దళితులు

11:09 - May 26, 2018

నిజామాబాద్ : ఆర్మూరులో దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. భూ వివాదం నేపథ్యంలో 300ల దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. ఆర్మూరు గ్రామ అభివృద్ధి కమిటీ 300ల దళిత కుటుంబాలను బహిష్కరించింది. దశాబ్దాల నుండి శ్మశాన వాటికలో దహనం చేసుకుంటువుండేవారమనీ కానీ..కానీ విలేజ్ డెవలప్ మెంట్ వారు తమకు చెందిన సమాధుల్ని తొలగించారని దళితులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ వర్గాల వారు విలేజ్ డెవలప్ మెంట్ లో వున్నవారిని కూడా కమిటీ మీటింగ్స్ లకు రావద్దని ఆదేశించారు. ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మీరు ఇక్కడ అంత్యక్రియలవంటి పనులు చేయకూడదని గ్రామకమిటీ వారు ఆంక్షలు విధించారని వారు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు గ్రామకమిటీతో పోరాడతున్నారు. జరిగిన విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదనీ దళితసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో దళితులంతా ఆందోళన చేపట్టారు. 

08:56 - May 24, 2018

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను లబ్దిదారులు విక్రయానికి తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో గొర్రెకాపరులు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను సంతకు తరలించారు. వాటిని అమ్మకానికి పెట్టారు.

08:22 - May 4, 2018

అనంతపురం : జిల్లాలో పెత్తందారుల ఆగడాలతో దళితులు తీవ్ర మనోవేదను గురవతున్నారు.  పరిగి మండలం మన్నంపల్లిలో గంగమ్మ- సప్పలమ్మ జాతర సందర్భంగా  దళితులను ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. జాతర సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే పార్థసారథి పూజలు చేసి వెళ్లిపోయాక దళితులను గుళ్లోకి రాకుండా గ్రామపెత్తందారులు అటకాయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా పెత్తందారులకే వత్తాసు పలుకుతున్నారని దళితులు ఆరోపించారు. అగ్రకుల  దౌర్జన్యంపై  సీపీఎం  ఆధ్వర్యంలో పెనుకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట దళితులు ధర్నా నిర్వహించారు. మన్నంపల్లి సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌తోపాటు దౌర్జన్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళితులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

17:09 - May 2, 2018

ఢిల్లీ : ఉత్తర భారతంలో దళితులపై దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. ఆధునిక సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా...ఆటవిక చర్యలు ఆగడం లేదు. అగ్రకుల దురహంకారంతో కనీసం తోటి మానవుడని కూడా గుర్తించకుండా నీచమైన చర్యలకు పాల్పడుతున్నారు. తమ పంటను కోయడానికి రాలేదన్న కారణంతో కొందరు అగ్ర కులస్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లా అజంపూర్‌ బిసౌరియా గ్రామానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్దిపాటి పొలంలో గోధుమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఊర్లోని అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు ముందు తమ పొలంలో పంటను కోయడానికి రావాలని సీతారాంను ఆదేశించారు. దీనికి నిరాకరించడంతో అతడిపై దౌర్జన్యానికి దిగారు. చెప్పులతో దాడి చేశారు. మీసాలను బలంగా లాగుతూ మూత్రం తాగించారని సీతారాం ఆరోపించారు. ఏప్రిల్‌ 24న ఈ ఘటన చోటుచేసుకుంది.

తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై ఫిర్యాదు చేయడానికి హజరత్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఇన్‌స్పెక్టర్‌ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో బాధితుడు ఎస్పీని ఆశ్రయించాడు. ఎస్పీ ఆదేశంతో స్పందించిన స్థానిక పోలీసులు సీతారాంపై దాడి చేసిన విజయ్‌ సింగ్‌, విక్రమ్‌ సింగ్‌, సోమ్‌పాల్‌ సింగ్‌, పింకు సింగ్‌లను అరెస్ట్‌ చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ అధికారి రాజేష్‌ కశ్యప్‌ను పై అధికారులు సస్పెండ్‌ చేశారు.

