దక్షిణాఫ్రికా

15:19 - March 25, 2018

సౌత్ ఆఫ్రికా : ఆసిస్ క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వివాదం కారణంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. మూడవ టెస్ట్ చివరి రెండు రోజులకు పైన్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. వివాదానికి సంబంధించి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రులియా స్పోర్ట్స్ కమిషన్ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతుండగా మిగిన ఉన్న రెండు రోజులకు ఆసీస్‌ జట్టు మరో ఆటగాడు టిమ్‌ పైన్‌ సారథ్య బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ యథావిధిగా జట్టులోనే కొనసాగుతారు. 

22:07 - February 4, 2018

దక్షిణాఫ్రికా : టెస్టు సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోంది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందు బౌలింగ్‌లో చెలరేగిన టీమిండియా తర్వాత బ్యాటింగ్‌లో విరుచుకుపడింది. కేవలం ఒక వికెట్ కోల్పోయి.. లక్ష్యాన్ని చేరుకుంది. 

తొలి వన్డేలో ఓటమితో ఆత్మవిశ్వాసం లోపించడం, గాయాలతో సారథి డుప్లెసిస్‌, సీనియర్‌ ఆటగాడు డివిలియర్స్‌ జట్టుకు దూరం కావడంతో... సౌతాఫ్రికా... సొంతగడ్డపైనే కష్టపడుతోంది. తొలి వన్డేలో ఓడిన సఫారీలు.. సెంచూరియన్‌లో జరిగిన రెండోవన్డేలో ఏమాత్రం ప్రతిఘటన చూపలేకపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్... సఫారీలను ఏమాత్రం నిలవనీయలేదు. ఆతిథ్యజట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మణికట్టు స్పిన్‌ ద్వయం యజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కకావికలం చేశారు. సఫారీ జట్టును తమ సొంతగడ్డపైనే తొలిసారి అత్యంత తక్కువ స్కోరు 118కి ఆలౌట్‌ చేశారు. ఆరంభంలో హషీమ్‌ ఆమ్లా, డికాక్ దూకుడుగానే బ్యాటింగ్ ప్రారంభించారు. తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆమ్లాను ఔట్‌ చేయడం ద్వారా భువనేశ్వర్‌ ఈ జోడీని విడదీశాడు. జట్టు స్కోరు 51 వద్ద మరో ఓపెనర్‌ డికాక్‌ను పెవిలియన్‌ పంపించి చాహల్‌ విజృంభించాడు. ఆ తర్వాత ఓవర్‌లో తాత్కాలిక సారథి మార్కమ్‌, డేవిడ్‌ మిల్లర్‌ ను ఔట్‌ చేసి భారీ దెబ్బ కొట్టాడు కుల్‌దీప్‌. దీంతో 51 వద్దే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు చేజార్చుకుంది. ఆ తరువాత డుమిని, జొండొ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు 99 వద్ద జొండోను, 107 వద్ద డుమినిని చాహలే పెవిలియన్‌కు పంపడంతో సఫారీల కథ దాదాపు ముగిసింది. టెయిలెండర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో... సౌతాఫ్రికా 118 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా చివరి ఆరు వికెట్లను 19 పరుగుల వ్యవధిలో చేజార్చుకోవడం గమనార్హం. చాహల్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా అవతరించాడు. 

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 15 పరుగుల వ్యక్తిగత స్కోరుకే ఔటైనా... ధావన్, కెప్టెన్ కోహ్లీ... స్కోరుబోర్డును పరుగెత్తించారు. మరో వికెట్‌ పడకుండా 20.3 ఓవర్లలోపే జట్టుకు విజయాన్ని అందించారు. అయితే విజయానికి మరో 2 పరుగులు ఉండగా... లంచ్ బ్రేక్ వచ్చింది. సఫారీల ఇన్నింగ్స్‌ త్వరగా ముగియడంతో టీమిండియా.. లంచ్ కంటే ముందే బ్యాటింగ్‌కు దిగింది. దీంతో మరో రెండు పరుగులు చేస్తే విజయం వరిస్తుందనగా నిబంధనల ప్రకారం అంపైర్లు ఆటకు విరామం ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. ధావన్ 51 పరుగులు చేయగా... కోహ్లీ 46 రన్స్ చేశాడు. 5 వికెట్లు తీసిన చాహల్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

18:52 - February 4, 2018

దక్షిణాఫ్రికా : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్‌లో సౌతాఫ్రికాను కట్టడి చేసిన భారత్... బ్యాటింగ్‌లోనూ విజృంభించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 20.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. దావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా..కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేశాడు. అంతకుముందు 118 పరుగులకే  సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. చాహల్, కుల్‌దీప్ దెబ్బకు సఫారీలు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చాహల్‌ 5 వికెట్లు తీశారు.  

