తెలంగాణ రాజకీయాలు

08:14 - December 2, 2018

హైదరాబాద్: అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు జూ.ఎన్టీఆర్. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అక్క సుహాసిని తరుఫున ప్రచారానికి ఎన్టీఆర్ వస్తారని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే ప్రకటన ద్వారా మద్దతు ప్రకటించిన ఎన్టీఆర్, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాలకు దూరం:
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. హేమాహేమీలు అంతా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ప్రధానంగా మహాకూటమి నుంచి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె నందమూరి తారకరామారావు మనవరాలు, దివంగత నందమూరి హరికృష్ణ కూతురు కావడంతో ఆ కుటుంబంపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన టీడీపీ నేతలు సైతం ఆమె కోసం ప్రచారం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే సుహాసిని సోదరులైన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ప్రచారం చేస్తారా? లేదా అనే దానిపై సందిగ్దం ఏర్పడింది. తన సోదరులిద్దరూ ప్రచారం చేస్తారని సుహాసిని భావించారు. అయితే ఆమె పోటీకి మద్దతిచ్చిన ఎన్టీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇప్పటివరకు పేరు ఇవ్వలేదు:
సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను అభ్యర్థులు లేదా పార్టీలు.. ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు టీడీపీ కానీ మహాకూటమి నేతలు కానీ ఎన్టీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జూ.ఎన్టీఆర్.. అక్క ప్రచారానికి రావడం కష్టమే అని తెలుస్తోంది.

20:26 - November 1, 2018

ఢిల్లీ: బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీ చేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవన్‌లో జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను తెలంగాణను పరిపాలించను, సీఎంను కాను అని అన్నారు. ఏపీలో పరిపాలిస్తే చాలన్నారు. తెలంగాణలో తమ నాయకులు ఉన్నారని, వాళ్లు ఎదగాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ టీడీపీ నేతలకు మద్దతు మాత్రమే ఇస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో పొత్తులపై తాను ఎక్కడా మాట్లాడలేదన్న చంద్రబాబు.. తెలంగాణలో పొత్తులపై నిర్ణయం స్థానిక నేతలదే అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేస్తే నన్ను తిడుతున్నారని చంద్రబాబు వాపోయారు. ప్రస్తుతమున్నది బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి అన్న చంద్రబాబు.. ఏ కూటమి వైపు ఉండాలన్నది తేల్చుకోవాల్సింది కేసీఆరే అన్నారు.

సేవ్ నేషన్ పేరుతో బీజేపీయేతర పక్షాలను ఐక్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన ఆయన పలు పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, శరద్ పవార్, అజిత్ జోగీ, ఫరూక్ అబ్దుల్లాలను చంద్రబాబు కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేశం పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అంతా ఒక్కటవ్వాల్సిన అవసరాన్ని చంద్రబాబు వారికి వివరించారు.

16:32 - October 11, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ టీడీపీ తన సత్తా చాటుకుంది. ఏ పార్టీకి లేని విధంగా తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అదే టీడీపీకి ప్లస్. కాగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావడం తెలంగాణలో టీడీపీకి మైనస్ అయింది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. ఆ కారణంగా టీఆర్ఎస్‌కు అత్యధిక స్థానాలు రావడం అధికారం దక్కడం జరిగిపోయాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడింది. ఓవైపు ఎన్నికల్లో వరుస ఓటములు.. దీనికి తోడు వలసలు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. Image result for l ramana

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 72స్థానాల్లో పోటీ చేస్తే 15 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం 14.66గా ఉంది. కాగా గులాబీ ఆకర్ష్ కారణంగా తెలుగుదేశం టికెట్ మీద గెల్చిన ఎమ్మెల్యేలంతా సైకిల్ దిగి కారెక్కారు. చివరకు టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. సండ్ర వెంటక వీరయ్య(సత్తుపల్లి), ఆర్ క్రిష్ణయ్య(ఎల్బీనగర్). టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి సైతం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా మహాకూటమి పేరుతో బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. అయితే మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయన్నది క్లారిటీ లేదు. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీలు చెబుతున్నాయి.

