తెలంగాణ

19:17 - June 19, 2018

యాదాద్రి : ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్. ఈ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముందు ధర్నా కార్యక్రమం చేపడుతామని తెలిపారు. సంక్షేమ పథకాలతో సామాజిక న్యాయం కాదన్నారు బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం. తాము చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోగలిగామన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు.

 

19:16 - June 19, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా మోటకొండూరు మండలం పిట్టలగూడెం ప్రజలు బీఎల్‌ఎఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో జనం గోస పాదయాత్రను చేపట్టారు. పిట్టల గూడెం గ్రామ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేవారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా అక్కడి వారికి కుల ధ్రువీకరణ పత్రం కూడా అందజేయలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. రేషన్‌ సరుకులు తెచ్చుకోవాలన్నా 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు చదువుకోవడానికి ఆత్మకూరుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. పిట్టలగూడెం ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని బీఎల్‌ఎఫ్‌ నాయకుడు మల్లేశం డిమాండ్‌ చేశారు. 

19:14 - June 19, 2018

వరంగల్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వరంగల్‌లోని స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1932, డిసెంబర్‌ 28న వరంగల్‌లో వేణుమాధవ్‌ జన్మించారు. 1947లో తన 16 ఏటనే మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దేశవిదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్‌ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

17:00 - June 19, 2018

జనగామ : జిల్లా లో ఓ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం నూతన భవన నిర్మాణానికి 2011-12 లో 31 లక్షల నిధులు విడుదల చేసింది. అయితే ఇన్ని రోజుల గడుస్తున్నా అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఆ పాఠశాల భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. విద్యా బోధనతో దేవాలయంగా ఉండాల్సిన ఆ పాఠశాల పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది.

పాఠశాల కూలిపోతుందోనని భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు దులో చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉన్నారు... చదువుకోవడానికి బడి నిండా పిల్లలు ఉన్నారు కాని పాఠశాల భవనం పరిస్థితి మాత్రం అద్వానంగా ఉంది. దీనితో పాఠశాల ఎప్పుడు కూలిపోతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ అయోమయ పరిస్థితికి భయపడి విద్యార్థుల తల్లి దండ్రులు జంకుతున్నారు. ఇవేకాకుండా పాఠశాలలో ఉండాల్సిన కనీస వసతులు మూత్రశాలలు, తాగడానికి నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2012 లో పాఠశాల భవనం కోసం స్థలం కేటాయింపు
2011-12 సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాల భవనం కోసం కొంత స్థలాన్ని కేటాయించి. నూతన భవనం కోసం 31 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది. కానీ అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో భవన నిర్మాణం చేయించాల్సిన అధికారులు పాఠశాలను గాలికొదిలేశారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పోయిన రెండు సంవత్సరాలలో 500 మంది పిల్లలతో ఉన్న స్కూల్‌ స్టెన్త్‌ ఈ ఏడాది 350 మందికి పడిపోయిందని. పాఠశాలలో గదుల కొరతతో పిల్లలను చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చిందని ఇది అధికారుల నిర్లక్ష్యానికి మచ్చుతునకగా పిల్లలు, ఉపాధ్యాయులు ఆవేదన్య వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పాఠశాల భవనం పూర్తిచేయాలని గ్రామస్తులు, పిల్లల తల్లి దండ్రులు కోరుతున్నారు.

