నల్గొండ

07:45 - February 26, 2017

నల్గొండ : జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లకు గుండెపోటు రావడం కామన్ అయిపోయింది. ఆర్టీసీ బస్సు నడుపుతూ పలువురు డ్రైవర్లు గుండెపోటుకు గురయి మృత్యువాత పడుతున్నారు. గత రెండు మూడు నెలల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఏపీ 29 జెడ్ 2113 నెంబర్ గల బస్సు ఖమ్మం నుండి హైదరాబాద్ కు వెళుతోంది. ఈ బస్సును డ్రైవర్ సైదులు నడుపుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున నకిరేకల్ వద్దకు రాగానే సైదులుకు గుండెపోటు వచ్చింది. వెంటనే బస్సును ఓ వైపుకు తిప్పాడు. డివైడర్ ను ఢీకొన్ని బస్సు ఆగిపోయింది. అప్పటికే నిద్రలో ఉన్న వారందరూ ఏమైందని విచారించలోగా సైదులు కన్నుమూశాడు. ఈ విషాద విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తరలించారు. మృతి చెందిన సైదులు కుటుంబానికి సమాచారం అందచేశారు. దీనితో వారు కన్నీరుమున్నీరయ్యారు. సైదులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.

 

13:49 - February 25, 2017

నల్గొండ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న యాత్ర..132వ రోజు నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలోని సీతావారిగూడెం నుండి యాత్ర ప్రారంభమైంది. అక్కడినుండి జిల్లాలోని అప్పన్నపేట, గరిడేపల్లి, ఎల్బీనగర్‌, నేరేడుచర్ల, రామాపురం, శాంతినగర్‌, కమలానగర్‌, పెంచికల్‌ దిన్నే, కల్లూరు, ముకుందాపురం, దాచారం, నాగులపాటి అన్నారంలో యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా.. గరిడేపల్లిలో తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ.. సీపీఎం పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతోందని విమర్శలు గుప్పించారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి సీఎం వివిధ అంశాలపై మాట్లాడుతున్నారని చెప్పారు. సామాజిక న్యాయం అంశాలపై చర్చకు వస్తామన్నా..టీఆర్‌ఎస్‌ నేతలు తోకముడిచారని తమ్మినేని వీరభద్రం ఫైర్‌ అయ్యారు. దేవుడికి ఇచ్చిన మొక్కులను మాత్రం కేసీఆర్‌ తీర్చుకుంటున్నాడని... కానీ జనాలకు ఇచ్చిన మొక్కులను సీఎం కేసీఆర్‌ ఎప్పుడు నెరవేరుస్తాడని ప్రశ్నించారు.

 

21:20 - February 19, 2017
21:12 - February 19, 2017

నల్గొండ : తెలంగాణ రైతులకు మేలు చేసే విధంగా నల్గొండ జిల్లాలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ కవిత తెలిపారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సరైన సమాధానం లేకుండా కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మిర్యాలగూడలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డి విహహానికి ఆమె హాజరయ్యారు. 

 

17:26 - February 18, 2017

నల్గొండ : ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం జరిపిన వారిలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త కూడా ఉన్నాడని బాధితురాలు చెప్పడంతో కలకలం రేగుతోంది. మాయ మాటలు..క్షుద్రపూజల పేరిట తనను తీసుకెళ్లి అత్యాచారం జరిపారని బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు స్వయంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేత ఉండడంతో కేసును గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. అత్యాచారం జరిపిన వారిలో ఎంపీటీసీ భర్త ఉయ్యాల వెంకన్న, వినోద్, రాజు ఉన్నారని, వీరికి ఓ మహిళ సహకరించిందని బాధితురాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

19:36 - February 17, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీజాక్ ఛైర్మన్‌ కోదండరాం కోరారు. ప్రభుత్వ రంగ సంస్ధలో 50వేల వరకు ఖాళీలు ఉన్నాయన్న ఆయన.. కేవలం ఎలక్ట్రిక్‌, సింగరేణిలో మాత్రమే భర్తీ చేస్తే సరిపోదన్నారు. 13 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కోదండరాం అన్నారు. ఇప్పటి వరకు 5వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని కోదండరాం చెప్పారు. 

