పార్టీ

16:36 - September 23, 2017

యూపీ : ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కొందరి స్వభావమని...తమకు మాత్రం పార్టీ కన్నా దేశమే గొప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోది ఇవాళ షహన్‌షాపూర్‌లో పర్యటించారు. అక్కడ పశు ఆరోగ్యమేళాను ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ సర్టిఫేకేట్లను అందజేశారు. ఇప్పటివరకు పశుపాలనపై ఏ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని...2022 నాటికి రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడమే తమ ధ్యేయమని ప్రధాని స్పష్టం చేశారు. నేను రిస్క్‌ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. 2022 నాటికి ప్రతి పేదవారికి ఇళ్లు, ఉపాధి చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని మోది విమర్శించారు. దేశం స్వచ్ఛంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. ప్రధానితో పాటు యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్‌ రామ్‌నాయక్‌ ఉన్నారు.

16:05 - September 21, 2017

చెన్నై : ఆప్ అధినేత కేజ్రీవాల్, సినీనటుడు కమల్ హాసన్ భేటీ ప్రారంభమైంది. నలుగురు ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ కమల్ హాసన్ ను కలిశారు. వారి మధ్య తాజా రాజకీయాలు చర్చకు వచ్చినుట్టు తెలుస్తోంది. కమల్ రాజకీయాల్లోకి రావాలని కేజ్రీ ఆకాక్షించినట్లు తెలుస్తోంది. అవినీతికి వ్యతికేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్ కు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని కమల్ ప్రకటించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

14:45 - September 21, 2017

చెన్నై : కాసేపట్లో కమల్ హాసన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. కేజ్రీ నలుగురు ఆప్ నేతలతో కలిసి కమల్ ను కలవనున్నారు. వారు తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:49 - September 16, 2017

చెన్నై : తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఏళ్ల తరబడి నడుస్తున్న చరిత్రే. అయితే ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలితల తర్వాత.. సినీ గ్లామర్ ద్రవిడ పార్టీల్లో పెద్దగా పని చేయలేదు. ద్రవిడ సిద్ధాంతాలు, తమిళ భాష, స్థానికతపైనే గత 40 ఏళ్లుగా తమిళ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. అయితే జయలలిత మరణం, కరుణానిధి వయోభారం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడేలా చేసింది. సినీ గ్లామర్ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమవుతోంది. నిశ్శబ్ధంగా మారిన తమిళ రాజకీయాల్లో సినీ గ్లామర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినీ గ్లామర్ ఎంతవరకు పని చేస్తుందో తెలుసుకునేందుకు.. బడా తారలు దారులు వెతుకుతున్నారు. నిన్న రజనీకాంత్, నేడు కమల్ హాసన్.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

మట్టివాసన తెలియాలి....
ఒకరు మాస్‌, మరొకరు క్లాస్‌. ఇద్దరూ ఏసీ గదుల్లో జీవించేవాళ్లే. మరి రాజకీయాల్లోకి వస్తే.. గ్రామీణ ప్రాతాలకు తిరగాలి. మట్టివాసన తెలియాలి. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకోవాలి. అట్టడుగు వర్గాలతో మమేకం కావాలనే వాస్తవికత తెలియాలి. మరి ఈ తారలకు అది సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జయలలిత మృతి చెందినప్పటి నుంచి కమల్‌హాసన్‌ అధికార పార్టీ, ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తూ.. చివరకు రాజకీయాల్లోకి తాను వస్తున్నానేమో అనేశాడు. ఇక డిఎంకెనా, కమ్యూనిస్టు పార్టీలోకా అని వస్తున్న వార్తలకు కమల్‌ ఫుల్‌ స్టాప్ పెట్టారు. ఏకంగా పార్టీనే పెట్టబోతున్నానని ట్వీట్టర్‌లో తెలిపారు.

సిద్ధంగా ఉండండంటూ ట్వీట్లు
రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ హడావిడి చేసి సైలెంట్ అయిన రజనీకాంత్‌ని పక్కన పెడితే.. సొంత పార్టీ పెడతా.. మార్పునకు సిద్ధంగా ఉండండంటూ ట్వీట్లు చేస్తున్న కమల్‌హాసన్.. నిజంగానే రాజకీయాల్లోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. 

