పులివెందుల

15:39 - March 22, 2018

విజయవాడ : ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే తేడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తున్నామని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీరందిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో దిగుబడి పెరుగుతున్నందున, భూగర్భ జలలు పెంచి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంచుతామని చెప్పారు.

10:57 - March 6, 2018

విజయవాడ : తాము అధికారంలోకి వచ్చిన తరువాత కడప జిల్లాలో పులివెందులలో పెద్ద ఎత్తున్న అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి దేవినేని పేర్కొన్నారు. మంగళవారం ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పంట కుంటలు తవ్వుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదని, భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో పంట కుంటలు తవ్వుకోవడానికి రైతులు ముందుకొస్తే కూలీలకు ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఎన్ఆర్ జిఎస్ టీ కింద నిబంధనలు పెట్టకుండా చూడాలని కోరారు.

సాగునీటి రంగంపై...ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిందని...సాక్షి పత్రిక అనేక అవాస్తవ వార్తలు ప్రచురించిందని మంత్రి దేవినేని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు..ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదని, పాతాళగంగ..వంద అడుగులకు వచ్చిందని సభకు తెలిపారు. తాము చేపట్టిన చర్యలతో పులివెందులలో ఉన్న రైతులు సంతోషంగా ఉన్నారని సభకు తెలిపారు. పులివెందులలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, బాబు కష్టానికి ఫలాలు అందుతున్నాయన్నారు. 

18:46 - March 5, 2018

కడప : జిల్లాలోని పులివెందులలో నిన్న జరిగిన ఘర్షణతో విధించిన 144 సెక్షన్‌ కొనసాగుతుంది. దాదాపు 800 పోలీసులు పులివెందులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కడప జిల్లా ఎస్పీ బాపూజీ అట్టడా పరిస్థతిని సమీక్షిస్తున్నారు. పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతుందని, పరిస్థితిని బట్టీ ఎత్తివేస్తామని అన్నారు. నిన్నటి ఘర్షనకు సంబంధించి కేసులు  నమోదు చేశామని, త్వరలోనే విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ బాపూజీ అన్నారు. 

17:34 - March 4, 2018

కడప : టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లతో కడప జిల్లా పులివెందులలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పులివెందుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమైన వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, టీడీపీ నేత సతీష్‌రెడ్డి సవాళ్లు విసురుకున్నారు. దీంతో పులివెందులలో ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చర్చకు పోలీసులు నిరాకరించారు. పూల అంగళ్ల వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి తీవ్రగాయాలు కావడంతో... పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, టీడీపీ నేత సతీష్‌రెడ్డిలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పులివెందులలో పోలీసులు భారీ ఎత్తున  మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:45 - March 4, 2018

కడప : పులివెందులలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని అధికార పక్షానికి చెందిన నేతలు సవాల్ విసరడం...తాము సిద్ధమేనని ప్రతిపక్ష నేతలు ప్రతిసవాల్ విసరడంతో గత కొన్ని రోజులుగా వాతావరణం వేడెక్కింది. పూల అంగళ్ల సెంటర్ లో బహిరంగ చర్చకు నేతలు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర ప్రాంతాల నుండి కార్యకర్తలకు పులివెందులకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో పులివెందులలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో భారీగా పోలీసులు మోహరించారు. 

09:51 - January 19, 2018

విజయవాడ : మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు మాదే.. కాదు మీ ఇలాఖాలో మాజెండానే ఎగురుతుంది.. ఇదీ ఇపుడు ఏపీలో అధికార, విపక్షపార్టీ నేతల మధ్య నడుస్తున్న డైలాగ్‌వార్‌. పులివెందులలో గెలుపుమాదే అంటున్న టీడీపీ నేతలకు .. కుప్పంలో మేమేపాగా వేస్తామని వైసీపీ నాయకులు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కడప జిల్లా పులివెందులలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఏపీలో పొలిటికల్‌ పందెంకోళ్లు డైలాగ్‌లతో ఢీకొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ - టీడీపీ అధినేతల మధ్య మాటల యుద్ధం 2019 ఎన్నికలకు సమర సన్నాహం చేస్తోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ముఖ్యంగా వైసీపి అధినేత జగన్ సొంత నియోజకర్గం పులివెందులలో టిడిపి గెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులపై తనదైన వ్యూహాన్ని అమలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల గడ్డపై పసుపుజెండా ఎగరడం ఖాయం అంటూ ప్రత్యర్థి పార్టీలో కలకలం రేపుతున్నారు. తరచుగా కడప, పులవెందులలోనే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పులివెందులలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు... పదేళ్లు అధికారంలో ఉండి కూడా సోంత ఊరికి నీరు తీసుకురాలేకపోయారని జగన్‌ను టార్గెట్‌ చేశారు.

అటు ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్‌ కూడా టీడీపీ అధ్యక్షుడికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈసారి తమదే విజయమని జగన్ ప్రకటిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పం నియోజకర్గంపైన జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారని వైసీపీ నేతలు అంటున్నారు. కుప్పం అసెంబ్లీ స్థానంలో అధికంగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఫ్యాన్‌గుర్తుపార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో భాగంగా బీసీలకు జగన్‌ పలు హామీల వరాలు ఇస్తున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శింస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానంలో బిసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపి అభ్యర్ధిగా నిలుపుతున్నట్లు జగన్ ప్రకటించారు. అధికారంలోకి వస్తే కుప్పం నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో అవకాశం ఇస్తామని జగన్ ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా టైం ఉన్నా.. అధికార, ప్రతిపక్షపార్టీ అధినేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో పాలిటిక్స్‌ను వేడెక్కించారు. దీంతో అటు కుప్పుంలోనూ, ఇటు పులివెందులలోనూ ఈసారి గెలుపు ఎవరిదనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి 2019 ఎన్నికల్లో ఓటరు మహాశయుడు ఎవరికి ఎలాంటి ఫలితం ఇస్తారో వేచి చూడాల్సిందే.  

