దయనీయం

18:47 - November 12, 2017

ఆదిలాబాద్ : జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంటను పండించడమే అంటే అమ్మడం మరింత కష్టంగా మారింది. రైతులు సీసీఐ అధికారులను, జిన్నింగ్ మిల్లుల యజమానులను బ్రతిమిలాడి అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. పంటను తక్కువ ధరకు కాజేయడానికి దళారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు ప్రయత్నిస్తున్నారు. ధరల విషయంలో, తేమ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు. 

 

20:59 - September 13, 2017

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనలు పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్న రోహింగ్యాల పరిస్థితిపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..
సొతగడ్డకు బరువయ్యారు.. 
సొతగడ్డకు బరువయ్యారు.. చదువుకునే అర్హతలేదు.. ఉద్యోగాలకు అవకాశం లేదు.. అసలు బతికే పరిస్థితే లేదు.. ఏం చేయాలి? ఎటు పారిపోవాలి..? ఎక్కడ తలదాచుకోవాలి? ఇప్పుడది భూమీ ఆకాశాలు ఏకమైన సుదీర్ఘ విలాపం.  చావుకీ బతుక్కీ మధ్య తేడా తెలియని లక్షలాది ప్రజల దీనత్వం.. జాతులపేరుతో, మతాల పేరుతో విద్వేషాలు పెంచుకునే మానవజాతి హీనత్వం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:43 - July 12, 2017
13:18 - May 13, 2017

అనంతపురం : ప్రభుత్వ ఆస్పత్రి గైనిక్ వార్డులో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. కాన్పు కథ అటుంచితే ముందు బెడ్స్‌ను చేజిక్కించుకోవడం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. వార్డులో అధికారికంగా అరవై పడకలున్నాయి. వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అదనంగా మరో అరవై పడకలను డాక్టర్లు ఏర్పాటు చేశారు. కానీ అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని, ముగ్గురిని పడుకోబెడుతున్నారు. దీంతో బాలింతలు, గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. చాలిచాలని పడకలపై.. రోజుల పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయంగా వచ్చే వారు కిందనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఇబ్బందిగా ఉన్న తప్పడం లేదని బాలింతలు వాపోతున్నారు.

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్న..

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్న.. సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ఆస్పత్రికి ఒకేసారి ఎక్కువ మంది రావడంతో ఈ సమస్య తలెత్తితందని వైద్యులు అంటున్నారు. 120 బెడ్స్‌ ఉంటే.. 180 మంది ఆస్పత్రిలో ఉన్నారన్నారు. వచ్చిన వారిని వెనక్కి పంపించడం ఇష్టం లేక.. ఉన్న బెడ్స్‌పైనే పడుకోబెట్టి ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది సంఖ్యను పెంచి... సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

18:58 - February 27, 2017

వాషింగ్టన్ : ట్రంప్ పుణ్యమా అంటూ అమెరికాలో భారతీయుల పరిస్థితి దయనీయంగా మారింది. భారతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొలరాడాలో పోస్టర్లు వెలిశాయి. ఓ భారతీయుడి ఇంటిపై పోస్టర్‌ అతికించడమే కాదు...కోడిగుడ్లు విసరడం, కుక్కల అశుద్ధం పూస్తూ తమ అక్కసును వెళ్లగక్కారు.
పెరిగిపోయిన జాతి విద్వేష దాడులు 
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జాతి విద్వేష దాడులు పెరిగిపోయాయాయి. కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపి, అలోక్‌రెడ్డిని తీవ్రంగా గాయపరిచిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే... జాతి విద్వేషాన్ని వెళ్లగక్కిన మరో ఘటన కొలరాడోలో వెలుగు చూసింది.  తాజాగా అమెరికాను వదిలిపోవాలని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి.
భారతీయుడి ఇంటిపై దాడి 
దక్షిణ కొలరాడాలోని పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటికి పేపర్ పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు విసిరికొట్టారు...  గోడలకు కుక్కల అశుద్ధం పూయడం లాంటి దారుణాలకు పాల్పడ్డారు. 
ఇండియన్లు వెళ్లిపోవాలని పోస్టర్లు...
తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద కూడా పోస్టర్లు అతికించారు. ఇండియన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అర్థం వచ్చేలా సందేశాలు పోస్టర్లలో రాశారు. దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని చెప్పారు. తన ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఇంటి గోడలను శుభ్రం చేసి సహకరించారని తెలిపారు. మళ్లీ దాడి చేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు..
దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు 
దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఒకరిద్దరు దాడి చేయలేదని, పెద్ద గుంపే వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

