దేవెగౌడ

19:21 - November 8, 2018

బెంగుళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరులో జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం దేవెగౌడతో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమావేశం అయ్యారు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబునాయుడు వీరిని కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు సమావేశమైన అనంతరం ముగ్గురు నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
రాజ్యాంగ బధ్దంగా ఏర్పాటైన సంస్ధలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దేవెగౌడ అన్నారు. కేంద్రలోని బీజేపీని గద్దె దించాలంటే దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని అందులో భాగంగా చంద్రబాబుతో చర్చలు జరిపామని దేవెగౌడ చెప్పారు. కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో కూడా చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు ఆయన తెలిపారు. 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.... దేశంలోని రాజ్యంగ బధ్దంగా ఏర్పడ్డ సంస్ధలను అడ్డంపెట్టుకుని మోడీ ప్రభుత్వం దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్నలక్ష్యంతో బెంగళూరు వచ్చానని చంద్రబాబు అన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో పెరిగిపోతున్నాయని,  ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిందని, రెగ్యులేటరీ బాడీ అయిన రిజర్వుబ్యాంకు ప్రస్తుతం మోడీ ప్రభుత్వ ఒత్తిడిలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈడీ, ఆదాయపుపన్ను శాఖలద్వారా గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వేధింపులకు పాల్పడుతూ సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ, జేడీఎస్‌ పాతమిత్రులేనని, లౌకికవాద శక్తులను ఏకం చేసే విషయంపై తాము చర్చించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి అంటూ...2019 లోక్‌సభ ఎన్నికల్లో 1996నాటి పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులు  ఏకం చేయంటంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈవారంలోనే చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తోనూ సమావేశం అవుతారు. 

07:27 - November 8, 2018

అమరావతి : రాహుల్‌ను కలిసి అధికార ఎన్డీయేలో గుబులు రేపిన టీడీపీ అధినేత చంద్రబాబు విపక్షాలను ఏకం చేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం బెంగళూరు వెళ్తున్నారు. దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

Image result for chandrababu mamata banerjeeరాష్ట్రానికి హామీలు ఇచ్చి.. మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిన కేంద్రంపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావడం, అనంతరం బీజేపీ-టీడీపీ నేతల మాటల యుద్దం కొనసాగడం, ఆ తర్వాత టీడీపీ నేతల ఇళ్లపై ఏసీబీ దాడులు జరగడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో చంద్రబాబు బీజేపీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను కలిసి సంచలనం లేపారు. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాల నేతలను కలిసిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాది నేతలను కలిసే పనిలో పడ్డారు .ఇందులో భాగంగా ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు. కర్నాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలతో సమావేశమవుతున్నారు. జేడీఎస్‌ నేతల సమావేశం అనంతరం... బెంగళూరు నుంచి నేరుగా చెన్నై వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక కర్నాటక, తమిళనాడు పర్యటన అనంతరం చంద్రబాబు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కూడా కలవనున్నారు. కర్నాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభావం ఎదురుకావడంతో బీజీపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు. 

Image result for chandrababu kumaraswamyడిసెంబర్ నాటికి మోడీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులను నేరుగా కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాలు వచ్చిన త‌ర్వాత జ‌న‌వ‌రిలో బీజేపీయేతర కూటమి నేతలతో మరోసారి హ‌స్తిన‌లో ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. జ‌న‌వ‌రి స‌మావేశం త‌రువాత ఆయా రాష్ట్రాల్లో నిర‌స‌న ర్యాలీలు, స‌భ‌ల్లో విపక్ష నేతలు పాల్గోనేలా ఒక ప్రణాళిక‌ను రూపొందిస్తున్నారు.
ఏదిఏమైనా తాజాగా వెలువడ్డ కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ వ్యతిరేకంగా రావడంతో.. బీజేపీయేతర శక్తులను ఏకం చేసేందుకు కసరత్తు చేస్తున్న చంద్రబాబుకు మరింత బలం చేకూరింది. మరి ఈ స్పీడ్‌ ఇలాగే కొనసాగుతుందా ? లేదా ? చూడాలి. 
 