 

17:22 - February 4, 2018

దక్షిణాఫ్రికా : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ బౌలింగ్ దెబ్బకు సఫారీలు విలవిలలాడిపోయారు. చాహల్, కుల్‌దీప్ చెలరేగిపోవడంతో... 118 పరుగులకే సౌతాఫ్రికా పెవిలియన్ చేరింది. 32.2 ఓవర్లకే సఫారీలు ఆలౌట్ అయ్యారు. చాహల్ 5 వికెట్లు తీయగా.. కుల్‌దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, బుమ్రా.. చెరో వికెట్ తీశారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డుమిని, జోండో చెరో 25 పరుగులు చేయగా.. ఆమ్లా 23, డికాక్ 20 రన్స్ చేశారు. ఇద్దరు డకౌట్ కాగా.. మరో ఇద్దరు ఒక పరుగుకే ఔటయ్యారు. 

 

09:34 - January 26, 2018

దక్షిణాఫ్రికా : వాండరర్స్‌ టెస్ట్‌ రెండో రోజు సైతం బౌలర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. తొలి రోజు భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోగా...రెండో రోజు భారత బౌలర్ల ధాటికి సఫారీ  బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. డీన్‌ ఎల్గార్‌, ఐడెన్‌ మర్కామ్‌, డివిలియర్స్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ బోల్తా కొట్టించగా...నైట్‌ వాచ్‌మన్‌ రబడను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు.కెప్టెన్‌ డు ప్లెసీ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.క్రీజ్‌లో పాతుకుపోయిన హషీమ్‌ ఆమ్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టెస్టుల్లో 37వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఆమ్లా 121 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.లోయర్ ఆర్డర్‌లో వెర్నోర్‌ ఫిలాండర్‌  కీలక  ఇన్నింగ్స్‌ ఆడాడు.194 పరుగులకు ఆలౌటైన  సఫారీ టీమ్‌ ..7 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా...భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశాడు.

 

06:35 - January 18, 2018

ఢిల్లీ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో విఫలమైంది.3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను సౌతాఫ్రికా మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో రెండో టెస్ట్‌లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టుకు సంచలన విజయాన్నందించాడు. 4వ ఇన్నింగ్స్‌లో 287 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి చేతులెత్తేశారు. 3 వికెట్లకు 35 పరుగులతో ఆఖరి రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.

అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన తొలి టెస్ట్‌లోనే లుంగీ నంగ్డీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్ కలిగిన భారత్‌కు చెక్‌ పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగిన నంగ్డీ...రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు తీసి భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు.రాహుల్‌,విరాట్‌ కొహ్లీ,హార్దిక్‌ పాండ్య,అశ్విన్‌,షమీ,బుమ్రా వికెట్లు తీసి భారత్‌ను 151 పరుగులకే కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు.

135 పరుగుల తేడాతో నెగ్గిన సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది.2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లు తీసి సౌతాఫ్రికా జట్టుకు సంచలన విజయాన్నందించిన లుంగీ నంగ్డీకే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. రెండు టెస్టుల్లోనూ బౌలర్లు అంచనాలకు మించి రాణించినా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో టీమిండియాకు సిరీస్‌ ఓటమి తప్పలేదు.

11:19 - January 13, 2018

ఢిల్లీ : సఫారీ గడ్డపై... బ్యాటింగ్‌లో ఆపసోపాలు పడుతున్న భారత్‌కు నేటి నుంచి రెండో గండం ప్రారంభమవుతుంది. తొలిటెస్టులో విజయానికి దగ్గరైనట్లే కనిపించి... చివర్లో ఓటమితో సరిపెట్టుకున్న కోహ్లీ సేన.. రెండో టెస్టుపై.. నమ్మకంతో ఉంది. సెంచూరియన్ పార్క్ వేదికగా... సౌతాఫ్రికాతో కోహ్లీ సేన సై అంటోంది. రెండో టెస్ట్‌లోఅన్ని విభాగాల్లో బలంగా  ఉన్న దక్షిణాఫ్రికా మరోసారి పేస్‌ బౌలింగ్‌తోనే భారత్‌ను  చిత్తు చేయాలని ప్లాన్‌లో ఉంది. 
సౌతాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైన టీమిండియా
భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌కు సెంచూరియన్‌ పార్క్‌ స్టేడియంలో రంగం సిద్ధమైంది. టెస్టు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా 2వ ర్యాంకర్‌ సౌతాఫ్రికాతో అమీతుమీకి సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్ట్‌కు కేప్‌టౌన్‌లో రంగం సిద్ధమైంది. తొలి టెస్ట్‌లో తేలిపోయిన కొహ్లీ అండ్‌ కో సెకండ్‌ టెస్ట్‌ నెగ్గాలని పట్టుదలతో ఉండగా....సిరీస్‌ విజయం సాధించాలని సఫారీ టీమ్‌ తహతహలాడుతోంది. 
బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత్‌ 
తొలి టెస్ట్‌లో బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్‌ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది.  విరాట్‌,పుజారా,విజయ్‌,ధావన్‌ ,రోహిత్‌ శర్మ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నా స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చేతులెత్తేసింది. రెండో టెస్ట్‌లో రహానే, రాహుల్‌ ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, మహమ్మద్‌ షమీ తొలి టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టారు. ఈ ముగ్గురిపై భారత జట్టు రెండో టెస్ట్‌లోనూ భారీ అంచనాలే పెట్టుకుంది. అశ్విన్‌ సైతం స్థాయికి తగ్గట్టుగా స్పిన్‌ మ్యాజిక్‌ చేస్తే భారత జట్టుకు బౌలింగ్‌లో తిరుగుండదు. 
భారత్‌ కంటే ధీటుగా సౌతాఫ్రికా  
మరోవైపు సౌతాఫ్రికా జట్టు భారత్‌ కంటే ధీటుగా ఉంది. కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌  విఫలమైనా....పేస్‌ బౌలర్లే సఫారీ టీమ్‌కు సంచలన విజయాన్నందించారు. టెస్ట్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ భారత్‌పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 34 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.భారత్‌ 10 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరి ఈ డూ ఆర్‌ డై టెస్ట్‌లో టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. 

