పాదయాత్ర

18:23 - November 23, 2017

కర్నూలు : ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబునాయుడు అనేక అబద్ధాలు చెప్పారని.. వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో... సాగుతున్న పాదయాత్రలో ఆయన ఏపీలోని చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయ్యాక.. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశాడని.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే.. పాలన సాగిస్తున్నారని జగన్‌ విమర్శించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాకనే.. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని జగన్‌ అన్నారు.

21:27 - November 22, 2017

కర్నూలు: వైసీపీ అధినేత జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 200 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించింది. బుధవారం 15వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ముద్దవరం చేరుకోవడంతో 200 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బాలపూర్‌ క్రాస్‌రోడ్స్‌, పెండేకల్‌ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. గ్రామ, గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించారు. మహిళలు, యువకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలుసుకుని సమస్యలు ఏకరవు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డోన్‌ నియోజకవర్గంలో పూర్తైన జగన్‌ పాదయాత్ర... వెల్దుర్తి మండలం నర్సరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు 212 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

09:53 - November 22, 2017

కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు మర్రికుంట క్రాస్‌రోడు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.15 గంటలకు బాలాపురం క్రాస్‌రోడు చేరుకుంటారు. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 4.30 గంటలకు  పెండెకల్‌ చేరుకొంటారు.  సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 7 గంటలకు వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. 

 

18:26 - November 21, 2017

కర్నూలు : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా సీఎం చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మంగళవారానికి 14వ రోజు చేరుకుంది. గోరుగుట్ల నుండి పాదయాత్ర మొదలైంది. షేక్ షా వలీ దర్గా వద్ద డోన్, పాణ్యం నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపారు. బేతంచర్ల బస్టాండు సర్కిల్ లో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తిని మళ్లీ సీఎంగా ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. రాత్రికి కోలుములెపల్లిలో జగన్ బస చేయనున్నారు. 

21:28 - November 20, 2017

కర్నూలు : 13వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రారంభమైంది. బాతులూరుపాడు, ఎన్నకొండల, హుసేనాపురం, పాలకూరు క్రాస్‌రోడ్స్, గోవిందదిన్నె మీదుగా సాగి, బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోకి జగన్‌ పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించిన జగన్‌... వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోవిందదిన్నెలో విద్యార్థి జేఏసీ ప్రతినిధులు జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పార్టీ ప్రకటించిన నవరత్నాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం
హుసేనాపురం వైసీపీ మహిళా సదస్సును అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని జగన్‌ తప్పుపట్టారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. మద్యం బెల్టు షాపులు, విద్యుత్‌ బిల్లుల మోత, నిరుద్యోగం, డ్వాక్రా రుణమాఫీ, రేషన్‌ షాపుల్లో 9 రకాల సరకులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను మహిళలు జగన్‌ దృష్టికి తెచ్చారు. వీటిపై తీవ్రంగా స్పందించిన జగన్‌.. ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అని ప్రశ్నించారు. హుసేనాపురం మహిళా సదస్సులో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా... జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హుసేనాపురం నుంచి పాలుకూరు క్రాస్‌రోడ్స్‌, గోవిందదిన్నె మీదుగా సాగిన జగన్‌ పాదయాత్ర బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో జగన్‌ సమావేశమైన జగన్‌, వారి సమస్యలు తెలుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

19:04 - November 20, 2017

కర్నూలు : జిల్లాలో జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. బనగానపల్లె నుంచి బయలుదేరిన పాదయాత్ర గోవిందిన్నె వరకు కొనసాగింది. పలు గ్రామాల్లో వైసీపీ జెండాలు ఆవిష్కరించారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలతోపాటు వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మద్యం బెల్టు షాపులు, నిరుద్యోగం, కరెంటు బిల్లుల మోత, రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చే తొమ్మిది రకాల సరకుల నిలిపివేత వంటి సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు అధికారంలో కొనసాగడం ధర్మమా.. అన్ని జగన్‌ ప్రశ్నించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందుని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.

 

21:24 - November 19, 2017

కర్నూలు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో యాత్ర చేశారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల పార్టీ జెండాలు ఆవిష్కరించారు. వృద్ధులు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్ల మంజూరు వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలును ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలేశారని బనగాలనపల్లె సహా పలు సభల్లో జగన్‌ విమర్శించారు. ఆరోగ్య శ్రీని అటకెక్కించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మండిపడ్డారు. 

12:41 - November 18, 2017

హైదరాబాద్ : వైసీపీలో ప్రస్తుతం పికే హవా నడుస్తోంది.. 2019లో అధికారంలోకి రావాలంటే ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలు సలహాలు తప్పకుండా అమలు చేయ్యాలని జగన్‌ భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పాదయాత్రను నమ్ముకునే ముందుకు సాగుతుంది. ఆరు నెలల పాటు పాదయాత్ర చెయ్యనున్న జగన్‌ అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీలో నిన్నటి వరకూ జగన్‌ ఒక్కరే వన్‌ అండ్‌ ఓన్లీగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం వైసీపీలో ప్రశాంత్‌ కిషోర్‌ ఏం చెబితే అదే నడుస్తుంది. పార్టీ వేసే ప్రతి అడుగులో పికే రోల్‌ కచ్చితంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాదయాత్రలో కూడా పికే టీం డైరక్షన్‌ కీ రోల్‌గా మారింది.