దళితులు గుర్రంపై ఊరేగడం కూడా నేరమే! రాజస్థాన్‌లో పెళ్లిరోజు గుర్రంపై ఊరేగినందుకు అగ్ర కులస్తులు కొందరు ఓ దళితుడిని చితకబాదారు. భిల్వారా జిల్లా గోవర్ధన్‌పుర గ్రామంలో ఏప్రిల్‌ 29న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఎస్‌సి/ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. దాడిలో గాయపడ్డ పెళ్లికొడుకును ఆసుపత్రిలో చేర్చారు. గత నెల మార్చిలో గుజరాత్‌ భావనగర్‌ జిల్లాలో కూడా గుర్రంపై ఊరేగిన ఓ దళితుడిని అగ్రవర్ణాలకు చెందిన కొందరు కొట్టి చంపారు. సామాజిక వివక్షను తట్టుకోలేక చాలామంది దళితులు బౌద్ధమతంలో చేరుతున్నారని బిజెపికి చెందిన ఎంపి ఉదిత్‌ రాజ్‌ చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు పెరిగిపోయాయని, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన పేర్కొనడం గమనార్హం. 

13:58 - April 24, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని గోపాలపురం మండలం భీమోలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పంచాయితీ ప్రెసిడెంట్‌, టీడీపీ నాయకులు తమ వర్గీయులతో దళితులు, బీసీలపై దాడికి దిగారు. నిన్న అర్ధరాత్రి అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళితులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. గాయపడ్డవారు గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య కొంత కాలంగా భూ విషయంలో వివాదం నడుస్తుంది. ఈ వివాదంలో ఉన్న భూమి ఇరు వర్గాలకు చెందినట్లు పట్టాలు ఉండటమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. 

 

21:03 - April 23, 2018

ఢిల్లీ : రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు దళిత వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. రాజ్యాంగం, దళిత సమాజంపై దాడులు జరగడాన్ని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. మోదీ పాలనలో దళితులకు రక్షణ కరువైందని తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి సంబందించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు.  

15:07 - April 23, 2018

విజయవాడ : దళితులపైన దాడులు.. మహిళ పై అత్యాచారాలు పెరిగాయన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. దళితులు చంద్రమండలంలోకి.. వెళ్లగలుగుతున్నాడు గానీ... గర్భగుడిలో పోలేకపోతున్నాడని మండిపడ్డారు. దళితులకు కేరళ ప్రభుత్వం గర్భగుడిలో వెళ్లాడానికి అవకాశం ఇచ్చిందని... అలాగే టీడీపీ కూడా దళితులకు గర్భగుడిలో ప్రవేశం కల్పించాలన్నారు. దళితులకు దేవాదాయ ధర్మదాయశాఖలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. త్వరలోనే సమావేశమై ప్రత్యేక హోదాపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు ఒక రోజు నిరాహార దీక్షకు ఎన్ని కోట్లు ఖర్చయిందో ప్రజలకు చెప్పాలని మధు డిమాండ్‌ చేశారు. 

10:34 - April 14, 2018

హైదరాబాద్ : బలహీన వర్గాలకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. లిబర్టి వద్దనున్న ట్యాంక్ బండ్ విగ్రహానికి సీపీఎం నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు మీడియాతో మాట్లాడారు. దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలు వారి ఆత్మగౌరవాన్ని కోరుకొనే వారు మతోన్మాద సంఘ్ పరివార్ శక్తులతో పోరాడాల్సినవసరం ఉందని తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తే అప్పుడే అంబేద్కర్ కు అసలైన నివాళి అని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారం సాధించేందుకు బిఎల్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. 

06:59 - April 14, 2018

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్ధ భరతం పట్టాలంటే అధ్యయనం అవసరమని గ్రహించి అవిశాంత అధ్యయనం చేశాడు. 32 ఏళ్ల వయస్సులో డా.అంబేద్కర్, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. న్యాయశాస్త్రం చదివి తిరుగులేని ఉత్తీర్ణతా శాతంతో పట్టా పొందాడు. ఇక దళిత జాతి కోసం ఏదైనా చేయాల్సిందేనని భావించిన ఆయన మేధస్సునంతా దళిత జాతి అభ్యున్నతి కోసం వినియోగించారు. మూక్‌నాయక్, బహిష్కృత భారతి అనే పత్రికలు స్ధాపించి దళితగొంతుకను నిర్భయంగా విన్పించారు. దళిత జాతి ప్రయోజనాలకోసం వెన్ను చూపని ధైర్యాన్ని ప్రదర్శించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌.