19:32 - June 15, 2017

కడప : జిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ పర్యటిస్తున్నారు.. పులివెందులలో పార్టీ నేతలను అడిగి అక్కడి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.. నెలరోజులక్రితం మృతిచెందిన వైసీపీ కార్యకర్త రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.. అలాగే పులివెదుల డిగ్రీ కళాశాలలో అధ్యాపకుగా పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయిన రాణాప్రతాపరెడ్డి కుటుంబసభ్యులనూ కలుసుకున్నారు.. వారికి జగన్‌ ధైర్యం చెప్పారు..

11:12 - March 7, 2017

విజయవాడ : గాలేరు-నగరి ప్రాజెక్టుపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి లేవనెత్తిన ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ప్రాజెక్ట్‌ ఎనభై శాతం పూర్తైందని వైసీపీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం మూడేళ్ల కాలంలో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పులివెందులకు నీళ్లు ఇచ్చామని చెప్పడాన్ని ప్రతిపక్ష నేత జనగ్‌ తప్పుపట్టారు. దీనిపై దేవినేని ఉమ వివరణ ఇచ్చారు.

15:46 - February 4, 2017

కడప : జిల్లాలోని పులివెందులలో వైఎస్సార్‌సిపి అధ్యక్షడు వైఎస్‌ జగన్‌ పర్యటించారు. నెలరోజుల క్రితం ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా 150 గొర్రెలు, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన యాదవ కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. చంద్రన్న భీమా పథకం కింద ఒక్కో గొర్రెకు 7వేలు రూపాయలు ఇవ్వడంతో పాటు చనిపోయిన వ్యక్తులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ చంద్రబాబు ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపు నష్టపరిహారాన్ని ఇస్తామన్నారు జగన్‌. అలాగే పులివెందులలో రోడ్డుపక్కన ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్ కలిసి పరామర్శించారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు చంద్రన్న భీమా పథకం కింద 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. 

 

16:05 - January 28, 2017

కడప : పులివెందుల యెడుగూరి సందింటి వారి ఫ్యామిలీకి పెట్టని కోట. పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఆ కుటుంబ సభ్యులు పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది యాభై ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇందులో వైఎస్ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి ఎంత కీలకమో.... వారి కుటుంబ సభ్యులు కూడ అంతే కీలకం. వైఎస్ ముఖ్యమంత్రిగా రాజధానిలో ఉంటే.. పులివెందుల పట్టు ఏ మాత్రం సడలకుండా చూసేది మాత్రం ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి. ఆ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి.. వైఎస్ మనోహర్ రెడ్డిలు ఆ పాత్ర నిర్వహించారు. అందుకే పులివెందుల పంచాయితీ నుంచి ఎంపీ స్థాయి వరకు వైఎస్ కుటుంబసభ్యులే ఉంటారు.

వైఎస్ మరణం తర్వాత...

వైఎస్ మరణం తర్వాత వారి కుటుంబంలో పొరపొచ్చాలు మొదలయ్యాయి. వైఎస్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల నాటి నుంచి వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా... వదిన విజయమ్మకు పోటీగా బరిలో దిగారు. అయితే.. ఆయనకు అప్పుడు డిపాజిట్టు కూడా దక్కలేదు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం... వైఎస్ వివేకా కుటుంబాల మధ్య కొన్నాళ్లు మాటలు.. అసలే లేకుండా పోయాయి. ఆ తర్వాత మనసు మార్చుకుని వైఎస్ వివేకా కుటుంబంతో కలిసి పోయారు. ఆ తర్వాత ఇప్పుడు అలాంటి విబేధాలే వైఎస్ కుటుంబంలో చెలరేగాయి. వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి పార్టీకి దూరం అవుతారన్న ప్రచారం జిల్లాలో జోరందుకుంది. ప్రస్తుతం వైఎస్ మనోహర్ రెడ్డి భార్య వైఎస్ ప్రమీలమ్మ పులివెందుల మున్సిపల్ చైర్మన్ గా ఉంది. అయితే మున్సిపాల్టీలో ఇతర వైఎస్ కుటుంబ సభ్యుల జోక్యం పెరిగి.. చైర్మన్ గా ఉన్న మనోహర్ రెడ్డి, ప్రమీలమ్మ మాటకు విలువ తగ్గడంతో మనోహర్ రెడ్డి అలక పాన్పు ఎక్కినట్టు జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఇటీవలే మున్సిపల్ కమీషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీని వెనుక కూడ వైఎస్ కుటుంబంలోని కొందరి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

ఇతరుల జోక్యం పెరగడాన్ని సహించని వైఎస్ మనోహర్ రెడ్డి...

మున్సిపాల్టీలో ఇతరుల జోక్యం పెరగడాన్ని సహించని వైఎస్ మనోహర్ రెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి వద్దకు కూడ వెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కుటుంబ సభ్యులు మనోహర్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం వివేకా అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో కుటుంబ విభేధాలు పార్టీకి నష్టం కలిగిస్తుందని వైసీపీ నేతలు ముందు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

వైఎస్ మనోహర్ రెడ్డి ప్రస్తుతం పార్టీకి దూరమైనా...

వైఎస్ మనోహర్ రెడ్డి ప్రస్తుతం పార్టీకి దూరమైనా... పార్టీ మారుతారనే వాదనను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. టీడీపీతో అసలే కలవరని చెబుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మనోహర్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల మీద పార్టీ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - పులివెందుల