19:30 - November 7, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి దేశంలోని   బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో చంద్రబాబు రేపు బెంగుళూరులో మాజీప్రధాని,జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడతో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ బేటీ కానున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఇటీవల మద్దతు ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు, యూపీ మాజీ సీఎం మాయావతి, లోక్ తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో భేటీ అయ్యి జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. తమిళనాడులో కీలక నేతగా ఉన్న డీఎంకే  పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కూడా రాహుల్-చంద్రబాబు భేటీని స్వాగతించారు. ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లి  డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ భేటీ కానున్నారు.

 

15:24 - May 17, 2018

హైదరాబాద్ : కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతారని భావించిన కేసీఆర్‌... ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో రెండు జాతీయ పార్టీలే ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించడంతో కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాతీయ స్థాయిలో ప్రాంతీయపార్టీల హవా కొనసాగుతుందా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్‌ దిస్‌ టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ..

దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలు ఆసక్తి రేపాయి. యావత్‌ దేశం కర్నాటక ఎన్నికలపై ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ మాత్రం రాలేదు. జాతీయ పార్టీలతోపాటు... ప్రాంతీయ పార్టీ హవా కొనసాగింది. జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందన్న వాదనలో బలం లేదని కర్నాటక ఎన్నికలు తేల్చాయి. నేషనల్‌ పార్టీలోపాటు ప్రాంతీయ పార్టీలు సైతం సంబర పడేలా ఫలితాలు రావడం... రాజకీయ వర్గాల్లో భిన్నవాదనలకు తెరలేపుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో కేసీఆర్‌ ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మనుగడ ఉండదు. ప్రాంతీయ పార్టీలే కీరోల్‌ ప్లేచేస్తాయని కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీలకూ ప్రజల్లో ఆదరణ పెరిగింది. అయితే రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీపై చివరికి ఆధారపడాల్సిన పరిస్థితిని కల్పించేలా కన్నడ ప్రజలు తీర్పునిచ్చారు. జేడీఎస్‌ అక్కడ కింగ్‌మేకర్‌గా మారింది. ఆపార్టీ ఎవరికి మద్దతిస్తే వారే గద్దెనెక్కుతారు. లేదా తాను మద్దతు తీసుకుని సీఎం కుర్చీపై కూర్చొనే అవకాశముంది.

కర్నాటక ఎన్నికల ఫలితాలను టీఆర్‌ఎస్‌ నేతలు వెరైటీగా విశ్లేషిస్తున్నారు. ఎటొచ్చి ప్రాంతీయ పార్టీ అక్కడ కీరోల్‌గా మారిందని చెబుతున్నారు. కాబట్టి 2019 ఎన్నికల్లో దేశంలోనూ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా కేసీఆర్‌ ఫ్రంట్‌లోకి జేడీఎస్‌ వస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ కన్నడలో జేడీఎస్‌కు అధికారం దక్కితే.. తమ ఫ్రంట్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టు అవుతుందని చెబుతున్నారు. తమ నేత కేసీఆర్‌ రెట్టించిన ఉత్సాహంతో ఫ్రంట్‌ ఏర్పాటు చర్యలు ముమ్మ రం చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ఏర్పాటు చేయనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ పట్టాలెక్కుతుందా. దేశ రాజకీయాల్లో ముందడుగు వేస్తుందా. లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

15:13 - May 17, 2018

కర్ణాటక : బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని జేడీఎస్ శాసనసభా పక్షనేత కుమార స్వామి పిలుపునిచ్చారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు కేసీఆర్, బాబు, మాయావతి, మమత బెనర్జీలు కలిసి రావాలని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనితో ఎమ్మెల్యేలను కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు. బీజేపీకి మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని, గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. 

15:12 - May 17, 2018

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. తగిన సంఖ్యా బలం లేకున్నా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం..యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీనితో దేవెగౌడ ముఖ్యమంత్రులు బాబు, కేసీఆర్, మమత బెనర్జీలకు ఫోన్ చేశారు. కేంద్రంపై పోరాటం చేయాలని, దీనిపై ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో సంఖ్యా బలం లేని బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని..దీనిపై కేంద్రంపై పోరాటం చేసేందుకు తమతో కాలిసి రావాలని ఏపీ, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చక్కగా ఉపయోగించుకోవాలని నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 

14:38 - May 17, 2018

ఢిల్లీ : కర్నాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గవర్నర్‌ తీరుపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే యోచనలో ఉన్నారు జేడీఎస్‌ అధినేత. ఈ మేరకు చందబ్రాబు, కేసీఆర్‌, మమతాబెనర్జీలకు దేవెగౌడ ఫోన్‌ చేశారు. తమ ఆందోళనకు మద్దతుగా కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.  

