తెలుగు రాష్ట్రాలు

22:53 - September 14, 2017
09:12 - September 4, 2017

హైదరాబాద్ : మోదీ కేబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. రెండు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా మంత్రిపదవి దక్కలేదు. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరె శ్రీరాంలకు ఛాన్స్‌ ఉందంటూ చివరి క్షణం వరకు జరిగిన ప్రచారం వట్టిదే అని తేలిపోయింది. వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ స్థానాల్లో ఒక్కరికైనా అవకాశం ఇస్తారని భావించినా.. చివరికి  ఫలితం దక్కలేదని తెలుగు రాష్ట్రాల కాషాయపార్టీ నేతలు మధనపడుతున్నారు.
అధిష్టానంపై కాషాయ నేతల ఆగ్రహం 
కేంద్ర మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. పైగా తెలంగాణ నుంచి ఉన్న దత్తాత్రేయను తప్పించి.. ఒక్కరికి కూడా స్థానం ఇవ్వకపోవడంపై కాషాయదళంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 
వెంకయ్య, దత్తాత్రేయ స్థానంలో ఎవరికీ దక్కని చోటు
మోదీ అధికారం చేపట్టాక తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఏపీ నుంచి వెంకయ్యనాయుడు, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు అవకాశం ఇచ్చారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాగా .. పునర్య్వస్థీకరణలో దత్తాత్రేయకు మోదీ టాటా చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్‌లో స్థానమే లేకుండా పోయింది.  అయితే ఏపీ నుంచి కంభంపాటి హరిబాబు,  తెలంగాణ నుంచి మురళీధర్‌రావు, రాంమాధవ్‌, వెదిరే శ్రీరాంలో ఎవరో ఒకరికి చోటు దక్కుతుందన్న ప్రచారం సాగింది. కాని ఎవరికీ మంత్రిపదవి దక్కక పోవడంతో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొంది. అదిగో, ఇదిగో  మంత్రిపదవులు అంటూ ..ఎంతో ఊరించి ఉసూరు మనిపించారంటూ అధిష్టానంపై తెలుగురాష్ట్రాల బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 

14:32 - September 3, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంత్రిర్గాన్ని పునర్వవస్థీకరించారు. కొత్తగా తొమ్మిది మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త మంత్రులతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు సహాయ మంత్రులుగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్‌, పియూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కేబినెట్‌ ర్యాంకు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త మంత్రులుగా అశ్వినీకుమార్‌ చౌబే, గజేంద్రసింగ్‌ షెకావత్‌, వీరేంద్ర కుమార్‌, శివప్రతాప్‌ శుక్లా, అనంతకుమార్‌ హెగ్డే, సత్యపాల్‌సింగ్‌ ప్రమాణం చేశారు. అలాగే మాజీ బ్యారోక్రాట్స్‌ హర్దీప్‌సింగ్, ఆర్‌కేసింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థానం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరితో మంత్రులతో ప్రమాణం చేయించారు.

మోదీ మంత్రివర్గంలో చేని అశ్వినీకుమార్‌ చౌబే బీహర్‌లోని బక్సర్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌ అసెంబ్లీకి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1974-75లో బీహార్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర జౌళి మండలిలో సభ్యుడుగా ఉన్నారు. బీహార్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన అశ్వినీకుమార్‌ చౌబే, ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపారు. పాట్నా యూనివర్సిటీ సైన్స్‌ కాలేజీ నుంచి జంతుశాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. బీహార్‌ దళిత కుటుంబాలకు 11 వేల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు.

గజేంద్రసింగ్‌ షెకావత్‌ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. షెకావత్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. జోధ్‌పూర్‌లోని జై నారాయణ్‌ వ్యాస్‌ యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో ఎంఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అఖిల భారత క్రీడా సంఘం సభ్యుడుగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడుగా కొనసాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో యువతకు చేరువయ్యారు.

మోదీ మంత్రివర్గంలో చేరిన శివ్రపతాప్‌ శుక్లాఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోరఖ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయవాదిగా పనిచేసిన శివప్రతాప్‌ శుక్లాకు ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. చేపట్టిన శాఖల్లో సంస్కరణలు తేవడం ద్వారా విశేష గుర్తింపు పొందారు. ఎమర్జెన్సీలో 19 నెలలపాటు జైలు జీవితం అనుభవించారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడుగా ఉన్నారు.

కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన హర్దీప్‌సింగ్‌ పూరీ 1974 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. దౌత్యవేత్తగా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం. 2009-13 మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీ, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీల్లో ఉన్నత విద్య చదివారు. విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు. ప్రస్తుతం ఆర్ఐఎస్‌ అనే మేధో సంస్థకు అధ్యక్షుడుగా ఉన్నారు. గతంలో అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు.

