తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

07:47 - December 16, 2018

తిరుపతి: ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లో మార్పు వచ్చిందా? తప్పు చేశానని పశ్చాతాపంతో కుమిలిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని తన సర్వేలో తేలిందని చెప్పి లగడపాటి నవ్వులపాలైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించని లగడపాటి సడెన్‌గా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. అయితే సమాధానాలు చెప్పేందుకు లగడపాటి నిరాకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తన సర్వేపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని, అదే పెద్ద పొరపాటైందని లగడపాటి వాపోయారు. నిజానికి తిరుపతిలో తానెప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు.  కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని చెప్పారు. ఆ రోజు మాట్లాడడమే పొరపాటైందని, మళ్లీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
లగడపాటి జోస్యం తారుమారు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరి చూపు లగడపాటి రాజగోపాల్‌పై పడింది. లగడపాటి జోస్యం ఎందుకు తలకిందులైంది? ఎన్నికల ఫలితాల మీద ఆయన ఎలా స్పందిస్తారు? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ లగడపాటి ఎవరికీ కనిపించలేదు. చివరికి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారి దర్శనం తర్వాత తెలంగాణ సర్వే ఫలితాలపై లగడపాటి మాట్లాడతారని మీడియా మిత్రులు భావించినా.. ఆయన మాత్రం టీఆర్ఎస్ విజయం, తన సర్వే అంచనాలపై అస్సలు నోరు విప్పలేదు.
సర్వేపై నో కామెంట్:
కొద్ది రోజుల క్రితం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి స్పందించిన సంగతి తెలిసిందే. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని ప్రకటించిన రాజగోపాల్... వారిలో ఇద్దరు పేర్లను కూడా అక్కడే ప్రకటించారు. ఆ తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందు కూడా మీడియా ముందుకు వచ్చి తన సర్వే అంచనాలు వెల్లడించారు. మహాకూటమిదే విజయం ఎంతో ధీమాగా చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా... లగడపాటి మాత్రం మహాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పదే పదే చెప్పి ఉత్కంఠ రేపారు. కానీ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో లగడపాటి అంచనాలు రివర్స్ అయిన విషయం విదితమే.

21:17 - December 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ గుబాలించింది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రజలు మళ్లీ కేసీఆర్ కే బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్ ను గద్దే దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి ఘోర పరాజయం పాలైంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, టీడీపీ 2, బీజేపీ, 1, ఎంఐఎం 7, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 7న తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
జిల్లాల వారిగా పార్టీల గెలుపు..
మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించింది. వరంగల్ జిల్లాలోని మొత్తం 12 సీట్లుకు గానూ టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 స్థానాల్లో టీఆర్ఎస్ 7, ఎంఐఎం 7, బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 10 స్థానాల్లో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 1 స్థానాన్ని దక్కించుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని 13 స్థానాల్లో టీఆర్ ఎస్ 11, కాంగ్రెస్ 1, ఇతరులు 1 స్థానాల్లో విజయం సాధించాయి. ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందారు. నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 3 చొప్పున దక్కించుకున్నారు. మెదక్ జిల్లాలోని 10 స్థానాల్లో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి. 

 

19:49 - December 11, 2018

హైదరాబాద్ : ఇప్పటివరకు సాఫీగా కొనసాగిన ఎన్నికల కౌంటింగ్ లో చివరి దశలో ఒక్కసారిగా ఈవీఎంలు మొరాయించడంతో టెన్షన్ నెలకొంది.  పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ లో రెండు ఈవీఎంలు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఈవీఎంలు మోరాయించాయి. కోదాడలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. తుంగతుర్తిలో 19 ఈవీఎంలు మొరాయించాయి. అందులో 19 వేల ఓట్లు నిక్షిప్తమయ్యాయని చెబుతున్నారు. కోదాడలో మొరాయించిన రెండు ఈవీఎంలలో వీవీప్యాట్ లోని స్లిప్ లను లెక్కిస్తున్నారు. అయితే ఈవీఎంలు మొరాయించడంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఈ కేంద్రాల్లో ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా అన్నరీతిలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఈపరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 

 

