తెలంగాణ సర్కార్

15:44 - September 26, 2017

హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌కు ఎప్పుడూ లేని విధంగా.. మద్యం షాపుల వల్ల కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల డిపోల ఆధునీకరణకు.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ సిద్ధమవుతోంది. మరి ఆధునిక మద్యం డిపోల సంగతేంటో ఇప్పుడో లుక్కేద్దాం.

ఎక్సైజ్‌ శాఖకు కోట్లల్లో ఆదాయం

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఈ సారి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అందుకే మద్యం డిపోలను ఆధునిక హంగులతో ఏర్పాటు చేసేందుకు టీఎస్‌బీసీఎల్‌ కసరత్తు చేస్తోంది. అద్దె భవనాల్లో నడుస్తున్న డిపోలను సొంత భవనాల్లోకి మార్చాలని చూస్తున్నారు. అలాగే డిపోల నుంచి మద్యం లోడుతో వెళ్లిన వాహనం ఎటువైపు వెళ్తుందో, ఎక్కడ సరుకు దించుతుందో తెలుసుకోవడానికి.. అత్యాధునిక టెక్నాలజీతో డిపోలు నిర్మించాలని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది.

రూ. 411 కోట్ల ఆదాయం

ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి మద్యం దుకాణాల వల్ల 411 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 2, 216 షాపులకు దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం వాటన్నింటినీ కలిపి లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించింది. ప్రతీసారి టెండర్లు డిపాజిట్ చేసినవారికి టెండర్‌ రాకపోతే.. డిపాజిట్‌ను తిరిగి చెల్లించేవారు. కానీ ఈ సారి తెలంగాణ ప్రభుత్వం డిపాజిట్ చేసిన ఆదాయాన్ని తిరిగి చెల్లించకుండా తన ఖాతాలో జమ చేసుకుంది. దీంతో ఈ సారి 256 కోట్లు అదనంగా వచ్చాయి.

మెదక్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌

తొలి విడతలో మెదక్‌, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లోని డిపోల ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపగా.. ఖమ్మం, కరీంనగర్‌ మద్యం డిపోలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించడానికి.. ముందు నుంచే ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్రంలో నెలకు సగటున 30 లక్షల కేసుల మద్యం వినియోగమవుతోంది. ఈ ఏడాది సాధారణ, మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం, బీరు కలిపి.. 633 లక్షల విలువ చేసే మద్యాన్ని అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ, ఇంత మద్యాన్ని ఒకేసారి నిల్వ చేసుకునే సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 18 గోదాంలకు లేవు. అందుకే కొత్తగా గోదాంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

5 ఎకరాల స్థలం అవసరం

ఎక్సైజ్‌ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఆధునిక టెక్నాలజీతో నడుస్తున్న గోదాంలు లేవు. వాటికి కనీసం 5 ఎకరాల స్థలం అవసరం. కాబట్టి ప్రభుత్వ భూములు ఉన్న చోటే గోదాంలు నిర్మించాలని.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

12:58 - September 11, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో సెప్టెంబర్‌లోపు నియామకాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తాజాగా తిరిగి వాయిదా కోరడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా శాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:18 - July 1, 2017

నల్లగొండ :జిల్లాని నాగార్జున సాగర్‌లో.. జీఎస్టీ ప్రభావంతో అంతరాష్ట్ర చెక్‌ పోస్టును మూసేస్తున్నారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో.. ఆంధ్ర, తెలంగాణ మధ్య సరిహద్దులో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆంధ్ర సరిహద్దులకు వెళ్లే వాహనాలకు కమర్షియల్‌ ట్యాక్స్‌ విధించడం వలన తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అయితే ఇవాళ్టితో జీఎస్టీ విధానం రావడంతో.. రాష్ట్ర సరిహద్దులో ఉండే వాణిజ్య పన్నుల చెక్‌ పోస్ట్‌ను ఎత్తేస్తున్నారు. ఇప్పటివరకు వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ.. ఇవాళ్టి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లనున్నాయి.