కేంద్ర మంత్రిగా పనిచేసిన సత్యపాల్‌సింగ్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సత్యపాల్‌ సింగ్‌ ముంబై, పుణె మాజీ పోలీస్‌ కమిషనర్‌గా పని చేశారు. 2014లో యూపీలోని బాగ్‌పత్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ, ఎంఫిల్‌ ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేశారు. నక్సల్స్‌ ఉద్యమంపై పీహెచ్‌డీ చేశారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సల్స్‌ నియంత్రణలో కృషికి ప్రత్యేక సేవా పతకం అందుకున్నారు. హోం శాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడుగా ఉన్నారు.

రాజ్‌కుమార్‌సింగ్‌ 1975 బీహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సేవలు అందిచారు. ప్రస్తుతం బీహార్‌లోని ఆరా లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎంఏతోపాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. నెదర్లాండ్స్‌లోని ఆర్‌వీబీ డెలెప్ట్‌ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య చదివారు. ప్రస్తుతం వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాలలో సభ్యుడుగా ఉన్నారు.

కేంద్ర మంత్రివర్గంలో చేరిన అల్ఫోన్స్‌ కన్నన్‌థానం కేరళ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.కొట్టాయం జిల్లా కలెక్టర్‌గా విధుల నిర్వహించారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసిన అల్ఫోన్స్‌... 15వేల అక్రమ నిర్మాణాలను కూల్చివేయించడం ద్వారా ఖ్యాతి పొందారు. 1994లో జన్‌శక్తి ఎన్జీవో ఏర్పాటుచేసి, ప్రజలకు సేవ చేశారు. 2006-11 మధ్య కేరళలోని కంజీరపల్లి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 994లో టైమ్స్‌ మ్యాగజైన్‌ వంద మంది యువ నాయకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కేంద్ర మంత్రివర్గంలో చేరిన వీరేంద్రకుమార్‌ మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌ ఎస్సీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభకు ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆర్థికశాస్త్రంలో ఎంపీ, బాలకార్మిక వ్యవస్థపై పీహెచ్‌డీ చేశారు. ఎమర్జెన్సీలో 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. కార్మిక సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడుగా ఉన్నారు.

మోదీ మంత్రివర్గంలో చేరిన అనంత్‌కుమార్‌ హెగ్డే ఉత్తర కన్నడ (కర్నాటక) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభకు వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో పని చేసిన అనుభవం ఉంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. 

12:05 - September 3, 2017

ఢిల్లీ : మోదీ కొత్త టీమ్‌ ప్రమాణ స్వీకారం చేసింది. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే నిర్మలాసీతారామన్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ, పీయూష్‌గోయల్‌కు పదోన్నతి కల్పించి... కేబినెట్‌ హోదా ఇచ్చారు. ఇక కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఇచ్చారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయను పదవి నుంచి తప్పించారు. ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ఊహాగానాలు సాగినా.... చివరకు మొండిచేయ్యే మిగిలింది. 

 

10:40 - September 3, 2017

హైదరాబాద్  : మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కేబినెట్‌ విస్తరణలో కొత్తగా 9 మందికి అవకాశం కల్పించనున్నారు. వీరిలో మధ్యప్రదేశ్‌ తికమ్‌గడ్‌ ఎంపీ వీరేంద్రకుమార్‌,... ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివప్రతాప్‌ శుక్లాకు అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా... ఉత్తర కర్నాటక నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతకుమార్‌ హెగ్డేకు అవకాశమివ్వనున్నారు. ఇక ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి.. సత్యపాల్‌సింగ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. ఇక అశ్వినీకుమార్‌చౌబే, గజేంద్రసింగ్‌ షెకావత్‌, హర్దీప్‌సింగ్‌పూరీ, రాజ్‌కుమార్‌సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనంలకు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. అయితే ఈ కెబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఎదురైంది. కంభంపాటి హరిబాబు, వెదిరే శ్రీరామ్‌లకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చినా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కొత్త కేబినెట్‌లో జేడీయూ, శివసేనలకు కూడా అవకాశం దక్కలేదు. కేవలం పలు రాష్ట్రాల ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

 

18:33 - August 30, 2017

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో మెడికల్ సీట్ల భర్తీ లోపాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్టీఆర్, కాళోజీ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీలో లోపాలు జరిగాయని హైకోర్టులో 20కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై తెలంగాణలో జరిగిన మెడికల్ సీట్ల భర్తీతో పాటు బి, సి కేటగిరీ నివేదికను కాళోజీ యూనివర్సిటీ హైకోర్టుకు అందించింది. జీవో నెంబర్ 550 క్లాజ్‌ 5(2)ను కోర్టు సస్పెండ్ చేసింది. మెరిట్ ద్వారా పొందిన సీటును మెరిట్‌తోనే భర్తీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మరికొన్ని పిటిషన్లపై రేపు కూడా విచారణ జరపనుంది. 

