నెల్లూరు

08:22 - November 27, 2017

నెల్లూరు : శబరిమలైకి వెళ్లి వస్తున్న వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా పేలప్రోలకు చెందిన కొంతమంది టాటా ఎస్ వాహనంలో శబరిమలైకి వెళ్లి తిరిగి వస్తున్నారు. సోమవారం ఉదయం మంచు దట్టంగా అలుముకుంది. తడ (మం) పన్నంగాడు ఎదురుగా ఆగి ఉన్న లారీని టాటా ఎస్ వాహనం ఢీకొంది. దీనితో ఇద్దరు అక్కడికక్కడనే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు పేలప్రోలుకు చెందిన రాహుల్, రామాంజనేయులుగా గుర్తించారు. గాయాలైన వారిని తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

12:35 - November 26, 2017

నెల్లూరు : ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వం..ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఓ రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేయడంతో అతని పరిస్థితి విషమంగా తయారైంది. ఇటీవలే చలపతి రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధ పడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. కానీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కడుపులోనే కత్తెర పెట్టి కుట్లు వేసి కొద్ది రోజుల అనంతరం ఇంటికి పంపించారు. తిరిగి కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ తీయడంతో అసలు విషయం బయటపడింది. కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని టెన్ టివి కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన వైద్యులు..కలెక్టర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. కానీ ఎలాంటి సహాయం అందించలేదని చలపతి రావు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే గత వారం రోజుల నుండి తిండి లేకపోవడం..మలమూత్రాలు కూడా రాకపోవడంతో కడుపు పూర్తిగా ఉబ్బిపోయింది. కళ్లెదుటే..భర్త అలాంటి పరిస్థితిలో ఉండడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది. తమను ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకొంటోంది. 

21:21 - November 24, 2017

నెల్లూరు : వైఎస్‌ జగన్‌పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. నెల్లూరులోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన సమావేశమయ్యారు. ఈడీ విడుదల చేసిన అవినీతి పరుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి టాప్ టెన్ లో ఉన్నారని అన్నారు. 31 డొల్ల కంపెనీల ద్వారా 368 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ ద్వారా దేశం దాటించారని ఆరోపించారు. ఇవన్నీ తాను చెబుతున్నది కాదని సాక్షాత్తు ఈడీ చెప్పిన మాటలని అన్నారు. అవినీతిపరులు రాజకీయాల్లో ఉండకూడదని పాదయాత్రలో సందేశాలు ఇస్తున్న జగన్ తక్షణం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని ఆ బాధ్యతను వేరే వాళ్లకు అప్పగించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మంత్రి సోమిరెడ్డి అన్నారు. 

16:12 - November 20, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని బీజేపీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బీజేపీ దళితమోర్చా కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి. టౌన్‌ హాల్‌ కేంద్రంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్‌రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం దాడికి దిగాయి. కుర్చీలతో కుమ్మలాటకు దిగాయి. దీంతో దళిత యువమోర్చా కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీలో కొన్నేళ్లుగా సురేష్ రెడ్డి, సురేంద్ర రెడ్డి... వర్గాలు రెండుగా విడిపోయాయి. సురేందర్ రెడ్డికి వెంకయ్యనాయుడి ఆశీస్సులతో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి దక్కింది.. దీనిని సురేష్ రెడ్డి వర్గం విభేదించింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతూ వచ్చాయి. సురేందర్ రెడ్డి ఒకవర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ.. సురేష్ రెడ్డి వర్గం విమర్శలు చేస్తోంది.. వీటిని సురేంద్ర రెడ్డి వర్గం పట్టించుకోలేదు . దీంతో సురేష్ రెడ్డి వర్గానికి చెందిన దళితమోర్చా రోడ్డెక్కింది. సురేందర్ రెడ్డి దళితులకు అన్యాయం చేస్తున్నారంటూ.. నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టింది.

సురేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వర్గీయులు బాహాబాహీ
టౌన్ హాల్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కుర్చీలతో తలపడ్డారు.. మొత్తానికి చాలా కాలంగా అంతర్గతంగాఉన్న బీజేపీ విభేదాలు దళిత మోర్చా సభలో భహిర్గతమై.. కుర్చీలతో కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. సురేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వర్గీయులు బాహాబాహీకి తలపడడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇరువర్గాలను అధిష్టానం ఎలా హ్యాండిల్‌ చేస్తుందో చూడాలి మరి.

