నిపుణులు

14:48 - November 21, 2017

ఇంటిని చక్కదిద్దే పనుల్లో మహిళలు బిజీగా ఉంటుంటారు. ఒక చేతితో గరిట తిప్పుతూ...మరో చేత్తో ఇంటి బాధ్యతలు మోస్తుంటారు. దీనితో కొంతమంది మహిళలు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటుంటారు. మరి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? తదితర అంశాలపై చర్చించేందుకు మానవి 'వేదిక'లో నర్మద (గైనకాలజిస్టు), సుజాత (న్యూట్రిషన్) పాల్గొని పలు సూచనలు..సలహాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.....

14:52 - November 3, 2017

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:42 - July 17, 2016

విశాఖపట్టణం : కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంటును నెలకొల్పితే ఉత్తరాధి ప్రాంతమంతా అభివృద్ధి కుంటుపడడం ఖాయమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 101 అణు విద్యుత్‌ ప్లాంట్లలో ప్రమాదాలు జరిగి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని దాడి వీరభద్రరావు అన్నారు. అలాంటి అణు విద్యుత్‌ ప్లాంట్లను మన ప్రభుత్వాలు ఎందుకు పెడుతున్నాయో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటికైనా వాటి ప్రతిపాదనలను విరమించుకోవాలని ఆయన సూచించారు.

ప్లాంటులు పెట్టడం సబబు కాదు..
అణు విద్యుత్‌ను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారని వారి సూచనల మేరకు కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంటులు పెట్టడం సబబు కాదన్నారు నిపుణులు. అనిల్‌ కకోద్కర్‌ లాంటి గొప్పశాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి ఏమీ కాదనుకోవడం శాస్త్రీయత అనుపించుకోదని విశాఖ సదస్సుకు వచ్చిన వివిధ రంగాల నిపుణులు అన్నారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి ప్రాజెక్టులు నెలకొల్పడం శాస్త్రీయత అనిపించుకోదన్నారు. 

12:45 - July 14, 2016

హర్యానా : తెలంగాణలో భారీ ప్రాజెక్టులు అవసరం లేదని...భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో భూమి నష్టపోతామని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. హర్యానాలోని నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిపుణులతో కలసి ఆయన సందర్శించారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. హర్యానాలో పరిశీలించిన అంశాలను అందరికీ వివరిస్తామన్నారు. ఎల్లుండి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను కలసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రయోజనాలను వివరిస్తామని చెప్పారు. తెలంగాణలో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిపోతాయని తెలిపారు.

15:51 - June 13, 2016

హైదారాబాద్ : పెళ్లీడు అబ్బాయిలు పారాహుషార్‌.. ఆలస్యం చేస్తే అంతే సంగతులు. వెంటనే కల్యాణానికి సిద్ధపడకపోతే అమ్మాయిలు దొరకడమే కష్టమంటున్నాయి గణాంకాలు. దీంతో భవిష్యత్తులో అబ్బాయిలు పెళ్లిల్లు పెద్దలకు తలనొప్పిగా మారనున్నాయి.

భవిష్యత్తులో అబ్బాయిలకు.. వధువు దొరకడమే గగనం...
దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం చదువు.. కట్నం.. ఉద్యోగం.. ఇవన్నీ ఉంటేనే పెళ్లికి ఓకే అంటున్నారు అబ్బాయిలు. ఇప్పుడిలా డిమాండ్ చేస్తున్నా... భవిష్యత్తులో వధువు దొరకడమే గగనంగా మారడం ఖాయమని గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లీడుకు రాబోతున్న అబ్బాయిల కన్నా.. అమ్మాయిలు సంఖ్య చాలా రోజురోజుకు తగ్గుతోంది.