09:35 - June 27, 2017

హైదరాబాద్ : జూన్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ఈ పన్ను వల్ల సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వినోదపు పన్ను 15 శాతం నుంచి 20 శాతం మధ్యలోనే ఉందని తెలిపారు. జీఎస్టీ వల్ల ఈ శాతం 28 శాతానికి పెరుగుతుందని... తద్వారా సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని వివరించారు. వినోదపు పన్ను ద్వారా ఏటా రూ.120 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర, గ్రామ పంచాయితీలకు ఈ ఆదాయం నేరుగా వెళ్లేదని... ఇప్పుడు దీన్ని జీఎస్టీలో చేర్చటం వల్ల ఈ పన్ను మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు... సినిమా టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతాయని చెప్పారు.

వినోదపు పన్నుకు కత్తెర...

ఇప్పటి వరకూ వివిధ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న సినిమాలకు రాష్ట్రాలు వినోదపు పన్నులో రాయితీనిచ్చేవి. కానీ ఈ పన్ను మినహాయింపుల వల్ల నిర్మాత లాభపడతాడు.. కానీ సగటు సామాన్య ప్రేక్షకుడికి మాత్రం సినిమా టిక్కెట్‌ ధర తగ్గదు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలుతో వినోదపు పన్ను మినహాయింపులకు ఎలాంటి ఆస్కారం (వినోదపు పన్ను కేంద్రం పరిధిలోకి వెళుతుంది కాబట్టి...) ఉండదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక సినిమాకు రాయితీ, పన్ను మినహాయింపునివ్వాలంటే... అందుకు సంబంధించిన సొమ్మును తానే భరించాల్సి ఉంటుంది.

సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు థియేటర్ యాజమాన్యాలకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సినిమా టికెట్ల ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. టికెట్ ధర గరిష్టంగా రూ. 20, కనిష్టంగా రూ. 10 పెంచేందుకు హోంశాఖ అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీ, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. టికెట్ ధరలోనే థియేటర్ నిర్వహణ వ్యయం, ఆన్‌లైన్ ఛార్జీలు ఉండనున్నాయి. జీఎస్టీ వసూలు కలిపి సినిమా టికెట్‌పై ముద్రించాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు.

నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో

నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో 20 శాతం సీట్లు లోయర్ క్లాస్‌కు ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధి ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ ధర రూ. 120, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 40, నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ రూ. 60, లోయర్ క్లాస్ టికెట్ ధరూ. 20, మున్సిపాలిటీల్లోని ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ ధర రూ. 80, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 30, నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ రూ. 60, లోయర్ క్లాస్ ధర రూ. 20, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో బాల్కనీ ధర రూ. 70, లోయర్ క్లాస్ ధర రూ. 20, నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ ధర రూ. 50, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 15గా నిర్ణయించారు.

సినిమాహాల్స్ ఆధునీకరణ కోసం

సినిమాహాల్స్ ఆధునీకరణ కోసం రూ. 2 నుంచి రూ. 7, నాన్ ఏసీ థియేటర్లలో రూ. 2 నుంచి రూ. 5 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్‌ల్లో గోల్డ్, రాయల్ టికెట్ల ధరలు రూ. 300 మించకూడదని వెల్లడి చేశారు. ఎగ్జిక్యూటివ్ టికెట్ల ధరలు రూ. 200 మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

15:50 - June 16, 2017

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి చనిపోతే.. పరామర్శించడానికి వెళ్లిన తన మీద 4 సెక్షన్లపై కేసు పెట్టారని మండిపడ్డారు. తప్పుడు ప్రెస్‌ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? కాదా అని ప్రతాప్‌ రెడ్డి ప్రశ్నించారు. 

15:51 - June 15, 2017

కరీంనగర్ : వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు చేస్తున్న సమ్మె విజయవంతమైందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. వారసత్వ ఉద్యోగాల డిమాండ్‌ సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని నేతలు హెచ్చరిస్తున్నారు. గుర్తింపు యూనియన్‌, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై కార్మికుల కుటుంబాల జీవితాల్లో మట్టి కొట్టాలని చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే.. భవిష్యత్‌లో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. 

