ధరలు

09:51 - September 17, 2018

పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయని సామాన్య, మధ్య తరగతి ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రోజుకో రేట్లు పెరుగుతూ రికార్డులను సృష్టిస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 6 పైసలు ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. మళ్లీ ధర పెరగడంతో పలువురు బెంబేలెత్తుతున్నారు. 

  • న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 82.06కు, డీజిల్ ధర రూ. 73.78. 
  • ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 89.44 డీజిల్ ధర రూ. 78.33. 
  • కోల్ కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 83.76 డీజిల్ ధర రూ. 75.57
  • చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 85.15 డీజిల్ ధర రూ. 77.94
  • హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర రూ. 86.85 డీజిల్ ధర రూ. 80.19.

అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పడం లేదని చమురు కంపెనీలు పేర్కొంటున్నాయి. వెంటనే సుంకాలను తగ్గించి, ప్రజలకు మేలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

07:52 - September 17, 2018

ఢిల్లీ : యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజిల్, పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న రావాలన్న బాబా రాందేవ్....పెట్రో ధరలు మోడీని ముంచుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తే లీటరు పెట్రోలు, డీజిల్‌ను కేవలం 35 రూపాయలకే విక్రయిస్తానన్నారు. పెట్రో ధరల పెరుగుదలతో జనాలకు మోడీ మరింత ప్రియమయ్యే అవకాశం ఉందన్నారు. పెట్రో ధరలపై నరేంద్ర మోడీ స్పందించి...ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

16:12 - September 14, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఇవాళ ఇంకాస్త పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 28పైసలు, డీజిల్‌ పై 22పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.28 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 77.82 రూపాయలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 88.39 రూపాయలు కాగా, లీటర్ డీజిల్ 77.82 రూపాయలు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 84.49, డీజిల్ రూ.77.49 లకు పెరిగాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 83.14, డీజిల్ రూ. 75.15లకు పెరిగింది. పెట్రో ధరలపై వాహనదారులు  భగ్గుమంటున్నారు. 

15:58 - September 9, 2018

ముంబై : చమురు ధరల పెరుగుదలపై మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ తీసుకురావడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని..ధరలు తగ్గే మార్గాలను చూస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీలోకి తీసుకొస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుందని, ఎన్డీయే ప్రభుత్వ హాయాంలో 13 సార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ధరల పెరుగుదల ఉంటుందన్నారు.

 

14:29 - September 7, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నెత్తిన అదనపు భారాలు పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగతు సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యులకు సవాల్ విసురుతున్నాయి. దీంతో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రూపాయి విలువ పతనమవుతుండటం పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైని తాకింది. ఈరోజు ఏకంగా లీటర్ కు 52 పైసలు పెరిగి రూ. 87.39కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 79.99కి చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.91, డీజిల్ ధర రూ. 78.48కి పెరిగింది.   

18:27 - September 4, 2018

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ పై 16 పైసలు, డీజిల్ పై 19 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోలు లీటరు ధర రూ.84.09 కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోకపోతే లీటరు ధర వంద రూపాయలకు చేరుకొన్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎటవంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా బీజేపీ నేతలు పెట్రో ధరల పెరుగుదలపై వ్యంగ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.  
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. పిల్లికి ముందుగా ఎవరు గంట కడతారు అన్న చందంగా కేంద్రం రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ ధరల భారాన్ని మోయలేక సామాన్యడు కుదేలవుతున్నాడు. 

