దృష్టి

11:11 - June 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన టీజేఎస్‌ నేతలపై... టీ కాంగ్రెస్‌ కన్ను పడిందా...? కోదండరామ్‌ నేతృత్వంలోని టీజేఎస్‌ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందా...? టీజేఎస్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అవుననే సమాధానం వస్తోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణపై కేసులువేసి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన టీజేఎస్‌ నాయకురాలు, మహిళా న్యాయవాదిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులుకదపడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

2019 ఎన్నికల్లో అటు అధికార టీఆర్‌ఎస్‌, ఇటు ప్రతిపక్షాలకు దీటైన జవాబు ఇవ్వాలనుకొంటున్న తెలంగాణ జనసమితికి టీ కాంగ్రెస్‌ నుంచి కొత్త సవాల్‌ ఎదురువుతోంది. టీజేఎస్‌లోని బలమైన నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కోదండరామ్‌ను కలవారానికి గురిచేస్తోంది. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసులు వేసి... తెలంగాణ సర్కారును ముప్పతిప్పులు పెట్టిన న్యాయవాది రచనారెడ్డి  టీజేఎస్‌ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రచనారెడ్డిని తమవైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. మంచి వాద్దాటి  కలిగివున్న రచనారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టొచ్చనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు...ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... రచనారెడ్డిని కలిసి చర్చించినట్టు  అటు టీజేఎస్‌, ఇటు కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. 

ఇటీవల టీజేఎస్‌ తమ అధికార ప్రతినిధులతోపాటు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్యానెల్‌కు రచనారెడ్డిని ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న రచనారెడ్డి... కామారెడ్డి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిలో పలుసార్లు పర్యటించి టీజేఎస్‌ తరుపున ప్రచారం కూడా చేశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె టీజేఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. టీజేఎస్‌ అధికార ప్రతినిధి, టీవీ చర్చా కార్యక్రమాల ప్యానెల్‌ నుంచి తన పేరు తొలగించాలని పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌కు లేఖ రాయడంపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

టీజేఎస్‌లోని బలమైన నేతలను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు తెరతీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌... ఇంతటితోనే ఆగుతుందా... లేక ఇంకా ఎవరిపైనా లక్ష్యాన్ని గురిపెడతారా.. అన్న అంశం తెలంగాణ జనసమితి నాయకులను కలవరానికి గురిచేస్తున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.  
-----------------------------------------------

07:31 - June 12, 2018

విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి భవిష్యత్‌లో తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. కృష్ణానది చెంతనేగల వైకుంఠపురం దగ్గర..  బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటర్‌ స్టోరేజ్‌ వంతెన నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు నగర ప్రజలకు రాబోయే రోజుల్లో దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మున్ముందు అక్కడ నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా.. కృష్ణానదిపై నూతన బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  ఇందుకోసం 2,169 కోట్ల మేర అనుమతులు కూడా జారీ చేసింది. రవాణాపరంగా ఈ ప్రాంతం కీలకం కావడం.. బ్యారేజ్‌ నిర్మాణానికి సహజసిద్ధంగా అనుకూలంగా ఉండడంతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బ్యారేజీ ఆకృతులు రూపొందించి... పనులకు టెండర్లు పిలవడానికి జలవనరులశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ బ్యారేజీ నిర్మాణమైతే... దాదాపు 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మిస్తే కొన్ని కిలోమీటర్ల మేర నీరు పుష్కలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
గని ఆత్కూరు, వైకుంఠపురం గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మాణం
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికచర్ల మండలం గనిఆత్కూరు, గుంటూరు జిల్లాలో వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈప్రాంతంలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణానికి డిమాండ్‌ ఏర్పడింది.  ప్రస్తుతం రాజధానిలో నీటి అవసరాలు ఆశించినంతగా లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీలో రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వాటర్‌ స్టోరేజీకి మరో బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. వర్షాకాలంలో దిగువ ప్రాంతంతోపాటు మున్నేరు నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10 టీఎంసీల నీటినిల్వ, 50 లక్షలమందికి తాగునీరు, రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా ఈ బ్యారేజీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది.
బ్యారేజీ నిర్మాణానికి రూ. 2,169 కోట్లు ఖర్చు
బ్యారేజీ నిర్మాణానికి  దాదాపు 2,169 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భూసేకరణకు 771 కోట్లు కేటాయించారు. బ్యారేజీ నిర్మాణ పనులకు 1088 కోట్లు, నావిగేషన్‌ పనులకు 88 కోట్లు, భవనాల నిర్మాణానికి మరో 11 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.  నూతన బ్యారేజీ నిర్మాణం జరిగిన వెంటనే 10 టీఎంసీల నీటిని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు.