15:57 - December 11, 2018
తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొందరికి విచిత్రమైన పరిస్థితిని ఇచ్చాయి. ఒకే ఇంట్లో ఆనందాలు - అపజయాలు ఇచ్చారు ఓటర్లు. అన్నదమ్ములుగా బరిలోకి దిగిన సోదరుల్లో ఒక్కరికి మాత్రమే విజయం ఇచ్చారు. తాండూరు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పట్నం మహీందర్ రెడ్డి ఓడిపోతే.. కొడంగల్ నుంచి బరిలోకి దిగిన అతని తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి సంచలన విజయం సాధించాడు. రేవంత్ రెడ్డిపైనే గెలిచి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు.
ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విజయం సాధిస్తే.. అతని సోదరుడు మల్లు రవి మాత్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓడిపోయారు.
మరో టాప్ ఫ్యామిలీ అయిన కోమటిరెడ్డి ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితే. నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోతే.. అతని తమ్ముడు రాజగోపాల్ మాత్రం మునుగోడు నుంచి గెలుపొందారు. ఇలా ఒకే ఇంట్లో ఆనందాలు - అపజయాలు పలకరించాయి. ఒకరు ఓడినందుకు బాధపడాలో.. మరొకరు గెలిచినందుకు ఆనంద పడాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఆ కుటుంబ సభ్యుల్లో ఉంది.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లోనూ బాధాకరమైన వాతావరణం నెలకొంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అవుతారు అనుకున్న భర్త ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి గెలుపొందాడు. భార్య పద్మావతి మాత్రం కోదాడ నుంచి ఓడిపోయారు. తాను గెలిచి పార్టీని ఓడించిన భర్తపై సానుభూతి వ్యక్తం చేయాలా లేక పార్టీతోపాటు తాను కూడా ఓడినందుకు చింతించాలా అనే విచిత్రమైన బాధాకరమైన ఆందోళన ఆ ఇంట్లో నెలకొంది.
15:10 - December 11, 2018

తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాలు అన్నీ కలిసి కూటమి కట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వచ్చేది మహాకూటమి అనే భ్రమలో.. సీఎం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన ఎందరో కాంగ్రెస్ నేతల అడ్రస్ గల్లంతు అయ్యింది. సీనియర్లు సైతం ఓటమి పాలయ్యారు.
ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్స్ :
జానారెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వంశీచందర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, మల్లు రవి, ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి ఉన్నారు.

 

14:29 - December 11, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన విజయం సాధించారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిపై 51,515 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వార్ వన్ సైడ్ నడిచింది. టీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. కారు జోరు ముందు కూటమి బేజారైంది. ఊహించని విధంగా టీఆర్ఎస్‌కు అత్యధిక స్థానాలు దక్కాయి.

20:15 - December 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరి కొద్ది గంటలే మిగిలున్నాయి. ఈ సమయంలో అటు అధికారపార్టీ, ఇటు కూటమి దేనికది ధీమాగా ఉన్నాయి. అదే సమయంలో హంగ్ వస్తుందనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి. పార్టీల కదలికలు కూడా ఈ వాదనకు బలం కలిగించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూటమి హంగ్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అందుకే అటు హస్తినలో చర్చలు ఇటు గవర్నర్‌తో భేటీలతో హంగ్ హంగామా మొదలు పెట్టింది. మరోవైపు హంగ్ వస్తే టీఆర్ఎస్‌తో కలిసేందుకు బీజేపీ, ఎంఐఎం విడివిడిగా సై అంటున్నాయి.
హంగ్‌పైనే కూటమి ఆశలు:
ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటికి ప్రధాన పార్టీలకు అంతుబట్టకుండానే ఉంది. అయితే అంచనాలు తారుమారై హంగ్ వస్తే అందుకోసం సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. కూటమి పార్టీలన్ని కలిసినా మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోతే అత్యధిక స్ధానాలు సాధించిన కూటమిగా తమనే ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ మేరకు కూటమినేతలంతా కలిసి గవర్నర్‌ను కలిశారు. ఈ అంశంపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలో మంతనాలు జరిపి వచ్చారు. ఇక టీఆర్ఎస్ విజయంపై ధీమాగా ఉన్నప్పటికి అటు ఎంఐఎం టీఆర్ఎస్ వెంటే నిలబడతామని చెబుతోంది. హంగ్ పరిస్థితి వస్తే అండగా ఉంటామని అసదుద్దీన్ స్వయంగా కేసీఆర్‌ను కలిసి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్‌తో కలిసేందుకు సిద్ధమే, కానీ:
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓవైపు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉండగా.. బీజేపీ మాత్రం హంగ్‌ వస్తుందన్న అంచనాకు వచ్చింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే.. కొత్త ప్రభుత్వంలో తామే కీలకమవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. కాంగ్రెస్‌, మజ్లిస్‌ల భాగస్వామ్యం లేని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ ప్రభుత్వంలో కలిసే విషయంపై ఆలోచిస్తామన్నారు. మజ్లి‌స్‌ను వీడితే టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని, అయితే దీనిపై జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు.