19:15 - February 16, 2017

నల్గొండ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ ర్యాలీకి యువతీ, యువకులు భారీగా తరలిరావాలని టీజేఎసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపు ఇచ్చారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ర్యాలీ నిర్వహించనున్నట్టు  చెప్పారు. నిరుద్యోగుల ఆకాంక్షలు-తెలంగాణ భవిష్యత్‌ అన్న అంశంపై నల్గొండలో జరిగిన సదస్సులో కోదండరామ్‌ ప్రసగించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రోడ్‌ నుంచి లయన్స్‌ క్లబ్‌ వరకు జరిగిన బైక్‌ ర్యాలీని ప్రారభించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై పాలకులు కక్షకట్టడం దారుణమని కోదండరామ్‌ విమర్శించారు. 

20:06 - February 3, 2017

నల్గొండ : ఆదాయం వస్తున్నా.. నిర్వహణ మాత్రం అంతంతమాత్రమే.. స్వామి దర్శనం కోసం వెళ్తే.. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే. భక్తుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ.. అందినకాడికి దండుకోవడమే అక్కడి అధికారుల విధి. ఇది చెర్వుగట్టులోని ఆలయం వద్ద జరుగుతున్న అవినీతి తంతు. ఆలయ ఉత్సవాల వేళ.. అక్కడి పరిస్థితిపై టెన్‌ టీవీ రిపోర్ట్. 
చెర్వుగట్టు ఆలయ బ్రహ్మోత్సవాలు
నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు చేదు అనుభవమే మిగులుతుంది. స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు.. అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భక్తుల కోసం ఇక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. తాగడానికి నీరు లేదు.. సరిపడా వసతి గదులు లేవు... బట్టలు మార్చుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో అవస్థలుపడుతున్నారు. ఇక్కడ కోనేరు దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే లడ్డూ ప్రసాదాన్ని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.
వివిధ ఫీజుల రూపంలో వడ్డన
అంతేగాకుండా ఆలయంలో వివిధ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. దుకాణదారులు కొబ్బరికాయలను.. నీళ్ల ప్యాకెట్లను ఉన్న రేట్ల కంటే ఎక్కువ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని.. వాహనాల పార్కింగ్‌కు అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఆలయంలో చెత్తచెదారం తొలగించకపోవడంతో అపరిశుభ్రంగా ఉందని విమర్శిస్తున్నారు. అలాగే దేవస్థానం పరిధిలోనే యథేచ్ఛగా గుట్కా విక్రయాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.  
ఏటా 8 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం 
ఈ దేవస్థానానికి ఏటా 8 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది.  ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసింది. కానీ ఈ ఆదాయాన్ని రాజకీయనాయకులు.. అధికారులు పంచుకుని భక్తులకు మొండి చేయి చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా.. అందులో చాలామంది పనికి డుమ్మా కొడుతున్నారని.. ఏళ్ల తరబడి ఉండడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. 

 

17:49 - January 30, 2017

నల్లగొండ : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పై తేనెటీగలు దాడి చేశాయి. జిల్లాలోని గాజుపేట గుహలను సందర్శించేందుకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. టార్చ్ లైట్లను వేసుకుని గుహలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఆ వెలుతురుకు తేనె టీగలు ఒక్కసారిగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తోపాటు అతని అనుచరులపై దాడి చేశాయి. ఈఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందికి గాయాలయ్యాయి. రవీంద్రకుమార్ ముఖంపై, చెంప కుడి వైపున గాయాలయ్యాయి. మరికొంతమంది కళ్లపై గాయాలయ్యాయి. గాయపడిన అనుచరులకు స్థానిక ప్రాథమిక కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ను దేవరకొండ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:11 - January 30, 2017

నల్గొండ : కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కోరారు. ఈ రైల్వే బడ్జెట్‌లోనైనా మౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - నల్గొండ