అబ్బాయిల కంటే.. అమ్మాయిల సంఖ్య తక్కువ...
కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలను చూసుకుంటే...ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆరు నుంచి పదిహేడేళ్ల లోపు సంఖ్యను పరిశీలిస్తే.. ఈ తేడా భారీగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈ వయసు అబ్బాయిల సంఖ్య 16లక్షల పైనే ఉండగా... అమ్మాయిల సంఖ్య 15లక్షలే. అటు ఏపీలోనూ అబ్బాయిలి 21లక్షలకు పైగా ఉండగా.. అమ్మాయిల సంఖ్య 20లక్షలే. ఇది ఇలాగే కొనసాగితే.. నాలుగేళ్లలో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉండబోతుంది. పదేళ్లలో అమ్మాయిల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నాలుగేళ్లలో ఏర్పడనున్న అమ్మాయిల కొరత...
ప్రస్తుతం 30 ఏళ్లకు పైబడిన పెళ్లికాని అబ్బాయిలు ఎక్కువగానే ఉన్నారు. పెళ్లి కోసం అంత తొందరపడడం లేదు. ఆచి.. తూచి అడుగేస్తున్నారు. వారి ఉద్యోగానికి.. చదువుకు సరిపడా అర్హతులున్న అమ్మాయిలనే కోరుకుంటున్నారు. అటువంటి వారి కోసం వెయిట్‌ చేస్తున్నారు. దీంతో పెళ్లీడు అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. ఇంచుమించు అమ్మాయిల పరిస్థితి అలానే ఉంది. వారికి నచ్చిన లక్షణాలున్న వారి కోసం ప్రయత్నిస్తున్నారు.

అబ్బాయిలు..అమ్మాయిల నిష్పత్తిలో మార్పులు...
మారుతున్న సమాజ స్థితిగతులకనుగుణంగా.. దంపతులు ఒక్కరో.. ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నారు. వారినే సరిగ్గా పెంచగలిగితే చాలానుకుంటున్నారు. దీంతో అబ్బాయిలు..అమ్మాయిల నిష్పత్తిలో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదని నిపుణుల విశ్లేషణ.

09:56 - May 6, 2016

చాలా మందికి నడవడం అంటే చాలా బద్ధకం. అందుకే చిన్న పనికి కూడా ద్విచక్ర వాహనంపై రయ్..రయ్.. అంటూ వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి భవిష్యత్‌లో ప్రమాదం పొంచివున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా.. ఉద్యోగులు, గృహిణులు, యువత సైతం ఈ కాలంలో కూర్చోడానికి, విశ్రాంతికోసం ఇంటికి పరిమితం కావడానికి ఇస్తున్న ప్రాధాన్యత నడవడానికి ఇవ్వడం లేదు. ఇంటినుంచి ఆఫీసుకు, తిరిగి ఇంటికి మనిషిని చేర్చటంలో సొంత వాహనాలు మంచి వెసులుబాటును ఇచ్చినప్పటికీ ఈ క్రమంలో నడక గాలికెగిరిపోయి సమస్యలను కోరి ఆహ్వానించినట్టవుతోంది.
ఇంటి నుంచి ఆఫీసుకు పోయాక కుర్చీల్లో కూర్చుని గంటల కొద్దీ పనిచేయటం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ చూడటం, తినటం, చదువుకోవటం, కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పటంతోనే కాలం వెళ్లబుచ్చటం వల్ల కండరాలు బిగుసుకుపోవటం అనేది సహజమైపోయింది. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

20:07 - March 11, 2016

కోట్ల రూపాయలను గోల్ మాల్ చేయడంలో సిద్ధహస్తులు. ప్రజల సొమ్ముతో పైలా పచ్చీస్ చేయడం వాళ్లకు అలవాటైన వ్యవహారం. ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరడంలో ముందుంటారు. రాజకీయ అండదండలతో చట్టసభల్లో చాలా ఈజీగా స్థానం సంపాదిస్తారు. ఆ తరువాత చల్లగా జారుకుంటారు. ఇవన్నీ మన దేశంలో బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేస్తున్న డిఫాల్టర్స్ కు సరిగ్గా సరిపోతాయి. ఆర్థిక మోసగాళ్ల అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), పి. వెంకటరామయ్య (బీఈఎఫ్ఐ), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శశి కుమార్ (ఆర్థిక నిపుణులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియో క్లిక్ చేయండి. 

11:50 - December 12, 2015

హైదరాబాద్ : ఇసుక.. అపురూపమై పోయింది. సామాన్యుడి నుంచి.. భారీ బిల్డర్‌ వరకు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేకుండా పోయింది. పైగా అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి.. ఇసుక ధరను ఆకాశానికి తీసుకు వెళ్లారు. ఇప్పుడా ధర దిగి రానంటోంది.. సామాన్యుడి అవసరం తీరకుండా ఉంది. ఇప్పుడేం చేయాలి.. ఇసుకకు ప్రత్యామ్నాయం ఏంటి..? ఇవే ఇప్పుడు ప్రభుత్వం మదిలో మెదలుతోన్న ప్రశ్నలు..

ఏపీలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు.....

ఏపీలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం నిర్మాణ రంగం డిమాండ్‌కు.. ఇసుక సరఫరాకు అస్సలు పొంతనే లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న నిర్మాణాల కోసం... సుమారు రెండు కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరముంది. మున్ముందు ఈ డిమాండ్‌ రెండున్నర కోట్ల క్యూబిక్‌ మీటర్లకూ చేరే అవకాశముంది. అయితే.. ప్రస్తుతం లభ్యమవుతోన్న ఇసుక.. కేవలం కోటి క్యూబిక్‌ మీటర్లే. దీంతో ఇసుక బంగారం కన్నా విలువైనదిగా మారిపోయింది.

చెలరేగి పోతున్న అక్రమార్కులు...

ఇసుకకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా... అక్రమార్కులు చెలరేగి పోతున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో.. ఇసుకను అందినకాడికి దోచేస్తున్నారు. ఇసుక అందుబాటులో ఉన్న చోట 'వాల్టా' చట్టాన్ని సైతం తుంగలో తొక్కి తవ్వేస్తున్నారు. కొన్ని అధికారిక రేవుల్లో కూడా నిబంధనలను ఉల్లంఘించి.. ఇసుకను తవ్వేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తుండడం వల్ల...

ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తుండడం వల్ల ఆయా ప్రాంతాల్లోని వంతెనలు, తాగునీటి ఫిల్టర్‌ బావుల నిర్మాణాలు దెబ్బ తింటున్నాయి. కరకట్టలు బలహీనపడి వరదల సమయంలో పంట, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. నదుల్లో నీటి ప్రవాహం గతి తప్పి... తీరం కోతకు గురవుతోంది. ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తుండడంతో భూగర్భ జలాలూ గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వల్ల పర్యావరణం దెబ్బతిని.. చెంతనే నదులున్నా... కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఇసుకాసురుల ఆగడాలను నిలువరించేందుకు..

ఇసుకాసురుల ఆగడాలను నిలువరించేందుకు.. ర్యాంపులను మహిళలకు అప్పగిస్తే.. తవ్వకాలపై నియంత్రణ ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే దాదాపు అన్ని ఇసుక ర్యాంపులనూ డ్వాక్రా మహిళా సంఘాలకే అప్పగించింది. ఇసుక తవ్వకాలు, పర్మిట్‌లు ఇవ్వడం లాంటి బాధ్యతలను మహిళా సంఘాలకే కట్టబెట్టింది. దీంతోపాటే ఇసుకను తరలించే వాహనాలకు జీఎస్‌టీ పరికరం తప్పని సరి అనీ షరతు విధించింది. అయితే.. పరిస్థితిలో ఏమార్పూ రాక పోగా.. ఇసుక అక్రమ తవ్వకాలు మరింతగా పెరిగాయి. 

20:16 - October 14, 2015

హైదరాబాద్ : ఏకపక్ష నిర్ణయాలంటూ టీ సర్కారుపై విమర్శల వాన కురుస్తూనే ఉంది. నిన్నటివరకూ ప్రతిపక్షాలు ఈ ఆరోపణలతో వేడెక్కించగా.. ఇప్పుడు విద్యుత్ రంగ నిపుణులు వంతొచ్చింది.. ఎవరినీ సంప్రదించకుండా చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం కుదర్చుకున్నారని వీరంతా మండిపడుతున్నారు.. ఈ అగ్రిమెంట్‌తో తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందంటూ టీ విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. తెలంగాణలో కరెంటు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం.. చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వెయ్యి మెగావాట్ల కరెంటు కొనుగోలుకు రెండు ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్‌ కుదిరింది. ఇందుకోసం టీసర్కారు ప్రతి ఏడాది 13వందల 14కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఈ ఒప్పందంపై అభ్యంతరాలుంటే తెలపాలని టీ విద్యుత్ నియంత్రణమండలి బహిరంగ ప్రకటన జారీచేసింది. దీనికి స్పందించిన విద్యుత్ రంగ నిపుణులు ఈ ఒప్పందంవల్ల జరిగే నష్టాలను వివరిస్తూ విద్యుత్ మండలికి లేఖ రాశారు.

