పాక్

07:02 - June 24, 2018

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. టోర్నీ ఏదైనా.. ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే ఆధిపత్యం భారత్‌దేనని మరోసారి రుజువైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. మన్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ చెరో గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నడిపించారు. తొలి క్వార్టర్ 25వ నిమిషంలో ఫస్ట్‌గోల్ చేసిన టీమిండియా ప్లేయర్లు.. ఆట చివరి ఐదు నిమిషాల్లో చెలరేగిపోయారు. భారత్‌ దూకుడుకు పాక్‌ ఆటగాళ్ల నుంచి సమాధానమే లేకుండా పోయింది. గోల్ చేసేందుకు పాకిస్థాన్‌ ప్లేయర్లకు భారత డిఫెండర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన పాకిస్థాన్ చేతులెత్తేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ పోటీల్లో బెల్జియం, హాలెండ్, భారత్, పాక్, అర్జెంటైనా, ఆస్ట్రేలియా దేశాలు తలపడుతున్నాయి. కాగా ఇవాళ ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో భారత్‌ తలపడనుంది. 

07:40 - January 20, 2018

వాషింగ్టన్ : ముంబై దాడుల మాస్టర్‌ మైండ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ విచారణ జరపాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. హఫీజ్‌ను తాము ఉగ్రవాదిగానే చూస్తామని యుఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి హీథర్‌ నోర్ట్‌ తెలిపారు. 2008లో జరిగిన ముంబై దాడుల్లో హఫీజ్‌ హస్తం ఉందని...ఈ దాడిలో అమెరికన్లతో పాటు చాలామంది చనిపోయారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది జాబితాలో హఫీజ్ ఉన్నాడని, అతన్ని చట్టం ప్రకారమే విచారించాలని అమెరికా పాకిస్తాన్‌కు సూచించింది. హఫీజ్‌పై పాకిస్తాన్‌లో కేసులే లేవని, అతన్ని విచారించలేమని పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించడం గమనార్హం. 

07:39 - January 20, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘన వరుసగా రెండోరోజుకూడా కొనసాగింది. ఆర్నియా, ఆర్‌ఎస్‌ పురా, రామ్‌గఢ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. పాక్‌ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా... మరో ముగ్గురు గాయపడ్డారు. సరిహద్దు గ్రామాలను టార్గెట్‌ చేసుకుని పాక్‌ కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌ కాల్పులను భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. 3 సెక్టార్లలోని పాకిస్తాన్‌ ఔట్‌పోస్టులు లక్ష్యంగా భారత్‌ కాల్పులు జరుపుతోంది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న కాల్పులతో సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పాక్‌ రేంజర్లు శుక్రవారం జరిపిన కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌ జవానుతో పాటు 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. 

21:21 - January 15, 2018

జమ్మూ కాశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నది. పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులను తిప్పికొడుతూ భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. యూరీ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆర్మీడే సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్న భారత బలగాలకు జమ్ముకశ్మీర్‌ నియంత్రణ రేఖ వద్ద భారీ విజయం లభించింది. తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. పూంచ్‌ జిల్లాలోని ఎల్వోసి వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్తాన్‌ సైనికులు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. శనివారం నాడు రాజౌరి సెక్టార్‌లో పాక్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను మృతికి ప్రతీకారంగా భారత్‌ ఈ చర్య చేపట్టింది. జనడ్రాట్‌, కోట్లి సెక్టార్‌ సరిహద్దులో తమ రేంజర్లు నలుగురు మృతి చెందినట్లు పాకిస్తాన్‌ ధృవీకరించింది.

యురీ సెక్టర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశాయి. ఆత్మాహుతి దాడి చేసేందుకు యత్నంచిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జైష్‌-ఎ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు యురీ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు జమ్ముకశ్మీర్‌ డిజిపి ఎస్పీ వైద్‌ తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్మీ, సిఆర్‌పిఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు కలిసి ఉమ్మడి ఆపరేషన్‌ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీలో 70వ ఆర్మీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. సరిహద్దు పరిస్థితుల్లో మార్పు రాకుంటే తీవ్ర చర్యలు చేపట్టక తప్పదని స్పష్టం చేశారు. సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లను ఆపాలని పాకిస్తాన్‌కు రావత్‌ సూచించారు. పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే భారత్‌ తగినరీతిలో సమాధానమిస్తుందని పేర్కొన్నారు. 