15:55 - May 15, 2018

కర్ణాటక : ఉదయం నుండి సంబరాలు జరుపుకున్న బీజేపీకి ఎన్నికల ఫలితాలు సాయంత్రం షాక్ ఇచ్చాయి. అధికారం చేజిక్కించుకుందామని అనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. మేజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి. రెండో స్థానంలో ఈ పార్టీ నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్ కీలక పాత్ర పోషించనుంది. 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 78 స్థానాలు..జేడీఎస్ 38 స్థానాలు..ఇతరులు 02 స్థానాలు సాధించాయి. ఇక్కడి ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ఈ ఫలితాలతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం జేడీఎస్ నేత దేవెగౌడతో ఫోన్ లో మంతనాలు జరిపారు. మద్దతు తెలియచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ కు 20, జేడీఎస్ కు 14 మంత్రి పదవులు పంచుకొనేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

అయితే కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వరప్ప రాజ్ భవన్ కు బయలుదేరారు. ముందస్తు అపాయింట్ మెంట్ లేదని రాజ్ భవన్ సిబ్బంది తిప్పి పంపారు. వెంటనే పద్మనాభనగర్ లోని దేవెగౌడ నివాసానికి ఆయన వెళ్లిపోయారు. సాయంత్రం గవర్నర్ ను జేడీఎస్ కాంగ్రెస్ నాయకులు కలువనున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో యడ్యూరప్ప గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశం తమకే ఇవ్వాలని గవర్నర్ ను యడ్యూరప్ప కోరనున్నారు. తదుపరి కార్యాచరణకు బీజేపీ అగ్ర నాయకులు బెంగళూరుకు రానున్నారు. ప్రస్తుతం అందరి చూపు గవర్నర్ వైపు నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానిస్తారనేది చూడాలి. 

15:11 - May 15, 2018

ఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. మొత్తం 222 స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని విడుదలవుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమైంది. కానీ రౌండ్ రౌండ్ కు ఫలితాలు తారుమారయ్యాయి. మేజిక్ ఫిగర్ 112కు కొద్ది దూరంలో బీజేపీ నిలువనుంది. బీజేపీ 104 స్థానాలు..కాంగ్రెస్ 78..జేడీఎస్ 38..ఇతరులు 02 స్థానాలు సాధించే అవకాశం ఉంది. దీనితో జేడీఎస్ కు తాము మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని..సాయంత్రం సిద్ధరామయ్య గవర్నర్ ను కలుస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవెగౌడ..కుమారస్వామిలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ లో సంభాషణలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చిన తరువాత మాట్లాడుదామని దేవెగౌడ వెల్లడించినట్లు తెలుస్తోంది. కుమార స్వామికి సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి 8 స్థానాల వెనుకంజలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది ? ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుందా ? అనేది చూడాలి. 

14:49 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడి ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వడం లేదని విడుదలవుతున్న ఫలితాలను బట్టి అర్థమౌతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ ప్రధాన పాత్ర పోషించనుంది. రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ రేపుతోంది. తొలుత ప్రారంభంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని ఫలితాలు నిరూపించాయి. కానీ సమయం మారుతున్న కొద్ది సీట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు సంపాదించాల్సి ఉంటుంది. కానీ వెల్లడవుతున్న ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ మాత్రం 104 సీట్లు సాధిస్తుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ 70-78 స్థానాలు సాధిస్తుందని..జేడీఎస్ 38-40 సీట్లు సాధిస్తుందని అంచనా. కాంగ్రెస్..జేడీఎస్ లు కలిస్తే ఆ సంఖ్య 112-116 పెరిగే అవకాశం ఉంది. దీనితో కాంగ్రెస్..జేడీఎస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది.

ఒక్కసారిగా వెల్లడవుతున్న పరిణామాలతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బిజెపి వ్యూహాలతో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి ?అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవెగౌడకు ఫోన్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. కానీ పూర్తి ఫలితాలు వెల్లడయిన తరువాత మాట్లాడుదామని దేవెగౌడ పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు యడ్యూరప్ప ఢిల్లీకి బయలుదేరారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - దేవెగౌడ