విద్యుత్ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటున్న నిపుణులు..
చత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం ఏకపక్షం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఉందని వాదిస్తున్నారు. ఒకవేళ ఇతర కారణాలతో కరెంటు కొనుగోలు చేయక పోయినా స్థిర చార్జీల రూపంలో ప్రతి ఏడాది 13వందల 14కోట్లు చెల్లించక తప్పదని సూచిస్తున్నారు. అలాగే రెగ్యులర్ విద్యుత్ ఒప్పందాలకు ఉండే కనీస లక్షణాలు ఇందులో లేవని ఆరోపిస్తున్నారు. పూర్తిగా చత్తీస్‌గఢ్‌కు అనుకూలంగా ఉన్న ఈ అగ్రిమెంట్‌వల్ల భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని లేఖలో రాశారు నిపుణులు.

ఒప్పందాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించొద్దని సూచన..
మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు టెండర్లు పిలవకుండానే ప్రభుత్వం చత్తీస్‌గఢ్‌తో డైరెక్టుగా ఒప్పందం కుదుర్చుకుందని విమర్శలొస్తున్నాయి. అంతకంటే తక్కువధరకు అందించే ఇతర కంపెనీలున్నా ఇలా అగ్రిమెంట్‌ కుదుర్చోవడం సరికాదంటున్నారు. పైగా టారిఫ్‌కు సంబంధించి ఇందులో ఎలాంటి నిబంధనలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించొద్దని నిపుణులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఒప్పందంపై బహిరంగ విచారణ జరిపి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. టెండర్లకు వెళ్లేలా పంపిణీ సంస్థలను ఆదేశించాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