13:20 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో పలు మల్టీప్లెక్స్ లు..సినిమా థియేటర్ లలో తినుబండారాలు, ఇతర ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించవద్దు...అని తెలంగాణ తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే అశోక్‌నగర్‌లోని లీగల్ మెట్రాలజీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తూనికలు..కొలతలు శాఖ హెచ్చరించినా యాజమాన్యాలు స్పందించలేదు. యదావిధిగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. గురువారం శాఖాధికారులు జీవీకే 1లో దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుపోయిన వాస్తవాలు వెలుగు చూశాయి. ఐదు తినుబండారాల పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. 200 ఎంఎల్ సాప్ట్ డ్రింక్ బాటిల్ లో కేవలం 150 ఎంఎల్ మాత్రమే కూల్ డ్రింక్ ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా కూల్ డ్రింక్ ధర రూ. 20 ఉంటే ఇక్కడ మాత్రం రూ. 100 విక్రయిస్తున్నారని వెల్లడైంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:11 - July 31, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. గ్రామాలతోపాటు రహదారులు, జాతీయ రహదారుల వెంబడి ఉన్న భూముల ధరలు నింగిని తాకనున్నాయి. ఆగస్టు1 నుంచే కొత్తధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

29 గ్రామాల్లో శరవేగంగా రాజధాని నిర్మాణం
రాజధానిగా అమరావతిని ప్రకటించాక అక్కడి భూముల ధరలు చుక్కలంటుతున్నాయి. తాజాగా భూముల ధరలు పెంచేందుకు సర్కార్ మొగ్గు చూపుతోంది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణంలో వేగం పెంచిన ప్రభుత్వం.. రాజధానితో పాటు.. కొన్ని ప్రాజెక్టులకు కూడా భూములు అవసరమని నిర్ణయించింది. దీంతో రియల్ ఎస్టేట్ ధరలు అందనంత ఎత్తుకు చేరే అవకాశం కనిపిస్తోంది.

ఎకరా ధర రూ. 5.50లక్షల నుంచి రూ.5.77లక్షలు..
ఉండవల్లి, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, పెనుమాక, వెంకటాయపాలెం పరిధిలో ప్రాంతాన్ని బట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎకరా ధర 5లక్షలా 50వేల నుంచి 5లక్షలా 77వేలకు, 6లక్షలా 60వేలనుంచి, 6 లక్షలా 93వేలకు, 9లక్షలా 90వేలనుంచి, 10 లక్షలా 39వేలకు , 11లక్షలనుంచి 11లక్షలా 55వేలకు, 19లక్షలా 80వేలనుంచి, 20 లక్షలా79వేలకు చేరనున్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న.. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, ఆత్మకూరు, పెదవడ్లపూడి, చినవడ్లపూడి, కుంచనపల్లి, నూతక్కి, రామచంద్రాపురం, విప్పటం, కొలనుకొండ, గుండిమెడ, పెదరావూరు, చిర్రావూరు గ్రామాల్లోనూ ఒక్కోచోట ఒక్కో ధర ఉంది.

గుండిమెడలో రూ. 27. 50లక్షలు నుంచి రూ. 28.87లక్షలు..
గుండిమెడలో ప్రస్తుతం ఎకరా 27లక్షలా 50వేలు ఉండగా.. 28లక్షలా 87వేలకు చేరుకోనుంది. మంగళగిరిలో 33 లక్షలు ఉన్నభూమి 34లక్షలా 65వేలు కానుంది. కుంచనపల్లిలో ప్రస్తుతం 50 లక్షలు ఉండగా.. 52లక్షలా 56వేలకు వెళ్లనుంది. చిన్నవడ్లపూడి 46లక్షలా 20వేలు కాగా, 48 లక్షలా 51 వేలకు, నూతక్కిలో 19 లక్షలా 80వేలనుంచి 20 లక్షలా 79వేలకు పెరుగనున్నాయి. చిర్రావూరు 16 లక్షలా 50వేలు కాగా.., 17 లక్షలా 32వేలకు, కొలనుకొండ 40 లక్షలు కాగా 42 లక్షలకు చేరనుంది.