12:23 - August 25, 2017

హైదరాబాద్ : వినాయక చవితి పండగ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి.. గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, అయినవిల్లి, విశాఖలోని సంపత్‌ వినాయక ఆలయం సహా.. ప్రముఖ ఆలయాలన్నీ పండగా వాతావరణంతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ వినాయక ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా వెలసిన గణేషులతో సందడి నెలకొంది. 

21:28 - August 22, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు స్తంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ రుణాల రద్దు, బ్యాంకింగ్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పదిలక్షల మంది ఎంప్లాయిస్‌ సమ్మెబాట పట్టారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఉద్యోగంఘాలు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, నష్టాలపేరుతో బ్యాంకుల మూసివేత, నిరర్థక ఆస్తుల రైటాఫ్‌ను వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాకింగ్‌ కార్యాకలాపాలు స్తంభించాయి. హైదరాబాద్‌లో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ధర్నాలకు దిగారు. కోటిలోని ఎస్‌బీఐ దగ్గర నిరసనలో పలువురు నేతలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేశారు. విజయవాడలో జరిగిన బ్యాంకు ఉద్యోగుల ధర్నాలో వందలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చింది.

పబ్లిక్‌సెక్టార్‌ బ్యాంకింగ్‌ రంగాన్ని దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభత్వం కుట్రలు చేస్తోందని కార్మికసంఘాల నేతలు విమర్శించారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉద్యోగులు సమ్మెకు దిగారు. కంబాల చెరువు వద్దనున్న ఎస్.బి.ఐ మెయిన్ బ్రాంచ్ వ్దద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంకింగ్‌ రంగాన్ని కుంగదీసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జీవీఎంసీ వద్ద బ్యాంకు ఎంప్లాస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్‌ రుణాల రద్దు చేయకుండా ఉండడం, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను నేరపూరిత చర్యగా ప్రకటించడం, ఎన్‌పీఏల వసూలుకు పార్లమెంటరీ కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయాలన్న డిమాండ్‌లతో సమ్మెకు దిగినట్టు బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు.

అటు కడప, అనంతపురం జిల్లాలో ప్రభుత్వ రంగబ్యాంకులు మూతపడ్డాయి. పలుచోట్ల బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. బ్యాంకులను ప్రవేటు పరం చేయడం, పదమూడు లక్షలకోట్ల ప్రవేటు సంస్థల మొండి బకాయిలను వసూలుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. భారీ మొత్తంలో రుణాలు ఎగవేస్తున్న కార్పొరేట్‌ బడాబాబుల ఆస్తులు జప్తు చేసి బ్యాంకింగ్‌ వ్యవస్థను కాపాడాలని నినాదాలు చేశారు. ప్రకాశంజిల్లాలో బ్యాంకు ఎంప్లాయిస్‌ పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. విలీనాల పేరుతో బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని యూనియన్‌ నేతలు ఆరోపించారు.

కారుణ్య నియమకాలు వెంటనే చేపట్టాలని బ్యాంకు బొర్డులలో ఉద్యొగ డైరెక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్‌చేస్తూ .. నిజామాబాద్‌ జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఎస్.బి.ఐ.మెయిన్ బ్రాంచ్ ముందు ఉద్యొగులు ఆందోలన చేపట్టారు ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. తక్కువ వేతనాలతో ప్రవేటు బ్యాంకులు ఉద్యోగుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నాయని గుంటూరు జిల్లా బ్యాంకు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేట్ కంపెనీలు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేస్తువుంటే వారిపై చర్యలు తీసుకోకుండా.. నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు.

1969లో బ్యాంకుల జాతీయకరణతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఇపుడు కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడికి బ్యాంకులు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాలనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్‌ రంగానికి నిరర్థక ఆస్తులు కేన్సర్‌లా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కష్టఫలితంగా వచ్చిన ప్రాఫిట్‌ను బడాబాబులకు ధారపోశారని విమర్శించారు. రెండున్నర లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాల రద్దు చేసి..నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిన్నిటకి వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 15న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీఎత్తున నిరసనకు దిగుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. 

19:30 - August 21, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మండిపడుతున్న బ్యాంకు యూనియన్ నేతలతో టెన్ టివి ముచ్చటించింది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:41 - August 21, 2017

హైదరాబాద్ : అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య.. తెలుగు రాష్ట్రాలు రెండూ సహకరించుకుంటూ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. రాష్ట్రవిభజన జరిగింది ఒకరికి వ్యతిరేకంగా కాదన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికేనని తెలిపారు. కలిసి కలహించుకోవడంకన్నా... విడిపోసి సహకరించుకోవడం మిన్నని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు సహజమేనని... వాటిని సీఎంలు కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇద్దరు సీఎంలు వ్యహరించాలన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒకటేనని.. తెలుగువారైనందుకు గర్వించాలన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - తెలుగు రాష్ట్రాలు