పాదయాత్రలో అడుగడుగునా పికే మార్క్‌
పార్టీ కార్యక్రమాలను వివిధ రూపాల్లో పికే టీం రూపొందించారు. పాదయాత్రలో అడుగడుగునా పికే మార్క్‌ కనిపిస్తుంది. ఎన్ని గంటలు పాదయాత్ర చెయ్యాలి.. ఎంత దూరం నడవాలి.. మార్గ మధ్యలో ఎవరెవరిని కలవాలి అనే అంశాలపై పికే టీం రూట్‌ మ్యాప్‌ ద్వారానే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజూ రైతులతో నేరుగా మాట్లాడటం, విద్యార్ధులతో ముఖాముఖి, రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహించడం, సాయంత్రం ఏదో ఒక కీలక అంశం ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు జగన్‌ లైవ్‌ అప్‌ డేట్స్‌ అందుబాటులో ఉండేలా 70మందితో టీం వర్క్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం జగన్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియా వైసీపీ, వైఎస్‌ఆర్‌ కుటుంబం, జై జగన్, ప్రజా సంకల్ప యాత్ర లైవ్‌ అంటూ పదికి పైగా లైవ్‌ పేజ్‌ల ద్వారా పాదయాత్రపై మరింత ఫోకస్‌ పెరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు.

డ్రెస్‌ కోడ్‌
జగన్‌ పాదయాత్రను ఐదు పికే టీంలు ఫాలో అవుతున్నాయి. ఈ టీంలు పాదయాత్రలో అన్ని వైపుల నుండి ఫాలో అవుతున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు వీరిని గుర్తించేందుకు డ్రెస్‌ కోడ్‌ ధరిస్తున్నారు. ఒక్కో టీంలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరు జగన్‌తో పాటు నడుస్తుంటారు.. జగన్‌ ఎవరెవరిని కలుస్తున్నారో.. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో.. వారి ఫొటోలు వీడియోలు రికార్డు చేస్తున్నారు. వీరు తీసిన ఫొటోలు ఎప్పటికప్పుడు హై స్పీడ్‌ నెట్‌ ద్వారా హైదరాబాద్‌లోని కార్యాలయానికి పంపిస్తారు.. వాటిలో బెస్ట్‌ సెలెక్ట్‌ చేసి సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ చేస్తున్నారు. వీలైనన్ని గ్రూపులకు ఈ మెసేజ్‌లు ఫోటోలు పంపిస్తున్నారు. జగన్‌ స్పీచ్‌ పాదయాత్ర ముఖాముఖి వంటి కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో లైవ్‌ ఇస్తున్నారు. అలాగే ప్రజల నుండి స్పందనను తీసుకుని వాటిని పికే కు పంపిస్తున్నారు. ఇక రెండవ టీం మీడియాతో ఉంటుంది. మూడవ టీం ప్రజల్లో కలిసిపోతుంది. ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తుంది. నాల్గవ టీం ప్రధానంగా వృద్ధులు, విద్యార్ధులు, మహిళలతో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఇక ఐదవ టీం స్థానికుల ఫోన్‌ నెంబర్లను.. వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇలా మొత్తానికి జగన్‌ పాదయాత్రలో ప్రషాంత్‌ కిషోర్‌ టీం హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది.. అయితే పికే టీంతో కొంతమంది నేతలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. అధినేత జగన్‌ మాత్రం పికే టీంలకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు.

21:23 - November 15, 2017

కర్నూలు : జగన్‌ 9వరోజు ప్రజా సంకల్ప యాత్ర కర్నూల్‌ జిల్లాలో కొనసాగింది. పాదయాత్రలో చంద్రబాబు తీరుపై జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు తన మానిఫెస్టోని మాయం చేశారని అది ఉంటే ప్రజలు సీఎంను నిలదీస్తారన్నారు. ప్రజల సలహాలను తీసుకుని పాదయాత్ర ముగిసిన అనంతరం 2019మానిఫెస్టోని తయారు చేస్తానని జగన్‌ అన్నారు. చంద్రబాబు మానిఫెస్టోలాగా పేజీల కొద్ది తనది ఉండదని ప్రజలను మోసం చేసే విధంగా ఉండదని అన్నారు. అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూస్తానన్నారు. 2019 మానిఫెస్టోలో పెట్టిన పనులు చేసిన తర్వాతే 2024లో ప్రజల ముందుకు వస్తానని జగన్‌ అన్నారు. 

21:18 - November 14, 2017

కర్నూలు : జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదోరోజు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగల మర్రి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగింది. జగన్ యాత్ర ఇవాళ వంద కిలోమీటర్లు దాటింది. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి గ్రామస్థులకే ఉద్యోగం కల్పిస్తామన్నారు జగన్. 

Pages

Don't Miss

Subscribe to RSS - పాదయాత్ర