 

22:13 - June 7, 2018

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌... పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు స్టార్ట్ చేశారు. యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటున్న పవన్ వాటినే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు. స్థూలంగా జనసేన మేనిఫెస్టోలో ఏ కీలకాంశాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించారు. ఆగస్టు 15 నాటికి మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తానన్న పవన్‌.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే యాత్రలో తన దృష్టికి వచ్చిన అంశాలను పవన్‌ నోట్ చేసుకుంటున్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని పవన్‌ భావిస్తున్నారు. 

యాత్రలో భాగంగానే పవన్‌, విద్యార్థులు, మహిళలు, రైతులు, మేధావులతోనూ భేటీ అవుతున్నారు. వారి సలహాలను తీసుకుంటున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి మేనిఫెస్టోలో చేర్చేందుకు ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించాలని పవన్‌ యోచిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తోన్న పవన్‌ కల్యాణ్‌.. ఉద్దానం సమస్య పరిష్కారం అంశాన్ని మేనిఫెస్టోలో ప్రధానంగా చేరుస్తారన్న భావన కూడా వ్యక్తమవుతోంది. దీంతో పాటు.. రాబోయే రోజుల్లో తన పర్యటనల్లో భాగంగా వచ్చే సమస్యలనూ మేనిఫెస్టోలో చేరుస్తారని భావిస్తున్నారు. 

07:42 - June 1, 2018

హైదరాబాద్ : తెలంగాణాలో స్థానిక సమరానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఓ అడుగుముందుకేసి గ్రామాల్లో పట్టు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదే మిగిలి ఉండడంతో... టీఆర్‌ఎస్‌ నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
లోకల్‌బాడీ ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్‌ ఆసక్తి
స్థానిక సంస్థల ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది.  ప్రభుత్వ పరంగా ఎన్నికలను నిర్ణీత సమయానికే పూర్తి చేయాలన్న అభిప్రాయంతో... స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు గులాబీబాస్‌ ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లుకావడంతో... ఈఎన్నికల ద్వారానే ప్రజల నాడిని గుర్తించవచ్చన్న అంచనాతో గులాబీ దళపతి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మద్దతును స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూడగట్టాలన్న భావనలో అధికారపార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతల్లో లోకల్‌బాడీ ఫీవర్‌
కొంతమంది టీఆర్‌ఎస్‌ నేతల్లో స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది.  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే... గ్రామాల్లో పార్టీపరంగా ఉన్న అంతర్గత పోరు తెరపైకి వస్తుందన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. మరోఏడాదిలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఇలాంటి గొడవలు ఉత్పన్నమైతే మంచిది కాదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరికొంత మంది మాత్రం ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందిస్తాయన్న ధీమాతో ఉన్నారు.  గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం చట్ట సవరణ చేయడంతోపాటు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు లాంటి అంశాలు తాము మద్దతునిచ్చే అభ్యర్థులకే కలిపి వస్తాయన్న అంచనాను అధికార పార్టీ నేతలు వేస్తున్నారు.  ఇటీవలే ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం కూడా ఓట్లు రాలుస్తుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. గ్రామాల్లో పట్టు సాధిస్తే .... సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆధిపత్యం సాధించడం సలువుగా ఉంటుందన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌.. నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.