ఎకరా రూ.6.60లక్షలు నుంచి 6.93లక్షలు కానుంది..
మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో మందడం, తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, మోదుగుల లంకపాలెం, మల్కాపురం, వెలగపూడి, కొండమరాజుపాలెంలో.. ఎకరా 6లక్షలా 60వేలు ఉండగా.. 6 లక్షలా93వేలకు చేరుకోనుంది. తుళ్లూరు కార్యాలయం పరిధిలోని తుళ్లూరు, నేలపాడు, దొండపాడు, పిచ్చుకులపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి గ్రామాల పరిధిలో ఏరియాను బట్టి ధర ఉంది. 3లక్షలా 30వేలనుంచి 3లక్షలా 46వేలు, 4లక్షలా 40వేల నుంచి 4లక్షలా 62వేలు, 6లక్షలా 60వేల నుంచి 6లక్షలా 93వేలు, 8లక్షలా 80వేల నుంచి 9లక్షల 24వేలు ధర పలుకుతోంది.అనంతవరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని అనంతవరం, నెక్కల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో 3లక్షలా 30వేలున్న ఎకరా భూమి.. 3లక్షలా 46 వేలకు చేరుకోనుంది. ఈ నిర్ణయం రాజధాని ముఖ్య ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నారు. 29 గ్రామాలతోపాటు రాజధాని సమీపంలోని ప్రముఖ ప్రాంతాల్లోని ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. 

20:40 - July 22, 2018
21:30 - June 9, 2018

హైదరాబాద్ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రజా సంఘాలు నిరసనతో హోరెత్తించాయి. పెరిగిన ధరలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కేంద్రం ఇష్టారీతిన ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధరలను వెంటనే తగ్గించాలని...లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంపై ప్రజా, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించాయి. 
అనంతపురంలో 
అనంతపురంలో వామపక్షాలు రోడ్డెక్కాయి. పెట్రో మంటను తగ్గించాలంటూ నగరంలోని టవర్‌ క్లాక్‌ సమీపంలోని ఓవర్‌ బ్రిడ్జి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వామపక్షాల నిరసనకు జనసేన, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు పరిపాలిస్తున్న కేరళ రాష్ట్రంలో పెట్రోల్‌ ధరలపై పన్నులు మినహాయించి ప్రజలకు ఊరట కలిగించారని గుర్తు చేశారు నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. 
విజయవాడలో
విజయవాడలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. పాతబస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. పెట్రోల, డీజిల్‌ ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని సీపీఎం మధు అన్నారు. పెంచిన వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
కడపలో 
కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్ డీజల్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందని వామపక్ష నేతలు మండిపడ్డారు. పెట్రోల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కడప నగరంలోని పాతబస్టాండ్ నుండి ఏడురోడ్ల కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
విజయనగరంలో    
విజయనగరం జిల్లాలోనూ పెట్రో ధరలపై వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జనసేన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు వామపక్ష నేతలు. ఆందోళన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
రాజమహేంద్రవరంలో 
పెంచిన పెట్రోల్‌, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. రాజమహేంద్రవరంలో మోటర్‌ కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో వామపక్ష నేతలతో కలిసి కార్మిక సంఘాలు రాస్తారోకో చేశాయి. 
అమలాపురంలో 
కేంద్రప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతోందని తూర్పుగోదావరి జిల్లా సీపీఎం నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా.. అమలాపురంలో వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 
నెల్లూరులో
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. ధరలు పెరగడం వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
జగిత్యాలలో
తెలంగాణలోనూ పెట్రో ధరలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ధరలను తగ్గించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ మేరకు జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. ధరలు తగ్గించాలంటూ అంబేద్కర్‌కు వినతిపత్రం అందించారు నేతలు. 
విశాఖలో 
దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ విశాఖ జిల్లా మద్దిలిపాలెం కూడలి వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. సామాన్యులపై ఎనలేని భారం మోపుతున్న ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు వామపక్ష నేతలు. 
శ్రీకాకుళంలో
శ్రీకాకుళం జిల్లాలో లెఫ్ట్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించి ధరల పెంపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేతలు. అడ్డగోలుగా పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ధరలను తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా సంఘాలు హెచ్చరించాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - ధరలు