14:57 - May 24, 2017

హైదరాబాద్: ఫీజుల విషయంలో ప్రైవేటు స్కూల్స్ నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు లెక్కలు చూపించి లాభాలు గడిస్తున్నాయి. అలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే డ్రాఫ్ట్ రిపోర్టును తయారు చేసిన ఫీజుల నియంత్రణ కమిటి దీనికి సంబంధించి ఈనెల 29న ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

కమిటీ నివేదిక తరువాతే
ఇందులో భాగంగా ఫీజుల నియంత్రణ కమిటి ప్రతి ప్రైవేటు స్కూల్ వద్దకు వెళుతుంది. అలా వచ్చిన కమిటీ మెంబర్స్ కు స్కూల్ యాజమాన్యం ఆడిటెడ్ అకౌంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిగా ఉన్నాయో లేదో కమిటీ పరిశీలిస్తుంది. లెక్కల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అటువంటి స్కూళ్ల జాబితాను ప్రభుత్వానికి అందజేస్తుంది. ప్రభుత్వ తనిఖీల్లోనూ ఏ మాత్రం తేడాలు జరిగినట్లు తేలినా ఆ స్కూలు అనుమతి రద్దు అవుతుంది. అయితే కమిటి నివేదిక తరువాతే ప్రభుత్వం ఫీ నియంత్రణపై గత నెలలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం చెప్పినప్పటికీ తాము నిరంతరం ఫీజుల నియంత్రణపై శ్రమించామని తమకు తక్కువ సమయం ఇవ్వడం వల్లే ఆలస్యమైందని అంటున్నారు తిరుపతిరావు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించబోతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నివేదికలో సూచించే ప్రతీది న్యాయసలహాతో కూడినదని.. అందుకే ఫీ రెగ్యులేషన్ చేపట్టిన తరువాత ప్రభుత్వమే దానికి చట్టబద్ధత కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ తమ స్కూళ్లలోనే డ్రెస్సులు,బుక్స్, స్టేషనరీ అమ్మకాలు చేపడుతున్నాయని ఇలా నిబంధనలు అతిక్రమించే పాఠశాలలపై చర్యలు తప్పవని తిరుపతిరావు హెచ్చరించారు.

 

14:48 - May 19, 2017

హైదరాబాద్: గ్రామీణ రహదారులు..నరకానికి నకళ్లు. ఎక్కడ చూసినా గుంతలే. బైక్‌ మీద వెళ్లినా, ఆటోలు, బస్సులో ప్రయాణించినా నడుములు విరిగే పరిస్థితి. ఇటువంటి రోడ్లకు ఇకపై మహర్దశ పట్టనుంది. అన్ని రహదారులను అద్దంలా మెరిసిపోయేలా అందంగా తీర్చి దిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రోడ్లు సౌకర్యంలేని పంచాయతీలు 423 ......

తెలంగాణలో ఇంకా చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. మొత్తం 423 గ్రామ పంచాయతీలకు రహదారులు లేవు. అలాగే 5,534 కాలనీలకు రోడ్డు సౌకర్యంలేదు. కొత్త రోడ్లు మంజూరులో వీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కానీ రోడ్ల నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతోంది. దీంతో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడంలేదు. ఇకపై ఈ దుస్థితికి స్వస్తి పలికేందుకు గ్రామీణ రహదారుల అభివృద్ధి సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఎంజీఎస్‌వై కింద 2001 నుంచి ఇప్పటి వరకు 2,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 10,184 కి.మీ. రోడ్లు నిర్మించారు. మరో 51 రోడ్లు, 26 వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింది 2016-17లో మంజూరైన 205.65 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటితో చేపడుతున్న 37 రోడ్లు, 117 వంతెనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతతో పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిఘా పెడతారు.

రోడ్ల నిర్మాణానికి బ్యాంకు రుణాలు .....