 

08:22 - May 29, 2018

జూన్‌ 1 నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే విద్యా సంవత్సరానికి పిల్లలు, తల్లిదండ్రులు సిద్ధమైన ప్రభుత్వం పెద్దగా సిద్ధం కాలేదని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రయివేటు స్కూల్స్‌ అధిక ఫీజులతో విద్యా సంవత్సరానికి స్వాగతం పలుతుండగా.. అందరికీ ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వ స్కూల్స్‌ వివిధ రకాల సమస్యలతో విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట రమేష్‌ మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగంపై దృష్టి పెట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:41 - April 24, 2018

చిత్తూరు : జననేత అధినేత పవన్‌ కల్యాణ్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆధిపత్యానికి తెరదించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 
చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ పర్యటన 
గుంటూరులో నిర్వహించిన ఆవిర్భావ సభ తర్వాత జోష్‌ మీద ఉన్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టూర్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
పవన్‌ వ్యూహాత్మక అడుగులు
ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన పవన్‌... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్నారని.. ఆయకు వ్యతిరేకంగా గళం విప్పారు. అటువంటి చంద్రబాబు సొంత జిల్లా నుంచి తన రాజకీయ పర్యటనను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు జనసేన నేతలు.. పవన్‌తో భేటీ అయ్యారు. వీరిలో భూబాధితులు కూడా ఉన్నారు.  జిల్లాలో చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ నాయకల పోకడలు గురించి వపన్‌ దృష్టికి తెచ్చారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు సాగిస్తున్న భూందందాల ఆధారాలను పవన్‌కు అందచేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై చలించిన పవన్‌ కల్యాణ్‌..  టీడీపీ నేతల భూదందాలను ఎట్టగట్టేందుకు చిత్తూరు జిల్లా పర్యటనకు ప్రణాళికు సిద్ధం చేసుకొంటున్నారు. 
పవన్‌ కల్యాణ్‌... నేరుగా విమర్శనాస్త్రాలు 
టీడీపీపై అప్పుడప్పుడూ ప్రత్యక్షంగా, ఎక్కువసార్లు ట్వీట్ల ద్వారా విరుచుకుపడుతున్న పవన్‌ కల్యాణ్‌... ఇప్పుడు నేరుగా విమర్శనాస్త్రాలను సంధించేందుకు సన్నద్ధమవుతున్నారు. హోదా పోరులో భాగంగా వామపక్షాలతో కలిసి... అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని  ముందుగా నిర్ణయించినా... ఈనెల 16న హోదా సాధన సమితి బంద్‌తో ర్యాలీలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు జనసేన బలోపేతం కోసం జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. 

 

16:35 - April 15, 2018

ఢిల్లీ : లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై క్రేంద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ అభిప్రాయం తెలుసుకునే పనిలో ఎన్డీయే ప్రభుత్వం నిమగ్నమైంది. 2019, 2014లో రెండు విడతలుగా జమిలి ఎన్నికలు జరిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్న ఆలోచనలో మోదీ సర్కారు ఉంది. 
జమిలి ఎన్నికలు 
జమిలి ఎన్నికల విషయంలో ఎలక్షన్‌ కమిషన్‌ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో లా కమిషన్‌ నివేదిక ఇవ్వనుంది. 2019, 2014లో రెండు దఫాలుగా లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపాలని లా కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీతి ఆయోగ్‌ కూడా జమిలి ఎన్నికలకు మొగ్గు చూపింది. ఈ మేరకు కేంద్రానికి పంపిన నివేదికను.... మోదీ సర్కారు  ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. లా కమిషన్‌ కూడా జంట ఎన్నికలకు సిఫారసు చేస్తే... దీనిపై అభిప్రాయం సేకరణను వేగవంతం చేయాలిన ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. 
అసెంబ్లీల కాలపమితి పొడిగింపు లేదా తగ్గింపు ?
2021 వరకు కాలపరిమితి ఉన్న అసెంబ్లీలకు 2019లో లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని  అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి విడత జమిలి ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో  ఉండే అవకాశం ఉంది. 2024 జమిలి ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ కాలపరిమితిని పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యాంగంతో పాటు ప్రజా ప్రానిధ్య చట్టానికి సవరణలు చేయాలి. 
బీజేపీకి ఎదురుగాలి ?
జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతోందన్న విమర్శలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మెజార్టీ సాధించింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో  కూడా బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని గ్రహించిన మోదీ సర్కారు.. దీనిని ఎదుర్కొనేందుకు  జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదనలు ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నిలకల్లో వచ్చిన సీట్లు 2019లో రాకపోతే ఏంచేయాలన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్న బీజేపీ... జమిలి ఎన్నికల ద్వారా జాతీయ అంశాలను ప్రజల ముందుంచి... లబ్ధి పొందాలన్న ఆలోచనలో ఉందని విశ్లేషిస్తున్నారు. కమలనాథుల ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో వేచి చూడాలి. 