దళితులను పంచములుగా, అస్పృశ్యులుగా జంతువుల కంటే హీనంగా పరిగణించడాన్ని తట్టుకోలేకపోయిన అంబేద్కర్‌ కులవ్యవస్ధపై శూలాన్ని ఎక్కుపెట్టాడు. ఇందుకు మనుస్మృతి కారణమని నమ్మిన అంబేద్కర్‌ 1927 డిసెంబర్‌ 25న మనుస్మృతిని బహిరంగంగా తగులబెట్టాడు. మనుధర్మాలను, దళితులను హీనంగా చూసే కట్టుబాట్లను చీల్చి చెండాడాడు.1913లో అమెరికావెళ్ళి నీగ్రోల పరిస్థితిని చూసాడు. ఆఫ్రికాలో పుట్టిన నీగ్రోలను, అమెరికన్లు బానిసలుగా కొనుగోలు చేయటం చూసి సహించలేకపోయాడు. ఇంచుమించు నీగ్రోల పరిస్ధితే అప్పట్లో కులవ్యవస్ధ శాసిస్తున్న భారతదేశంలో దళితజాతికి ఉండేది. అందుకే భారత రాజ్యాంగాన్ని తయారు చేసే బృహత్తర బాధ్యతను భుజాలకెత్తుకున్నాక అంబేద్కర్‌ దళితుల శ్రేయస్సు కోసం ప్రతిక్షణం తపించాడు.

దళితులు అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక నియోజకవర్గాలు అవసరమని భావించిన అంబేద్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం ముందు సమర్థంగా వాదనలు విన్పించాడు. యావత్‌ దేశం సైమన్‌ గో బ్యాక్‌ అంటూ నినదిస్తుంటే, నిర్భయంగా సైమన్‌ కమిషన్‌ ముందు హాజరై దళితజాతి అనుభవిస్తున్న దుర్భర పరిస్ధితులను కళ్లకు కట్టినట్లు వివరించాడు. దేశద్రోహి అనే నిందలు భరిస్తూనే ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో స్పెషల్‌ ఎలక్ట్రోరేట్స్, రిజర్వేషన్‌ ప్రాధాన్యతను వివరించారు. సోదాహరణగా అంబేద్కర్‌ వివరణను విన్న బ్రిటిష్‌ ప్రభుత్వం 1932లో కమ్యూనల్‌ అవార్డును ప్రకటించింది. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. నా ప్రాణాలు కావాలో లేక దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలో తేల్చుకోమంటూ అంబేద్కర్‌ను బెదిరించినంత పని చేశాడు. విధిలేని పరిస్ధితుల్లో అంబేద్కర్‌ తీవ్ర మనోవేదనతో 1932లో జరిగిన పూనా ఒడంబడిక పై సంతకం చేశాడు. తన జాతికి ద్రోహం చేస్తున్నాననే బాధతోనే అంబేద్కర్‌.. ఎందరో మహాత్ములు వచ్చారు, వెళ్లారు కానీ అస్ప్రుశ్యులు మాత్రం ఇంకా అంటరాని వారుగానే ఉన్నారని వ్యాఖ్యానించారు.

07:45 - April 10, 2018

ప్రస్తుతం దేశంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాలం మారింది, కులం పోయింది అన్న మాటలు వట్టివే అని జరుగుతున్న సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. వీటిని ఆపాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడం దేశంలోని దళిత వర్గాలను బాధకు గురిచేస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా దేశంలోని దళిత మేధావులు, నాయకులు ఈ దాడులను ఆపాలని, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకీ దళితులపై దాడులు పెరగటానికి కారణాలేంటి? ఇవి ఆగాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సీనియర్‌ నాయకుడు జాన్‌వెస్లీ గతకొంతకాలంలో కుల విపక్షపై పోరాడతున్నారు. మరి ఈ అంశంపై ఆయన ఎటువంటి విశ్లేషణ చేయనున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

 

Pages

Don't Miss

Subscribe to RSS - దళితులు