 

08:38 - January 9, 2018

దక్షిణాఫ్రికా : టీమ్‌ ఇండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. సఫారీ గడ్డపై భారత్‌కు తొలి పరాభావం ఎదురైంది. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది.  పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక విరాట్‌సేన చతికిలపడింది.72 పరుగుల తేడాతో ఓడి... మూడుటెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికాకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది.
మొదటి టెస్ట్‌లో టీమ్‌ ఇండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్‌ ఇండియా ఓటమిపాలైంది. ఒకరోజు ఆట మిగిలి ఉండగానే చేతులెత్తేసింది. 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సఫారీ పేసర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు డ్రెస్సింగ్‌రూమ్‌ బాట పట్టారు.  రెండో ఇన్సింగ్స్‌లోనూ భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా... బ్యాట్స్‌మెన్‌ మాత్రం పరుగులు సాధించడంలో చేతులెత్తేశారు. 
భారత్‌కు 208 పరుగుల లక్ష్యం 
మొదటి టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి ఇన్సింగ్స్‌లో 286 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. టీమ్‌ ఇండియా తొలి ఇన్సింగ్స్‌లో భారత టాప్‌ఆర్డర్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో 209 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో సఫారీలు 77 పరుగుల ఆధిక్యం సాధించారు. రెండో ఇన్సింగ్స్‌లో దక్షిణాఫ్రికా 130 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. భారత్‌కు 208 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
భారత ఆటగాళ్లు ఘోర విఫలం 
సఫారీలు తమ ముందుంచిన 208 పరుగుల టార్గెట్‌ను చేరుకోవడంలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఓపెనర్లు ధవన్‌ 16 పరుగులు, విజయ్‌ 13 పరుగులు చేసి పెవిలియన్‌ చేఆరు. ఇక చతేశ్వర్‌ పుజారా  4 పరుగులు మాత్రమే చేసి మోర్కెల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు.  ఈ నేపథ్యంలో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చుతాడనుకున్న  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా 28 పరుగులకే అవుట్‌ అయ్యాడు.  రోహిత్‌ 10 రన్స్‌, హార్థిక్‌ ఒక రన్‌ చేసి స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఆశ్విన్‌, భువనేశ్వర్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 53 బాల్స్‌ ఆడిన అశ్విన్‌ ఐదు బౌండరీలు బాది 37 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. అదే ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ, బుమ్రా వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. దీంతో రెండో ఇన్సింగ్స్‌లో భారత జట్టు 135 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. 72 రన్స్‌ తేడాతో ఈ టెస్ట్‌మ్యాచ్‌ను కోల్పోయింది.  దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 తేడాతో లీడ్‌లోకి వెళ్లింది. ఫిలాందర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

 

22:11 - January 8, 2018

దక్షిణాఫ్రికా : సఫారీ గడ్డపై భారత్‌కు తొలి పరాభావం ఎదురైంది. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేన ఓటమి పాలైంది. నిన్నటి వర్షంతో.. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో... బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది టీమిండియా. కేవలం 135 పరుగులకే చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేసిన భారత్‌ విజయానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇవాళ ఉదయం ఓపెనర్లకు కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా... చకచకా వికెట్లు కోల్పోయింది. 130 పరుగులకే ఆలౌట్ అయ్యారు. షమీ, బుమ్రా చెరో 3 వికెట్ల చొప్పున, భువనేశ్వర్, పాండ్యా.. చెరో 2 వికెట్లు తీసారు. తరువాత 208 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన కోహ్లీసేనలో ఎవరు ఎక్కవ సేపు క్రీజులో నిలవలేదు. బాల్ టర్న్ అవడంతో... ఒక్కక్కరుగా పెవిలియన్ చేరారు. అశ్విన్ 37 పరుగులు, కెప్టెన్ కోహ్లీ 28 పరుగులు చేశారు. మిగిలిన వారంత తక్కువ సంఖ్యకే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్ ఫిలాండర్ 6 వికెట్లతో భారత్‌ను దెబ్బతీశాడు. 

 

17:57 - January 8, 2018

కేఫ్ టౌన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 130 పరుగులకు ఆలౌట్ అయింది. షమీ, బుమ్రాలు విజృంభించారు. దక్షిణాఫ్రికా 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - దక్షిణాఫ్రికా