దత్తత గ్రామం

19:53 - April 16, 2018

ఆదిలాబాద్‌ : ఎమ్మెల్యే తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో సమస్యలన్నీ తీరి అభివృద్ధి చెందుతుందని భావించారు గ్రామస్తులు. కానీ, నాలుగేళ్లు గడిచినా కనీసం ఎమ్మెల్యే గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలోని తేజాపూర్‌ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధే తప్ప ఇంతవరకు జరిగిందేమీ లేదంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:47 - February 17, 2018

ఈ కేకుల కటింగులు.. శంకుస్థాపనల సంగతేమోగని.. పాణాలు వోతుండే పబ్లీకుయి.. పొయ్యిపొయ్యి జోగురామన్న గూసున్న వేదిక టెంటుకే మంటలంటుకున్నయ్.. మంత్రిగారాయే.. కింద మందుండే.. మరి టపాకులు గాల్చిండ్రా.? ఏమైంది తెల్వదిగని.. మొత్తం మీద ఒక కుల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఆగమాగమైంది జర్ర శేపట్ల..

తలాపునే పారుతుంది గోదారి.. మనశేను.. మన చెలుక ఎడారి..? తెలంగాణ రైతు బత్కు అమాస.. చంద్రయ్య జేస్తున్నడు తమాష.. పాటలు ఇప్పుడు ఇట్ల వాడుకోవల్సొస్తదేమో అనిపిస్తున్నది.. కుద్దు మంత్రి కల్వకుంట్ల తారక రామారావుగారు దత్తత వట్టిన ఊర్లెనే మూడు నెళ్ల సంది తాగెనీళ్లు లేవంటే..? ఇది పారిపాలననేనా..? ప్రజల పాలనేనా సూడుండ్రి..

విదేశాల పొంట తిర్గి ఎంజాయ్ జేసుడుగాదు.. కల్వకుంట్ల తారక రామారావుగారూ.. నీకు ధమ్ము ధైర్యం ఉంటే.. ఒక్కసారి గల్ఫ్ కంట్రీలకు వొయ్యి.. ఆడున్న తెలంగాణ బిడ్డల నడ్మ నిలవడి సూడు అంటున్నరు కొంతమంది.. వేలమంది తెలంగాణ బిడ్డలు గల్ప్ దేశం బొయ్యి మోసపోతుంటే.. నువ్వు దావోసులు.. సింగపూర్లు లండన్లు తిర్గుకుంట.. ఏం కమాయి జేస్తున్నవయ్యా అనేది వాళ్ల మాట..

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారు.. ఇగో ఇప్పుడు నేను జూపెట్టవోవే సావు.. మీ ఖాతల జమగావాల్సిన సావే.. మంచిగ పేదోళ్లకు ఎప్పటి లెక్కనే కంట్రోలు బియ్యం ఇయ్యక కథల వడ్తివి.. పాపం నీ ఏలిముద్రల సిగ్నల్ కోసం ఇల్లెక్కితె.. జారిపడి సచ్చిపోయింది ముసలామే.. ఈ పాపం మీరు జేశిందే అనేది జనం మాట..

మల్కాజ్ గిరి మల్లా రెడ్డి మళ్ల ఏశిండుగదా..? భారతదేశంలనే పెద్దనియోజకవర్గం మల్కాజ్ గిరి.. దానికి ఎంపీని నేను.. మల్లారెడ్డి.. మల్లారెడ్డి.. కని మల్లారెడ్డితోని ఏం పనిగాకున్నా.. మాటలైతె మంచిగుంటయయ్యా.. ఎన్కట డ్రామాలాడుతుంటే.. నడ్మిట్ల బుడ్డరఖాన్ తీర్గ ఒక్కడొస్తడు సూడుండ్రి.. అగో ఆ తరీఖల వచ్చి నవ్విస్తాఉంటడు.. మరి ఇయ్యాళ ఏం జేశిండో సూడుండ్రి..

నిత్య నిరసన వాది.. శ్రీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు.. ఇయ్యాళ ఇంకో వెరైటీ నిరసన వెట్టిండు.. ఏ వేదిక కాడికెళ్లైతె మోడీ ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు గురిపిచ్చిండో.. అదే వేదిక కాడికి వొయ్యి రెండు చెవ్వులళ్ల తామర పువ్వులు వెట్టుకోని నిరసన జెప్పిండు.. మీరు జూడుండ్రి శివప్రాసాద్ గట్టినట్టు ఏశాలు.. ఏ అగ్రవర్ణ ఎంపీలు గట్టరు.. ఆడరు.. ఎందుకంటె వాళ్లకు ఆత్మగౌరవం అడ్డొస్తది గదా..? మనకు ఆ సోయి ఉండదిగదా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు.. దేవాదుల పైపులైన్లు బర్తుడే గిప్టు ఇచ్చినయ్..  యాభై మీటర్ల మీదికెళ్లి నీళ్లు జిత్తి దీవెనార్తి వెడ్తున్నయ్.. సల్లగ బత్కు సారూ.. వెయ్యేండ్లు ఉండాలే మీ అసొంటి ముఖ్యమంత్రి.. అని.. అగో పైపులు దీవెనార్తి వెట్టుడేందనుకుంటున్నరా..? వాజీవే గవ్వెట్ల దీవెనార్తి వెడ్తయ్.. మల్లన్న కథలు గాకపోతె..?

