పవిత్ర సంగమం

19:08 - November 15, 2017

విజయవాడ : ఫెర్రీ ప్రమాద ఘటనలో 22 మంది మృతికి కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ప్రధాన నిందితుడు కొండల్ రావుతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి విచారించారు. కొండలరావు, నీలం శేషగిరి రావు, మాచవరపు మనోజ్ కుమార్, యంజమూరి విజయ సారథి, గేదెల శ్రీను, బోటు నడిపిన భైరవ స్వామి, గేదెల లక్ష్మీలను అరెస్టు చేశారు. విహార యాత్రకు పనికొచ్చిన బోటు కాదని..చేపలు పట్టడానికి ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేపట్టి నదిలో ఉపయోగిస్తున్నారు.

అనధికారికంగా బోటును తిప్పేందుకు..ఇతరత్రా వ్యవహారాల్లో ముగ్గురు మంత్రులు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టూరిజం శాఖ..జలవనరుల శాఖ అధికారులు..కొంత మంది పెద్దల కనుసన్నలలో బోట్లు నడుస్తున్నాయని సీఎం బాబుకు సమాచారం అందిందని తెలుస్తోంది. 

14:31 - November 15, 2017

పశ్చిమగోదావరి : ఫెర్రీ సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదం అనంతరం అధికారులు మేల్కొన్నారు. బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన అనంతరం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారనే విమర్శలున్నాయి.

బుధవారం ఉదయం పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణిస్తున్న బోట్లను అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాపికొండలకు వెళ్లే బోట్లను తహశీల్దార్ తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ లేని బోట్లను తహశీల్దార్ చంద్రశేఖర్ నిలిపివేశారు. దేవీపట్నం మండలం అంగులూరు వద్ద ఈ తనిఖీలు చేశారు. మధ్యలో తనిఖీలు చేస్తుండడంపై పర్యాటకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణం కాకముందే తనిఖీలు చేయాలని..ఇలా చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే అధికారులు..మీడియా సిబ్బందిపై బోట్ల నిర్వాహకులు దాడికి యత్నించారు. బోటు యజమానులు మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించడం నిరసన వ్యక్తమౌతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు. దీనితో స్పందించిన రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణించే బోట్లు 90 దాక ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ అంచనా వేసిన అనంతరం అనుమతులివ్వాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. 

20:37 - November 14, 2017

జల సమాధి జవాబు ఏదీ ?

పవిత్ర సంగమంలో బోల్తాకొట్టిన పడవ ఎవరిది? ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది? అనుమతులు లేకుండా తిరుగుతుంటే ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా? లేక నేతలు కుమ్మక్కయ్యారా? అసలు ఓ ఆధ్యాత్మిక ఉత్సవంలో, ఓ టూరిస్టు ప్రాంతంలో సామాన్యులే ఎందుకు చనిపోతారు? సామాన్యులే ఎందుకు గాయపడతారు? దీనిపై ప్రత్యేక కథనం..గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేటు పర్యాటకానికి ఓ రేంజ్ లో ప్రచారం కల్పిస్తూ కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా గాలికి వదిలేయంటం చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కాదా అని బాధితులు మండిపడుతున్నారు..

ఎలాంటి అనుమతులు లేవు..ఏ దారిలో వెళ్లాలో బోట్ నడిపేవాడికి తెలియదు.. దీనివెనుక ఎవరెవరు కుమ్మక్కయ్యారో అంతా గప్ చుప్.. ఎక్స్ గ్రేషియా ఇస్తాం.. కమిటీ వేస్తాం.. విచారణ జరుపుతాం.. ఆ విధంగా ముందుకెళతాం.. జాతరకెళితే ఇంటికి సేఫ్ గా రాగలరా? ఏదైనా దేవాలయ ఉత్సవానికెళితే సరైన రక్షణ ఉంటుందా? ఏ మాత్రం లేదని చరిత్ర చెప్తోంది. మన దేశంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివి కాదు. అనేక ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. వాటిలో మొన్నటి పుష్కరాల ఘటన మొదటి కాదు.. నేటి పడవ ప్రమాదం ఆఖరికాకపోవచ్చు.. ప్రభుత్వాల నిర్లక్షం ఆ రేంజ్ లో కనిపిస్తోంది.

