నిర్మల్

13:40 - August 20, 2018

హైదరాబాద్ : నాగార్జున సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుండి 2 లక్షల 8వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరింది. తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు, ఏ ఎమ్మార్పీకి కలిపి సుమారు 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో వారం రోజుల పాటు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరితే డ్యామ్‌ గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది.

జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 14 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు.

నిర్మల్‌ జిల్లా భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర నుండి భారీగా వదర నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 17వేల 5వందల క్యూసెక్కుల నీటిని సుద్ధవాగులోకి విడుదల చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:23 - August 19, 2018

నిర్మల్‌ : జిల్లాలోని కడెం పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. కానిస్టేబుల్‌ మధురేఖ పోలీస్‌ క్వార్టర్స్‌లోనే పురుగుల మందు తాగింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా మర్గమధ్యంలోనే మధురేఖ మరణించింది. అయితే మధురేఖ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

10:38 - August 12, 2018

నిర్మల్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు 13 గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700అడుగులు కాగా... ప్రస్తుతం 698.37 అడుగులకు చేరింది. లక్ష క్యూసెక్కులు నీరు ప్రాజెక్టులోకి చేరుతుంగా... లక్షా 25వేల క్యూసెక్కుల నీరు అధికారులు కిందకు వదులుతున్నారు. 13 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

15:12 - July 14, 2018

నిర్మల్ : మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ నాణ్యత ఎలా ఉందో పలు ఘటనలు నిరూపించాయి. పలు ప్రాంతాల్లో పైపు లైన్ లు పగిలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పైపులైన్ పగిలిపోయింది. భారీగా నీరంతా వృధాగా పోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నిర్మల్ పట్టణానికి నీరందిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల్పించింది. అందులో భాగంగా 'మిషన్ భగీరథ'కింద పైపులైన్ ఏర్పాటు చేశారు. శనివారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.

కానీ మంజులాపూర్...నిర్మల్ జాతీయ రహదారి పక్కనే ఉన్న పైపులైన్ వాల్ ఎగిరిపోయింది. ఒక్కసారిగా నీరంతా పైకి ఎగిసింది. దాదాపు పది మీటర్ల ఎత్తున నీరు ఎగిసిపడింది. పక్కనే ఉన్న ఓ రైతుకు ఉన్న మూడెకరాల పొలంలోకి భారీగా నీరంతా చేరింది. చేనంతా నీటితో నిండిపోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అధికారులు చర్యలు చేపట్టారు. మరి ఆర్థికంగా నష్టపోయిన ఆ రైతును అధికారులు...ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. 

12:29 - July 9, 2018

నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల నిరక్షరాస్యత వారి కుమార్తెను బలిగొంది. నర్సవ్వ, ఎర్రన్న దంపతులకు శిరీష (5) ఉంది. చిన్నారికి ఆదివారం రాత్రి పాము కుట్టింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసింది. కానీ వారి నిరక్షరాస్యతతో చెట్ల మందులు కాలయాపన చేశారు. కానీ శిరీష ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. 

08:44 - July 2, 2018

నిర్మల్ : రక్తపాశాలను కూడా మద్యం ప్రభావితం చేస్తోంది. మద్యం మత్తులో కన్న తండ్రులను, తల్లులను దారుణంగా హత్య చేస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాగే కన్న కొడుకులను హత్య చేస్తున్న తండ్రుల ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓదెల మండలం ఉప్పరపల్లిలో మద్యం డబ్బుల కోసం కన్న కుమారుడిని కన్నతండ్రి కొట్టి చంపిన ఘటన మరచిపోకముందే..మద్యం డబ్బుల కోసం కన్న తండ్రిని దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముథోల్ జిల్లాలో మద్యానికి బానిసైన నగేశ్ తండ్రి పోతన్నను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులివ్వాలని తండ్రితో గొడవ పడ్డ నగేశ్ తండ్రి డబ్బులు ఇవ్వకపోవటంతో ఘర్షణకు దిగాడు. అనంతరం కర్రతో తీవ్రంగా దాడి చేయగా పోతన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోతన్న భార్య, స్థానికులు కలిసి భైంసా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పోతన్న మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తండ్రిపై దాడి చేసిన వెంటనే నగేశ్ పరారయ్యాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పరారీలో వున్న నగేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

21:12 - July 1, 2018

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా బసంత్‌ నగర్‌ టోల్‌ గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బసంత్‌ నగర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 44 జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

11:15 - June 18, 2018

నిర్మల్ : సోన్ మండలంలో జరిగిన బాలికపై హత్యాచారం ఘటనపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపి తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశాడు. దీనిపై కుటుంబసభ్యులు...గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందతుడిని అప్పగించాలంటూ తామే శిక్షిస్తామని జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళన జరిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘలు స్కూల్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో పలు స్కూల్స్ బంద్ అయ్యాయి. 

