నల్లగొండ

18:22 - September 25, 2017

నల్లగొండ : జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం వద్ద ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలు ఆకస్మికంగా పరిశీలించారు. సమాచారం తెలుసుకుని ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్ట్‌ వద్దకు పరుగులు తీశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు హరీష్‌రావు. వచ్చే మూడు నెలల్లో టన్నెల్‌ పన్నులు పూర్తవుతాయని... డిసెంబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామన్నారు హరీష్‌రావు. ప్రతి 15 రోజులకోసారి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్‌ను కోరామని... పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్ట్‌ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హరీష్‌రావు హెచ్చరించారు. 

16:33 - September 25, 2017

నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్‌ స్థానం ఉప ఎన్నికల గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. తొందరపడుతున్నామా.. అనే అలోచనతో గులాబీదళపతి సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ పార్లమెంట్‌ స్థానంలో హస్తంపార్టీని తక్కువ అంచనా వేస్తున్నామా.. అనే ఆందోళన కారుగుర్తుపార్టీలో వస్తున్నట్టు చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోటలో పాగావేయడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.

 

టీడీపీ అనూహ్య విజయాన్ని సాధించడం..
గత ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి గుత్తాసుఖేందర్‌రెడ్డి రెండు లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత గుత్తా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అయితే మారురు కాని కార్యకర్తలు మాత్రం ఇంకా కాంగ్రెస్‌ వెంటే ఉన్నట్టు గుత్తాకూడా గ్రహించారు. అందుకే కారుగుర్తుపార్టీలో చేరినా గులాబీకండువా కప్పుకోకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలో అధికార టీడీపీ అనూహ్య విజయాన్ని సాధించడం..ఇక్కడ గులాబీబాస్‌ కు ప్రేరణ అయిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌దెబ్బతీయాలంటే.. ఆపార్టీ బలంగా ఉన్నచోటే దెబ్బకొట్టాలనేది ప్లాన్‌. అందుకే కేసీఆర్‌ ఆదేశాలతో ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లుతున్న టీమాస్‌ఫోరం కూడా గులాబీబాస్‌ను ముందస్తు టెస్ట్‌కు పరుగులు పెట్టేలా చేస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. పనిలో పనిగా ఇటీవల కాస్త హడావిడి చేస్తున్న బీజేపీ ఉత్సాహాన్ని కూడా దెబ్బకొట్టవచ్చనేది కేసీఆర్‌ వ్యూహాంగా తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ అంచనాలు తల్లకిందు
అయితే నల్లగొండలో టీఆర్‌ఎస్‌ అంచనాలు తల్లకిందులు కావడం ఖాయం అని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. గతంలో పలు ఉప ఎన్నికల్లో గెలిచామని చెబుతున్న గులాబీనేతలు.. అసలు విషయాన్ని మర్చిపోయారని అంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలను ప్రభావితం చేసి.. ఓట్లు పొందిన గులాబీపార్టీకి ప్రస్తుతం సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యే పరిస్థితి లేదంటున్నాయి. పైగా ఉమ్మడి నల్లగొండజిల్లాలో హస్తంపార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ లాంటీ ఉద్దండులను తట్టుకుని గెలవడం అంత సులభం కాదనే విశ్లషణలు వస్తున్నాయి.  

15:35 - September 21, 2017

నల్లగొండ : జిల్లాలో ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తమ్ముడి భార్య శ్రీలత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమండ్లలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని శ్రీలత ఆత్మహత్య చేసుకుంది.. శ్రీలత భర్త ఓ ప్రైవేటు స్కూల్‌కు వ్యవస్థాపకుడిగా ఉన్నాడు.

15:16 - September 19, 2017
08:12 - September 15, 2017

నల్లగొండ : అమెరికాలో జాత్యహంకారానికి బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య మరచిపోక ముందే కాన్సాస్‌లో మరో దారుణం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని సీతారాంపురంకు చెందిన వైద్యుడు అచ్యుత్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. కాన్సాస్‌ రాష్ట్రంలోని విచితలో డాక్టర్‌ అచ్యుత్‌రెడ్డి నిర్వహిస్తున్న హోలిస్టిక్‌ క్లినిక్‌లోనే ఈ దారుణం జరిగింది. చికత్సి కోసం వచ్చిన రోగే అచ్యుత్‌రెడ్డిని కత్తితో పొడిచి సంపాడు. అచ్యుత్‌రెడ్డి ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు మిర్యాలగూడలోనే చదివాడు. హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 1986లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ సైకియాట్రీ చేశారు. 1989 నుంచి కాన్సాస్‌లోని విచితలో హోలిస్టిక్‌ క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న క్లినిక్‌కు వచ్చిన ఒక వ్యక్తి డాక్టర్‌ అచ్చుత్‌రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోద్రిక్తుడైన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తినీ తీసుకుని అచ్యుత్‌రెడ్డిని పొడిచాడు. దీంతో అచ్యుత్‌రెడ్డి రక్తమడుగులోపడి విలవిలాకొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిశాడు. నిందితుణ్ని కాన్సాస్‌ పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విషాదంలో కుటుంబ సభ్యులు
అచ్యుత్‌రెడ్డిక భార్య బీనారెడ్డి, పిల్లలు రాధ, లక్ష్మి, విష్ణు ఉన్నారు. తల్లిదండ్రలు, భద్రారెడ్డి పారిజాత మిర్యాలగూడలో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న అచ్యుత్‌రెడ్డి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అచ్యుత్‌రెడ్డి హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

