుడు మరో సంచలనానికి దారి తీశారు. ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు... దేవుడు పేరు చెబితే ఇంతెత్తున లేస్తారు... విచిత్రమైన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతారు. పక్కా నాస్తికుడినని చెప్పుకుంటారు. అటువంటి ఆయన దేవుడి గుడిలో ప్రత్యక్షమైతే, స్వామి వారి ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని దర్శనమిస్తే...

ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్‌ వర్మ ప్రత్యేకతే అది. ఏది చేసినా తనదైన స్టైల్‌లో చేస్తాడీ దర్శకుడు. నాస్తికుడినని చెప్పుకునే రామ్‌గోపాల్‌ వర్మ ఒకే రోజు రెండు ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు. ఒకటి ప్రఖ్యాత కాణిపాకం వినాయకుని గుడికాగా, రెండోది తిరుమల శ్రీవారి ఆలయం. తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ట్వీట్‌ చేసిన వర్మ అన్నట్లుగానే స్వామిని దర్శించుకున్నారు. నుదుట సిందూరం, చేతిలో స్వామి వారి లడ్డూ, సంప్రదాయ వస్త్రధారణతో దిగిన ఫొటోలు పోస్టు చేసి తనదైన శైలిని చాటుకున్నారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం దివంగత ఎన్‌.టి.రామారావే తనను ఇలా మార్చేశారని కింద క్యాప్షన్‌ పెట్టి ఆశ్చర్యపరిచారు.

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడిస్తానని వర్మ తెలిపారు. జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓ వీడియోను వర్మ యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. అందులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ సేవలు, ఆయన చనిపోయాక అంతిమ యాత్ర వివరాలు ఉన్నాయి.
 

15:06 - October 19, 2018

తిరుమల: దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి ఆమె తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి 2019 ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టత ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని ఆమె తేల్చి చెప్పారు. కాగా, కృష్ణా జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మీపార్వతి పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఊహాగానాలకు లక్ష్మీపార్వతి ఇవాళ తెరదించారు.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మాత్రం చేస్తానని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా తెలిపారు. జగన్ గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆమె అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రాంగోపాల్ వర్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పోస్టర్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ, లక్ష్మీపార్వతిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 

16:23 - October 18, 2018

తిరుమల : తిరుమల అంటే గుర్తుకొచ్చే శ్రీ వేంకటేశ్వర స్వామి. వెంకన్న అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనకు, ఆయన భక్తకోటికి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. లడ్డూల పేరుతో కూడా శ్రీవారి సన్నిథిలో అక్రమాలు సర్వసాధారణంగా జరిగటం రివాజుగా మారిపోయింది.  ఈ నేపథ్యంలో తిరుమలలో బ్యాంకుల నిర్వహణ పరిధిలోని లడ్డూ కౌంటర్లలో అక్రమాలు జరిగినట్లు టీటీడీ నిఘా విభాగం గుర్తించింది. ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో 22 లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్యాంకుల నిర్వహణలోని కౌంటర్లలో ఒప్పంద ఉద్యోగులు లడ్డూలు విక్రయించారు. రద్దీ దృష్ట్యా టోకెన్ స్కానింగ్ లేకున్నా లడ్డూలు అందించాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ లేకపోవడంతో కాంట్రాక్ట్  సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది. ప్రాథమికంగా 16 వేల లడ్డూలు పక్కదారి పట్టినట్లు నిఘా విభాగం అధికారులు గుర్తించారు. అధిక మొత్తంలో అక్రమాలు జరిగినట్లు టీటీడీ నిఘా విభాగం అనుమానిస్తుంది. ఈ నెల 14 నుంచి లడ్డూ కౌంటర్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. లడ్డూల అక్రమాలపై నిఘా విభాగం అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఈ లడ్డూల అక్రమలకు అడ్డుకట్ట పడకపోవటంతో శ్రీవారి భక్తులు స్వామీ..ఈ లడ్డూల మాయగాళ్లను కనిపెట్టవయ్యా అంటు స్వామివారికి మొరపెట్టుకుంటున్నారు.
 

Pages

Don't Miss

Subscribe to RSS - తిరుమల