16:45 - June 19, 2018

నిజామాబాద్ : ముగ్గురు పాకీస్థానీ పౌరులకు భారత దేశ పౌరసత్వం లభించింది. నిజామాబాద్‌ ఆర్డీవో వినోద్‌ కుమార్‌ ఈ మేరకు తన కార్యాయలంలో వారికి పౌరసత్వ పత్రాలను అందించారు. నిజమాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఫయాజ్‌ ఉన్నీస పాకీస్థాన్‌కి చెందిన నదీమ్‌ జావిద్‌ని 1988లో వివాహం చేసుకుంది. కుటుంబకలహాలతో 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం ఫయాజ్‌ భారత్‌కు తిరిగివచ్చింది. లాంగ్‌టర్మ్‌ వీసాపై 7 సంవత్సరాలుగా భారత్‌లో ఉంటుంది. 2016లో భారత పౌరసత్వం తీసుకున్న ఫయాజ్‌ ఉన్నీస తన ముగ్గురు కుమారులకు కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. వివరాలు పరిశీలించిన భారత ప్రభుత్వం ముగ్గరికీ ఏప్రిల్‌ 24న భారత పౌరసత్వం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లా అధికారులు పౌరసత్వాన్ని ఆ ముగ్గురు పాకిస్తానీ యువకులకు అందజేశారు. 

15:47 - June 19, 2018

వరంగల్ అర్బన్ : కాజీపేటలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. కాలేజ్ లో ఎలాక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే అమిత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను వుంటున్న హాస్టల్ రూమ్ లో అమిత్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు సంవత్సరాల క్రితం మానసిక ఒత్తిడితో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరచిపోకముందే ఇదే కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంతో నిట్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్ కు చెందిన అమిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుసుకున్న నిట్ నిర్వాహకులు వెంటనే సంఘనాస్థలికి చేరుకుని తక్షణం వరంగల్ లోని అల్ట్రా మెడా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అమిత్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కాగా అమిత్ ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని ప్రాథమికంగా తెలిసింది. 

21:46 - June 18, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ... దేశంలోనే నేరాలలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. అసభ్య, అశ్లీల సినిమాలు, వెబ్‌సైట్లు, ప్రసార మాద్యమాలలో మహిళలను కించపరిచే విధంగా చూపడం వల్లే వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. వాటి నివారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని దోషులను శిక్షించాలని సీపీఎం ప్రభుత్వాన్ని కోరింది. 

21:26 - June 18, 2018

హైదరాబాద్ :ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వచ్చారని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కేసీఆర్‌ స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని అన్నారు భట్టి విక్రమార్క. 

19:28 - June 18, 2018

కేంద్రం రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని మెజారిటీ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశంలో దీనికి సమాధానం లభించిందా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేవనెత్తిన అంశాలపై మరోసారి కేంద్రం సానుకూలంగా ఎందుకు స్పందించలేదు? మరోపక్క విభజన హామీల అమలుపై ప్రధాని మోదీ కట్టుబడి వున్నారని నీతి అయోగ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కాగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని వివక్ష చూపుతున్నారనే విమర్శలు కూడా వున్న నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశంలో మరోసారి ప్రధాని ద్వంద వైఖరి అవలంభించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సమస్యలకు నీతి అయోగ్ లో సమాధానం లభించిందా? అనే అంశంపై చర్చ. ఈ చర్చలో టీఆర్ఎస్ నేత రాజమోహన్, టీడీపీ బాబు రాంప్రసాద్ పాల్గొన్నారు.

18:25 - June 18, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ ప్రభంజనంలో కూడా జహీరాబాద్‌ నుంచి గెలుపొందిన నేత గీతారెడ్డి. అలాంటి కీలక నేతకే టీఆర్ఎస్‌ చెక్‌ పెట్టనుందా... అంటే.. అవుననిపించేలా కనిపిస్తున్నాయి పరిణామాలు. నేరుగా మంత్రి హరీష్‌రావే గీతారెడ్డిని టార్గెట్‌ చేసినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా మారుతున్న జహీరాబాద్‌ నియోజకవర్గ పాలిటిక్స్‌పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.

కాంగ్రెస్‌ కోటలో జెండే పాతే యోచనలో టీఆర్ఎస్‌
కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట లాంటిది జహీరాబాద్‌ నియోజకవర్గం. అలాంటి కోటకు ఇప్పుడు బీటలు వారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కాంగ్రెస్‌కోటలో జెండా ఎగరేసేందుకు వ్యూహం రచిస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ. కాంగ్రెస్‌లో కీలక నేత గీతారెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆ పార్టీ. డైరెక్టుగా మంత్రి హరీష్‌రావే.. టార్గెట్‌ గీతారెడ్డి ఆపరేషన్‌ చేపట్టారు.