16:08 - January 30, 2018

హైదరాబాద్ : బల్దియాలో ఇప్పుడంతా బిజీబిజీ... ఎవరిని కదిలించినా ఆస్తిపన్ను వసూళ్ళమాటే... టార్గెట్‌ రీచ్‌ కావడం కోసం అన్ని పనులనూ పక్కన పెట్టేశారు. టైమ్‌ టు టైమ్‌ రివ్యూ చేస్తూ... పన్ను వసూళ్ళు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆదాయంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ వాటా ఎక్కువే... ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బల్దియా ఏ చేయబోతోంది. వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
రోజు వారీ వసూళ్ళపై దృష్టి
జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయంలో ప్రధానమైంది ఆస్తి పన్ను... బల్దియాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చడంలో అగ్రభాగం ఆస్తిపన్నుదే. బిల్‌ కలెక్టర్‌ మొదలుకుని కమిషనర్‌ వరకూ.. అందరూ ట్యాక్స్‌ కలెక్షన్లకు పెద్ద పీఠ వేస్తారు. జనవరి వచ్చిందంటే చాలు.. రోజు వారీ వసూళ్ళపై దృష్టి పెడతారు. దీంతో ఈ మధ్య  జీహెచ్‌ఎంసీలో ఏ అధికారిని కదిలించినా... ట్యాక్స్‌ వసూళ్ళ ముచ్చటే వినిపిస్తున్నారు. 
ఈసారి రూ. 1400 కోట్లు లక్ష్యం  
జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం డిమాండ్‌, ఎరియర్స్ కలిపి 2400 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఆస్తిపన్నుగా దాదాపు 1200కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈసారి 1400 కోట్లు వసూలు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
గ్రేటర్‌ పరిధిలో 14లక్షల 72వేల మంది ఆస్తి పన్ను చెల్లింపు దారులు ఉన్నారు.  అందులో కమర్షియల్‌ ఎస్టాబ్లిష్మెంట్స్‌ 2లక్షలా 40వేలు కాగా... రెసిడెన్సియల్‌ తోపాటు కమర్షియల్‌ కలిగినఆస్తులు 20వేలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా 1235కోట్లు ఈ ఏడాది ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. అయితే ఇప్పటివరకున్న ఎరియర్స్, వడ్డీ కలిపి మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్‌ డిమాండ్‌ 2400 కోట్లు ఉంటుంది. 
చివరి రెండు రోజుల్లో వంద కోట్లు వసూలు
ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ  లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. మరో 532 కోట్ల రూపాయలు వసూలు చెయ్యాల్సి ఉంది. బల్దియాలో సాధారణ రోజుల్లో ప్రతిరోజు కోటీ 50 లక్షల నుంచి 2కోట్ల వరకూ వసూలవుతుంది. కాగా స్పెషల్‌ ఫోకస్‌  పెట్టడంతో అది రెండు నుంచి మూడు కోట్లకు పెరిగింది. సాధారణంగా చివరి రెండు రోజుల్లో వంద కోట్లు వసూలు అవుతుంటాయి. ఈ రెండు నెలల్లో 430 కోట్లు వసూలు చెయ్యాల్సి ఉంది.  అంటే ప్రతి రోజు ఏడు కోట్ల వరకు  వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఆర్థిక ఇబ్బందుల్లో బల్దియా
బల్దియా అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. నాలాల విస్తరణ, సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా నిధుల అవసరం ఉంది. అయితే రెగ్యులర్ మెయింటినెన్స్ పనులు, జీతాలకే ఇప్పుడు కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వసూలవుతున్న ఆస్థిపన్నును అన్ని పనులకూ సర్దుబాటు చేస్తున్నారు.  
బల్దియాకు మరో ముఖ్యమైన ఆదాయం పర్మిషన్‌ ఫీజు
బల్దియా ఆదాయంలో మరో ముఖ్యమైన వనరు పర్మిషన్‌ ఫీజు. టౌన్‌ప్లానింగ్ ద్వారా నిర్మాణ అనుమతులకోసం ప్రతి ఏటా హైదరాబాద్‌లో  దాదాపు 500 కోట్ల ఆదాయం వస్తుంది.  ఈ ఏడాది ఇప్పటివరకూ 400 కోట్ల ఆదాయం రాగా.. మరో వంద కోట్లు వసూలయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కానీ... ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా రావాల్సిన ఆదాయం ఈ సారి తగ్గడం కూడా సమస్యగా మారింది. క్షేత్ర స్థాయిలో డే టు డే రివ్యూలు చేస్తూ... వసూళ్ళపై దృష్టి పెట్టారు బల్దియా అధికారులు. కానీ..  లక్ష్యాన్ని చేరుకుని ఇబ్బందులను అధిగమిస్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

