తుపాన్

20:00 - December 2, 2017

ఢిల్లీ : కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఓక్ఖీ తుపాను అతలాకుతలం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యానికి ఇప్పటికే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రాష్ట్రాల్లోనూ వంద మందికి పైగా మత్స్యకారులు ఇప్పటికీ సముద్రంలోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు.. అధికారులు.. యుద్ధనౌకలను వినియోగిస్తున్నారు. మరోవైపు.. డిసెంబర్‌ ఐదు నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఓక్ఖీ తుఫాను.. దక్షిణాదిని ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. తమిళనాడులోని తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాపై.. ఓక్ఖీ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఓక్ఖీ కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే 13 మంది మరణించారు. కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లకు చెందిన సుమారు 531 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వీరిలో 393 మందిని రక్షించారు. తమిళనాడులో ఇప్పటికీ 60 మంది జాడ తెలియడం లేదు. గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధనౌకలు గాలిస్తున్నాయి. తీరం వెంబడి కోస్ట్‌గార్డ్‌, వైమానిక, నావికాదళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

తుపాను దెబ్బకు తమిళనాట.. సుమారు నాలుగు వేలకు పైగా విద్యుత్‌ లైన్‌లు దెబ్బతిన్నాయి. దీంతో.. కన్యాకుమారి జిల్లా మొత్తం అంధకారంలో ఉండిపోయింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను కేటాయించింది. అమిత వేగంగా వీస్తోన్న గాలుల వల్లే అత్యధిక నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా.. తమిళనాట.. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఫోన్‌ చేసి.. రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అటు కేరళలోనూ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రానికి వచ్చిన పర్యటకులు.. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన వారు.. బయటకు రావద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం పదేసి లక్షల రూపాయల మేర పరిహారం ప్రకటించింది. ఒక్ఖీ తుపాను.. లక్షద్వీప్‌ను కూడా అతలాకుతలం చేస్తోంది. లక్షద్వీప్‌ పరిధిలోని కాల్పేని ద్వీపంలో వర్షం ధాటికి సముద్ర నీటిమట్టం బాగా పెరిగింది. కొబ్బరిచెట్లు కూకటివేళ్లతో సహా ఒరిగిపోయాయి. తీరంలో ఆపిన బోట్లు దెబ్బతిన్నాయి. లక్షద్వీప్‌ పరిధిలో 31 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వెయ్యికి పైగా ప్రజలు ఇందులో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం తుపాను లక్షద్వీప్‌ వద్ద ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో ముంబై, గుజరాత్‌ దిశగా సాగే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

మరోవైపు.. డిసెంబర్‌ ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా తుపాను గండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. డిసెంబర్‌ ఐదున అల్పపీడనం బలపడి.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించే సువర్ణముఖి, కాళింగి నదుల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాల అధికారులకు ప్రభుత్వం సూచించింది. 

10:08 - May 29, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం తెల్లవారుజామున వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారే అవకాశం ఉందని, రేపు బంగ్లాదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి కోల్‌ కతాకు దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ కు దక్షిణ నైరుతి దిశగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో తుపానుగా మారనుందని, అనంతరం 30న మధ్యాహ్నానికి బంగ్లాదేశ్‌ తీరాన్ని తాకుతుందని వారు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలుస్తోంది. మరోవైపు పశ్చిమగోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఆరు సెం.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాన్ గా మారిన సమయంలో దిశ మార్చుకొనే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆంధ్రా తీరం వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మంగళవారంకు కేరళను తాకనుందని వెల్లడించారు.

09:21 - April 16, 2017

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో 'మారుత' తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తీవ్ర వాయుగుండంగా తుపాన్ మారింది. ప్రస్తుతం మాయాబందర్ కు 340 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

16:26 - December 13, 2016
15:38 - December 13, 2016

చెన్నై : వర్ధా తుపాన్ ప్రభావం ఇంకా తమిళనాడును వీడడం లేదు. తీరం దాటిన సమయంలో తుపాన్ తీవ్ర బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా వాతావరణ అధికారులు మరో హెచ్చరిక జారీ చేశారు. రాగల 24గంటల్లో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటిన అనంతరం చెన్నై పరిసర ప్రాంతాల్లో 114 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినట్లు రికార్డైంది. సత్యపురంలో 38 సెం.మీ. కేవీపీ కాటికుప్పంలో 34 సెం.మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. 
కకావికలం..
వర్దా తుపాను తమిళనాడును కకావికలం చేసింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో చెన్నైతోపాటు తమిళనాడు తీరప్రాంతం అతలాకుతలమైంది. ప్రధానంగా ఐదు జిల్లాల ప్రజలు వణికిపోయారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో చెన్నై తీరాన్ని దాటింది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను కుదిపేసింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు, భీకరమైన గాలులకు వృక్షాలు నేలకూలాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