ఎవ్వలయ్యా అన్నది మోడీ ఏం పనిజేస్తలేడు ఏమైనా బైటిదేశాల పొంట బైరాగి తిర్గినట్టు తిర్గుతడు అని..? చల్ ఇదంత తప్పు.. మోడీగారి పనితనం జనానికి తెలుస్తలేదు.. ముఖ్యంగ ప్రతిపక్ష పార్టీలు ఆయనను జూస్తె కంట్లె వెట్టుకుంటున్నరుగని.. ఈదేశానికి ఈ మూడున్నరేండ్ల కాలంల మోడీ జేశ్న గొప్పపనులు ఏంటియో నేను జూపెడ్త సూడుండ్రి.. 

చెడపకురా చెడేవు అన్న ముచ్చట్లకు రాంగోపాల్ వర్మ ముచ్చట సరిగ్గ సరిపోయెతట్టున్నది.. జీఎస్టీ అని ఒక వీడ్యో యూట్యూబ్ల వెట్టెగదా... ఆ పంచాది ముదిరి ముదిరి.. రాంగోపాల్ వర్మ తాత లెక్క తయ్యారైంది... నోరున్నదిగదా అని ఎట్లవడ్తె అట్లనే మాట్లాడిన మన్షిని.. చట్టం విల్చుకొచ్చింది.. ఇయ్యాళ పోలీసోళ్ల ముంగట హాజిరేశిండు..

17:29 - February 25, 2016

కరీంనగర్ : పూరిళ్లను మిద్దెలుగా మారుస్తామన్నాడు. మట్టిరోడ్లను తారురోడ్లుగా తీర్చిదిద్దుతామన్నాడు. 24గంటల విద్యుత్ వెలుగులతో గ్రామం సర్వంగా సుందరంగా మారుతుందన్నాడు. రెండు నెలల్లోనే గ్రామ స్వరూపాన్నే మార్చేస్తామన్నాడు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే తమ గ్రామన్ని దత్తత తీసుకోవడంతో తమ దశ దిశ మారిపోతుందని గ్రామస్తులంతా భ్రమపడ్డారు. కానీ..సీన్ రివర్స్ అయ్యింది. ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం కావడంతో ఊసురుమంటూ బతుకుతున్నారు కరీంనగర్ జిల్లా ముల్కనూర్ గ్రామస్తులు.

పూరిళ్లన్నంటిని రెండు నెలల్లో మిద్దెలుగా ....

పూరిళ్లన్నంటిని రెండు నెలల్లో మిద్దెలుగా మారుస్తామని స్వయానా ముఖ్యమంత్రే హామీ ఇవ్వడంతో..ఉన్న పాత ఇంటిని కాస్తా ఇలా కూలగొట్టుకున్నారు. ఇళ్లును కూల్చేసి రోజులు,.నెలలు గడుస్తున్నా..ఇంకా పునాది రాయి పడకపోవడంతో..ఇదిగో ఇలా నాలుగు రేకులు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

చిన్నముల్కనూర్ ను దత్తత తీసుకున్న కేసీఆర్‌ .....

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయానా దత్తత తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఈ గ్రామం నుంచే కాబట్టి..కేసీఆర్‌ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా సంబరపడ్డారు. అయితే గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాదు అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంతో పాటు, కమ్యూనిటీ భవనాలు, రోడ్ల వెడల్పు, విద్యుద్దీకరణ పనులు, చెరువుల పునరుద్దరణ వంటి హామీలతో గ్రామ స్వరూపాన్నే మార్చేస్తాన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళను రెండు నెలల్లో పూర్తిచేసి..సంబరాలు చేసుకుందామని గతేడాది ఆగస్టులో గ్రామన్ని సందర్శించిన సందర్భంగా హామీ ఇచ్చారు.

247 మంది పేదలకు ఇళ్లు మంజూరు....

ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావడంతో తమ గ్రామం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని గ్రామస్తులు సంబరపడ్డారు. గ్రామంలోని దాదాపు 247 మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరవడంతో..వారంతా పాత పెంకుటిళ్ళను కూల్చివేశారు. పాతింటి స్థానంలో కొత్త ఇంటిని చూసుకోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ..సీఎం ముల్కనూరు గ్రామాన్ని సందర్శించి 6నెలలు గడిచినా..ఇంత వరకు ఇళ్ళకు ముహుర్తమే ఖరారు కాలేదు. దీంతో ఇండ్లను కూల్చుకున్న వారంతా ఇలా ఆరుబయటే జీవనాన్ని సాగిస్తున్నారు.

ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా....

ముల్కనూర్‌ గ్రామ స్వరూపాన్నే మార్చేస్తామన్న కేసీఆర్‌..ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఇటీవలే టి టిడిపి నేత రేవంత్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్‌ తన సొంత జిల్లాలో దత్తత తీసుకున్న రెండు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు తప్ప..ముల్కనూరును పట్టించుకోవడంలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

13:26 - January 17, 2016

హైదరాబాద్ : శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్‌ బాబు గ్రామాలను దత్తత తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని.. వాటిని అన్ని విధాల అభివృద్ధి చేయాలనుకున్నారు. వీటిలో మహబూబ్‌నగర్‌ జిల్లా సిద్ధాపూర్‌ కూడా ఉంది. ఈగ్రామాన్ని దత్తత తీసుకుని ఐదు నెలలు కావస్తోంది. మహేశ్‌ బాబు రాక కోసం గ్రామస్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా... ఇంతవరకు రాకపోవడంతో వారిలో ఒకింత నిరాశ కనిపిస్తోంది.

నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకున్నా....

కోటీశ్వరుడి కుమారడైన్నటికీ.. సిటీని విడిచిపెట్టి... సొంతూరు వచ్చి అభివృద్ధి చేస్తాడు హీరో. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు పాత్ర ఇది. తన ఆదర్శం సినిమా పాత్రకే పరిమితం కాకూడదనుకున్నారు మన మహేశ్‌ బాబు. నిజజీవితంలో కూడా వెనుకుబడ్డ గ్రామాలను అభివృద్ధి చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు ఆరడుగుల అందగాడు.

తన ఆదర్శాన్ని అమలు చేసేందుకు....

తన ఆదర్శాన్ని అమలు చేసేందుకు వెనుకబడిన మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేసుకున్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్టు ట్వీట్‌ చేశారు. దీంతో ఊరి ప్రజల ఆనందానికి అవధులేకుండా పోయాయి. వెండితెర రాకుమారుడుని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుందని భావించారు. గ్రామానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని భావించారు. ఊరు అభివృద్ధి చెందుతుందని ఆశించారు. కానీ దత్తత తీసుకున్న తర్వాత మహేష్‌బాబు ఇంతవరకు సిద్ధాపూర్‌ రాకపోవడంతో ప్రజల్లో ఒకింత నిరాశ కనిపిస్తోంది.

హైదరాబాద్‌కు 36 కి.మీ. దూరంలో ఉన్న సిద్ధాపూర్‌ .....

మహేశ్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ గ్రామం హైదరాబాద్‌కు కేవలం 36 కి.మీ. దూరంలోనే ఉంది. మొత్తం 720 కుటుంబాలు ఉంటున్నాయి. జనాభా 3,004 మంది. ఎస్టీలు-1120 మందికాగా, ఎస్సీలు-453 మంది ఉన్నారు. ఇతరులు 1431. సిద్ధాపూర్‌ పంచాయతీ పరిధిలో ఏన్గుమడుగు తండా, చింతగట్టు తండా, కొడిచర్లకుంట తండాలున్నాయి. సిద్ధాపూర్‌తోపాటు, తండాల్లో సీసీ రోడ్లు లేవు. ప్రాథమిక, ప్రాథమికోన్నతి, ఉన్నత పాఠశాలున్నా... అవి శిథాలవస్థకు చేరుకున్నాయి. మొత్తం 280 మంది విద్యార్ధులున్నా.. వీరికి సరిపడ తరగతి గదులులేవు. బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యంలేదు. వైద్యశాల, పశువైద్యశాల శూన్యం. ముగురునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. నల్లానీటి సౌకర్యంలేకపోవడంతో ఊరికి ఆమడదూరంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ దగ్గరకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మహేష్‌బాబు దత్తత తీసుకోవడంతో ఈ సమస్యలన్నీ తీరతాయని భావిస్తే.. చివరికి నిరాశే మిగిలిందని నిట్టూరుస్తున్నారు.

శివారు తండాలను అభివృద్ధి చేయాలి....

సిద్ధాపూర్‌తోపాటు, పంచాయతీ పరిధిలోని తండాల్లో వ్యవసాయాధార కుటుంబాలే ఎక్కువ. భూమిలేని నిరుపేదలు ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని హైదరాబాద్‌, షాద్‌నగర్‌కు వలసపోయి ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. మహేష్‌బాబు ఇప్పటికైనా సిద్ధాపూర్‌తోపాటు, శివారు తండాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దత్తత తీసుకున్నగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మహేశ్‌బాబు ముందుకొస్తే అన్ని విధాల సహకరిస్తామని సిద్ధాపూర్‌ సర్పంచ్‌ జంగయ్య చెబుతున్నారు. జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న నటుడు ప్రకాష్‌రాజ్‌... ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మహేశ్‌బాబు కూడా సిద్ధాపూర్‌లో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

Don't Miss

Subscribe to RSS - దత్తత గ్రామం