నేరాలు

08:01 - May 29, 2018

హైదరాబాద్ : అనగనగా ముగ్గురు మిత్రులు.. అవసరానికి కావాల్సినంత డబ్బు కోసం అక్రమ మార్గం పట్టారు. అప్పు చేస్తారు..  డబ్బుతిరిగి ఇమ్మంటే గన్‌ తీస్తారు..అడగ్గానే  డ‌బ్బు ఇవ్వక‌ుంటే  బుల్లెట్ దింపుతారు. ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాకు చెక్‌ పెట్టారు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. పదిహేను సంవత్సరాల నాటి మర్డర్‌ కేసు ఇప్పుడు బయటపడింది. 
నేరబాట పట్టిన ముగ్గురు మిత్రులు
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకున్నారు ముగ్గురు స్నేహితులు. అందుకోసం నేరాల బాట పట్టారు. అందినంత అప్పు చేయడం... తిరిగి ఇమ్మంటే జేబులోనుంచి గన్‌ తీసి బెదిరించడం. అడగ్గానే డబ్బివ్వకపోయినా అంతే.. ఇలా బెదిరింపులు.. మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.
తపంచా, 22 ఎంఎం పిస్తోల్‌ తెప్పించుకుని నేరాలు
చుంచు మ‌ల్లికార్జున్, మిట్ట ఆంజ‌నేయులు, ప్రకాశ్ కుమార్.. ఈ ముగ్గురూ స్నేహితులు. చుంచు మ‌ల్లీకార్జున్ కిరాణా స్టోర్ న‌డుపుతుంటే... మిట్ట ఆంజ‌నేయులు ఎల‌క్ర్టానిక్ స‌ర్వీస్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.. ఇక ప్రకాశ్ కుమార్ ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరు ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా కోల్‌కతా నుంచి ఒక తపంచా, 22 ఎంఎం పిస్తోల్‌ తెప్పించుకుని నేరాలకు తెరతీశారు. చుంచు మ‌ల్లికార్జున్ 2003లో త‌న భార్య అనుసూయను చంపిన కేసు ఇప్పుడు పోలీస్‌ విచారణలో వెలుగు చూడడం కొసమెరుపు. నిద్రపోతున్న అనసూయను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. 

 

11:44 - April 20, 2018

ఢిల్లీ : ప్రపంచంలోనే ప్రజాస్వామ్యదేశం అని భారతదేశానికి పేరు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రజాస్వామ్యానికి అసలు అర్థం వుందా? అసలు భారత్ లో ప్రజాస్వామ్యం వుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులు. ఒకపక్క మృగాళ్ల చేతుల్లో చిద్రమైపోతున్న చిన్నారులు. వివిధ కారణాలతో అంతులేని హింసలకు బలైపోతున్న ఆడబిడ్డలు. పెరిగిపోతున్న మతోన్మాదం,యేరుల్లా పారుతున్న మద్యం మనిషిలో వుండే విచక్షణను కూని చేస్తు ఆడబిడ్డలపై జరుగుతున్న హింసాత్మక మారణ కాండకు సమిధల్లా మాడిపోతున్న అభాగ్యులు. పశుత్వ కాంక్షలకు బలైపోతున్న చిన్నారులు. వయస్సుతో సంబంధం లేకుండా అంతులేని అత్యాచారాలకు గురయి ఊహించేందుకే భయపడేంత హింసలను అనుభవిస్తు కూలిపోతున్న, కాలిపోతున్న మహిళ జీవితాలు మరోపక్క. ఇవేవీ పట్టనట్లుగా ప్రజాప్రతినిధులు తమ ఓటు బ్యాంకులకు మాత్రం మహిళలను వినియోగించుకుంటున్నారు. అనంతరం అధాకారాన్ని అడ్డంపెట్టుకుని కొందరు ప్రజాప్రతినిధులు మహిళలపై హింసలకు, దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

వీరా ప్రజాప్రతినిధులు?..
ప్రజా ప్రనిధులు అంటే ప్రజలను రక్షించేవారు, ప్రజలు బాగోగులు చూసేవారు. కానీ వీరా ప్రజాప్రతినిధులు అని సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు నేడు భారత దేశంలో వున్నాయి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి రాజ్యాంబద్ధంగా పాలన సాగించాల్సిన వీరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై సాగిస్తున్న అరాచాలకు అంతులేకుండా పోతోంది.