 

20:13 - January 6, 2018

హైదరాబాద్ : జంప్‌ జిలానీలతో కాంగ్రెస్‌ పార్టీ బాగా కుదేలైనట్లే కనిపిస్తోంది.. టీఆర్‌ఎస్‌ చేసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో... హస్తం పార్టీకి హ్యాండిచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలు.. కారెక్కేశారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కాంగ్రెస్‌ ఏంచేస్తోంది... ఇంతకూ గెలుపు గుర్రాలను ఎంచుకుందా...? లేదా....? వాచ్‌ ది స్టోరీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ లోని ఏడుగురు ఎమ్మెల్యేలను కారులోకి ఎక్కించుంది. విడతలవారీగా జరిపిన ఈ ఆపరేషన్‌తో కాంగ్రెస్‌ పార్టీ వణికిపోయింది. ఆ షాక్‌నుంచి తేరుకోవడానికి  కాంగ్రెస్‌కు చాలా సమయమే పట్టింది. దీనిపై సమీక్షించుకున్న  నేతలు జరిగిన లోటును భర్తీ చేయడంపై దృష్టి సారించారు.
గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్‌
గోడమీది పిల్లుల్లా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో... ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు  సమాచారం. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌ రావు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు.  కానీ.. జానారెడ్డి ప్రభావంతో  క్యాడర్‌ పెద్దగా వెళ్ళలేదు. ఇక్కడ ప్రత్యామ్నాయంగా జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డిని బరిలో దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.   
మక్తల్‌ బరిలో డీకే అరుణ కూతురు! 
మక్తల్‌లో రాజకీయం మరింత రంజుగా మారింది.  ఇక్కడి నుంచి గెలిచిన డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. దీంతో తమ్ముడిపై ప్రతీకారంతో రగిలిపోతున్న డీకే అరుణ... తన కూతురు స్నిగ్దారెడ్డిని బరిలో దించే యోచనలో ఉన్నట్లు సమాచారం. డీకే అరుణ ప్రభావంతో స్నిగ్దారెడ్డి  గెలుపు మరింత సులువన్న భావనలో ఉన్నారు కాంగ్రెస్‌ నేతలు.
పోటీకి సిద్ధపడుతున్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి
కాంగ్రెస్‌కు ఖమ్మంలో కూడా  ఇబ్బందిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.. రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన కోరం కనకయ్య, పువ్వాడ అజయ్‌లు కారెక్కేశారు. ఇల్లందు ఎస్టీ రిజర్వుడు కావడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు  కష్టంగా మారింది.. ఇక్కడ ప్రత్యామ్నాయం ఎవరన్న క్లారిటీ లేదు.  ఖమ్మం రూరల్‌ నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. సో... పువ్వాడ విజయ్‌తో పోటీకి పొంగులేటి ఇప్పటినుంచే సిద్ధపడుతున్నారు.
కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే నారాయణరావ్
అటు ఆదిలాబాద్‌ జిల్లాలో.. ముధోల్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఆదిలోనే ఝలక్‌ ఇచ్చారు. దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పాటిల్‌ పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఆయన తనకు టికెట్‌ ఇస్తే వచ్చే ఎన్నికల్లో  విఠల్‌ రెడ్డికి గుణపాఠం చెబుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ళ కాంగ్రెస్‌ టికెట్‌కు పోటాపోటీ
ఇక రంగారెడ్డి జిల్లాలోనూ అదే పరిస్థితి. చేవెళ్ళలో యాదయ్య కాషాయ కండువా కప్పుకున్నారు... ఆస్థానం నుంచి   డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి టికెట్‌ ఆశిస్తున్నారు. కాగా.. ఇటీవల రేవంత్‌ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన సతీష్‌ మాదిగ సైతం టికెట్‌ పోటీలో ఉన్నారు..  వెంకటస్వామికి సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులు ఉండగా... సతీష్‌ మాదిగకు రేవంత్‌రెడ్డి అండ ఉంది.  
డోర్నకల్‌లో కాంగ్రెస్‌ టికెట్‌ ముగ్గురు లీడర్ల ఆసక్తి
ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రభావం వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌పైనా తీవ్రంగానే పడింది. డోర్నకల్‌ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు... ఆ స్థానం నుంచి మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌, బెల్లయ్య నాయక్‌లు టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.  టీడీపీ నుంచి  కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్‌ రామచంద్ర నాయక్‌ కూడా టికెట్‌  రేస్‌లో ఉన్నారు..  అభ్యర్థి ఎవరన్నదీ కాంగ్రెస్‌ స్పష్టం చేయలేదు. దీంతో సంధిగ్దం నెలకొంది. హస్తం పార్టీకి హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలకు.. ప్రజాక్షేత్రంలో చెక్‌ పెట్టేందుకు  కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అందుకోసం గెలుపు గుర్రాల ఎంపికలో నిమగ్నమైంది.  ఇంతకీ ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తారో.. లేక వలస నేతలకే జై కొడతారో వేచి చూడాలి.