20:09 - December 9, 2016

విశాఖ : గంగపుత్రుల బతుకులు తెగిన గాలిపటంలా మారాయి. ఒడ్డుకు చేరిన చేపపిల్లాల విలవిల్లాడుతున్నాయి. మోడీ దెబ్బకు జీవనోపాధే ప్రశ్నార్థకంగా మారింది. కుటుంబాలు గడవక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయి. పెద్ద నోట్ల రద్దుతో మత్స్యకారుల వ్యాపారాలు బేజారయ్యాయి. గిరాకీ లేక ఊసురుమంటున్నారు. ఆదుకున్నగంగమ్మే ఇప్పుడు కాదు పొమ్మంటుంటే.. ఏం చేయాలో తెలియక గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర నిర్ణయంతో రోడ్డునపడ్డ మత్స్యకారుల కుటుంబాల జీవన స్థితిగతులపై 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌...! 
నోట్ల రద్దుతో కుదేలైన చేపల వ్యాపారం
500, వెయ్యి నోట్ల రద్దుతో మత్స్యకారుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. వారి కుటుంబాలు గడవడం ప్రస్తుతం కష్టంగా మారింది. పెద్ద నోట్ల రద్దుతో విశాఖలో చేపల వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. బిజినెస్‌ లేక ప్రస్తుతం వ్యాపారాలు మానేశారు. వ్యాపారాలు సరిగ్గా లేకపోవడం వల్ల బోటు యజమానుల నుంచి చేపలు కొనుగోలు తగ్గించేశామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేపల అమ్మకాలపై 50 వేల మంది మత్య్సకారుల జీవనం 
గిరాకీ లేక ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది మత్య్సకారులు చేపల అమ్మకాలపై జీవనం సాగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో గీరాకీ లేక అమ్మకం, కొనుగోలుదారుల పరిస్థితి చాలా దయనీంగా మారింది. నాడు హుదూద్‌ తుపాన్‌ సమయంలో చేపల వేట సాగక.. చేపలు దొరకని పరిస్థితి. ఇప్పుడేమో పుష్కలంగా చేపలు ఉండి కూడా డబ్బుల్లేక ఏకమొత్తంలో చేపలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 
గతంలో రోజుకు రూ.30 కోట్లు సాగిన వ్యాపారం
30 కోట్ల నుంచి  కోటి రూపాయలకు తగ్గిన బిజినెస్‌
విశాఖ జిల్లా వ్యాప్తంగా రోజుకు దాదాపు 30 కోట్ల చేపల వ్యాపారం జరుగుతుంది. ఇందులో ఎగుమతుల కంటే చిల్లర వ్యాపారమే ఎక్కువ. ఇప్పుడు చేపల సీజన్ కావడంతో మత్స్యకారులు మంచి బిజినెస్ జరుగుతుందని ఆశపడ్డారు. కానీ మోదీ నిర్ణయంతో రోజుకు 30 కోట్ల వ్యాపారం జరిగే చోట ప్రస్తుతం కోటి రూపాయల బిజినెస్ కూడా జరగటం లేదు. పెద్ద నోట్లు రద్దుతో వ్యాపారులు చేపలు కొనడం మానేశారు. కొనుగోలుదారులు కూడా 2వేల నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
ఎండు చేపలు మార్కెట్‌ పరిస్థితి దయనీయం 
సీజన్ కావడంతో సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకుతున్నా పెద్ద నోట్ల రద్దుతో అమ్మకాలు జరగడం లేదని సెంట్రల్ మైరేన్ ఫిషరీస్ సర్వేనే స్పష్టం చేస్తోంది. కనీసం డీజిల్‌ ఖర్చులకు కూడా డబ్బులు రాకపోవడంతో చాలామంది చేపల వేటకు వెళ్లడం మానేశారు. అటు మార్కెట్‌, ఇటు వీధుల్లో చేపల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. హర్బర్‌లో ఎండు చేపలు మార్కెట్‌ పరిస్థితి చాలా దయనీయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా చిల్లర కష్టాలు పరిష్కరించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