48 మంది ప్రజాప్రతినిధులు మహిళలపై జరిగిన నేరాలకు పాల్పడ్డారన్న ఏడీఆర్ నివేదిక..
మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 48మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మహిళపై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం, జమ్ముకశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి, హత్యకు పాల్పడిన సంఘటన వెలుగుచూసిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ నివేదికను విడుదల చేసింది.

1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ..
ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1580 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ఉండగా, అందులో 48 మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 45 మంది ఎమ్మెల్యేలు కాగా, మిగతా ముగ్గురు ఎంపీలు. ఇందులో 12 మంది బీజేపీకి చెందిన వాళ్లే. తర్వాత స్థానాల్లో శివసేన (7), తృణమూల్ కాంగ్రెస్ (6) ఉన్నాయి. రాష్ర్టాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 12 మందిపై అభియోగాలుండగా, తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11), ఒడిశా (5), ఆంధ్రప్రదేశ్ (5) ఉన్నాయి. ఈ 48 మందిపై మహిళల కిడ్నాప్, లైంగికదాడి, అపహరణ, గృహహింస, అక్రమ రవాణా, దాడి, పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం లాంటి కేసులు నమోదయ్యాయి.

20:54 - February 20, 2018

హైదరాబాద్ : నేరాలు పెరిగిపోతున్నాయి. ఘోరాలకు అంతే లేకుండా పోయింది. కాపలా సిబ్బందిని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉండొచ్చు.. బీరువాలో నగలు, డబ్బులు మాయమైపోయి ఉండొచ్చు ..ఇంట్లో వాళ్లపై దాడులు జరిగి ఉండొచ్చు... ఇలాంటి వాటి ముందే పసిగట్టి అలర్ట్‌ అవ్వడానికి ఇప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. తమ ఇంటిని.. తమ వారిని కాపాడుకునేందుకు మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకూ ఇప్పుడు సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. భాగ్యనగరంలో పెరిగిన సీసీ కెమెరాల వాడకంపై 10 టీవీ స్పెషల్ ఫోకస్.

దోపిడీలు, దొంగతనాల నుంచి తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఒక కోణమైతే ఇంట్లోని వృద్ధులు, చిన్నారుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సెల్‌ఫోన్లకు, ల్యాప్‌ టాప్‌లకు సీసీ కెమెరాల్ని అనుసంధానించుకుంటున్నారు. ఇంటికి వచ్చి ఆ రికార్డుల్ని పరిశీలించుకోవడం ద్వారా ఒక్కోసారి అవి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి.

క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో శక్తివంతమైన రకాలు వస్తున్నాయి. వంద వాహనాల మధ్యలో నుంచి వెళ్తున్న కారు లేదా బైక్‌ నంబర్‌ ప్లేట్ తెలుసుకోవడం ఇప్పుడు సులభమైపోయింది. ప్రమాదాలకు కారణమైన వాహనాలు కనిపించగానే సంబంధిత అధికారులకు హెచ్చరికలు వెళ్లిపోతాయి. చాలా నగరాల్లో ట్రాఫిక్‌ పోలీసులు మునుపట్లా...కూడళ్ల దగ్గర కాపుకాసి సిగ్నల్‌ జంపింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసుల్ని నమోదు చేయడం లేదు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీసీ స్క్రీన్‌ ముందు కూర్చుని వాహనాల్ని పరిశీలిస్తున్నారు. ఉల్లంఘనల్ని కెమెరాలే గుర్తిస్తున్నాయి. అక్కడి నుంచే చలానాలు వెళ్లిపోతున్నాయి.