 

11:23 - December 3, 2017

ఢిల్లీ : టెస్ట్‌లో భారత్‌ జట్టు భారీస్కోర్‌పై కన్నేసింది. తొలి రోజే శ్రీలంకపై ఆతిధ్య భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్‌ విరాట్‌ కొహ్ల, టెస్ట్ స్పెషలిస్ట్‌ మురళీ విజయ్‌ సెంచరీలతో చెలరేగడంతో భారత జట్టు తొలి రోజే 370 పరుగుల మార్క్ దాటింది.

ఢిల్లీ టెస్ట్‌ తొలి రోజే టీమిండియా డామినేట్‌ చేసింది. విరాట్‌ కొహ్లీ, విజయ్‌ల డబుల్‌ సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌పై కన్నేసింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ...టెస్ట్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌, కెప్టెన్‌ కొహ్లీ సెంచరీలతో చెలరేగడంతో మొదటి రోజే 370 పరుగుల మార్క్ దాటింది. విజయ్‌-విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోవడంతో లంక బౌలర్లు మరోసారి తేలిపోయారు. విజయ్‌ ట్రేడ్‌మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడి 11వ సెంచరీ నమోదు చేశాడు. దూకుడుగా ఆడిన విరాట్‌ 20వ టెస్ట్‌ సెంచరీ పూర్తి చేశాడు.

ఇద్దరూ కలిసి 3వ వికెట్‌కు 283 పరుగులు జోడించి భారత జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశారు.267 బంతుల్లో 13 ఫోర్లతో 155 పరుగులు చేసిన విజయ్‌ ఔటైనా విరాట్‌ మాత్రం తడబడలేదు. 186 బంతుల్లో 16 ఫోర్లతో 156 పరుగులు చేసిన కొహ్లీ మరో డబుల్‌ సెంచరీ సాధించాలని తహతహలాడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 371 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులకు పైగా స్కోర్‌ చేసి లంక జట్టుపై ఒత్తిడి పెంచాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

Pages

Don't Miss

Subscribe to RSS - దృష్టి