19:44 - August 6, 2015

ఉస్మానియా కూల్చేద్దాం..ఈ మాటను అన్నది మరెవరో కాదు. సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌. కొత్తరాష్ట్రానికి తొలి సీఎంగానూ, అంతకు మించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథిగా ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర కేసీఆర్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉస్మానియా లాంటి చారిత్రక కట్టడం పునర్వైభవం తేవడానికి ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయని నిపుణులు తేల్చుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సీఎం అయిన తొలినాళ్లలో మెట్రో డిజైన్‌ మార్చాలని కేసీఆర్‌ పట్టు...
సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్‌ హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుపై దృష్టి సారించి దాని డిజైన్‌ మర్చాలని పట్టుబట్టారు. ముఖ్యంగా తెలంగాణ చారిత్రక సంపదగా నిలిచే అసెంబ్లీ, గన్‌పార్క్‌ స్థూపం నిర్మాణాలకు ముప్పు ఉందని గుర్తించి ఏకంగా మెట్రో దారిమళ్లించాలంటూ కేసీఆర్‌ హుకూం జారీ చేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో సరిగ్గా ఏడాది గడిచిపోయింది. ఉస్మానియా భవనాన్ని కూల్చేసి ఆ స్థానంలో టవర్లు నిర్మిస్తామన్నారు. ఈ నిర్ణయం సగటు తెలంగాణ ఉద్యమకారుడిని కూడా ఆలోచనలో పడేసింది.
నాటి నిజాం పాలనలోనే నిపుణుల కమిటీతో నిర్ణయం...
ఏ చారిత్రక పునర్వైభవాన్ని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌నుంచి ఆశించారో అందుకు విరుద్ధమైన పరిణామం ఇది. 1908లో ఏడో నిజామ్‌ ఓ బోర్డును ఏర్పాటు నియమించి, నిపుణులు, సమాజ ప్రతినిధుల సూచనల మేరకు ఉస్మానియా ధర్మాసుపత్రి నిర్మించారు. నాటి రాచరిక వ్యవస్థలోనే నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఉస్మానియాను నిర్మిస్తే నేటి ప్రజాస్వామ్య పాలకులు మాత్రం ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని మేధావులు అంటున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై...
ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతపై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు కూల్చివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చకుండా.. మరోచోట ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. చారిత్రక వైభవాన్ని కాపాడుతూ ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని కాపాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పడు చూద్దాం.
మొదటి విధానం కన్జర్వేషన్‌....
వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడానికి ఏడు ముఖ్యమైన విధానాలు ఉన్నాయి. వీటిని యునెస్కో ప్రమాణాల ప్రకారం ఆమోదించారు. ఇందులో మొదటి విధానం కన్జర్వేషన్‌... ఈ విధానం ప్రకారం వారసత్వ కట్టడాలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే కన్జర్వేషన్‌ తప్పనిసరి. ఒకసారి వారసత్వ గుర్తింపు వచ్చిన తర్వాత దాని పరిరక్షణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రీస్టోరేషన్‌, రీ కనస్ట్రక్షన్‌, ప్రిజర్వేషన్‌, రెట్రోఫిట్టింగ్‌ వంటి చర్యలన్నీ ఇందులో భాగమే.
రెండో విధానం రీ కన్‌స్ట్రక్షన్‌...
రెండో విధానం రీ కన్‌స్ట్రక్షన్‌..వారసత్వ కట్టడాల శిథిల స్థితిని బట్టి పునర్నిర్మాణం చేపడతారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ కట్టడాలు నామరూపాలు లేకుండా పోయినప్పుడు తిరిగి నిర్మిస్తారు. ఈ విధానంలో నేల మట్టం అయిన నిర్మాణాన్ని అక్కడితో వదిలేయకుండా అదే స్థానంలో మరో కట్టడాన్ని నిర్మిస్తారు. కూలిపోయిన కట్టడం నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రితోనే కొత్త నిర్మాణం చేపట్టాలి.
తవ్వకాల్లో బయటపడ్డ నిర్మాణాలను కాపాడటం....
స్టెబిలైజేషన్‌ ఈ విధానంలో పురావస్తుశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఆయా ప్రదేశాల్లో గానీ, కొండల్లో గానీ బయటపడిన నిర్మాణాలను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం. ఇటువంటి కట్టడాలకు నష్టం వాటిల్లకుండా పరిరక్షించుకోవాలి. వీటికి ఎక్కడ ఎటువంటి మరమ్మతులు వచ్చినా ఆ కాలంలో ఏయే నిర్మాణ సామగ్రిని ఉపయోగించారో వాటితోనే సరిచేస్తారు.
రెట్రోఫిట్టింగ్‌ ఈవిధానంలో...
రెట్రోఫిట్టింగ్‌ ఈవిధానంలో ఒక భవనం ఎప్పటికైనా శిథిలావస్థకు చేరుకోవడం సహజం. ఇది వెంటనే జరగదు. గోడలకు బీటలు వేయడం, పైకప్పు పెచ్చులుగా ఊడిపోవడం, భవనంలో ఒక్కో భాగం కిందపడిపోతుండడం, ఇలా వివిధ దశలు దాటిన తర్వాత కూలిపోయే స్థితికి ఆ భవనం వస్తోంది. ఈ దశలను ఆరంభంలోనే గుర్తించి వాటికి మరమ్మతులు చేయించవచ్చు. అప్పుడు రిపేర్‌ అండ్‌ రెట్రోఫిట్టింగ్‌ పద్ధతిని పాటించాలి. ఉస్మానియా ఆసుపత్రిని రెట్రోఫిట్టింగ్‌ పద్ధతి ద్వారా కాపాడుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో చారిత్రక ఆనవాళ్లను వేరే ప్రాంతానికి మార్చడం....
ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఈ విధానంలో ఏదైనా భారీ కట్టడం గానీ, పెద్ద ప్రాజెక్టు గానీ నిర్మించాల నుకున్నప్పుడు ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ఈ నిర్మాణాలు జరిగే ప్రదేశంలో ఎటువంటి చారిత్రక ఆనవాళ్లకు సంబంధించిన ఏ చిన్న గుర్తులు లభించినా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పనిసరి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు అక్కడ బౌద్ధమతానికి సంబంధించిన శకలాలను గుర్తించారు. వాటిని కాలగర్భంలో కలిపేయకుండా పక్కనే ఉన్న నాగార్జున కొండపైకి మార్పు చేశారు.
నిర్మాణాల్లో త్రీడి మ్యాపింగ్‌ లాంటి విధానాలతో...
నేడు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానే పెరిగింది. నిర్మాణాల్లో త్రీడి మ్యాపింగ్‌ లాంటి విధానాలతో సమూల మార్పులతో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి పునర్వైభవం తేవచ్చు. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం హైదరాబాద్‌ మరో చారిత్రక వారసత్వ సంపదను కోల్పోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Don't Miss

Subscribe to RSS - నిపుణులు