21:43 - January 1, 2018

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ అమెరికా నేతలను మూర్ఖులుగా భావిస్తోందని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా 33 బిలియన్ డాలర్లకుపైగా పాకిస్థాన్‌కు సహాయం అందజేసిందని మండిపడ్డారు. మా నేతలను మూర్ఖులుగా భావిస్తూ, అబద్ధాలు, మోసాలు తప్ప పాకిస్తాన్‌ మాకు ఇచ్చింది ఏమీ లేదని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మేం వేటాడుతున్న ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తోందే తప్ప కొంచెం కూడా సహాయపడటం లేదని ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఇచ్చే 25 కోట్ల 50 లక్షల డాలర్ల సహాయాన్ని నిలిపివేసే దిశగా చర్చలు జరుపుతోంది.

21:50 - December 11, 2017

ఇస్లామాబాద్ : గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై పాక్‌ స్పందించింది. భారత ఎన్నికల చర్చలోకి పాకిస్తాన్‌ను లాగడం మానుకోవాలని పేర్కొంది. కల్పితమైన కుట్ర ఆరోపణలకు బదులు సొంత బలంతో ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేయాలని మోదీకి సూచించింది. ఈ కుట్ర కథనాలు ఆధారరహితం, బాధ్యతా రాహిత్యమని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ మహమ్మద్‌ ఫైజల్‌ ట్వీట్‌ చేశారు. ప్రధానిని నీచుడుగా పేర్కొన్నందుకు మణిశంకర్‌ అయ్యర్‌ను కాంగ్రెస్ బహిష్కరించింది. తనను అడ్డు తొలగించేందుకు పాక్‌కు చెందిన మాజీ అధికారులతో అయ్యర్‌ తన ఇంట్లో రహస్యంగా సమావేశమయ్యారని మోది ఆరోపించారు. ఈ సమావేశంలో.. పాక్‌ హై కమిషనర్, పాక్ మాజీ విదేశాంగ మంత్రి, భారత మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. మోది ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది.

09:25 - October 16, 2017

ఇస్లామాబాద్ : జమాతుద్దవా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఉన్న ఉగ్రవాద ఆరోపణలను ఉపసంహరించుకుంది పాకిస్థాన్. ఉగ్రవాద ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో ఇన్నాళ్లూ హౌజ్ అరెస్ట్‌లో ఉన్న సయీద్‌ను ఇక విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. యాంటీ టెర్రరిజం యాక్ట్ కిందే గతంలో సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారు పాక్ అధికారులు. అయితే ఇప్పుడు సయీద్‌తోపాటు అతని నలుగురు అనుచరులు ఈ చట్టం కిందికి రాకపోవడంతో వాళ్లను రిలీజ్ చేయాలని సయీద్ తరఫు లాయర్ ఏకే డోగార్ వాదించారు. అయితే సయీద్‌తోపాటు జేయూడీపై అన్ని ఆధారాలను తాము సమర్పిస్తామని లాహోర్ హైకోర్టుకు పాక్ ప్రభుత్వం తెలిపింది. సయీద్‌పై ఇప్పటికే యూఎన్, యూఎస్ నిషేధం విధించారు. అతన్ని అరెస్ట్ చేస్తే కోటి డాలర్లు కూడా ఇస్తామని ప్రకటించాయి. 2008 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచీ అతను గృహ నిర్బంధంలోనే ఉన్నాడు.

17:25 - October 9, 2017

 

స్పోర్ట్స్ : ఎప్పుడు చెత్త రికార్డులో ముందుండే పాక్ ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. అది ఎంటో తెలిస్తే అందరు అవాక్కు అవుతారు. ఓ వైపు వరుస వైఫల్యాలు...మరోవైపు ఆర్థిక కష్టాలతో పాకిస్థాన్ జట్టు కుదేలవుతుంటే ఆ జట్టు దుబాయిలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తోంది. ఇది ఇలాఉంటే శ్రీలంకతో జరగుతున్న రెండవ టెస్ట్ లో పాక్ బౌలర్ వాహెబ్ రియాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వెసుకున్నాడు. ఒక్క బంతి వేయడానికి ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించి చరిత్ర కెక్కాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ శనివారం ఆటలో రియాజ్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ 111వ ఓవర్ నాలుగో బంతని వేసేందుకు రియాజ్ ఐదుసార్లు యత్నించాడు. బౌలిగ్ చేయడానికి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క సారిగా ఆగిపోయాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఐదునిమిషాలపాటు ప్రయత్నించిన బంతిని వేయలేకపోయాడు. అవతల ఉన్న బ్యాట్స్ మెన్ కరుణరత్నేతో పాటు పాక్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ సర్ఫాజ్ అహ్మద్, అంపైర్ కూడా విసుగు చెందారు.

 

అదే సమయంలో కోచ్ మైక్ మిక్కీ అర్థర్ హవాభావాలను చూడాలి. చివరకు చిర్రెత్తుకొచ్చిన ఆయన మరో ఆటగాడితో ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం మొదటి సారి అని స్పోర్ట్స్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ వీడియోతో ''వాహెబ్ రియాజ్ బౌలింగ్ బరిచిపోయాడేమో'' అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు.

21:37 - September 22, 2017

శ్రీనగర్ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ సైన్యానికి భారత్ తీవ్ర హెచ్చరికలు చేసింది. భారత సైనికులపై మరోసారి కాల్పులకు తెగబడితే తగిన రీతిలో సమాధానం చెబుతామని పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. భారత, పాకిస్తాన్‌లకు చెందిన డిజిఎంవోల మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్తాన్‌ పౌరులు మృతి చెందారని, 26 మంది గాయపడ్డారని పాకిస్తాన్‌ ఆరోపించింది. పౌరులపై కాల్పులు జరపలేదని భారత్‌ స్పష్టం చేసింది. జమ్ము సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినందునే భారత్‌ దీటుగా స్పందించిందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్‌ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారని భారత్‌ పేర్కొంది. పాకిస్తాన్‌ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల జమ్మూ కశ్మీర్‌లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని భట్‌.. పాక్‌ డీజీఎంవో దృష్టికి తీసుకెళ్లారు.

21:31 - September 22, 2017

న్యూయార్క్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలను భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించిన ఐక్యరాజ్యసమితిలో భారత కార్యదర్శి ఈనమ్‌ గంబీర్‌ పాకిస్తాన్‌ తీరును ఎండగట్టారు.పాకిస్తాన్‌ ఇపుడు టెర్రరిస్తాన్‌గా మారిపోయిందని భారత్‌ పేర్కొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోందని దుయ్యబట్టింది. ఒసామాబిన్‌ లాడెన్, ముల్లా ఒమర్‌ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి కాపాడిన దేశం పాకిస్తాన్‌ కాదా? అని ప్రశ్నించింది. అలాంటిది తానే బాధిత దేశంగా పాకిస్తాన్‌ చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఈనమ్‌ గంభీర్‌ అన్నారు.

లష్కరే తోయిబా ప్రధాన నేత హఫీజ్ సయీద్ 
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన నేత హఫీజ్ సయీద్ ను ఐరాస గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించినప్పటికీ... పాకిస్తాన్‌ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని భారత్‌ ధ్వజమెత్తింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు తుపాకులతో ప్రజల మధ్యే స్వేచ్ఛగా తిరుగుతారని ఉద్ఘాటించింది. సొంతగడ్డపై విఫలమైన ఓ దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని పాకిస్తాన్‌కు చురకలంటించింది. జమ్ముకశ్మీర్‌ ఇప్పటికి...ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుందని...దీన్ని పాకిస్తాన్‌ అర్థం చేసుకోవాలని ఈనమ్‌ స్పష్టం చేశారు.ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖాకాని అబ్బాసీ మరోసారి కశ్మీర్‌ రాగాన్ని ఆలపించారు. భారత్‌ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని... కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. అబ్బాసీ చేసిన ఆరోపణలపై ఈనమ్ గంబీర్‌ గట్టి సమాధానమిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌పై భారత్ ఈ స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - పాక్