జిల్లాలు గెలిచిన స్థానాలు
రంగారెడ్డి 7
హైదరాబాద్ 3
మహబూబ్‌నగర్ 2
వరంగల్ 2
ఖమ్మం 1

          

2014లో టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు 15
ఎంపీ స్థానాలు 1
ఓటింగ్ శాతం 14.66

 

 

 

 

మరోవైపు టీఆర్ఎస్ మాత్రం దూకుడు మీదుంది. ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల కన్నా చాలా ముందు ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ సరైన నాయకత్వమే లేదు. ఈ లోపం కారణంగానే టీడీపీ చతికలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఆ లోపాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 

2014 టీడీపీ ఎమ్మెల్యేలు
సండ్ర వెంకట వీరయ్య -సత్తుపల్లి
ఆర్.కృష్ణయ్య -ఎల్బీనగర్
రేవంత్ రెడ్డి -కొడంగల్
రాజేందర్ రెడ్డి -నారాయణ్ పేట్
వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్
కృష్ణా రావు కూకట్ పల్లి
కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం
క్రిష్ణా రెడ్డి మహేశ్వరం
ప్రకాశ్ గౌడ్, రాజేంద్రనగర్
ఎ.గాంధీ శేరిలింగం పల్లి
ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి
చల్లా ధర్మారెడ్డి పరకాల
శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్
సాయన్న, కంటోన్‌మెంట్
మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్

     


 

 

07:51 - January 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు రాజకీయ పార్టీ అవతరిస్తామని టీ జేఏసీ,.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. 
అప్పుడే ఎన్నికల వేడి 
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలు ప్రజాక్షేత్రంలోకి తమ కార్యక్రమాలను తీసుకెళ్తున్నాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు అ్రస్తాలను సిద్దం చేస్తున్నాయి. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. మారుతున్న రాజకీయ పరిణామాలతో మరో రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికలపై కన్నేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 
త్వరలో రాజకీయ పార్టీగా టీజేఏసీ  
తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌తో కలిసి ఉద్యమం చేసిన టీ-జేఏసీ త్వరలో రాజకీయ పార్టీగా ఆవిర్బవించనుండడంతో గులాబీ నేతల్లో ఆందోళన మొదలైంది. టీ-జేఏసీ చైర్మన్‌గా గుర్తింపు పొందిన ప్రొ.కోదండరామ్‌ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే పార్టీలో అసంతృప్తి నేతలంతా ఆ వైపునకు వెళ్లే అవకాశం ఉందని నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారనే సంకేతాలను టీ-జేఏసీ ఇవ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే ఓవైపు కోదండరామ్‌ బృందం పార్టీ వేదికను సిద్దం చేసుకునే పనిలో పడగా... ఇప్పటివరకు ఏపీకే పరిమితమనుకుంటున్న జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించడంతో రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. 
టీజేఏసీలో చర్చ 
అయితే... పవన్‌ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు టీజేఏసీలో చర్చ మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుందామని యోచిస్తున్న తరుణంలో... ఇప్పుడు పవన్‌ తెలంగాణలోనూ పోటీ చేస్తానని ప్రకటించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీజేఏసీని అడ్డుకునేందుకే అధికార పార్టీ పవన్‌ను రంగంలోకి దింపిందనే అభిప్రాయం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
రాబోయే ఎన్నికలకు పార్టీలు వ్యూహాలు 
ఇదిలావుంటే... జరుగుతున్న పరిణామాలను అధికార పార్టీ నేతలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. టీ జేఏసీ, జనసేన ఎన్నికల రంగంలో ఉంటేనే తమకు రాజకీయంగా కలిసివస్తుందనే ధీమా నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే... రాబోయే ఎన్నికలకు ఇప్పుడిప్పుడే పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా భవిష్యత్‌లో రాజకీయ ముఖచిత్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి. 

 

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ రాజకీయాలు