ఈ ప్రమాదాల చిట్టా చూస్తే అర్ధమయ్యేది ఒక్కటే..సామాన్య ప్రజలంటే పాలకులకు ఎంత చిన్నచూపో తెలిసిపోతుంది. హడావుడి చేసి, రండి రండి అంటూ పర్యాటకులను, భక్తులను ప్రచారార్భాటంతో ఆకర్షించటం తప్ప , హడావుడిగా ఉత్సవాలు నిర్వహించటం తప్ప అందులో ఎలాంటి చిత్తశుద్ధి కనిపించని పరిస్థితి. గాల్లో దీపంలా ప్రజారక్షణను వదిలేసే పాలకులదే నూటికి నూరుపాళ్లూ ఈ పాపం.. అసలీ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ మంత్రి హస్తం కూడా ఉందనే వార్తలో నిజమెంత?

పవిత్ర సంగమంలో భక్తులు మరణించారంటే దానికి కారణం నూటికి నూరుపాళ్లూ ఏలికల నిర్లక్ష్యమే. ప్రచారం చేసుకున్నంత ఉత్సాహంగా ఏర్పాట్లు కూడా చేసి ఉంటే, ఇలాంటి విషాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల ప్రాణాలకు వీసమెత్తు విలువివ్వకుండా, పర్యాటక ప్రాంతాల్లో పుణ్య క్షేత్రాల్లో ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్యంలో మార్పు రావలసిన అవసరం ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:43 - November 13, 2017

విజయవాడ : పవిత్ర సంగమానికి వచ్చి 20 చనిపోవడం బాధాకరమని, స్వార్థం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఫెర్రీ ఘాట్ దగ్గర పవిత్ర సంగమంలో బోటు బోల్తా కొట్టిన ప్రమాదంపై ఏపీ శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీయడం జరిగిందని, మరికొంత మంది ఆచూకి తెలియరావాల్సి ఉందన్నారు. ఫెర్రీఘాట్ లో ఉన్న ఒకతను వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించిన పిచ్చయ్య..కన్నా శివయ్యలు 9మందిని కాపాడారని, వీరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం..అత్యాధునిక సామాగ్రీతో అక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకు తగిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న 17 మంది వారి స్వగ్రామాలకు చేరుకోవడం జరిగిందన్నారు. ఘటనకు సంబంధించి కేసు బుక్ చేయడం జరిగిందని, కొండల్ రావు, శేషగిరి రావు, విజయ సారథి, శ్రీను, చిట్టిలపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

టూరిజం డిపార్ట్ మెంట్ తో ఒక ఎంవోయూ చేసుకుందని..పర్మిషన్ తీసుకొనే సమయంలో పలు నిబంధనలు పెట్టడం జరిగిందన్నారు. కానీ ఇతనికి పర్మిషన్ లేదని..సాయంత్రం సమయంలో ఎవరికీ ఎక్కించుకోలేమని టూరిజం సిబ్బంది పేర్కొనడం జరిగిందన్నారు. కానీ డబ్బుల ఆశతో వారిని బోటులో ఎక్కించుకున్నారని పేర్కొన్నారు. అనుభవం లేని డ్రైవర్..ఉన్నాడని..రూట్ కూడా అతడికి తెలియదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన..ఇద్దరు..ముగ్గురు చనిపోయిన వారిలో ఉన్నారని..సీపీఐ నారాయణ కుటుంబానికి చెందిన వారు కూడా మృతి చెందిన వారిలో ఉన్నారని తెలిపారు.

ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయం..దేశీయంగా ఉండే నిపుణులను సంప్రదించి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొంటామని హామీనిచ్చారు. ఇందుకు సంబంధించి ఒక సంతాప తీర్మానం ప్రవేశ పెట్టి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

13:19 - November 13, 2017

విజయవాడ : కృష్ణానదిలో విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కానీ గాలింపులు చేపడుతున్న సహాయక సిబ్బందికి మృతదేహాలు లభ్యమౌతున్నాయి. ఉదయం నుండి నాలుగు మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమైంది. దీనితో మృతుల సంఖ్య 20కి చేరుకుంది. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మొత్తంగా 42 మంది బోటులో ప్రయాణిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:16 - November 13, 2017

విజయవాడ : ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర పవిత్ర సంగమం వద్ద చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బోటుకు అనుమతి లేదని..ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లనిచ్చేది లేదని ఓ పర్యాటక శాఖ ఉద్యోగి పేర్కొన్న దృశ్యాలు సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. పడవ బోల్తా కొట్టిన ఘటనలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వేరే దగ్గర అనుమతి ఉందని..ఇక్కడ మాత్రం బోటు పెట్టవద్దని ఆ అధికారి హెచ్చరించాడు. కానీ అక్కడున్న ప్రైవేటు సిబ్బంది ఆ అధికారిని మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేశారు. మరి హెచ్చరించిన అధికారి మాట వింటే 20 మంది ప్రాణాలు నిలిచి ఉండేవి. 

