పునాదిరాయి

21:17 - May 1, 2016

కరీంనగర్ : కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునాది రాయి వేయనున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ ఎత్తిపోతలు, పంప్‌హౌస్‌లు, కాల్వల నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇక మావోయిస్టు ప్రాబల్యం ఉన్న తూర్పు అటవీ ప్రాంతంలో సీఎం పర్యటన నేపథ్యంలో టెన్షన్‌ నెలకొంది. గోదావరిపై మూడు ప్రదేశాల్లో ఆనకట్టలను నిర్మించి రాష్ట్రంలో సాగునీటి అవసరాలు తీర్చాలని సర్కార్‌ యోచిస్తోంది. ఇందుకోసం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్‌ నిర్మించతలపెట్టింది. దీనికోసం ఇప్పటికే నిపుణులచే అన్ని సర్వేలు చేపట్టింది. మేడిగడ్డ ఆనకట్ట నుండి అన్నారం బ్యారేజికి నీటి ఎత్తిపోతలకు రూ.3,524 కోట్లు,.. అన్నారం బ్యారేజి నుండి సుందిళ్ల బ్యారేజి ఎత్తిపోతలకు రూ.2,140 కోట్లు,.. సుందిళ్ల బ్యారేజి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ వరకు నీటిని తరలించేందుకు రూ.2,334 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టును నిర్మించి.. 160 టీఎంసీల నీటిని మళ్లించనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు సర్కార్‌ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది.

భారీ బందోబస్తు..
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్ట్‌ పనులకు పునాది రాయి వేయనున్నారు. ఇందుకోసం కేసీఆర్‌ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌ నుండి మహదేవ్‌పూర్‌ మండలం కన్నెపల్లికి చేరుకుని మేడిగడ్డ బ్యారేజి పంప్‌హౌస్‌ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం అంబట్‌పల్లిలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ పనులకు పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రాజెక్ట్‌ నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, ఈటెల, కేటీఆర్‌లతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు.  తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ గోదావరి సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే డీజీపీ అనురాగ్‌శర్మ మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతపై అధికారులతో సమీక్షించారు. తూర్పున ఉన్న అడవుల్లో అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులకు పట్టున్న గ్రామాలతో పాటు మాజీలపై నిఘా పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 

Don't Miss

Subscribe to RSS - పునాదిరాయి