17:23 - December 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. గెలుపు ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. విజయం తమదే అని ఇటు టీఆర్ఎస్, అటు ప్రజాకూటమి నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే పరస్పరం భిన్నంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందరిని కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని అసద్ అన్నారు. ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మజ్లిస్ టీఆర్ఎస్ పక్షాన ఉంటుందని చెప్పారు. జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగు అని చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం అసద్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెప్పారు. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్న తరుణంలో కేసీఆర్‌తో అసద్ భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సుమారు 4 గంటల పాటు కేసీఆర్‌తో అసదుద్దీన్ సమావేశం అయ్యారు.

16:16 - December 10, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ప్రజాకూటమి నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కూటమి నేతలు గవర్నర్‌ను కోరారు. కూటమిని సమూహంగా గుర్తించాలని, కూటమికి వచ్చే సీట్లను ఒక్కటిగా పరిగణించాలని కోరారు. అంతేకాదు ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని, ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి రాజ్యాంగబద్దత ఉంటుందని గవర్నర్‌కు వివరించిననట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికి సంబంధించిన అన్ని వివరాలను గవర్నర్‌కు అందించామని కూటమి నేతలు వెల్లడించారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో 80 సీట్లతో గెలుస్తామని, 12న ప్రమాణస్వీకారం చేస్తామని ఆయన జోస్యం చెప్పారు. కూటమికి మెజార్టీ ఖాయమని తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమిని సమూహంగా చూడాలన్న కోదండరామ్.. గతంలో సర్కారియా కమిషన్ ఇదే అంశం చెప్పిందని గుర్తు చేశారు. కౌంటింగ్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని టీడీపీ నేత ఎల్ రమణ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరించినట్టు తెలుస్తోందన్నారు. కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని తాను ముందే చెప్పానని ఎల్ రమణ చెప్పారు.

21:36 - December 9, 2018

హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే పట్టం కట్టాయి. దీంతో గులాబీ నేతలు మెజార్టీపై దృష్టి పెట్టారు. బావమరుదులు కేటీఆర్, హరీశ్‌‌రావు ఏ నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల అనంత‌రం కేటీఆర్, హ‌రీష్‌రావు పార్టీ అభ్యర్థుల‌తో పోలింగ్ స‌ర‌ళిపై ఆరా తీశారు. పోటీచేసిన అధికార పార్టీ అభ్యర్థుల‌తో ఫోన్‌లో సంప్రదించి నియోజ‌క‌వ‌ర్గాల వారిగా స‌మాచారం తెలుసుకున్నారు. ప్రతిప‌క్ష పార్టీలు కూట‌మిగా ఏర్పడ‌డంతో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి హోరాహోరిగా మారింద‌న్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేశారు. సిద్దిపేటలో పోలింగ్‌ సరళిని పరిశీలించిన కేటీఆర్‌... బావ హరీశ్‌రావుకు లక్ష మెజార్టీ దక్కుతుందంటూ ముందుగానే అభినందనలు తెలిపారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయన్ని వెల్లడించారు. మూడు నెలలు కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
వంద సీట్లు ఖాయం:
తెలంగాణలో వంద సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమాతో ఉన్నారు. ఎన్నికల వేళ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 25 శాతానికి పైగా స్థానాలు కలిగిన హైదరాబాద్, రంగారెడ్డిపైనే కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేటీఆర్ అమలు చేసినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలను రోడ్‌ షోలతో చుట్టేశారు. నాడు గ్రేటర్‌లో 100సీట్లు గెలుస్తామని సవాల్ చేసిన కేటీఆర్.. టీఆర్ఎస్ పార్టీకి 99సీట్లు సాధించి పెట్టారు. ఇప్పుడు కూడా ఆయన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 100సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించకుంటే.. రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు కేటీఆర్.
కాంగ్రెస్ కీలక నేతల ఓటమి:
మంత్రి కేటీఆర్ పోలింగ్ సరళిపై దృష్టి పెడితే.. మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొడంగల్, గద్వాల, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పోలింగ్ ఎలా జరిగింది? గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయనే దానిపై టీఆర్ఎస్ నాయకులతో మంతనాలు జరిపినట్లు సమాచారమందుతోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ కీలక నేతలు ఓడిపోతారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 85సీట్లకు పైగా గెలిచే అవకాశం ఉందని హరీశ్‌కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల సమాచారాన్ని మంత్రి హరీశ్‌.. ఎప్పటికప్పుడు పార్టీ అధినేత కేసీఆర్‌కు చేరవేస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు