పీఎఫ్

06:33 - January 22, 2018

హైదరాబాద్ : వారంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారు. కానీ వారు ఇప్పుడు మా సంక్షేమం సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో వారు తమ కాలం వెళ్లదీస్తూ.. కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మమ్మల్ని.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం చేయండంటూ అధికారుల్ని వేడుకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్‌ వాడి, సర్వశిక్ష అభియాన్‌, ఆశా ఆయాలుగా తదితర వాటిలో వారు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరువేల మంది వివిధ పథకాల్లో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదని వారు వాపోతున్నారు. తమకు

పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని.. సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి... కలెక్టరేట్‌ ఎదుట వారు ఆందోళన చేశారు.
ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం సరైన బడ్జెట్‌ కేటాయించడం లేదు. ఇప్పడు ఆ పథకాలను కాస్త ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది. ప్రభుత్వాలు సరైన బడ్జెట్‌ను కేటాయించి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పథకాల్లో ఎక్కువగా పేద, బడుగు బలహీన వర్గాల వారే పని చేస్తున్నారు. కార్మికుల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. వీరి జీవితంలో మాత్రం ఏలాంటి మార్పులు రావటం లేదు. వీరికి శ్రమకు తగ్గ కనీస వేతనం అమలుకు నోచుకోవడం లేదు. తమకు రిటైర్మెంట్‌ అప్పడు తగిన విధంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తమ వంతు కృషిగా స్కీం వర్కర్స్‌ పని చేస్తున్నారు. తమకు కనీస సౌకర్యాలను కల్పించి.. మా సంక్షేమాన్ని పట్టించుకోండి అంటూ స్కీమ్‌ వర్కర్లు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

17:34 - January 17, 2018

ఆదిలాబాద్ : కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వచ్చి మూడున్నరేళ్ళు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని సీఐటీయు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబు తీవ్రంగా విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పీఆర్‌టీయు భవనంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్కీమ్ వర్కర్లని కార్మికులకు గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని సాయి బాబు డిమాండ్ చేశారు. 

16:32 - June 29, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో టైంస్కేల్‌ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. 30ఏళ్లుగా పనిచేస్తున్నా.. తమకు పీఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కూడా కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 14న ఆర్ట్స్‌ కాలేజీ మహాధర్నా చేపడుతున్నట్టు వారు తెలిపారు. టైంస్కేల్‌ ఉద్యోగులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. టైంస్కేల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తమ్మినేనిప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

07:58 - April 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీలో పొదుపు చర్యలు కార్మికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కార్యకలాపాల పరంగా వేర్వేరుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు అధికారికంగా ఇంకా విడిపోలేదు. కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులకు మంగళం పాడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏపిఎస్‌ఆర్టీసి అధికారులు. తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల్లో పదిహేను వేల వరకు పెన్షనబుల్‌ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంస్థ పీఎఫ్ జమచేస్తుంది. బేసిక్ పే, డీఏ కలిపి 15 వేలు దాటితే తన వాటా పీఎఫ్‌ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసి పీఎఫ్‌ బోర్డు సమావేశానికి తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం ఓ లేఖ రాసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పూర్తికాని ఆర్టీసీ విభజన...
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. ఇందులో యాజమాన్యం, కార్మిక సంఘాల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పిఎఫ్ కోత విధించడం వల్ల రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసిలకు ఆరువందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

21:10 - July 26, 2016

కడప : పీఎఫ్ కార్యాలయంపై సీబీఐ దాడులు చేపట్టింది. పీఎఫ్ రుణ మంజూరు చేయమని వచ్చిన వ్యక్తి నుండి రూ.9వేలు లంచం తీసుకుంటుండగా ఏబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎల్ డీసీ ఉద్యోగి దానం అనే అధికారిని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

06:50 - February 19, 2016

ఆర్టీసీలో మరో కలకలం రేగుతోంది. పీఎఫ్ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న ప్రతిపాదనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు పీఎఫ్ నిధికి ఆర్టీసీ కార్మికులు 12శాతం చెల్లిస్తుండగా, అంతే మొత్తంలో అంటే మరో 12శాతం ఆర్టీసీ యాజమాన్యం జమ చేస్తోంది. అయితే, ఆర్టీసీ యాజమాన్యం తాను చెల్లిస్తున్న వాటాను కూడా కార్మికుల జీతాల నుంచే కట్ చేయాలన్న ప్రతిపాదన చేస్తోంది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు జరగబోతున్న భారీ నష్టాన్ని తలచుకుని బాధపడుతున్నారు. పీఎఫ్ విధానంలో మార్పులు చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులకు జరగబోతున్న నష్టమేమిటి? ఒక్కొక్క కార్మికుడు సగటున ఎంత నష్టపోయే అవకాశం వుంది? వ్రుత్తి నిర్వహణలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఎస్డబ్ల్యుఎఫ్ నేత సుందరయ్య విశ్లేషించారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:46 - February 19, 2016

సంస్కరణల విశ్వరూపం మొదలైంది. కార్మికుల, ఉద్యోగుల జేబుకు చిల్లు పడుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఆర్టీసీలో పీఎఫ్ వ్యవహారం. 7 ఏళ్ల సర్వీస్, 15330 బేసిక్ వున్న మెకానిక్ ఏడాదికి కోల్పోయేది రూ.5220. 8 ఏళ్ల సర్వీస్, 15660 బేసిక్ వున్న కండక్టర్ ఏడాదికి కోల్పోయేది రూ. 5800. 17ఏళ్ల సర్వీస్, 16330 బేసిక్ వున్న హెల్పర్ ఏడాదికి కోల్పోయేది రూ. 7000. 27ఏళ్ల సర్వీసున్న డ్రైవర్ ఏడాదికి కోల్పోయేది రూ. 30, 876. 

నష్టజాతక సంస్థగా ముద్ర..
ప్రగతి రథ చక్రాలు. ఇంతటి స్పూర్తివంతమైన, అర్ధవంతమైన నినాదాన్ని సొంతం చేసుకున్న ఆర్టీసీ ఇప్పుడు నష్టజాతక సంస్థగా ముద్ర వేయించుకుంటోంది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని సంరక్షించుకోవాలంటే సంస్కరణలు తప్పవన్న అభిప్రాయాన్ని ప్రభుత్వాధికారులు, మంత్రులు తరచూ వ్యక్తం చేస్తుంటారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం, లేదా అయినవాళ్లకు దీర్ఘకాలం పాటు లీజులకివ్వడం, అద్దె బస్సులను ప్రవేశపెట్టడం, ఒక్కొక్క విభాగాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడం, కొన్ని రూట్లకు ప్రయివేట్ ఆపరేటర్లకు వదిలిపెట్టడం, డ్రైవర్ లతోనే కండక్టర్ డ్యూటీ కూడా చేయించడం, తగినంత మంది సిబ్బందిని నియమించకుండా పనిభారం పెంచడం ... ఇవీ ఇప్పటి దాకా ఆర్టీసీలో అమలు చేసిన, చేస్తున్న సంస్కరణలు. ఇలాంటి సంస్కరణలేవీ ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి బయటపడేయలేకపోయాయి.

సరికొత్త ప్రతిపాదనలు..
ఆర్టీసీ పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ప్రయివేట్ ఆపరేటర్లను ముద్దు చేస్తున్న తీరు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు దానిని మరింత సంక్షోభంలోకి నెడతాయని వామపక్ష కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఆర్టీసీ సంస్థ అభివృద్ధినీ, ప్రజా శ్రేయస్సును కాంక్షించి కార్మిక సంఘాలు ఇచ్చిన సూచనలను ఏమాత్రం పట్టించుకోని యాజమాన్యం నష్టాలను తగ్గించుకునేందుకంటూ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీటిలో అత్యంత వివాదస్పదంగా మారింది పీఎఫ్ వ్యవహారం. ఇప్పటి వరకు ప్రావిడెంట్ ఫండ్ లేదా భవిష్య నిధికి తమ వేతనం నుంచి కార్మికులు 12శాతం ఇస్తుంటే, యాజమాన్యం మరో 12శాతం జమ చేస్తుంది.

పీఎఫ్ అన్నది సామాజిక భద్రతా పథకం..
పీఎఫ్ అన్నది సామాజిక భద్రతా పథకం. రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని గడపడానికి సహాయపడాలన్నది పీఎఫ్ పథకం ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రయివేట్ అనే తేడా లేకుండా ప్రతి సంస్థ అమలు చేయాల్సి వుంటుంది. దానికి నిబంధనలున్నాయి. వాటిని ఉల్లంఘించడానికి వీలులేదు. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో చాలా సంస్థల్లో పీఎఫ్ పథకం సక్రమంగా అమలుకావడం లేదు. అనేక ప్రయివేట్ సంస్థలు తమ అభివృద్ధికి రేయింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులను, ఉద్యోగులను తొండి చేస్తున్నాయి. న్యాయంగా తాము చెల్లించాల్సిన వాటాను కూడా కార్మికుల, ఉద్యోగుల జీతాల నుంచే కట్ చేస్తున్నాయి. అలా కట్ చేసిన సొమ్మును కూడా సక్రమంగా జమచేయని సంస్థలెన్నో. ఇప్పుడు ఈ జాడ్యం ఆర్టీసీకి కూడా అంటుకుంటోంది. తాను చెల్లించాల్సిన 12శాతం సొమ్మును కార్మికుల జీతం నుంచే కట్ చేయాలన్నది ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన. అంటే ఆ మేరకు కార్మికుల జీతాలకు తొర్ర పడుతుంది. వాస్తవిక వేతనం తగ్గిపోతుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కక్కరు ఏడాదికి 6 వేల నుంచి 30 వేల రూపాయల దాకా నష్టపోతారన్న అంచనాలున్నాయి.