సీసీ కెమెరాలు కేవలం రోడ్ల మీదే కాకుండా బ్యాంకులు, ఏటియంలు, ఇతర వ్యాపార సముదాయాలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లలో నేరాలు అదుపు చెయ్యవచ్చని నిరూపిస్తున్నాయి.. వీటి వాడకం పెరిగాక నేరాల సంఖ్య తగ్గడంతో పాటు.. ఇళ్లలోని వారు ధైర్యంగా ఉండగలుగుతున్నారని ఇంటి యజమానులు చెబుతున్నారు.

సమాజంలో జరుగుతున్న తీవ్ర నేరాలకు సీసీ కెమెరాల ద్వారా పరిష్కారం లభిస్తోంది. పోలీసు స్టేషన్లూ, జైళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలు ఉండి తీరాలని కూడా అత్యున్నత న్యాయస్ధానం తేల్చి చెప్పింది. అక్రమాలకు ఆస్కారం ఉన్న ప్రతి చోట వీటిని ఏర్పాటు చేస్తే అవి అక్రమార్కుల భరతం పడతాయి.

హైదరాబాద్‌లో అటు ప్రభుత్వం ఇటు ప్రజల భాగస్వామ్యం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు విజయవంతమైందని చెప్పాలి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ..ఇతన తీవ్ర నేరాలు 14 శాతం తగ్గాయి. తప్పు చేస్తే సీసీ కెమెరా ఆధారాలతో దొరికిపోతాం.. శిక్ష పడటం ఖాయమన్న భయం నేరస్తుల్లో మొదలైంది. 

21:08 - January 26, 2018

హైదరాబాద్ : తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పోలీసులు చేపట్టిన సమగ్ర సర్వే తుది దశకు వచ్చింది. ఇప్పటివరకూ జరిపిన పోలీసుల సర్వే ప్రకారం.. జంటనగరాల్లో దాదాపు 40 వేల మంది నేరస్థులున్నారు. వీరందరి వివరాలనూ.. జియో ట్యాగింగ్‌ ద్వారా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీనివల్ల.. భవిష్యత్తులో నేరాలు గణనీయంగా తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. జంటనగరాల్లో నేరస్థుల సర్వే పూర్తైంది. మొత్తం 60 పోలీసు స్టేషన్ల పరిధిలోని క్రిమినల్స్‌ వివరాలను పోలీసులు సేకరించారు. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఐదు జోన్లలో ఈనెల 18న చేపట్టిన సర్వే వారం పాటు కొనసాగింది. హంతకులు, దోపిడీ దొంగలు, ఆస్తి దొంగలు, రౌడీషీటర్లు, సైబర్‌ క్రిమినల్స్‌, గొలుసు దొంగలు... ఇలా అందరి వివరాలు సేకరించారు.

పాత నేరస్థుల ఇల్లిల్లూ తిరిగిన పోలీసులు.. వారి నుంచి ఆధార్‌ కార్డులు, ప్రస్తుత ఫోటోలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. పాత, కొత్త నేరాల రికార్డులను పరిశీలించారు. తెలంగాణ పోలీసులందరికీ వీరి వివరాలు అందుబాటులో ఉండేలా.. ప్రత్యేక కాప్‌ యాప్‌లో వాటిని నిక్షిప్తం చేశారు. ఇకపై ఒక్క మౌస్‌ క్లిక్‌తో కమిషనర్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకు నేరస్థులందరి సమాచారాన్నీ తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుంది.