07:05 - September 15, 2017

నల్లగొండ : జిల్లా ప్రకాశం బజార్ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ మటన్ మార్కెట్ శంకుస్థాపన చేశారు. ఎంపీ గుత్తాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:05 - September 13, 2017

నల్లగొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీపీసీసీలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. పీసీసీ చీఫ్‌ పేరు ఎత్తితే చాలు.. తోక తొక్కిన తాసుపాములా కస్సుమంటూ లేస్తారు. కోపంతో ఊగిపోతారు. శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల తర్వాత మరింత రగలిపోతున్నారు. ఈ సమావేశాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమను అవమానించారన్న భావంతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు... టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచే కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.

గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవకాశం దొరికనప్పుడట్టా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని టార్గెట్‌ చేస్తున్నారు. చాన్స్‌ వచ్చినప్పుడల్లా తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పైరవీలు చేసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు... శంషాబాద్‌ సమావేశం అనుభవంతో ఇక కాంగ్రెస్‌లో ఉండలేమన్న భావనుకు వచ్చారని సమాచారం. పార్టీ శిక్షణా తరగతుల్లో అవమానించారన్న కోపంతో రగలిపోతున్న కోమటిరెడ్డి సోదరులు.. ఆ రోజు వేదికపై ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోపాటు ఐఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాకు ఇంగిత జ్ఞానంలేదంటూ వ్యాఖ్యానించడం రాజకీయం పెద్ద రచ్చతోపాటు చర్చకు దారితీసింది.

టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమకు కాంగ్రెస్‌లో పొగబెట్టారని బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు.. టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని ప్రకటించారు. సెప్టెంబర్‌లో పీసీసీలో మార్పులు ఉంటాయని అనుకున్న నల్గొండ బద్రర్స్‌ ఆశలపై కుంతియా నీళ్లు చల్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కెప్టెనంటూ కుంతియా స్పష్టం చేయడంతో.... కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. శంషాబాద్‌ షాక్‌తో కోమటిరెడ్డి సోదరులకు పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై స్పష్టంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. తమ రాజకీయ భవిష్యత్‌పై అయోమయంలో ఉన్నారని వినిపిస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్‌ పయనం టీఆర్‌ఎస్‌, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి టీఆర్‌ఎస్‌ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక బ్రదర్స్‌ బీజేపీ గూటికి చేరతారని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కూడా కోమటిరెడ్డి సోదరుల్లో స్పష్టతలేదని వినిపిస్తోంది. కమలం పార్టీపై ప్రజల్లో ఊపు కనిపించడంలేదని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరు కలవరపడుతున్నారు. కమలదళంలో చేరితే భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందేమోన్న భయం వెంటాడుతోంది. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించే తాము బీజేపీలో ఇమడలేమన్న భావంతో కోమటిరెడ్డి సోదరులతోపాటు వీరి అనుచరులు ఉన్నారు. దీంతో బీజేపీలోకి వెళ్లే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా
మొత్తానికి పార్టీలో పట్టు పెంచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాటిని తట్టుకోలేక... కోటమిరెడ్డి సోదరులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు వేరు పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వీరిపై వేటు పడకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటూతేల్చుకోలేని పరిస్థితితుల్లో చివరి అవకాశంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరికి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా ? ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరుల దారెటు ? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

19:04 - September 11, 2017

నల్లగొండ : రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్‌ఎస్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీల రైతులు ఉండేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంటవేసిన ప్రతి రైతుకు ఎకరానికి 4 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జీవో 39ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ ఆందోళన నిర్వహించింది. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

 

15:43 - September 11, 2017

నల్లగొండ : కోమటిరెడ్డి బ్రదర్స్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఈ పేర్లు తెలియనివారుండరు. అంతటి చర్చనీయాంశ రాజకీయనాయకులుగా వీరి పేర్లు నల్గొండ ప్రజల్లో నానుతుంటాయి. కీర్తి శేషులు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి చాలా విశ్వాసమైన వ్యక్తిగా కోమటిరెడ్డికి గుర్తింపు ఉంది. ఆ సమయంలోనే తమ్ముడు రాజగోపాల రెడ్డిని భువనగిరి ఎంపీగా పార్లమెంటుకు పంపించారు. అయితే వైఎస్‌ మరణాంతరం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెక్‌ పడిందనే చెప్పుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన పేరుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఉత్తమ్‌కు మంత్రి పదవి లభించింది.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బ..
మొదటి నుండి ఎడమొహం పెడమొహంగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల నడుమ కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో మంత్రి పదవులు మారాయి. దీంతో వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల్లో సైతం ఒకరినొకరు ఓడించుకునేందుకు ప్రయత్నించారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుండి వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంలో టీపీసీసీ పగ్గాలు ఉత్తమ్‌కు దక్కడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. నాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా ఉత్తమ్‌ను విమర్శిస్తూ టీపీసీసీని తాము పరిగణలోకి తీసుకోవడంలేదని బహిరంగంగానే ప్రకటించారీ ఇద్దరు సోదరులు.

సాధారణ ఎన్నికల్లో టీపీసీసీ బాధ్యతల్లో ఉన్న ఉత్తమ్‌ వైఖరి వల్లే కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రచారం చేశారు. తమకు వీలున్న మార్గాల ద్వారా అధిష్ఠానం వద్దకు పదే పదే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గతంలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ వైఎస్‌ వర్గానికి సన్నిహితంగా ఉండటం వల్లే టీపీసీసీపై విమర్శలు చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఉత్తమ్‌ వైఖరితో 2019 ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో పార్టీ మరింత దిగజారిపోతుందని కోమటిరెడ్డి వర్గం ప్రచారం చేస్తూ వస్తోంది. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే కోమటిరెడ్డి లాంటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నాయకులు పార్టీ పగ్గాలు చేపట్టాలని సామాజిక వెబ్‌సైట్‌ల ద్వారా, తన క్యాడర్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. దీంతో టీపీసీసీ నాయకత్వం మార్పు జరుగుతుందని, బ్రదర్స్‌లో ఒకరికి పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది.

అదే సమయంలో టీఆర్‌ఎస్‌లోకి కోమటిరెడ్డి వెళ్తున్నారన్న ప్రచారం జరగడం, అనూహ్యంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి గులాబీ పార్టీకి చేరడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వెనక్కి తగ్గారన్న ఆరోపణలున్నాయి. అప్పటివరకు కేసీఆర్‌పై పెద్దగా విమర్శలు చేయని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆ తర్వాత తీవ్రమైన విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుండి ఈ బ్రదర్స్‌ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్గొండలో నాలుగు రోజుల పాటు మకాం వేయడంతో ప్రచారం నిజమవుతుందని భావించారు. అయితే సెప్టెంబర్‌లో టీపీసీసీ పగ్గాలు మారే అవకాశం ఉండటంతో తమకు కొంత సమయం కావాలని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీ నేతలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొంత కాలం పాటు ఈ ప్రచారాలు సద్దుమనిగినా ఇటీవల మళ్లీ ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా దిగ్విజయ్‌ స్థానంలో కుంతియా బాధ్యతలు చేపట్టడం కోమటిరెడ్డి బ్రదర్స్‌ను మరింత ఇరకాటంలో పెట్టినట్టయింది. కుంతియా ఉత్తమ్‌ వర్గంతో సన్నిహితంగా ఉన్నారనే అభిప్రాయాలున్నాయి. ఉత్తమ్‌ తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ సభలకు కుంతియా హాజరుకావడంతో టీపీసీసీలో మార్పులు జరగవనే ప్రచారం జరిగింది. దీంతో టీపీసీసీ కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అవకాశాలు సన్నగిల్లిపోయాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌ సారధ్యంలోనే వచ్చే శాసనసభ ఎన్నికలను ఎదుర్కుంటామని కుంతియా ప్రకటించడం సొంత పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీసింది.

బీజేపీలోకి...
కుంతియా ప్రకటనతో కోమటిరెడ్డి డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గం లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కుంతియా వ్యాఖ్యలు తమ క్యాడర్‌ను నైరాశ్యంలోకి నెట్టాయని బ్రదర్స్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని రాహుల్‌ దగ్గరే తేల్చుకుంటామనుకున్నా కుంతియా వ్యాఖ్యలలోని అంతరార్థం గురించి బ్రదర్స్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిణామాలతో మొదటి నుండి వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీకి వెళ్లడం శ్రేయస్కరమని సోదరులు భావిస్తున్నారు. కాని రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రభావిత శక్తిగా ఎదిగే అవకాశం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగా సరిపెట్టుకోవాలా అన్న ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. వెంకటరెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్టోబర్‌లో ఇందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. టీపీసీసీ పగ్గాలు రాకపోతే కమలం గూటికి చేరడం ఖాయమని కోమటిరెడ్డి అనుచరులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏదేమయినప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మార్పు ప్రచారం వారి రాజకీయ స్థిరత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న బ్రదర్స్‌ ప్రస్తుతం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది అక్టోబర్‌ మాసంలో తెలియనుంది.

17:58 - September 10, 2017

నల్లగొండ : జిల్లాలోపూర్తయిన భూ సర్వే గ్రామాలను వామపక్షాల నేతలు సందర్శించారు. మిర్యాలగూడ మండలం ముల్కలకాల్వ గ్రామంలో రైతులతో మాట్లాడారు. భూ సర్వే, రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతులకు చేకూరిన ప్రయోజనాన్ని లెఫ్ట్‌నేతలు ఆరాతీశారు. అయితే భూ సర్వేపేరుతో కేవలం రెవిన్యూ రికార్డులు మాత్రమే సరిచేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో భూమి కొలతలు పూర్తిచేస్తేనే తమకు ప్రయోజనం ఉంటుందని ఈసందర్భంగా రైతులు స్పష్టంచేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - నల్లగొండ