కొత్తగా నిర్మించాల్సిన రహదారులకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వారం రోజుల్లో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంచనాలు పెంచకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. నిధుల కొరత ఉంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు వేసే కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంతలు పడినా కాంట్రాక్టర్లే మరమ్మతులు చేసేలా నిబంధనలను రూపొందించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ప్రస్తుతం ఉన్న రోడ్లకు రిపేర్లు చేయాలని సర్కారు నిర్ణయించింది. 

09:36 - May 8, 2017

హైదరాబాద్: అంతన్నారు .. ఇంతన్నారు.. చివరికి మొండిచెయ్యి చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హామీల వర్షం కురిపించిన పాలకులు సైలెంట్‌ అయ్యారు. పదోన్నతులపై గంపెడాశలు పెట్టుకున్న .. పాఠశాల ఉపాధ్యాయులు నిరాశలో ముగినిపోయారు. కోర్టు ఉత్వర్వులున్నా..తెలంగాణ సర్కార్‌ లెక్కచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అటకెక్కిన ప్రభుత్వ ఉత్వర్వులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావిడిగా ఇచ్చిన ఉత్తర్వులు అటకెక్కాయి. స్కూల్‌టీచర్లు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌లు కల్పించిన ప్రభుత్వం.. ఎస్‌జీటీలను పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టుమెట్లెక్కారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సర్వీస్‌రూల్స్‌ మార్చి పదోన్నతులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

భాషాపండితులు, పీఈటీలకు అప్‌గ్రేడ్‌ ఇస్తూ ఫిబ్రవరి 3న జీవోలు 17, 18 జారీ

ఉపాధ్యాలయు పోరాట ఫలితంగా ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. భాషాపండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా, వ్యాయామ టీచర్ల పోస్టులను పీడీలుగా మారుస్తూ ఫిబ్రవరి 3న జీవో నంర్‌లు 17, 18లను జారీ చేసింది. ఈ ఉత్వర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 2487 లాంగ్వేజ్‌ పండితులు, 1047 పీఈటీ పోస్టులు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. అయితే.. ఇక్కడ ఆర్థిక శాఖ కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించిందనే విమర్శలు వస్తున్నాయి. అప్‌గ్రెడేషన్‌ ఉత్వర్వులతోపాటు పాఠశాల విద్యాశాఖ ఇవ్వాల్సిన అర్హతలు, సీనియారిటీ లిస్టును కూడా ఆర్థికశాఖే ఇచ్చేసింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులకు సాంకేతిక సమస్యలు సృష్టించినట్టైంది.

ఆర్థికశాఖ నిర్వాకంపై కోర్టుకెళ్లిన సెకండరీ గ్రేడ్‌ టీచర్లు

ఆర్థికశాఖ నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ రెండు నెలల కిందటనే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు .. పదోన్నతులు ఇవ్వాలనుకుంటే.. అంతకు ముందున్న సర్వీస్‌రూల్స్‌ మార్చుకోవచ్చిన ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయిందని ఎస్జీటీలు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన మంత్రులు, తర్వాత పట్టనట్టే వ్యవహరిస్తున్నారని భాషాపండితులు, పీఈటీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సర్వీస్‌రూల్స్‌ సవరించి అప్‌గ్రేడేషన్‌ ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి .. ఈవేసవి సెలవులు ముగిసేలోగా తమకు న్యాయం చేయాలని భాషాపండితుల, వ్యాయామ ఉపాధ్యాలు కోరుతున్నారు. తాత్కాలిక సర్వీసు నిబంధనలను సవరించి .. అపగ్రేడ్‌ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది.

06:57 - April 27, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ ప్రభుత్వానికి కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైంది. 2013 భూ సేకరణ చట్టాన్ని బైపాస్‌ చేస్తూ.. కేసీఆర్‌ సర్కారు ప్రతిపాదించిన సరికొత్త చట్టాన్ని కేంద్రం వెనక్కి తిప్పిపంపింది. బిల్లుకు మార్పులు చేసి పంపాలని సూచించడంతో.. తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈనెల 30 ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సవరణలు ఆమోదించాలని భావిస్తోంది టీఆర్‌ఎస్‌ సర్కార్‌.