20:01 - September 13, 2017

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రూటు మార్చారు. మొన్నటి వరకూ పాలనపైనే ఎక్కువ ఫోకస్ చేసిన చంద్రబాబు తాజాగా ఎమ్మెల్యేల పనితీరును  సీరియస్‌గా మానిటర్ చేస్తున్నారు. పని తీరు బాగుంటేనే  వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో  రైళ్లు పరుగెడుతున్నాయి.  .

టిడిపి అధినేత.. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఓవైపు పాలనా కార్యక్రమాలు చూసుకుంటూనే  మరోవైపు పార్టీకి వీలైనంత సమయం కేటాయిస్తున్నారు. ఇక నుండి రియల్ టైమ్ పాలిటిక్స్ చేస్తానంటూ తాజాగా  ఆయన చేసిన కామెంట్స్ తెలుగు తమ్ముళ్లలో గుబులు పుట్టిస్తున్నాయి.  ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేయిస్తున్న వరుస సర్వేలతో వచ్చే ఎన్నికల్లో తమ బెర్త్ ఉంటుందా? లేక ఊడుతుందా అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

ఇటీవ‌ల చంద్రబాబు చేయించిన స‌ర్వేలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వారిలో మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేలడంతోపాటు.. కొందరిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్ధాయిలో ఉన్నట్లు తేలింది. అలాగే కొందరు ఇంచార్జ్‌లు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని తేలింది. దీంతో ఇంచార్జ్‌లను మార్చాలనే యోచనలో ఉన్నారు చంద్రబాబు. ఇక ఎమ్మెల్యేల పని తీరును కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటున్న చంద్రబాబు పార్టీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడల్లా సూచనలు చేస్తూనే ఉన్నారు. పని తీరు సరిచేసుకోకపోతే వచ్చే ఎన్నికలకు టికెట్ ఉండదనే హెచ్చరికలు పంపిస్తున్నారు. అటు యువనేత లోకేశ్ సైతం ఇదే అంశాన్ని నేతల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. 

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 175 టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ని పక్కన పెట్టి పనిచేయాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. మ‌రి బాబు మాటలు నేత‌లు సీరియ‌స్ గా తీసుకుంటారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది వేచి చూడాలి. 

07:05 - September 13, 2017

నల్లగొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ టీపీసీసీలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. పీసీసీ చీఫ్‌ పేరు ఎత్తితే చాలు.. తోక తొక్కిన తాసుపాములా కస్సుమంటూ లేస్తారు. కోపంతో ఊగిపోతారు. శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల శిక్షణా తరగతుల తర్వాత మరింత రగలిపోతున్నారు. ఈ సమావేశాల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమను అవమానించారన్న భావంతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు... టీపీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచే కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది.

గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నంత కాలం గాంధీభవన్‌ గడప తొక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవకాశం దొరికనప్పుడట్టా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని టార్గెట్‌ చేస్తున్నారు. చాన్స్‌ వచ్చినప్పుడల్లా తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పైరవీలు చేసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులు... శంషాబాద్‌ సమావేశం అనుభవంతో ఇక కాంగ్రెస్‌లో ఉండలేమన్న భావనుకు వచ్చారని సమాచారం. పార్టీ శిక్షణా తరగతుల్లో అవమానించారన్న కోపంతో రగలిపోతున్న కోమటిరెడ్డి సోదరులు.. ఆ రోజు వేదికపై ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డితోపాటు ఐఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాకు ఇంగిత జ్ఞానంలేదంటూ వ్యాఖ్యానించడం రాజకీయం పెద్ద రచ్చతోపాటు చర్చకు దారితీసింది.

టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమకు కాంగ్రెస్‌లో పొగబెట్టారని బహిరంగంగా విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు.. టీపీసీసీ చీఫ్‌ పదవి తమకు ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని ప్రకటించారు. సెప్టెంబర్‌లో పీసీసీలో మార్పులు ఉంటాయని అనుకున్న నల్గొండ బద్రర్స్‌ ఆశలపై కుంతియా నీళ్లు చల్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కెప్టెనంటూ కుంతియా స్పష్టం చేయడంతో.... కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. శంషాబాద్‌ షాక్‌తో కోమటిరెడ్డి సోదరులకు పార్టీలో కొనసాగలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ విషయాలపై స్పష్టంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. తమ రాజకీయ భవిష్యత్‌పై అయోమయంలో ఉన్నారని వినిపిస్తోంది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి భవిష్యత్‌ పయనం టీఆర్‌ఎస్‌, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి టీఆర్‌ఎస్‌ తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక బ్రదర్స్‌ బీజేపీ గూటికి చేరతారని చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కూడా కోమటిరెడ్డి సోదరుల్లో స్పష్టతలేదని వినిపిస్తోంది. కమలం పార్టీపై ప్రజల్లో ఊపు కనిపించడంలేదని భావిస్తున్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరు కలవరపడుతున్నారు. కమలదళంలో చేరితే భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందేమోన్న భయం వెంటాడుతోంది. అన్ని విషయాల్లో స్వేచ్ఛగా వ్యవహరించే తాము బీజేపీలో ఇమడలేమన్న భావంతో కోమటిరెడ్డి సోదరులతోపాటు వీరి అనుచరులు ఉన్నారు. దీంతో బీజేపీలోకి వెళ్లే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా
మొత్తానికి పార్టీలో పట్టు పెంచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాటిని తట్టుకోలేక... కోటమిరెడ్డి సోదరులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు వేరు పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు వీరిపై వేటు పడకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటూతేల్చుకోలేని పరిస్థితితుల్లో చివరి అవకాశంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. వీరికి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారా ? ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరుల దారెటు ? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

12:40 - September 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళన అంశం.. అధికార పార్టీలో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ శాసన సభ్యులకే పూర్తి అధికారాలు కట్టబెట్టారు. దీంతో భూ సర్వేతో గ్రామాల్లో కొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కీలకంగా మారే రైతు సమన్వయ సమితిలపై ఆధిపత్యం ఉండాలని.. అన్ని వర్గాలు పోటీ పడుతున్నాయి. కమిటీల నియామకం జరిగేలా శాసనసభ్యులు చూడాలని ఆదేశాలున్నా.. అవి అమలులో మాత్రం నేతలకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్రామస్థాయి కమిటీలో సభ్యుడిగా కొనసాగితేనే.. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పదవులకు అర్హత దక్కుతుందన్న నిబంధన నేతల్లో మరింత పట్టు పెంచేలా చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన కమిటీల్లో పార్టీ పదవులు దక్కించుకునే విధంగానే నేతలు పోటీ పడుతున్నారు.

నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు
రాష్ట్రస్థాయిలో 10 వేలకు పైగా గ్రామాల్లో కమిటీలు.. ఈ నెల 15 నాటికి ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 3 వేల కమిటీల నియామకం పూర్తి కాలేదని తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే కమిటీల నియామకంలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో 1.50 లక్షలకు పైగా పదవులు రైతు సమితిల నుంచి దక్కనున్నాయి. రైతు సంక్షేమ పథకాలన్నీ భవిష్యత్తులో రైతు కమిటీల ద్వారానే అమలు చేసే అవకాశం ఉండటంతో.. కమిటీలో పట్టు దక్కించుకునేందుకు పార్టీలోని నేతలు పావులు కదుపుతున్నారు.