ప్రాభవం కోల్పోయిన ఫరీదుద్దీన్‌..జైపాల్‌ రెడ్డికీ మొదలైన కష్టాలు
జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా మలిచిన బాగారెడ్డి.. ఇక్కడనుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. 2009లో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయ్యింది. దీంతో గజ్వేల్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న జె. గీతారెడ్డిని.. జహీరాబాద్‌ నుంచి పోటీ చేయించారు అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి. దాంతో కాంగ్రెస్‌లో బలమైన నేతగా పేరున్న ఫరీదుద్దీన్‌ ప్రాభవం తగ్గిపోయింది. అదే సమయంలో బాగారెడ్డి కుమారుడు జైపాల్‌ రెడ్డికి కూడా కష్ట కాలం మొదలైంది. గీతారెడ్డి అటు ఫరీదుద్దీన్‌ను, ఇటు జైపాల్‌ను కూడా వెనక్కి నెట్టి దూసుకెళ్ళారు.

టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఫరీదుద్దీన్‌..
ఈ నేపథ్యంలో ఇటీవల టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఫరీదుద్దీన్‌.. ఎమ్మెల్సీగా ఎన్నికై తన ఉనికిని కాపాడుకోగా.. జైపాల్‌రెడ్డి వర్గం మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా.. గీతారెడ్డి తమను కలుపుకుని పోవడం లేదన్న ఆవేదన బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్‌ విజయానికి హరీష్‌రావు వ్యూహం రచిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం.. మాలో గ్రూపుల్లేవంటోంది.

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత ఉగ్గెల్లి రాములు
కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టాలన్న యోచనతో తరచూ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు హరీష్‌రావు. జిల్లా మొత్తానికి టీడీపీకి కాస్త బలమున్నది కూడా ఈ స్థానంలోనే. కానీ ఇక్కడి టీడీపీ నేత ఉగ్గెల్లి రాములు కూడా మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో టీఆర్ఎస్‌ బలం మరింత పెరిగింది. ఇక కాంగ్రెస్‌లోని అసమ్మతి నేతలను కూడా తమ వైపు తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు మంత్రి. గీతారెడ్డి ఒంటెద్దు పోకడతో నష్టపోతోంది కాంగ్రెస్‌. దీనికి తోడు హరీష్‌రావు వ్యూహంతో ఆ పార్టీ మరింత చతికిలపడే అవకాశం కనిపిస్తోంది. ఇంతవరకూ నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేబాధ్యత తనదేనని హామీ ఇచ్చారు మంత్రి. కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థినే గెలిపించాలన్నారు మంత్రి.

జహీరాబాద్‌ను టీఆర్ఎస్‌ ఖాతాలో వేయాలన్న పట్టుదలతో హరీశ్ రావు
గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ జిల్లావ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినా.. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. కాగా.. నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఎన్నికల్ని అవకాశంగా తీసుకున్న మంత్రి హరీష్‌రావు... తన చతురతతో టీఆర్ఎస్‌ జెండా ఎగిరేలా చేశారు. ఇక మిగిలిన జహీరాబాద్‌ను కూడా టీఆర్ఎస్‌ ఖాతాలో వేయాలన్న పట్టుదలతో ఉన్నారు హరీష్‌రావు. అందుకోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గడ్డుకాలంగానే కనిపిస్తోంది. కాగా.. కాంగ్రెస్‌ బలహీనతను అనుకూలంగా మలుచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది టీఆర్ఎస్. కాగా.. మంత్రి హరీష్‌రావు చేపట్టిన టార్గెట్‌ గీతారెడ్డి ఆపరేషన్‌ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే... 

Pages

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