జంట నగరాల్లో 40 వేల మంది నేరస్థులు ఉన్నట్టు పోలీసుల సర్వేలో తేలింది. సౌత్‌ జోన్‌ పరిధిలో 11 వేల మంది నేరస్థులు ఉన్నారు. సెంట్రల్‌ జోన్‌లో 9 వేల మంది క్రిమినల్స్‌ ఉన్నట్టు లెక్కతేలింది. హైదరాబాద్‌లో ఉంటూ నగరంలోనే నేరాలు చేసేవారు 31 వేల మందిని గుర్తించారు. హైదరాబాద్‌లో ఉంటూ బయట నేరాలకు పాల్పడేవారు 9 వేల మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ హైదరాబాద్‌లో నేరాలు చేసేవారు 7 వేల మంది ఉన్నారని సర్వేలో తేలింది. నగరంలో ఉంటూ ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడేవారు 3 వేల మంది ఉన్నట్టు గుర్తించారు. నేరస్థుల డెటాబేస్‌తో క్రైమ్‌ రేట్‌ తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేరస్థుల సమగ్ర సర్వే ఆధారంగా ఎవరెవరు నేరాలు మానేశారో తెలుసుకునే అవకాశం కలిగింది. ఇలాంటి వారికి ఉపాధి కల్పించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. నేరస్థులు నడత మార్చుకునేందుకు ఈ సర్వే దోహదపడుతుందని ప్రజాసంఘాలు నాయకులు, సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. నేరస్థుల సమగ్ర సర్వేతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, నేరాలు ఎంతవరకు తగ్గుతాయో వేచి చూడాలి. 

11:42 - January 18, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 'సమగ్ర నేరస్తుల సర్వే'ను పోలీసులు ప్రారంభించారు. గురువారం నుండి గ్రేటర్ హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. పదేళ్ల నాటి నేరస్తుల పూర్తి వివరాలను ఈ సర్వేలో సేకరించనున్నారు. ఎల్ బినగర్ డీసీపీ 'నేరస్తుల సర్వే'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. 6316 నేరస్తులున్నట్లు తెలుస్తోందని, డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం తాము సర్వే నిర్వంచడం జరుగుతోందని, 70 మందిని సర్వే చేయడం జరిగిందన్నారు. వారి గత అనుభవాలు..వారి ఫింగర్ ప్రింట్స్..అన్ని వివరాలు సేకరించడం జరుగుతోందన్నారు. సర్వేకు వారు కూడా సహకరించడం జరుగుతోందని, ఎలాంటి క్రిమినల్ జరిగినా దర్యాప్తుకు ఈ సర్వే చక్కగా ఉపయోగపడుతుందన్నారు. 

15:11 - January 11, 2018

నేరాల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నా ఆర్థిక కారణాలతో నేరాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యల వార్తలు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చేస్తున్నారా ? లేక ఆవేశంతో చేస్తున్నారా ? అనేది పక్కన పెడితే వీటికి మూల కారణాలు ఏంటీ ? ఇంతటి భయంకరమైన పరిస్థితులకు అసలు కారణాలు ఏంటీ ? వివాహేతర సంబంధాల కేసుల్లో మహిళలను నిందితురాలిగా చేయాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోవడం యాదృచ్చకమైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భర్తల హత్యలు హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత మూడు నెలల కాలంలో పది హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. నేరం ఎవరు చేసిన మహిళలు చేసిన నేరంపై ఎందుకు పెద్దగా మాట్లాడుకోవాల్సి వస్తోంది ? వారి పిల్లల భవిష్యత్ ఏంటీ ? తదితర అంశాలపై టెన్ టివి ఫోకస్ ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో దేవి (సామాజిక కార్యకర్త) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:50 - January 2, 2018