11:51 - November 13, 2017
06:26 - November 13, 2017

విజయవాడ : ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్యక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు. పడవ ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేత జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ నిర్యక్ష్యానికి నిలువుటద్దం ఈ ఘటన అని ఏపీ పీసీసీ అధ్యక్షడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు కృష్ణా నదిలో బోట్లు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ప్రశ్నించారు. అనుమతిలేని బోట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. మరోవైపు పడవ ప్రమాదం దురదృష్టకర సంఘటన అని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వివిధ పక్షాల నేతలు కోరారు. 

06:24 - November 13, 2017

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ దగ్గర పవిత్ర సంగమం ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం రివర్‌ బోట్‌ సంస్థకు చెందిన పర్యాటకుల బోటు కృష్ణానదిలో తిరగబడింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో 16మంది చనిపోగా... మరో 10మంది గల్లంతయ్యారు. స్థానికులు, రక్షణ సిబ్బంది 15 మందిని కాపాడారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలతో గాలింపు చేపట్టారు.

ఒంగోలుకు చెందిన వాసవీ క్లబ్‌, నెల్లూకు చెందిన కొంతమంది పర్యాటకులు కృష్ణా పవిత్ర సంగమం దగ్గర హారతి చూసేందుకు భవానీ ఐలాండ్స్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమవ్వగా.. అప్పటికే ఏపీ టూరిజం బోట్‌ సిబ్బంది సమయం అయిపోయిందని వారిని ఎక్కించుకోలేదు. దీంతో వారంతా రివర్‌ బోట్‌ సంస్థకు చెందిన బోట్‌లో ఎక్కారు. సామర్థ్యానికి మించి బోట్‌లో ఎక్కించుకున్నారు. మొత్తం 40మంది పర్యాటకులు ఆ బోట్‌లో ఉన్నారు. బోట్‌ పవిత్ర సంగమం ప్రాంతానికి చేరుకోగానే మట్టిదిబ్బను ఢీకొట్టింది. దీంతో బోట్‌ ఒకవైపుకు వంగిపోయింది. దీని వల్ల ప్రయాణీకులు ఒక పక్కకు రావడంతో బోటు బోల్తాపడింది. బోటు ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు, రెస్క్యూటీమ్‌ సహాయక చర్యలు చేపట్టారు. 15 మందిని సురక్షితంగా కాపాడారు. మరో 10మంది గల్లంతయ్యారు. వీరికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

బోటు డ్రైవర్‌ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు చెబుతున్నారు. తాము ఎంతకోరినా లైఫ్‌ జాకెట్లు ఇవ్వలేదన్నారు. పదేపదే అడుగుతున్నా పట్టించుకోలేదని వాపోయారు. ప్రమాదానికి ముందే రెండు, మూడుసార్లు కుదుపులు వచ్చాయని, ఇంతలోనే బోట్‌ తిరగబడిందని ప్రమాద తీరును వివరించారు. లైఫ్‌ జాకెట్లు ఉంటే అందరూ ప్రాణాలతో బయటపడేవారంటూ కన్నీరుమున్నీరయ్యారు.

ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ పాయింట్‌ నుంచి పవిత్ర సంగమం వెళ్తుండగా జరిగిన బోటు ప్రమాదంపై పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలపై అధికారులతో ఆమె చర్చించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమదానికి కారణాలపై ఆరా తీశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని మృతుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు హోంమంత్రి చిన రాజప్ప తెలిపారు. ఫెర్రీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులు, అధికారులతో ఆయన మాట్లాడారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి విచారణ చేపట్టాలన్నారు. ఫెర్రీ బోట్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇవాళ వారి స్వగ్రామానికి తరలించనున్నారు.

09:21 - December 14, 2016

కృష్ణా హారతి..విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్కరాల నుండి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సూర్యస్తమయ సమయంలో నది ఒడ్డు నుంచి వేద పండితులు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారీ సెట్టింగ్ ల మధ్య విద్యుత్ దీపాల ధగధగల మధ్య పండితులు ఇచ్చే హారతిని వీక్షిచేందుకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు. కానీ మంగళవారం మాత్రం కృష్ణా హారతి ఇచ్చే ప్రాంతంలో అంధకారం నెలకొంది. హారతి కార్యక్రమానికి కొద్దిసేపటి ముందే ఏపీ విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. బిల్లు చెల్లించనందుకే కరెంట్ కట్ చేశామని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 12 లక్షల బిల్లు బకాయి ఉందని తెలుస్తోంది. దీనితో జనరేటర్ సహాయంతో హారతి కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహించారు. మరి బిల్లు చెల్లిస్తారా ? హారతి కార్యక్రమం యదావిధిగా కొనసాగుతుందా ? ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - పవిత్ర సంగమం