20:46 - August 31, 2017

ప్రకాశం : ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీ మారతారన్న ప్రచారం ఒంగోలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండో విడత కేబినేట్‌ విస్తరణలో టిడిపి తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పార్టీని వీడే యోచనలో శీనయ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు చీరాల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మాగుంటను బరిలోకి దింపాలని లోటస్‌పాండ్‌లో చర్చలు జరుగుతున్నాయి.
టీడిపిలోకి చేరిన మాగుంట శ్రీనివాసులు
మాగుంట శ్రీనివాసులు రెడ్డి... కాంగ్రెస్‌ నేత, పారిశ్రామికవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డికి సొంత తమ్ముడు. మాగుంట కుటుంబానికి రాజకీయ వారసుడు. కాంగ్రెస్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన హస్తం పార్టీని వీడి వైసీపీవైపు అడుగులు వేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి..అయితే కొన్ని కారణాల వల్ల శీనయ్య సైకిలెక్కాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం.. ఓడిపోవడం జరిగిపోయాయి.. అయినా తెలుగుదేశం అధిష్ఠానం మాగుంటకు ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడి పదవిలో కూడా కూర్చోబెట్టింది..
మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం
సీఎం చంద్రబాబు.... మాగుంటకు ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి మంత్రి పదవి ఖాయమని పార్టీలో ప్రచారం జరిగింది.. కానీ అలా జరగలేదు... రెండో మంత్రి వర్గ విస్తరణలోనూ మంత్రి పదవి రాకపోవడంతో శీనయ్య అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్సీగాఉన్నా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానంటూ అనుచరులతో చాలాసార్లు ప్రస్తావించారు..  జిల్లాలో బలమైన నేతల మధ్య తానేమీ చేయలేకపోతున్నానని ఆవేదన చెందారు..
మాగుంట వర్గాలు టీడిపీలో చేరేందుకు విముఖత
మాగుంట వర్గానికి చెందిన వారు టిడిపిలో చేరతానంటే మాగుంట స్పందింక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు జిల్లాలో టీడిపి అధ్యక్ష పదవికి ఎంపిక చేసేందుకు కొంతమంది పార్టీ శ్రేణులు ఏకమైనా మాగుంట విముఖత చూపడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సారి పార్టీ మారితే గనక ఆ పార్టీ నుండి ఓ హామీని తీసుకోవాలనే ఆలోచనలో శీనయ్య ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్న హామీ లభిస్తే మాగుంట సైకిల్‌ దిగేస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. చీరాల నియోజకవర్గం నుండి శాసన సభ వైసీపీ సీటు మాగుంటకి ఇచ్చేందుకు ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. నంద్యాలలో రాజకీయాలు సద్దుమనగడంతో ఇప్పుడా ప్రయత్నాలకు బాలినేని పదునుపెడుతున్నారు. ఇందుకోసం వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో మాగుంట తీసుకునే నిర్ణయం ఒంగోలు రాజకీయాల్లో పెద్ద మార్పును తీసుకురానుంది.

 

11:39 - August 21, 2017

చెన్నై : జయలలిత మరణం తర్వాత పళని, పన్నీరు రెండు వర్గాలుగా చీలిన అన్నాడీంఎకే పార్టీ నేడు విలీనం కాబోతున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు రాజ్ భవన్ లో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేయనున్నారు. పన్నీర్ తో పాటు ఆయన వర్గానికి చెందిన మాఫై, సెంగొట్టియన్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కంటే ముందు శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:45 - August 18, 2017

హైదరాబాద్ : రాబోయే సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తున్న కమలనాథులు తెలంగాణాలో గులాబి పార్టీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆరుగురు టిఆర్ఎస్‌ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి రంగం సిద్ధం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీలను కమల దళంలో చేర్చుకుంటే తెలంగాణాలో కూడా పట్టు చిక్కినట్లువుతుందని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నారట.

తెలంగాణపై ఫోకస్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణపై ఫోకస్‌ చేశారన్న అంశంపై కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కారుపార్టీ జోరుకు బ్రేకులు వేసే దిశగా పావులు కదుపుతున్నారు. దీనికి అమిత్ షా ఇప్పటికే తెర‌వెన‌క మంత్రాంగం న‌డిపిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో గులాబీ ఎంపీలను లాగేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. అర‌డ‌జ‌ను ఎంపీలతో అమిత్ షా ట‌చ్‌లో ఉన్నారట. టిఆర్ఎస్ గూటికి చేరిన వ‌ల‌స ఎంపీలు ముందువరుసలో ఉన్నార‌ని తెలుస్తోంది. అసంతృ ఎంపీలు బీజేపీ అధ్యక్షుడితో మంత‌నాలు జరిపిన‌ట్లు ప్రచారం జ‌ర‌గుతోంది.

ఆరుగురు టిఆర్ఎస్ ఎంపీలు
ఇప్పటివరకు ఆరుగురు టిఆర్ఎస్ ఎంపీలు అమిత్ వ‌ల‌లో ఉన్నట్లు కమలం పార్టీలో చర్చ సాగుతోంది. అంతా అనుకూలంగా జరిగి అమిత్‌ షా మంత్రాగం ఫలిస్తే.. త్వరలోనే ఆరుగురు ఎంపీలు క‌మ‌లం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. అమిత్ షా పక్కా ప్లాన్‌తో రాష్ట్రానికి వ‌స్తున్నారని సమాచారం. కమలం గూటికి చేరేది ఎవరా ఆరుగురు ఎంపీలు అన్న అంశం గులాబి పార్టీలో గుబులు పుట్టిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డిఎస్ కుమారుడు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఎంపీల వలసల ప్రచారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Pages

Don't Miss

Subscribe to RSS - పార్టీ