ఆర్టీసీలో ఉద్యోగం అత్యంత కష్టమైంది..
ఆర్టీసీ కార్మికులంతా నష్టపోయే సొమ్ము విలువ ఏడాదికి 600 కోట్ల దాకా వుంటుంది. కార్మికుల జేబుకు చిల్లు పెట్టి, వారి పొట్టలు కొట్టి, మిగుల్చుకున్న డబ్బుతో నష్టాలు పూడ్చాలన్నది ఆర్టీసీ యాజమాన్యం తుంటరి ఐడియా. నిజానికి ఆర్టీసీలో ఉద్యోగం అత్యంత కష్టమైనది. ఎండనక వాననక, రాత్రనక పగలనక పనిచేయాలి. ఒక రోజు రాత్రంతా డ్యూటీ చేయాలి. మరో రోజు తెల్లారకముందే డ్యూటీ ఎక్కాలి. ఇంకో రోజు రెస్ట్ లేకుండా 14, 16 గంటలు ఏకబిగిన పనిచేయాలి. ఎక్కడెక్కడో తిరగాలి. ఎక్కడెక్కడో తినాలి. మరెక్కడో పడుకోవాలి. ఆర్టీసీలో ఉద్యోగమంటే ఒళ్లంతా హూనం చేసుకోవడమే. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడమే. బస్సు ఆలస్యంగా వచ్చినా, తొందరగా వెళ్లిన ప్రయాణీకుల శాపనార్ధాలు తప్పవు. ఇంత చేసినా వారికి, ఇతర ఉద్యోగులతో పోల్చుకుంటే ఆర్టీసీ కార్మికులకు లభించే వేతనాలు తక్కువ. వృత్తిపరంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. నిజానికి వీరికి మరింత మెరుగైన సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య పథకాలు అమలు చేయాలి. కానీ, ఇప్పుడు వున్న సౌకర్యాలూ, సదుపాయాలకే కత్తెర వేయాలనుకోవడం మంచిది కాదు. ఇవాళ ఆర్టీసీలో తెర మీదకు వస్తున్న విధానాలు అక్కడకే పరిమితం కావు. 

10:17 - October 17, 2015

ఉద్యోగులకు శుభవార్త. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సొమ్ముల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులకు త్వరలోనే తెర పడనుంది. పీఎఫ్‌ సొమ్ముల కోసం దరఖాస్తు అందిన మూడు గంటల్లో క్లైమ్‌లను సెటిల్‌ చేసే విధంగా 'ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌' (ఈపీఎఫ్‌ఓ) త్వరలో అన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆధార్‌ వాడకాన్ని స్వచ్ఛందం చేస్తూ సుప్రీకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ ఈ దిశగా మరింత ముందుకు సాగాలని నిర్ణయింది. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఈఫీఎఫ్‌ఓ ఖాతాదారు పీఎఫ్‌ సొమ్ము వెనక్కి తీసుకొనేందుకు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సదరు సొమ్ము ఇక నేరుగా ఆ ఖాతాదారు బ్యాంకు అకౌంట్‌లో జమ చేయబడుతుంది. ఈ కొత్త విధానం అమలునకు అనుమతించాల్సిందిగా తాము కార్మిక శాఖకు అభ్యర్థనను పంపినట్లు కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ కె.కె.జలానీ తెలిపారు. ఈ వ్యవస్థకు అనుమతులు లభించేకంటే ముందే పీఎఫ్‌ సోమ్ము ఉపసంహరణ కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన వ్యవస్థను అభివృద్ధి పరిచేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆధార్‌ సంఖ్యతో కూడిన విత్‌డ్రా అభ్యర్థలను కేవలం మూడు రోజుల్లోనే సెటిల్‌ చేసేలా పని చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం 20 రోజుల సమయాన్ని ఈపీఎఫ్‌ఓ అధికారులు తీసుకుంటున్నారు. పీఎఫ్‌ ఖాతాను, బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసుకున్న వారు మాత్రమే ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా లబ్దిపొందేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎప్రిల్ నుండి అందుబాటులోకి తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అయిదు కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు గాను కేవలం 40 శాతం మంది మాత్రమే ఇలా తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.

Don't Miss

Subscribe to RSS - పీఎఫ్