హైదరాబాద్ : ఆ యాప్‌ నేరగాళ్ల పాలిట సింహస్వప్నం. ఘటనా స్థలానికి చేరుకునే లోపే పోలీసులకు అక్కడి వివరాలన్నీ అందజేస్తుంది. ఆ ప్రాంతంలో క్రిమినల్స్‌ ఎవరు ? రౌడీ షీటర్లు ఎవరు? ఇప్పటికే అక్కడ ఎలాంటి నేరాలు జరిగాయి? ఇలా సమస్త సమాచారాన్ని అందిస్తుంది. నేరాలు చేసి తప్పించుకున్నా వారి గుట్టును బయటపెడుతుంది? తెలంగాణ పోలీసులు మరో ముందడుగు వేశారు. నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలాంటి స్మార్ట్‌ పోలీస్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలీసులంద‌రినీ ఒకే గొడుగు కింద‌కు తేవడంతో పాటు.. ద‌ర్యాప్తు వేగాన్ని పెంచేందుకు ఉపయోగపడే టీఎస్‌కాప్‌ యాప్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత హైదరాబాద్‌ కాప్‌ పేరుతో ప్రారంభమైన ఈ సేవలు.. ఇప్పుడు టీఎస్‌కాప్‌ పేరుతో రాష్ట్రమంత విస్తరించారు. శాంతిభద్రతల విషయంలో అన్ని విభాగాలకు ఉపయోగపడే టీఎస్ కాప్ మొబైల్ యాప్‌ను డీజీపీ అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా 54 రకాల పోలీస్‌ సేవలు అందించనున్నారు. నేర పరిశోధన విభాగాల్లోని పోలీసులకు ఉపయోగపడే సమస్త సమాచారం యాప్‌లో ఉండనుంది. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లేలోపే ఈ ప్రత్యేక యాప్ ద్వారా చాలా సమాచారం అందుబాటులోకి వచ్చేలా డిజైన్‌ చేశారు.

డయల్‌ -100కి వచ్చే ఫిర్యాదులు నేరుగా సమీపంలోని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి చేరుతుంది. నేర పరిశోధన విభాగాల్లోని పోలీసులు అక్కడికి చేరుకునే లోపే...ఆ ప్రాంతంలో జరిగిన నేరాలు, నేరస్తుల వివరాలు స్క్రీన్‌లో ప్రత్యక్షమవుతాయి. నేరగాళ్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు? ఒకే తరహాలో నేరాలు ఎక్కడెక్కడ జరిగాయి? ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? ఆలయాలు, ప్రార్థనా మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇలా అన్ని వివరాలు TSCOP యాప్‌లో దర్శనమిస్తాయి. దీంతో నేరం ఎవరు చేసి ఉంటారు? ఈ తరహా నేరాలు ఎవరు చేస్తారు అనే దానిపై పోలీసులకు అవగాహన వచ్చేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.

నేరాలు జరిగిన ప్రదేశాలకు చేరడంతో పాటు పోలీస్‌ పోర్స్‌ను అలెర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఒక్క బ‌ట‌న్ నొక్కితే అంద‌రూ అధికారులు అప్రమత్తమవుతారు. ఒక్కొ స్థాయి అధికారులకు వారికి ఉప‌యోగ‌ప‌డే వివ‌రాలు మాత్రమే క‌నిపిస్తాయి. టీఎస్‌కాప్‌ యాప్‌ ద్వారా పారదర్శక సేవలతో పాటు.. నేరాలను అదుపుచేయడానికి ఉపయోగపడుతుందని డీజీపి మహేందర్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

17:20 - December 30, 2017
15:35 - December 29, 2017

కృష్ణా : విజయవాడలో నేరాలను అదుపుచేయడంలో పోలీస్‌ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోందన్నారు నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌. కొత్త టెక్నాలజీని ఉపయోగించి మంచి ఫలితాలు రాబట్టామన్నారు. నేరాలను అదుపు చేయడంతో ప్రజల సహకారం తీసుకుంటున్నామన్నారు.

08:10 - December 22, 2017

హైదరాబాద్ : ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది...తన ప్రేమను నిరాకరిస్తుందనే కారణంతో ప్రేమోన్మాది చేసిన దాడిలో సంధ్యారాణి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. దీనిపై స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని..ఉరి తీయాలని..ఇలాంటి ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం కార్తీక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. లాలాపేటలో నివాసం ఉంటున్న సంధ్యారాణిపై కార్తీక్ గురువారం సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 85 శాతానికి పైగా కాలిన గాయాలతో సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కానీ శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై పోలీసు అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నానాటికీ సమాజంలో ప్రేమోన్మాదం పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో అమ్మాయిల తల్లిదండ్రులు భయాందోళనకు గురువుతున్నారు. ఇలాంటి నేరాలు తగ్గాలంటే... కఠిన శిక్షలు మాత్రమే కాకుండా... సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - నేరాలు