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని తోసిరాజంటూ..

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని తోసిరాజంటూ.. సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించిన కేసీఆర్‌ ప్రభుత్వానికి హస్తినలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక తెలంగాణ భూ సేకరణ బిల్లు యథాతథ ఆమోదానికి కేంద్రం నో చెప్పింది. 2013 భూ సేకరణ చట్టానికి లోబడి ప్రత్యేక చట్టం ఉండాలని..విపక్షాలు, నిపుణులు, ప్రజా సంఘాలు నెత్తీనోరు బాదుకుని చెప్పినా వినకుండా, అంసెబ్లీలో సంఖ్యాబలం అండగా, కేసీఆర్‌ సర్కారు భూసేకరణ కొత్త బిల్లును పాస్‌ చేయించి, రాష్ట్రపతి అమోదానికి పంపింది. ఈ బిల్లు గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ బిల్లు తరహాలో ఉంటుందని.. మోదీ ప్రభుత్వం ఈజీగా ఆమోద ముద్ర వేస్తుందని ఆశించింది. కానీ హస్తినలో సీన్ రివర్స్ కావడంతో టీఆర్ఎస్‌ కంగుతింది.

కేసీఆర్‌ ప్రభుత్వానికి హస్తినలో చుక్కెదురు....

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త భూ సేక‌ర‌ణ చట్టం బిల్లు డ్రాప్ట్‌పై కేంద్ర న్యాయశాఖ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కలెక్టర్లకు ఫెయిర్ compensation ఇస్తామని అనే పదం.. ascertain బదులు revisit అనే పదం పెట్టమని.. అలాగే క్లాస్ 3,10లనూ తొలగించమని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేదు. దీంతో గుజ‌రాత్ త‌ర‌హా భూ సేక‌ర‌ణ విధానాన్ని తెలంగాణ‌లోనూ అమ‌లు చేసేందుకు కేబినెట్‌లో చర్చించింది. రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో అధ్యయన కమీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల పేరుతో కొత్త భూ సేకరణ చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించింది. దీని ద్వారా పరిహారం త్వరగా చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పింది.

బిల్లుపై కేంద్ర న్యాయశాఖ అభ్యంతరాలు ....

ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారిందని గుర్తించిన ప్రభుత్వం గతంలో 123 జీవో తెచ్చింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయే బాధితులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మరోవైపు మెదక్ జిల్లాలో నిమ్జ్ భూసేకరణ విషయంలో కొందరు రైతు కూలీలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో భూ నిర్వాసితులకు,రైతు కూలీలకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూసేకరణకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన సర్కార్.. హడావుడిగా కొత్త బిల్లును రూపొందించింది.

భూసేకరణ అడ్డంకులను అధిగమించేందుకు 123 జీవో ...

ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసిఆర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిసి.. ప్రత్యేక తెలంగాణ భూసేకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని కోరారు. మార్పులు అనివార్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో చేసేది లేక సీఎం కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. వచ్చీరాగానే రెవిన్యూ,నీటి పారుదల శాఖ అధికారులు, సిఎస్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. కేంద్రం ఎత్తి చూపిన లోపాలను అధిగమించే విషయంపై న్యాయనిపుణులతో చర్చించారు.

బిల్లును ఆమోదించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరిన కేసీఆర్‌ .....

కేంద్రం చెప్పినట్లు మార్పులు చేర్పులు చేసినా.. బిల్లును తిరిగి అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. సంఖ్యా బలంతో బిల్లు మరోసారి ఆమోదం పొందినా.. ప్రతిపక్షాల నుంచి సర్కార్‌కు ఇక్కట్లు తప్పేలా లేవు. ఈనెల 30న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సవరణలు ఆమోదించాలని సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - తెలంగాణ సర్కార్