12:57 - September 23, 2016

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న కుండపోత వర్షాలు. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే  ఉన్నాయి. మోకాళ్లలోతు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట్‌ సమీపంలోని కాలనీల్లో నాలుగురోజుల నుంచి తిండి, నిద్రలేక కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అల్వాల్ లోని భూదేవి నగర్ లో పరిస్థితి దయనీయంగా మారింది. వర్షానికి ఇంట్లోని సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయని వాపోయారు. బియ్యం, నూనే, బట్టలు, పిల్లల పుస్తకాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఆకలి కొనిసస్తున్నారని..తమను ఆదుకోవాలని వేడుకున్నారు. 
 

 

11:58 - September 11, 2016

శ్రీకాకుళం : జిల్లాలో ఉన్న ప్రతిష్ఠాత్మక రిమ్స్ పరిస్థితి రానురాను దిగాజారిపోతోంది. జిల్లాలోని ఏకైక వైద్య విద్యాలయం సేవలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. పలు కీలక పోస్టులలో ఖాళీలు ఏర్పడడంతో.. వైద్య విద్య భవితవ్యం అయోమయంలో పడింది. దీనికితోడు వైద్యసేవలు సక్రమంగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రిమ్స్‌లో పారిశుద్ధ్యం, జవాబుదారీతనం కొరవడి పెద్దాసుపత్రి పరువు బజారున పడుతోంది. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. వైద్య విద్యాలయం పేరు చెబితేనే రోగులు వణికిపోతున్నారు
పెద్దాసుపత్రికి మాయరోగం  
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం తరుపున సేవలందిస్తున్న పెద్దాసుపత్రికి మాయరోగం దాపురించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో  రిమ్స్‌ నిర్లక్ష్యానికి నిదర్శంగా మారింది. ప్రస్తుతం రిమ్స్‌లో డైరెక్టరు పోస్టు ఇంచార్జీతోనే కాలం వెల్లదీస్తున్నారు. పలు అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, డీన్, రిజిస్ట్రార్ లాంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో వైద్య విద్య భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. 
సిబ్బంది లేమి, నిధుల సమస్య 
రిమ్స్‌లో సిబ్బంది లేమి, నిధుల సమస్య అభివృద్దికి అడ్డంకిగా మారాయి. మరోవైపు జిల్లాకు పెద్దదిక్కు అయిన రిమ్స్‌లో వైద్యం బాధ్యతాయుతంగా లేదని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. రిమ్స్ లో పారిశుద్ధ్యం అంతంత మాత్రమే కావడంతో.. పెద్ద సంఖ్యలో పందులు తిష్ఠవేశాయి. దీంతో రోగాలు తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తున్న రోగులకు మరిన్ని రోగాలు వచ్చే ప్రమాదం ఏర్పడింది.  పెద్దసుపత్రిలోని పలు బ్లాకులు  చెత్తచెదారం, మురుగు పేరుకు పోవడంతో  రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
ప్రశ్నార్ధకంగా వైద్య విద్య, రోగులకు వైద్యం 
ఇటు వైద్య విద్య, అటు రోగులకు వైద్యం రిమ్స్‌లో ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఖాళీగా ఉన్న కీలక పోస్టులు భర్తీ చేసి రిమ్స్‌ను పూర్తిస్థాయి వైద్య విద్యాలయంగా తీర్చిదిద్దాలని శ్రీకాకుళం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.  

 

Don't Miss

Subscribe to RSS - దయనీయం