14:32 - December 13, 2016

ఢిల్లీ : నవంబర్‌, డిసెంబర్‌ వచ్చిందంటే చెన్నై వాసుల్లో వణుకుపుడుతోంది. ఈ రెండు మాసాల్లో ప్రకృతి ప్రకోపాలు చెన్నై ప్రజల్ని భయపెడుతున్నాయి. భారీ విధ్వంసమో..? పెను విషాదమో..? ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్‌లో చెన్నపట్నాన్ని తుఫాన్‌ అతలాకుతలం చేస్తే.. మళ్లీ అదే డిసెంబర్‌లో వర్దా వణికించింది. అసలే అమ్మ జయలలిత మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమిళనాడు వాసుల్ని తుఫాన్‌ భయబ్రాంతులకు గురి చేసింది. డిసెంబర్‌ నెల తమకు అచ్చిరావడం లేదని తమిళులు భావిస్తున్నారు. నిరుడు డిసెంబర్‌లో తుఫాన్‌ ప్రభావంతో చెన్నై జలమయమైంది. నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. దాన్నుంచి కోలుకునేందుకు తమిళనాడుకు చాలా నెలలే పట్టింది. అదే డిసెంబర్ లో చెన్నై ప్రకృతి ప్రకోపానికి గురైంది. 'అమ్మ' జయలలిత మరణించిన బాధలో ఉన్న చెన్నై వాసులకు.. వర్దా తుఫాన్ బీభత్సాన్ని చూపించింది. భవనాలే ఊగిపోయే విధంగా చెన్నైలో ఈదురు గాలులు వీయడంతో మనుషులు బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఈదురు గాలుల ధాటికి వందల ఏళ్ళ నాటి చెట్లు సైతం నేలకూలగా, రోడ్లపై ఉన్న కార్లు గాల్లోనే గింగరాలు తిరిగాయి.

వర్ధా హఢల్..
ప్రకృతి సృష్టించే బీభత్సాన్ని అడ్డుకోవడం ఎవరి సాధ్యమూ కాదనే విధంగా వర్దా తుఫాన్‌ చెన్నైను మరోసారి హడలెత్తించింది. భారీ ఈదురుగాలులతో కూడిన తుఫాన్‌ సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. 1994 అక్టోబర్‌ 30న వచ్చింది. దాని తాకిడికి అప్పట్లో 26 మంది చనిపోయారు. నగరం మొత్తం అంధకారంలో మునిగిపోయింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి టెలిఫోన్‌ స్తంభాలు, భారీవృక్షాలు కూలిపోవడంతో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. నగరం మొత్తం అతలాకుతలమైంది. 2004లో పెను విపత్తును మిగిల్చిన ప్రళయం సునామీ కూడా డిసెంబర్‌ నెలలోనే తమిళనాడును ముంచెత్తింది. వేలాదిమందిని పొట్టన పెట్టుకున్న ఈ విపత్తు గుర్తొస్తే తమిళప్రజలు ఇప్పటికీ వణికిపోతుంటారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో డిసెంబర్ మాసం అంటేనే తమిళులు గుండెలు అరచేతిలో పట్టుకుంటున్నారు. సరిగ్గా ఏడాది కిందట నగరాన్ని వర్షాలు ముంచెత్తగా.. ఈ ఏడాది డిసెంబర్‌లో జయలలిత మరణం, వర్దా బీభత్సం తమిళుల గుండెలు అవిసిపోయేలా చేశాయి. 

14:11 - December 12, 2016

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద' పేరు పెట్టారు. వర్ద అంటే ఏమిటీ ? వర్ద అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. 
బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్ లు తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది.
హిందూ మహా సముద్రంలో వచ్చే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.1953లో అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు వచ్చినపుడు హరికేన్స్, ట్రోపికల్ పేరుతో పిలిచారు. మనదగ్గర నీలం, హెలిన్, లెహెర్, ఫైలిన్, హూద్ హుద్, రౌనా వంటి తుపాన్ లు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.
 

తుఫానులకు పేర్లు పెట్టటం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటం తేలిక అవుతుందని నిపుణుల అంచనా. అందుకే పేర్లు పెడతారు. ఇప్పుడు వర్ద తుపాన్ ఎం చేస్తుందో చూడాలి. 

13:56 - December 12, 2016
13:52 - December 12, 2016

చెన్నై : వార్దా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. వార్దా తుపాను ప్రభావంతో చెన్నై మీనంబాకంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తర తమిళనాడులో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహనాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గం. వరకూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌ ను తాత్కాలికంగా మూసివేశారు. తుపాను సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సాయంత్రం వరకూ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. చైన్నై తో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రాలోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. 

13:26 - December 12, 2016

నెల్లూరు : వార్ధా తుపాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై కనిపిస్తోంది. కాసేపటి క్రితం చెన్నై తీరాన్ని తాకడంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అంతగా ప్రభావం చూపించదని తెలుస్తోంది. కావలి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 20-30 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. 6 కిలోమీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. తుపాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అంతా అప్రమత్తం - జేసీ..
జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నెల్లూరు జాయింట్ కలెక్టర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. తమిళనాడుకు దగ్గరలో ఉన్న సూళ్లూరుపేటలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తో తాను పరిస్థితి సమీక్షించడం జరుగుతోందని తెలిపారు. అంతగా భారీ వర్షాలు కురవడం లేదని, కానీ ముందు జాగ్రత్తలో భాగంగా లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వారికి భోజన, ఇతర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. వాకాడులో 9 సెంటిమీటర్ల వర్షం కురిసిందని, వాకాడు, సూళ్లూరుపేటలో 50-60 కి.మీ.వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. తడ, సూళ్లూరుపేట, దొరవానిసత్రంతో పాటు మూడు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - తుపాన్