08:30 - June 13, 2018

నిర్మల్ : ఆ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనారిటీ ఓటర్లే అధికం. కానీ పాలకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడు ఆ నాయకులు గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ముథోల్‌ నియోజకవర్గంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికం
నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో దళిత, బహుజన, మైనరిటీ ప్రజలే అధికంగా ఉన్నారు. కానీ ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో దళిత, బహుజన, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో బహుజనులకు అధికారాన్ని కట్టబెట్టాలనే యోచనలో నియోజకవర్గ  ప్రజలు ఉన్నారు. 
ముథోల్‌.. 117 గ్రామాలు, 49 తాండాలు 
ముథోల్‌ నియోజకవర్గంలో ముథోల్‌తో పాటు కుంటాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, భైంసా మండలాలున్నాయి. ఈ మండలాల్లో 117 గ్రామాలు, 49 తాండాలు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం మొత్తం 2,06,230 మంది ఓటర్లు ఉన్నారు. వీరీలో ఎస్సీ ఓటర్లు 20 శాతం, ఎస్టీ ఓట్లరు 9 శాతం, బీసీలు 31 శాతం, మైనారిటీలు  14 శాతం ఉండగా..  ఇతర ఓటర్లు 24 శాతం ఉన్నారు. 
రెడ్డి, రావు సామాజికవర్గం ఆధిపత్యం 
ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలు ఉన్నా ముథోల్‌ నియోజకవర్గంలో రెడ్డి, రావు సామాజిక వర్గాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయి. 1957 ఎన్నికల్లో గోపిడి గంగిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1962లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1967లో గడ్డన్నరెడ్డి ముథోల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వరుసగా 1972, 1978,1983 ఎన్నికల్లో గెలిచారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గడ్డన్నపై టీడీపీ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి విజయం సాధించారు. తిరిగి 1989 ఎన్నికల్లో గడ్డన్న తన పదవిని చేజిక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో గడ్డన్న మరోసారి ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి నారాయణరావు పటేల్‌ ఆయనపై విజయం సాధించారు. మళ్లీ 1999లో గడ్డన్న గెలవగా.. 2004 ఎన్నికల్లో నారాయణరావు పటేల్‌ని ప్రజలు గెలిపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేణుగోపాలచారి అనూహ్య విజయం సాధించారు. ఇక 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి రమాదేవీపై 14,837 ఓట్లతో విజయం సాధించారు. 
బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తారా ? 
ఇప్పటి వరకు ఏ పార్టీ చూసినా రెడ్డి, రావు సామాజిక వర్గానికి తప్ప ఇతర సామాజిక వర్గానికి టికెట్‌ ఇచ్చిన దాఖలు లేవు. దీంతో తమ సమస్యలు పరిష్కారం అవ్వటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత, బహుజనుల కేంద్రం అయినప్పటికీ....  రెడ్డి, రావు సామాజిక వర్గాలకు చెందినవారు ఎమ్మెల్యేలుగా ఉండటంతో అభివృద్ధిలో ముథోల్‌ నియోజకవర్గం వెనుకపడిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో ముథోల్‌ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. గోదావరి నది పక్కనే ప్రవహిస్తున్నా... వ్యవసాయానికి చుక్కనీరు అందటం లేదని రైతులు వాపోతున్నారు. ఉపాధి కరువై దుబాయ్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో బహుజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీలు ఈ సారి కూడా ఆ సామాజిక వర్గాలకే టికెట్‌ ఇస్తాయో... ప్రజలు కోరుతున్నట్టు బహుజనులకు టిక్కెట్లు కేటాయిస్తాయో వేచి చూడాలి.

19:43 - June 12, 2018

నిర్మల్ : తెలంగాణలో రైతులకు లబ్ది చేకూరాలనే ఉద్దేశంతో సర్కార్‌ చేపట్టిన విత్తనాల పంపిణీ పక్కదారి పడుతోంది. యదేచ్చగా సబ్సిడీ విత్తనాలు పక్కదారి పడుతున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని తనూర్‌, కుబీర్‌, ముధోల్‌ మండలాల పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 100కు పైగా సబ్సిడీ సోయా విత్తనాల బస్తాలు పట్టుబడ్డాయి. విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న రెండు ఆటోలు, ఒక మోటర్‌ సైకిల్‌, ఒక బొలేరో వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - నిర్మల్