13:12 - November 18, 2017

నెల్లూరు : జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బద్వేలుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి, పావనిగా గుర్తింపు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:56 - November 14, 2017

నెల్లూరు : బోటు ప్రమాదంలో మృతి చెందిన లలితమ్మ, హరిత, అశ్విక మృతదేహాలు జిల్లాలోని వారి స్వగ్రామం కురుగొండకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. వీరి మృతితో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులతోపాటు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇవాళ సాయంత్రం మృతదేహాలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వం బాధ్యత ఉందన్నారు.

 

08:20 - November 13, 2017

విజయవాడ : కృష్ణా నదిలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 16 మంది పర్యాటకులను గజ ఈతగాళ్లు రక్షించారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మృతదేహం మినహా 15 మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రత్యేక అంబులెన్స్ లలో మృతదేహాలను స్వస్థలానికి తరలిస్తున్నారు. పది మృతదేహాలు ఒంగోలు చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలిని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రమాదంపై విచారణకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.

బోటులో మొత్తం 41 మంది పర్యాటకులున్నారు. 32 మంది ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు..8 మంది నెల్లూరు జిల్లా వాసులున్నారు. మృతుల్లో 15 మంది ప్రకాశం జిల్లా ఒంగోలు వాసులుగా గుర్తించారు. వీరంతా కృష్ణా నదిలో విహార యాత్రకు వెళ్లారు. 

08:34 - November 10, 2017

నెల్లూరు : కువైట్‌లో యజమాని చేతిలో చిత్రహింసలు పడుతున్న నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రవి తన ఇంటికి చేరుకున్నాడు. తాను చిత్రహింసలు పడుతున్న విషయాన్ని రవి వీడియో ద్వారా తెలుపగా టెన్‌ టీవీ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో కువైట్లో ఉన్న అనేక మంది భారతీయులు స్పందించి రవిని ఇండియాకు సేఫ్‌గా పంపించారు. ప్రస్తుతం రవి తన స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాను ఇండియాకి వస్తానన్న నమ్మకమే లేదని, నేను బ్రతికున్నానంటే దానికి కారణం టెన్‌ టీవీ కథనాల వల్లేనని రవి టెన్‌ టీవీకి కృతజ్ఞతలు తెలిపాడు. 

16:01 - November 7, 2017

నెల్లూరు : జిల్లాలోని కావలిలో ఇద్దరు పోలీసు అధికారులు స్టేషన్‌లోనే వీరంగం సృష్టించారు. ఒకరితో ఒకరు  ఘర్షణకు దిగి.. రోడ్డునపడ్డారు. ఓ ఫ్యాన్సీ స్టోర్‌ వివాదంలో.. సీఐ, ఏఎస్ ఐల మధ్య పంపకాలు దగ్గర తేడా వచ్చి.. పోలీస్‌స్టేషన్‌లోనే గొడవపడ్డారు. సోమవారం రాత్రి ఏఎస్ ఐ సుబ్రహ్మణ్యం స్టేషన్‌లో.. సీఐ రోశయ్యతో వాగ్వాదానికి దిగడంతో.. అక్కడే ఉన్న ఎస్ ఐ అంకమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఎస్ ఐని సుబ్రహ్మణ్యం నెట్టాడు.. దీంతో ఆగ్రహం చెందిన సీఐ .. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని.. సీఐ చెప్పారు.

 

18:27 - November 4, 2017

నెల్లూరు : జిల్లాలో విజృంభిస్తున్న డెంగ్యూ, సీజనల్‌ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఆదేశించారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరాలు, సీజనల్ వ్యాధులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు తగ్గేవరకు డాక్టర్లు సెలవును రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్యూటీ సమయంలో చాలా చోట్ల డాక్టర్లు ఆస్పత్రుల్లో ఉండటం లేదన్న ఆరోపణలు ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ అటెన్డెన్స్‌ వేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్‌ వేయకపోతే సూపరింటెండ్‌పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - నెల్లూరు